మేడారం.. ఈ పేరులోనే ఒక మహత్యం దాగి ఉంది. ఒక చైతన్యం, ఒక ధిక్కారం కనిపిస్తుంది. రెండేళ్లకు ఓసారి జరిగే ‘సమ్మక్క-సారలమ్మ’ మహా జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తకోటి పోటెత్తుతుంది. మౌలిక సదుపాయాలు అంతగా లేని చిన్న అటవీగ్రామంలో జరిగే ఈ వేడుక.. గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధిగాంచింది. ప్రపంచం ఎంత ఆధునికత సంతరించుకుంటున్నా.. ‘మేడారం’ ఇప్పటికీ గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ తన ప్రత్యేకతను కాపాడుకుంటున్నది.
మతాలు, పద్ధతులు వేరైనా.. జాతరలన్నీ సహజంగా జరుగుతాయి. కానీ, ఏ జాతరకూ లేని ప్రత్యేకతలు, అన్ని జాతరల్లో కనిపించే విశిష్టతలు మేడారంలో మాత్రమే కనిపిస్తాయి. భక్తుల పుణ్యస్నానాలతో పులకించే జంపన్న వాగు.. కుంభమేళాను తలపిస్తుంది. కొండకోనల మధ్య జనసందోహం.. శబరిమలను గుర్తుకుతెస్తుంది. తలనీలాలు సమర్పించుకునే దగ్గర.. తిరుమల క్షేత్రం ప్రత్యక్షమవుతుంది. అలాంటి మేడారం జాతరలో మీడియా మేనేజ్మెంట్ అత్యంత కీలకమైనది, సంక్లిష్టమైనది. జాతరలో జరిగే ప్రతి అంశాన్నీ ప్రజలకు తెలియజేయడానికి అన్ని ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల నుంచి ప్రతినిధులు ఇక్కడికి తరలివస్తారు.
జాతర కవరేజీకి డీపీఆర్వో కార్యాలయం నుంచే దాదాపు వెయ్యి మీడియా పాస్లు జారీచేస్తారు. వీరికి తోడుగా మరో రెండు వందలకుపైగా దేశ, విదేశీ జర్నలిస్టులు జాతర సందర్భంగా మేడారంలో వాలిపోతారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనాలు, జాతర అంశాలను కెమెరాల్లో బంధించడం.. ఇలా అనేక రకాలుగా కవరేజీ అందిస్తారు. ఇలాంటి గొప్ప జాతరలో భాగస్వామ్యం కావడం నిజంగానే గొప్ప అవకాశం. అద్భుతమైన అనుభవం కూడా. 1993లో ఏపీపీఎస్సీ ద్వారా వరంగల్ జిల్లాలో సహాయ పౌర సంబంధాల అధికారిగా చేరారు కన్నెకంటి వెంకట రమణ. అప్పటినుంచీ మేడారం జాతర విధులు నిర్వర్తిస్తూ వస్తున్నారు. మొట్టమొదటిసారిగా 1994లో మేడారం మహా జాతరలో భాగస్వాములయ్యారు.
2014 వరకూ ప్రతి జాతరకూ ములుగు డివిజనల్ పీఆర్ఓగా, వరంగల్ డీపీఆర్ఓగా మేడారంలో మీడియా సెంటర్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. పదోన్నతిపై హైదరాబాద్కు వెళ్లినప్పటికీ.. ప్రతీ జాతరకూ తప్పనిసరిగా వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడి గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలు, అమ్మవార్ల ఆగమనం, భక్తుల మొక్కులు, జాతర జరిగే తీరుతోపాటు సమ్మక్క-సారలమ్మ వన ప్రవేశం వరకూ ప్రతి విషయాన్నీ దగ్గరినుంచి గమనిస్తున్నారు. దాంతోపాటు వివిధ రాష్ర్టాలనుంచి వచ్చే గిరిజన జాతుల సంస్కృతీ సాంప్రదాయాలు, మీడియా కవరేజీ, జాతరలో ఎదురయ్యే ఇబ్బందులు.. ఇలా విభిన్న అంశాలపై అనేక ఆర్టికల్స్ రాశారు. వృత్తిగత, వ్యక్తిగత వ్యాసాలన్నిటినీ ఒక దగ్గర కూర్చి.. ‘సమ్మక్క – ది గ్లోరీ ఆఫ్ మేడారం’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ పుస్తకం చదివితే.. మేడారం మహాజాతరకు తరలివెళ్లిన అనుభూతి కలుగుతుంది. మేడారం వైభవాన్ని కళ్లకు కడుతుంది.
రచన : కన్నెకంటి వెంకట రమణ, పేజీలు : 80;
ధర : రూ.250, ప్రచురణ : కన్నెకంటి పబ్లికేషన్స్
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 98499 05900, 9490396828
రచన : మోటకట్ల, పేజీలు : 124;
ధర : రూ.200
ప్రతులకు : మోటకట్ల సుబ్బారెడ్డి
ఫోన్ : 97017 55652