బాలల సాహిత్యం అనగానే.. అనగనగా అనే మొదలయ్యే కథలే ఎక్కువ. అవన్నీ.. పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలే అయినా ఈ తరం పిల్లలకు ఇంకేదో కావాలి. ఆ కావాల్సిందేదో రేడియో దురికి అంకుల్‌గా పేరుగాంచిన బాలసాహితీవేత్త దురికి మోహనరావుకు చక్కగా తెలుసు. అందుకే నలభై ఏండ్లుగా బాలసాహిత్యంలో కథల సాగు చేస్తున్న ఆయన కొత్త పాయింట్‌తో ‘పిల్లలు పిడుగులు’ కథల పుస్తకాన్ని తీసుకొచ్చారు. తప్పులు చేసే పెద్దలకు బుద్ధి చెప్పే పిల్లల కథలు భలే ముచ్చటగా సాగిపోతాయి. పైకి కొంత తమాషాగా సాగిపోయే ఈ కథలు కాస్త లోతుగా ఆలోచిస్తే.. మంచి కౌన్సెలింగ్ పాఠంలా అనిపిస్తాయి. అంతకుమించి పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. దానికితోడు ఆనందాన్ని పంచుతాయి.
రచయిత: దురికి మోహనరావు
పేజీలు: 72, వెల: రూ.50
ప్రతులకు: సాహితి ప్రచురణలు ,81210 98500 ,www.sahithibooks.com
కథలు చెప్పాల్సిన అవ్వాతాతలు ఊళ్లకే పరిమితవుతున్నారు. ఇంట్లో చూస్తే అమ్మానాన్నలు ఆఫీసు పనిలో మునిగిపోతున్నారు. వెరసి అందమైన కథలతో సాగిపోవాల్సిన బాల్యం సెల్‌ఫోన్‌తో ముడిపడి వాడిపోతున్నది. గతంలోలా బాలమిత్ర, చందమామ కథలు కూడా ఈ తరానికి అందుబాటులో లేకుండా పోయాయి. అలాంటి చిన్నారుల కోసం కొందరు రచయితలు బాలసాహిత్యాన్ని తమ భుజానికి ఎత్తుకున్నారు. వారిలో ఒకరు ఆర్.సి.కృష్ణస్వామిరాజు. చిట్టి కథలో గట్టి సందేశాన్ని, విలువలను చొప్పించి చెప్పడంలో ఆయన దిట్ట. ఆయన కలం నుంచి వెలువడిన 23వ కథల పుస్తకం ‘కటకటా మర్కటా’. వివిధ పత్రికల్లో ముద్రితమైన తన కథలను ఒక చోట చేర్చి, అందమైన బొమ్మలు కూర్చి చిన్నారులకు కానుకగా అందించారు.
రచయిత: ఆర్.సి.కృష్ణస్వామిరాజు
పేజీలు: 120, ధర: రూ.140
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు ,93936 62821