భాష ఏదైనా భావం ఒక్కటే.. కానీ ఆ భావాన్ని ఒక భాష నుంచి మరో భాషలోకి సంపూర్ణంగా అనువదించాలన్నా, పరభాషా విజ్ఞానాన్ని ఒడిసిపట్టాలన్నా ‘పదకోశాలు’ (నిఘంటువులు) అత్యంత కీలకం. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది మంది మాట్లాడే ప్రాచీన అరబ్బీ భాషకూ, అజంతా భాషగా ప్రసిద్ధి చెందిన తియ్యని తెలుగుకూ మధ్య అక్షర అనుసంధానం చేయడం ఒక బృహత్తర యజ్ఞం. ఆ అసాధారణ కార్యాన్ని ఒంటిచేత్తో భుజానికెత్తుకుని, అక్షరరూపం ఇచ్చారు ప్రముఖ పరిశోధకులు డాక్టర్ అబ్దుల్ రహీమ్ మొహమ్మద్ భిక్కు మౌలానా. ఆయన ఎంతో శ్రమకోర్చి, నిరంతర పరిశోధనతో రూపొందించిన విశేష గ్రంథమే ఈ ‘అరబ్బీ తెలుగు పదకోశం’.
దాదాపు 1352 భారీ పుటలతో వెలువడిన ఈ నిఘంటువు భాషా సాహిత్య లోకంలో ఒక అపూర్వ మైలురాయి. సాధారణంగా ఒక నిఘంటువు రూపకల్పన వెనుక ఒక పెద్ద సంస్థో, విద్వాంసుల బృందమో ఉంటుంది. కానీ, డాక్టర్ అబ్దుల్ రహీమ్ ఒక్కరే ఈ సుదీర్ఘమైన, క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయడం విశేషం. అరబ్బీ భాషలోని మూలపదాలను, వాటి విభిన్న అర్థాలను, తెలుగు సంస్కృతికి మరియు వాడుకకు తగినట్లుగా మలిచిన తీరు అద్భుతం. ప్రతి పుటలోనూ రచయిత అంకితభావం, నిశిత పరిశీలన స్పష్టంగా కనిపిస్తాయి. భాషాభిమానులు, గ్రంథాలయాలు, సాహిత్య పరిశోధకులు తప్పక సేకరించి, భద్రపరుచుకోవాల్సిన అమూల్యమైన గ్రంథం ఇది.
(Comprehensive Arabic – Telugu Dictionary)
రచయిత: డాక్టర్ అబ్దుల్ రహీమ్ మొహమ్మద్ భిక్కు మౌలానా
పుటలు: 1352, ధర : రూ. 250/-
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
-ముహమ్మద్ ముజాహిద్