నవంబర్ మాసాంతం నుంచి మార్చి నెలాఖరు వరకు విహారానికి అనుకూల మాసాలుగా పేరుంది. ఆల్రెడీ ఓ నెల గడిచిపోయింది. ఇప్పటికైనా యాత్రకు సిద్ధమవ్వండి. ఈసారి మీరు సాగించే విహారం.. విజ్ఞాన, వినోద, ఆధ్యాత్మిక కళల సమాహారంగా మార్చుకోండి.
వెళ్లామా.. వచ్చామా అని కాదు. మీరు వెళ్లిన ప్రతి చోటును అనుభూతి చెందకపోతే, నింపాదిగా అక్కడ ఉండి.. ఆ ప్రాంతంతో స్నేహం చేసి… అక్కడి సంస్కృతిని అర్థం చేసుకోలేకపోతే,.. మీరు చేసే యాత్ర.. అది విహారయాత్ర అయినా, తీర్థయాత్ర అయినా..మరేదైనా మీకు సరైన ప్రతిఫలాన్ని అందించలేదని అర్థం. మీ పర్యటనలు అర్థవంతం కావాలన్నా.. నాలుగు కాలాల పాటు మీ మనసు పొరల్లో మధురస్మృతిగా మిగలాలన్నా మీరేం చేయాలో తెలుసుకోండి. నవంబర్ మాసాంతం నుంచి మార్చి నెలాఖరు వరకు విహారానికి అనుకూల మాసాలుగా పేరుంది. ఆల్రెడీ ఓ నెల గడిచిపోయింది. ఇప్పటికైనా యాత్రకు సిద్ధమవ్వండి. ఈసారి మీరు సాగించే విహారాన్ని.. విజ్ఞాన, వినోద, ఆధ్యాత్మిక కళల సమాహారంగా మార్చుకోండి.
చాలామంది యాత్రలు ‘పుల్లయ్య వేమారం వెళ్లాడు.. వచ్చాడు’ అన్నచందంగా సాగుతాయి. ఆదరాబాదరాగా బయలుదేరి హడావిడిగా చుట్టేసి తిరిగొచ్చేస్తారు. అప్పుడు అసంతృప్తి మొదలవుతుంది. ‘ఏమిటో అంతా హడావిడి అయిపోయింది. ఏదో చుట్టేసినట్టు అయ్యింది. ఈసారి వెళ్లినప్పుడు తాపీగా అన్నీ బాగా చూసి రావాలి’ అనుకుంటారు. మళ్లీ వెళ్లటం అనేది అవుతుందా లేదా అనేది వాళ్ల చేతుల్లో కూడా ఉండదు. మరికొంత మంది తమ పర్యటన అందరి దృష్టిలో పడాలని తెగ తాపత్రయపడతారు. పర్యటన మొత్తంలో వాళ్ల ఫోకస్ అంతా ఫొటోలు, వీడియోలు తీయటం పైనే ఉంటుంది. గుడిలో దేవతా మూర్తి అయినా, ప్రకృతి దృశ్యం అయినా వాళ్లకు ఒకటే. కెమెరా కన్నుతో మాత్రమే చూస్తారు. ఇన్స్టాగ్రామ్ ఫొటోలు, ఫేస్బుక్ పోస్టులు, వాట్సాప్ మెసేజ్‌లే పరమావధిగా వాళ్ల విహారం సాగుతుంది.
ఇంకొంత మంది ఉంటారు. కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేయాలని ఎవరో చెబితే వింటారు. ఏదో యాత్రల బస్సు పట్టుకుని అక్కడికి వెళతారు. ప్రతి ఉదయం కాశీ నుంచి బయలుదేరి ఓ రోజు ప్రయాగ, మరో రోజు అయోధ్య తిరగేసి నిద్రవేళకు కాశీ చేరుకుంటారు. రాత్రి పడుకుంటారు. తొమ్మిది రోజులూ ఇలాగే సాగుతాయి. యాత్ర పూర్తవుతుంది. కానీ, కాశీలో తరగని ఆధ్యాత్మికత ఉంటుంది. ఆ విశేషాల్ని పరిపూర్ణంగా దర్శించి అనుభూతి చెందాలనే సూత్రం మాత్రం ఆచరణలోకి రాదు. తొమ్మిదిరోజులు అక్కడే ఉండి ఘాట్లు, ఆలయాలు సందర్శిస్తూ క్షేత్ర మహిమను తెలుసుకుంటూ గడిపితే తప్ప యాత్ర పరిపూర్ణం కాదు. తొమ్మిది రాత్రులు అయ్యేసరికి అరిషడ్వర్గాలు, త్రిగుణాలను త్యజించి పునీతులు కాలేకపోతే ఆ యాత్ర సార్థకమైనట్టు కాదు. ఒక్క కాశీ యాత్ర అని కాదు. ఏ పర్యటనకైనా ఇది వర్తిస్తుంది.
