కనపర్తి.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని గ్రామం. రమేశ్ చెప్పాల తన స్వగ్రామం కనపర్తితో తనకున్న అనుబంధాన్ని, అనుభవాల్ని, అనుభూతుల్ని తలుచుకుంటూ ‘కథల మండువ’ మా కనపర్తి ముషాయిరా 2 పేరుతో 18 కథలుగా అక్షరీకరించాడు. ఈ కథలు పాఠకులను కనపర్తి గ్రామంలో, అక్కడి పంటపొలాలు, అక్కడి వీధుల్లో విహరింపజేస్తాయి. అంతేకాదు పాఠకులకు తమ సొంతూరి వాతావరణాన్ని కూడా కండ్ల ముందు నిలుపుతాయి. ఊళ్లో తొలిసారిగా సైకిల్ కొన్న వ్యక్తికి దానితో ఎలాంటి అనుబంధం ఉంటుందో ‘సైకిల్ రామయ్య’ కథ ద్వారా తెలుస్తుంది. ఇక ‘వంటలకు పోతానం’లో గ్రామాల్లో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వన భోజనాలకు వెళ్తున్నప్పుడు జరిగే హడావుడి, సందడి అంతా కనిపిస్తుంది. ఊళ్లల్లో కాలువ నీళ్ల పంచాయితీ ఎట్లుంటుందో ‘కెనాల్ కిరికిరి’ తెలియజేస్తుంది.
పల్లెల్లో ఒకప్పటి హోలీ వైభవాన్ని ‘జాజిరి’ వివరిస్తుంది. ఊరికి కష్టమొస్తే దాన్ని తీర్చే వరకు పట్టువదలకుండా కొంతమంది ప్రయత్నం చేస్తారు. ‘మా ఊరి ఆంజనేయస్వామి’ ఇలాంటి వ్యక్తి కథే. ‘కక్కవోసే దవాఖాన’, ‘దేవతల బాయి’ కథలు ఊళ్లల్లో వైద్యం, చికిత్సల గురించి ఉన్న విశ్వాసం, నమ్మకాలు ప్రధానంగా సాగుతాయి. ‘అందరం పోయేటోళ్ళమే’ 45 ఏండ్ల కింద స్కైలాబ్ ఉపగ్రహం భారతదేశంలో ఎక్కడ పడిపోతుందో తెలియక దాన్నే ఓ ప్రళయంగా భావించిన పల్లె ప్రజల గందరగోళాన్ని, మనుషుల్లో వచ్చిన మార్పును గుర్తుకుతెస్తుంది. వీటితోపాటు బతక నేర్వడం తెలియకపోయినా సాటివారికి బతుకు నేర్పే వ్యక్తులు, చెట్టు కేంద్రంగా జరిగిపోయే గ్రామ జీవితం, ఇసుర్రాయి గ్రామదేవతగా వెలసిన వైనం, మనసులు ఖాళీ చేసుకునేందుకు ఉపకరించే కల్లు మండువాలు, స్థానిక వ్యవసాయ మార్కెట్లు లాంటి గ్రామీణ వ్యవస్థ అంతా ఈ ‘కథల మండువ’లో కనిపిస్తుంది. అంతేకాదు తెలంగాణ జానపదుల సాంస్కృతిక జీవితం కూడా ఇమిడి ఉండటం ఈ కథల్లో విశేషం.
కథల మండువ
రచన: రమేశ్ చెప్పాల
పేజీలు: 134; ధర: రూ. 210
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98490 73163
దేవుడికి కవితా నీరాజనం
భగవంతుడి మీద మనకు ఉండే అనురక్తి భక్తి. దేవుణ్ని ఆకారంగా, నిరాకారంగా రెండు రకాలుగా కొలుస్తారు. ఆకారంగా సర్వాంతర్యామి కోవెలలో పూజలందుకుంటాడు. భక్తుడేమో తనను తాను అణకువతో దేవుడికి సమర్పించుకుంటాడు. అలా ఎక్కడో శిలా మాత్రంగా పడి ఉన్న తనకు (తిరుమల) కొండకు వచ్చే భక్తులకు చేయూతను ఇవ్వడానికి మెట్టుగా మారినా, లేదంటే గుడి వాకిట గంటగా మోగినా, కాలి నడకన వచ్చే భక్తులకు నీటిని అందించే భాగ్యము కలిగినా చాలు.. వేరే కోరికలేవీ లేవంటూ ఆళ్ళపల్లి రవీంద్రరావు యాభై పద్యాల్లో ‘శ్రీహరి పదములు’ రూపంలో శ్రీహరికి కవితా నీరాజనం అందించాడు. పుస్తకం చిన్నదే అయినప్పటికీ పాఠకుల్లో పాదుకొల్పే భక్తి భావం మాత్రం పెద్దదే.
