అన్నదాత ఆత్మహత్య అని పేపర్లో చదివితే అయ్యో అనుకుంటాం. పేజీ తిప్పగానే ఆ వార్తను విస్మరిస్తాం. ఆయన అలా సానుభూతి వచనాలు పలికి ఊరుకోడు. బలవన్మరణం పొందిన రైతుకు వచ్చిన కష్టమేంటని ఆరా తీస్తాడు. స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తాడు. దుఃఖంతో తల్లడిల్లుతున్న వారికి భరోసా ఇస్తాడు. తోచిన సాయం చేసి, ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందేలా కృషి చేస్తున్నాడు ఈ ఉపాధ్యాయుడు. పాతికేండ్లుగా రైతన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్న పులి రాజు మనసున్న మారాజు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పులి రాజు స్వగ్రామం గజ్వేల్ సమీపంలోని ఏటిగడ్డ కిష్టాపూర్. 1997లో కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ చేశాడు. ఆ రోజుల్లో తెలంగాణలో పత్తి రైతుల ఆత్మహత్యలు రోజూ పత్రికల పతాక శీర్షికల్లో వచ్చేవి. ఆ వార్తలు చదివి కలత చెందిన రాజు.. తనవంతుగా అన్నదాత కుటుంబానికి అండగా నిలవాలని భావించాడు. బాధిత కుటుంబాలను కలిసి వారి జీవన స్థితిగతుల వివరాలు సేకరించాడు. ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా అందేలా చొరవ చూపాడు. ఇలా ఉండగా 2002లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు సాధించాడు రాజు. సమర్థంగా విధులు నిర్వర్తిస్తూనే.. సెలవు రోజుల్లో తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. 5వేల రైతు కుటుంబాలను కలిశాడు. దాదాపు 3 వేల కుటుంబాలకు సాయం అందేలా చేశాడు. రాజు చొరవతో బాధిత కుటుంబానికి చెందిన పిల్లల్లో చదువు కొనసాగించి, ఉద్యోగాల్లో చేరిన వారూ ఉన్నారు.

అన్నదాత కుటుంబాలకు అండగా ఉండటానికి ప్రతి నెలా తన జీతంలో పది శాతం వెచ్చిస్తున్నాడు రాజు. ఇదంతా ఎందుకు అని అడిగితే.. ‘అన్నం పెట్టే రైతు కుటుంబం పస్తుంటే.. చూస్తూ ఎలా ఊరుకోగలన’ని అంటాడు రాజు. ‘ఒకప్పుడు రైతు ఆత్మహత్యకు పాల్పడితే, పరిహారం కోసం అతని కుటుంబ సభ్యులు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగేవారు. కానీ, తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో రైతుల బతుకు చిత్రం మారింది. రైతు భరోసాతో పెట్టుబడి దొరికింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో పల్లెలు కళకళలాడాయి. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. ‘రైతుబీమా’ పథకం ప్రత్యేకం. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే, నెల రోజుల లోపే ఆ రైతు నామినీ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమయ్యేవి. యజమాని పోయినా.. ఆ ఇల్లు రోడ్డున పడకుండా ఈ పథకం కాపాడిందం’టాడు రాజు.

తెలంగాణ ప్రాంతంలో పత్తి రైతు బలవన్మరణాలపై నివేదిక సిద్ధం చేసి 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశాడు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలను అందజేయడమే పనిగా పెట్టుకున్నాడు. అప్పటి ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో తాత్సారం చేయడంతో 2012లో ఆయా కుటుంబాల పక్షాన హైకోర్టులో కేసు వేయించాడు. జీవో 421 ప్రకారం 452మంది కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చేశాడు. ఇలా అన్నదాత కుటుంబాలకు అండగా నిలిచాడు రాజు. ఇప్పటికీ, రైతుకు కష్టం ఉందంటే వెంటనే అక్కడికి వెళ్లిపోతుంటాడు. తనకు చేతనైన సాయం చేస్తాడు. పదిమందితో సాయం అందేలా చేస్తుంటాడు.
తెలంగాణ వ్యాప్తంగా తిరిగి సేకరించిన రైతు కుటుంబాల గాథలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చాడు పులి రాజు. ‘రైతు ఆత్మహత్యల గోస’ పుస్తకాన్ని గతేడాది, ‘వేలురు ఆత్మహత్మల గోస’ పుస్తకాన్ని గత అక్టోబర్లో ఆవిష్కరించాడు. ఇలా రైతు కష్టాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ‘అన్నం పెట్టే రైతును అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం రైతుకు ఎన్ని రకాలుగా అండగా నిలవాలో చాటి చెప్పింది. ముఖ్యంగా రైతు భరోసా దేశవ్యాప్తంగా అమలు కావాలి. దేశానికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు లేని గ్రామాలను చూడాలన్నదే నా ధ్యేయం’ అంటున్న పులి రాజు మంచితనానికి మనమూ హ్యాట్సాఫ్ చెబుదాం.
రైతుల గోసను వినడంలోనే కాదు, విద్యార్థులకు పాఠాలు చెప్పడంలోనూ పులి రాజుది ప్రత్యేక శైలి. 2017లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారానికి ఆయన ఎంపికయ్యాడు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. అంతేకాదు, రైతుల కోసం చేస్తున్న నిస్వార్థ సేవకు గానూ 2015లో న్యూఢిల్లీలోని సివిల్ సొసైటీ మ్యాగజైన్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు’, 2019లో అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ‘రైతు నేస్తం’, 2024లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ నుంచి ‘కిసాన్ సేవారత్న’ అవార్డులను అందుకున్నాడు.
…? దేవిని కిరణ్కుమార్ , గజ్వేల్