ప్రకృతిలోనూ అణువణువూ సౌందర్యభరితమే. కొండలు, గుట్టలు, లోయలు, జలపాతాలు, సరస్సులు ఓ రకమైన అనుభూతిని ఇస్తే ఒళ్లంతా పచ్చదనాన్ని నింపుకొన్న ప్రకృతి మైమరపింపజేస్తుంది. కనువిందు చేసే చెట్లు, విరగబూసిన పూల తోటలు, పచ్చిక బయళ్లు మనల్ని మరో లోకంలోకి తీసుకుపోతాయి. యాత్రలో ఒళ్లంతా కళ్లు చేసుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్లాలి. ఇంకేం అద్భుతం చూడబోతున్నామా అన్న కుతూహలంతో నలుదిక్కుల్ని తేరిపార చూడాలి. ఆ అనుభూతులను మనసు లోతుల్లో పదిలపరుచుకుంటూ అలా అలా సాగిపోవాలి.
దట్టమైన అరణ్యాల్లో విహరిస్తూ వన్యప్రాణుల జీవనం గురించి ఆసక్తితో తెలుసుకుంటున్నప్పుడు గగుర్పాటు కలుగుతుంది. విలాసవంతమైన రాజసౌధాలను, చారిత్రక కట్టడాలను చూసినప్పుడు మన ఆలోచనలు కొన్ని వందల ఏండ్లు వెనక్కి వెళ్లిపోతాయి. సాంకేతికత అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఇంతింత ఎత్తున కట్టడాలను అసలు ఎలా నిర్మించగలిగారు? ఇన్నాళ్లూ అవి ఎలా నిలబడగలిగాయి అని విభ్రాంతికి లోనవుతాం. నాటి నిర్మాణ కౌశలానికి సౌందర్య దృష్టికి అబ్బురపడతాం.
ప్రాచీన ఆలయాలను సందర్శించినప్పుడూ అంతే! అక్కడ వాస్తు, శిల్ప, చిత్రకళా నైపుణ్యాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఆలయ గోపురాలు, చుట్టూ ఉన్న ప్రాకారాలు తమదైన ప్రత్యేకతతో మన చూపుల్ని కట్టి పడేస్తాయి. క్షేత్ర మహాత్మ్యం తెలుసుకోవాలన్న తహతహ మొదలవుతుంది. మనసు భక్తి పారవశ్యానికి లోనవుతుంది. ఇలా ప్రకృతి ప్రదేశాలు, చారిత్రక ప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఒకదానికొకటి తీసిపోకుండా తమవంతు అనుభూతిని మనకు పంచుతూ ఉంటాయి. కాకపోతే వాటిని దర్శించగలిగే ఓపిక, ఆస్వాదించే సమయం, అర్థం చేసుకుని పదిలపరచుకోగల కొత్త చూపు మనకు ఉండాలి.

అమ్మానాన్నలు పిక్నిక్కు తీసుకెళ్లినప్పుడు పిల్లల్లో పర్యటనల పట్ల ఆసక్తికి బీజం పడుతుంది. అది వయసుతోపాటు పెరిగి పెద్దదవుతుంది. తోటివాళ్లతో కలిసి ఎక్స్కర్షన్కి వెళతారు. ఆయా ప్రదేశాలకు సంబంధించిన కొత్త విశేషాలు తెలుసుకోవటమే కాదు, తల్లిదండ్రులు లేనప్పుడు ఒంటరిగా ఎలా నెగ్గుకురావాలో నేర్చుకుంటారు. చదువుతోపాటు సమాంతరంగా సాగే విజ్ఞాన యాత్రలు వారిలో అభిరుచిని పెంచుతాయి.
ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్లకు కూడా విమాన ప్రయాణం సహజంగా మారింది. కానీ, ఒకప్పడు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించటమే చాలామందికి అద్భుతమైన అనుభవం. కిటికీ పక్కన సీటు సంపాదించుకోవటానికి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు పోటీపడటం, ఆ తర్వాత కూర్చుని బయట వేగంగా కదిలిపోయే చెట్లను, విద్యుత్ స్తంభాలను అబ్బురంగా చూస్తూ ఉండటం చాలామందికి ఓ తీపిగుర్తు.
తర్వాత జీవితంలో కొందరికి పర్యటనలు అభిరుచిగా మారతాయి. కొత్త ప్రదేశాలను చుట్టి రావటం, అవకాశం ఉన్నప్పుడల్లా ట్రెక్కింగ్‌లు, హైకింగ్లకు సిద్ధమవుతారు. “సోలో లైఫే సో బెటర్” అనుకుంటూ భుజం మీద బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని ఒంటరి యాత్రలకు బయలుదేరేవాళ్లు కొందరైతే, స్నేహితులతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకునే వాళ్లు మరికొంత మంది. కొత్త దంపతులయ్యాక చేపట్టే హనీమూన్, కుటుంబ సభ్యులందరూ కలిసి చేసే విహారయాత్రలు, తీర్థయాత్రలు వాటికి అదనం.
వ్యక్తుల అభిరుచులను బట్టి వాళ్లు పర్యటనలకు ఎంపిక చేసుకునే ప్రదేశాలు మారిపోతాయి. దానికి అనుగుణంగానే టూరిజం నిపుణులు వాటిని వర్గీకరించారు. కేవలం కొత్త ప్రదేశాలను చూసి కాస్త విశ్రాంతిగా గడపటానికి చేపట్టే పర్యటనలను ‘లీజర్ టూరిజం’ గానూ, వ్యాపార లావాదేవీల కోసం చేపట్టే వాటిని ‘బిజినెస్ టూరిజం’ అని అంటున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ఉన్నాయి.

రిస్క్ చేయటానికి సిద్ధపడి చేసే పర్యటనలను ‘అడ్వెంచర్ టూరిజం’ పేరుతో పిలుస్తున్నారు. ఇందులో నేలపైనా, నీళ్లలోనూ, గాలిలోనూ సాహసాలు చేయటానికి సిద్ధమవుతారు. ట్రెక్కింగ్‌లు, హైకింగ్లు, మౌంటైన్ బైకింగ్లు, రాక్ క్లయింబింగ్లు, బంగీజంప్‌లు.. ఇవన్నీ భూమిమీద చేపట్టేవి. డిజర్ట్ సఫారీలు, వైల్డ్ లైఫ్ సఫారీలు కూడా ఇందులోకి వస్తాయి. స్కూబా డైవింగ్, సైలింగ్, కయాకింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్ అనేవి నీటిపైన సాగించే సాహసకృత్యాలు. ఇక మిగిలింది గాలిలో.. పారా గ్లయిడింగ్, స్కై డైవింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్ తదితరాలు ఇందులోకి వస్తాయి.
భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. కాని ఎక్కువ మంది ట్రెక్కింగ్, స్కీయింగ్ కోసం హిమాలయాలను, వాటర్ స్పోర్ట్స్‌కి రుషికేశ్, స్కూబా డైవింగ్‌కి అండమాన్ దీవులను ఎంపిక చేసుకుంటున్నారు. యోగా ప్రేమికులు కూడా రుషికేశ్ గంగానది ఒడ్డున సాధన చేయడాన్ని ఇష్టపడుతున్నారు. వైద్యచికిత్సల కోసం, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి చేసే విహారాలు హెల్త్ టూరిజం కిందికి వస్తాయి. క్రీడలు చూడటానికి, పాల్గొనడానికి వెళ్లడం స్పోర్ట్స్ టూరిజం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా చేసే విహారాన్ని ఎకో టూరిజంగా పిలుస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని జీవన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి చేసే పర్యటనలు కల్చరల్ టూరిజం కిందికి వస్తాయి. ఇవన్నీ మనకు కొద్దో గొప్పో తెలిసినవే. అంతగా పరిచయం లేని రకరకాల పర్యటనలు ఉన్నాయి. అవేంటంటే..
ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లి వలంటీర్‌గా సేవలందించే వలంటూరిజం కూడా ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఎక్కడికి వెళ్లకుండా ఉన్నచోటి నుంచే వివిధ ప్రాంతాలను అన్వేషించే వర్చువల్ టూరిజం ఇప్పుడు మిగతా అన్ని విహారాలను తోసిరాజంటున్నది. ‘లోకో భిన్న రుచిః’ అన్నట్టు.. ఎవరి ఆసక్తి వారిది. దానికి తగ్గట్టే పర్యటన అనుభవమూ దక్కుతుంది.

పర్యటన అంటే శరీరాన్ని ఒకచోటు నుంచి మరోచోటుకు కదిలించటం కాదు. అదొక మరపురాని ప్రయాణం. నిమగ్నతను పెంచుకోవటానికి మానసికంగా చేసే సాధన. ఆత్మోన్నతి కోసం చేసే ప్రయత్నం. బాహ్యంగానే కాదు, ఆంతరంగకంగానూ అది సంపూర్ణ పరివర్తనకు దోహదం చేస్తుంది. భారతీయ ఆధ్యాత్మికవేత్తలు పర్యాటకాన్ని స్వీయ ఆవిష్కరణకు, స్వీయ జ్ఞానానికి ఒక మార్గంగా ఏనాడో పేర్కొన్నారు.
మీరు ఏదైనా పర్యటనలకు వెళ్లినప్పుడు.. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు, కొత్త ఆచార వ్యవహారాలు, కొత్త ఆహార అలవాట్లు మీకు పరిచయం అవుతాయి. మీరు చేయవలసిందల్లా వాటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవటమే. “మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కళ్లు విప్పార్చుకుని పరిశీంచకపోతే.. అసలు మీరు పర్యటన చేసినట్టే కాదు. అలా చేసినవాళ్లు రెక్కలు లేని పక్షులు లాంటి వాళ్లు” అన్నాడు ఓ కవి.
అది పుణ్య క్షేత్రమైనా, పర్యాటక కేంద్రమైనా.. ప్రాంతం ఏదైనా మీ శరీరాన్ని , మనసును ఆత్మలను లయం చేసి దర్శించగలిగితే అలౌకికమైన ఆనందం మీ సొంతమవుతుంది. కొత్త ప్రపంచపు వాకిళ్లు మీ కోసం తెరుచుకుంటాయి. దివ్యమైన అనుభవాలు, ప్రశాంతతకు దరిచేర్చే అనుభూతులు మీ పరమవుతాయి. కొన్నేండ్ల సాధన ద్వారా యోగులు ఎంత ఫలితాన్ని సాధించగలుగుతారో.. నాణ్యమైన, నిజమైన పర్యాటకులు ఒక్క యాత్రలోనే అలాంటి ఉత్కృష్టమైన స్థితిని అందుకోగలుగుతారని పెద్దల మాట.
పర్యటనలు చేసే మేలు
మనల్ని మనకు పరిచయం చేస్తాయి : పర్యటనలు ఉల్లాసాన్ని, సంతోషాన్ని కలిగించటం మాత్రమే కాదు. అవి మనకు ఎన్నో కొత్త విషయాలను నేర్పుతాయి. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తాయి. మనతోపాటు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా కొత్తగా అర్థం చేస్తాయి. వయసు పెరిగినకొద్దీ వివేకం పెరుగుతుందో లేదో తెలియదు కానీ, విహారం వల్ల వ్యక్తి అవగాహన కచ్చితంగా పెరుగుతుంది. అంటే మన చూపు విశాలమవుతుంది.