శ్రీహరి పదములు
రచన: ఆళ్ళపల్లి రవీంద్రరావు
పేజీలు: 20
ప్రతులకు: ఫోన్- 90001 10309
ఘనం..పీవీ వనం భోగిపండ్ల చెట్టు
రేగు చెట్టు తెలంగాణ ప్రాంతంలో అతి సులభంగా పెరుగుతుంది. మొదట ఆకుపచ్చగా, పండేటప్పుడు నారింజ రంగులో ఉండే దీని పండు మనకు సుపరిచితమే. గుండ్రని గింజ ఉండి పండు గుజ్జుతో కప్పి ఉంటుంది. పులుపు, తీపి కలిసి ఉండే ఈ పండు రుచి చాలా మందికి ఇష్టం. జిజిఫస్ మారిటేనియా అనేది దీని శాస్త్రీయ నామం. గోళీకాయంత పండు నుంచి ఆపిల్ పండు పరిమాణంలో ఉండే వాటి దాకా రేగు చెట్లలో అనేక రకాలున్నాయి.
ప్రకృతితో మమేకమైన సంస్కృతి మనది. రేగుపండ్లు సంక్రాంతి పండుగ నాటికి పక్వానికి వస్తాయి. భోగి నాటి సాయంత్రం చేసే భోగిపండ్ల వేడుకలో వేడుకలో అక్షింతలు, నాణాలతో పాటు రేగిపండ్లను కలిపి చిన్నపిల్లల తలపై పోస్తారు. చలికాలంలో పండే ఈ రేగుపండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకల దృఢత్వానికి ఇవి మంచి ఔషధం. జింక్, ఐరన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అజీర్తిని తద్వారా మలబద్ధకాన్ని నివారించేందుకు సహకరిస్తాయి. ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది. తక్కువ ైగ్లెసెమిక్ ఇండెక్స్ ఉండే పండు కావడంతో షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా చక్కగా తినొచ్చు. ఇందులోని సి- విటమిన్ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, మన శరీరానికి ఏ పోషకాలు ఎంత పాళ్లలో కావాలో అన్నిపాళ్లలో రేగిపండు అందిస్తుంది. తద్వారా జీవక్రియ మెరుగుపడేందుకు తోడ్పడుతుంది.
నేను చదువుకునే రోజుల్లో మా బడి ముందు చలికాలం రోజుల్లో రేగుపండ్లు అమ్మేవాళ్లు. ఫ్రూట్ మసాలా చల్లుకుని తినేవాళ్లం. తిన్నాకొద్దీ తినాలనిపించే ఈ పండ్లు ఎన్నితిన్నా కడుపు నిండినట్టు ఉండదు. సీజన్లో వచ్చే పండ్లను మా అమ్మ తప్పక తినిపించేవారు. సీతాఫలాలు కాగానే రేగుపండ్లు, ఆ తర్వాత మామిడి పండ్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచేది. ఇవికాక జామ, దానిమ్మ ఇలా పండ్లు మన ఆహారం అనే వాళ్లు. మా నాయనమ్మ పెరట్లో నాటిన గంగరేగు చెట్టు ఇంకా కాస్తున్నది. రేగుచెట్లు శ్రమ, పెట్టుబడి లేకుండా ప్రకృతిసిద్ధంగా పెరుగుతాయి. ఎరువులు, పురుగు మందుల అవసరమే ఉండదు. మా అన్నయ్య తన తోటలో 10 ఆపిల్ బేర్ అనే మొక్కలు నాటారు. విరగకాసిన కాయల బరువుకు కొమ్మలు చేతికి అందేలా వంగాయి. మా ఊళ్లో అలాంటి పండ్లు చూడ్డం అదే మొదటిసారి. కాబట్టి అవి తినొచ్చో, లేదో తెలియక తొలుత ఎవరూ వాటిని ముట్టుకోలేదు. హైదరాబాద్ మార్కెట్లో మాత్రం తేలిగ్గా అమ్ముడయ్యాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు