QR Code | చూడ్డానికి అదో పిచ్చి ముగ్గులా కనిపిస్తుంది.. కానీ, దాంట్లో పెద్ద వ్యవహారమే ఉంది.. తెలుసా? అదేనండీ.. క్యూఆర్ కోడ్. చిరు వ్యాపారుల నుంచి బడా బిజినెస్మ్యాన్ల వరకూ అందరి ఆర్థిక వ్యవహారాల్లో క్యూఆర్ కీలకం అయిపోంది. ఫోన్ కెమెరాతో స్కాన్ చేయడం.. పేమెంట్ చేసేయడం.. సెలెబ్రిటీలు కన్ఫర్మ్ చేయడం.. అంతా బాగానే ఉంది. కానీ, ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా? కన్ఫ్యూజన్గా కనిపించే ఈ క్యూఆర్ కోడ్‌ని ఎవరైనా మార్చేస్తే? స్కాన్ చేయగానే సైబర్ నేరగాళ్ల గాలానికి చిక్కితే? బ్యాంక్ ఖాతా అంతా ఖాళీ అయితే..’ అప్పుడు పరిస్థితి ఏంటి?
క్విషింగ్ ఉచ్చులో చిక్కొద్దంటే నెటిజన్‌గా మారిన ప్రతి సామాన్యుడూ ఈ తరహా మోసాలపై అవగాహన పెంచుకోవాలి. అందుకు ఇవిగోండి.. సెక్యూరిటీ చిట్కాలు. వీటిని కచ్చితంగా ఫాలో అయితే క్విషింగ్ నుంచి ఖుషీగా బయటపడొచ్చు. లేకపోతే.. బాధితుల జాబితాలో మీరూ ఒకరు అవుతారు.
ఢిల్లీలోని ఓ యూనివర్సిటీ ఈవెంట్ ప్లాన్ చేసింది. జాతీయస్థాయిలో ఓ వెబినార్ అది. ఆ ఈవెంట్‌కి సంబంధించిన అన్ని వివరాలతో ఓ పోస్టర్ని డిజైన్ చేశారు. దాంట్లోనే వెబినార్‌లో రిజిస్టర్ అయ్యేందుకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఈవెంట్లో పాల్గొనేందుకు ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు. ఆ పోస్టర్ని సైబర్ నేరగాళ్లు ఫేక్ చేశారు. ఒరిజినల్ క్యూఆర్ కోడ్ స్థానంలో ఫేక్ పెట్టి యూనివర్సటీ పోస్టర్ని వైరల్ చేశారు. దీంతో అది చూసిన చాలామంది ఫేక్ కోడ్‌ని స్కాన్ చేసి ఈ క్విషింగ్ వలలో పడ్డారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో బ్యాంకు వివరాల్ని ఎంటర్ చేయడం వల్ల ఎంతోమంది తమ అకౌంట్లోని డబ్బు పోగొట్టుకున్నారు.
ముంబయిలోని ఓ హోటల్ యూపీఐ పేమెంట్స్‌కి క్యూఆర్ కోడ్ స్కానర్లను ఏర్పాటుచేసింది. రద్దీ హోటల్ కావడంతో ప్రతి టేబుల్‌పైనా ఓ స్కానర్ పెట్టారు నిర్వాహకులు. హ్యాకర్ల కన్ను ఈ హోటల్‌పై పడింది. అధికారిక కోడ్ల స్థానంలో మోసగాళ్లు ఫేక్ క్యూఆర్ కోడ్లను పెట్టారు. ఇంకేముంది కస్టమర్లు చేసే పేమెంట్స్ అన్నీ రీడైరెక్ట్ అయిపోయాయి. మోసాన్ని గ్రహించేలోపే ఎన్నో పేమెంట్స్ జరిగిపోయాయి. ఇదే మాదిరిగా పలు కేఫ్ల్లోనూ జరగడంతో యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి.
