చంపావత్ ఆడపులి 20వ శతాబ్దం తొలినాళ్లలో ఉత్తరాఖండ్, నేపాల్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. 1900 1907 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పులి నేపాల్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో దాదాపు 436 మందిని పొట్టన పెట్టుకుందని అంచనా. ఇలాంటి పులిని ప్రసిద్ధ వేటగాడు, జంతు సంరక్షకుడు జిమ్ కార్బెట్ 1907లో అత్యంత చాకచక్యంగా కాల్చిచంపాడు. ఈ వృత్తాంతాన్ని స్వయంగా ఆయనే ‘చంపావత్ టైగర్’ పేరుతో ఇంగ్లిష్లో పుస్తకంగా రాశారు.
దాన్ని కందుకూరి రవీంద్రనాథ్ ‘చంపావత్ పులి’ పేరుతో తెలుగులో అనువదించారు. అయితే, చంపావత్ పులికి నోట్లో పండ్లు విరిగిపోవడంతో వేగంగా పరిగెత్తే జీవులను వదిలి, మనుషులపై పడిందనే విషయం మన మనసుల్ని ద్రవింపజేస్తుంది. ఇప్పుడు కూడా మనుషులపై పులులు దాడిచేస్తున్న సంఘటనలు తరచుగా వింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పులుల, ఇతర వన్యప్రాణుల సహజ ఆవాసాలను కాపాడాలనే సందేశాన్ని ఈ పుస్తకం ఇస్తుంది. ఇందులో జిమ్ కార్బెట్ వేటాడిన ఇతర నర భక్షక పులుల వేట కథనాలను అందించడం విశేషం. రచనా శైలి సరళం, ఆసక్తికరం.
మూలం: జిమ్ కార్బెట్
అనువాదం: కందుకూరి రవీంద్రనాథ్
పేజీలు: 225; ధర: రూ. 299
ప్రతులకు: ఫోన్: 94407 12903
భారతదేశంలో మధ్యయుగంలో సంభవించిన ఆధ్యాత్మిక విప్లవం భక్తి ఉద్యమం. భగవంతుణ్ని చేరుకోవడానికి జ్ఞాన, కర్మ మార్గాలు కాకుండా భక్తి మార్గంలో సాగిపోవడమే ఈ ఉద్యమ లక్ష్యం. ఉత్తర భారతదేశంలో రామానంద్, కబీర్, గురు నానక్, తులసీదాస్, రవిదాస్ తదితర భక్తి ఉద్యమకారులు కనిపిస్తారు. అదే సమయంలో తెలుగు రాష్ర్టాల్లో కృష్ణమాచార్యులు, పోతన, అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి లాంటివారు భక్తి మార్గాన్ని ప్రవచించారు.
అంతేకాదు వీరబ్రహ్మేంద్రస్వామి, ఆయన శిష్యుడు సిద్దప్ప, వేమన ప్రజల్లో గూడుకట్టుకుపోయిన మూఢ విశ్వాసాలను తీవ్రంగా ఖండించారు. వీరు తమ బోధనలు, కీర్తనలు, పద్యాల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావడమే కాదు తెలుగు భాషకూ తమ రచనల్లో పట్టం కట్టారు. ఈ వివరాలను పొందుపరుస్తూ డా. ఎస్. నారాయణరెడ్డి ‘భక్తికవులు, తత్తకవులు, సామాజిక భూమిక’ పేరుతో పుస్తకం వెలయించారు.
నన్నయ మొదలుకుని దక్షిణాంధ్ర యుగం వరకు ఉన్న ప్రముఖ కవుల భక్తి భావనను రచయిత ఇందులో సమీక్షించారు. ఇంకా తెలుగు నాట భక్తి కవులు సాధించిన సామాజిక ప్రయోజనం, వారి రచనలపై భారతీయ భాషల భక్తి సాహిత్యం ప్రభావం తదితర విషయాలను కూడా వివరించారు. దీనికిగాను 1993లో నారాయణరెడ్డి బెంగళూరు విశ్వావిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. మొత్తం 6 భాగాల్లో సాగిన ఈ రచన సాహిత్య విద్యార్థులకే కాదు జిజ్ఞాసువులకూ మంచి కరదీపిక.
రచన: డా.ఎస్.నారాయణరెడ్డి
పేజీలు: 262; ధర: రూ. 250
ప్రచురణ: యువభారతి
ప్రతులకు: ఫోన్: 93913 73684