హైదరాబాద్‌లో ఫుల్ సందడిగా ఉండే సినిమా హాలు… గేటు దగ్గర అందరి కంట్లో పడేలా డిస్కౌంట్ పోస్టర్. ‘సినిమా టిక్కెట్లపై బంపర్ డిస్కౌంట్.. వెంటనే బుక్ చేసుకోండి’ అంటూ.. ఓ క్యూఆర్ కోడ్ పెట్టారు. సినిమా చూడటానికి వచ్చిన వాళ్లు ఆఫర్ అదిరిపోయిందంటూ దాన్ని స్కాన్ చేసి బుకింగ్ చేసేందుకు లాగిన్ అయ్యారు. అంతే.. అందరూ హ్యాకర్‌కి చిక్కారు. నకిలీ బుకింగ్ సైట్లో బ్యాంకింగ్ లాగిన్ వివరాల్ని ఎంటర్ చేయడంతో చాలామంది డబ్బులు పోగొట్టుకొని ఉస్సూరుమన్నారు. ఇవి కొన్ని మాత్రమే! ఈ తరహా క్విషింగ్ మోసాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇవి ఫాలో అవ్వండి.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ముందు ఒకసారి చెక్ చేయండి. అది అధికారిక పోస్టరా? లేదా? అని గమనించాలి. అంటే.. మీరేదైనా దుకాణానికి వెళ్తే యజమాని సూచించిన కోడ్‌ని మాత్రమే స్కాన్ చేయాలి. అలా కాకుండా.. చుట్టూ చూసి కనిపించిన కోడ్‌ని స్కాన్ చేయకండి. యజమాని అధికారిక క్యూఆర్ కోడ్ అందరికీ స్పష్టంగా కనిపించేలా పబ్లిక్‌గా ఉంటుంది. ఫేక్ కోడ్.. ఎక్కడో చిన్నగా అతికించి ఉంటుంది.
అదనపు సమాచారం కోసమో.. సభ్యత్వ నమోదు కోసమో.. ఏదైనా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే… ముందు రీడైరెక్ట్ అయిన వెబ్ పేజీ లింక్‌ని నిశితంగా పరిశీలించాలి. విజిట్ అయ్యే వెబ్సైట్ అధికారికమైనదో కాదో చెక్ చేసుకోవాలి. httpsతో స్టార్ట్ అయితే అది సురక్షితం అనుకోవచ్చు. ఎప్పుడైతే సైట్ సెక్యూర్డ్ అనుకుంటారో అప్పుడే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయండి.
క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడానికి ఫోన్ కెమెరా మాత్రమే సరిపోదు. దానికి తగిన అప్లికేషన్ కూడా ఉండాలి. ఏవేవో డీఫాల్ట్ అప్లికేషన్స్ వాడకుండా.. ‘సేఫ్టీ ఫీచర్’ అందిస్తూ కోడ్లను స్కాన్ చేస్తాయో వాటిని వాడండి. అలాంటి స్కానర్ అప్లికేషన్స్ ఫేక్ కోడ్లను అడ్డుకుంటాయి. లింక్‌లను ఓపెన్ చేయడానికి ముందే వాటిలో పొంచి ఉన్న ప్రమాదాల్ని పసిగడతాయి.
ఏదైనా కోడ్‌ని స్కాన్ చేయగానే రీడైరెక్ట్ అయిన లింక్, మీ ఆర్థిక పరమైన వివరాల్ని లక్ష్యంగా చేసుకుంటే ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవహారాలకు సంబంధించిన లాగిన్స్ని ఎంటర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి. ఎందుకంటే.. రీడైరెక్ట్ అయిన సైట్ ఫేక్ అయ్యుండొచ్చు. సైట్ లింక్‌కి సంబంధించిన వివరాల్ని పరిశీలించాక ఇన్పుట్స్ ఇవ్వండి.
‘ఎన్నెన్నో బంపర్ ఆఫర్లు.. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి’ అంటూ ఎక్కడైనా కనిపిస్తే ఆగం కావొద్దు. తొందరపడి స్కాన్ చేయొద్దు. ఆ ప్రకటన నిజమైందో, కాదో చెక్ చేయండి. అప్పుడే కోడ్‌ని స్కాన్ చేసి.. అదనపు వివరాల్ని తెలుసుకోండి. ఈ ఆఫర్లు వాస్తవికతకి దూరంగా ఉంటే తప్పకుండా అనుమానించాల్సిందే!
పబ్లిక్ ప్లేస్‌లలో ఎక్కడైనా అనుమానాస్పదంగా క్యూఆర్ కోడ్ పెట్టినట్టు అనిపిస్తే చెక్ చేయండి. సంబంధిత యాజమాన్య సంస్థల దృష్టికి తీసుకెళ్లండి. లేదా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.
స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. దీంతో అనుకోకుండా ఏవైనా మాలిషస్ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసినప్పటికీ ఫోన్, యాప్స్ మాల్వేర్లను అడ్డుకుంటాయి. ముఖ్యమైన ఆన్లైన్ సర్వీసుల్ని వాడే క్రమంలో కచ్చితంగా Two-Factor ఆథెంటికేషన్ని పెట్టుకోవాలి. దీంతో క్విషింగ్ చేసినప్పటికీ మన అకౌంట్లోకి లాగిన్ అవ్వడాన్ని అడ్డుకోవచ్చు. ఈ క్విషింగ్ ట్రెండ్‌పై నెటిజన్లు అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే.. ఎక్కడికెళ్లినా ఈ కోడ్లే దర్శనమిస్తున్నాయి. ఆచితూచి స్కానింగ్ చేయండి. అప్పుడే క్విషింగ్ వలకు చిక్కకుండా ఉంటారు.