సృజనాత్మక ప్రతిభ : చిన్నప్పటి నుంచి పర్యటనలు చేపట్టే చిన్నారుల్లో సృజనాత్మక ప్రతిభ అధికంగా ఉంటుందని, మిగిలిన వారితో పోలిస్తే వాళ్లు మంచి గ్రేడ్లు తెచ్చుకుని రాణిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. పర్యటనలు చేపట్టే అలవాటు ఉన్న వాళ్లలో ఆత్మవిశ్వాసం అధికం అని.. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ‘నేను చేయగలను’ అన్న ధోరణి వాళ్లలో కనిపిస్తుందని మనస్తత్వవేత్తలు చెబతున్నారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి ఎదురయ్యే అసౌకర్యాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారట. ఎక్కువ మందిని కలవటం వల్ల మనలో సహానుభూతి, కల్చరల్ అవేర్నెస్ కూడా పెరుగుతాయి.
రోగనిరోధక శక్తిపై ప్రభావం : కొత్త ప్రాంతాలకు మనల్ని మనం పరిచయం చేసుకోవటం వల్ల శరీరంలో యాంటి బాడీస్ పెరుగుతాయి. అది మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందట. పర్యటనలు చేపట్టినప్పుడు మన శరీరం వేలకొద్దీ కొత్త బ్యాక్టీరియాను స్వీకరించి శక్తిమంతంగా మారుతుందని చెబుతున్నారు.
ఆరోగ్య వృద్ధి : అలాగే ఒత్తిడిని దూరం చేసే దివ్య ఔషధం యాత్రలు చేయటం. దానివల్ల మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మూడు రోజుల పర్యటన చేసిన అనంతరం చాలామందిలో పూర్తి విశ్రాంత భావన కలిగిందని, ఆందోళనకు, ఒత్తిడికి దూరం కాగలిగామని చెప్పారు. ప్రశాంతంగా ఉండే అడవిలో పర్యటనలు చేపట్టిన నగరవాసుల్లో మానసిక ఆందోళన తగ్గుముఖం పట్టినట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించటం వల్ల చాలా సమస్యలు దూరం అయ్యాయన్న భావన ఏదో తెలియని బలాన్ని అందిస్తుంది.
దీర్ఘకాలిక ప్రయోజనాలు : ప్రయాణాలకు, మనలో కాగ్నిటివ్ యాక్టివిటీకి సంబంధం ఉందని కొలంబియా బిజినెస్ స్కూలు ప్రొఫెసర్ ఆడమ్ జెలెన్ స్కీ, అతని బృందం వెల్లడించారు. మెదడు చురుగ్గా పనిచేయటానికి, మరింత సృజనాత్మకంగా వ్యవహరించటానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
శారీరక వ్యాయామం : ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు వ్యాయామం చేయటానికి, వర్కవుట్లు చేయటానికి బద్దకించవచ్చు. కానీ, ఏదైనా పర్యటన చేపట్టినప్పుడు మాత్రం తెలియకుండానే చాలా దూరం నడుస్తారు. ఇది చాలా కేలరీలను కరిగించి, శరీరానికి పుష్టినిస్తుంది. ఆహారపరంగా కూడా కొత్త రుచులు మీకు పరిచయం అవుతాయి.
ఒక బిలియనీర్ ఆర్థిక స్వేచ్ఛకు నిర్వచనం చెబుతూ.. ‘ప్రపంచంలో కోరుకున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ నచ్చినన్ని రోజులు గడపగలగటం’ అన్నాడు. అంటే నచ్చిన చోటుకు వెళ్లడం సంపదకు కొలమానంగా మారిందని మనం అర్థం చేసుకోవచ్చు. నవంబర్ మొదలుకొని మార్చి రెండో వారం వరకూ ట్రావెల్ ఫ్రెండ్లీ మాసాలుగా చెబుతారు. ఆ తర్వాత వేసవి. దానికి తోడు జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈలోపుగానే మీ యాత్రకు సిద్ధమవ్వండి. ఏడాదికి ఒకసారైనా ఓ మంచి పర్యటన చేపడితే దానివల్ల అందే ఫలితాలు ఆ సంవత్సరమంతా మిమ్మల్ని చైతన్యంగా ఉంచుతాయి. ఇందుకు విదేశీ పర్యటనలు చేయనవసరం లేదు. ఆయా వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా స్థానికంగా ఉండే ప్రదేశాలను ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే, ఆ యాత్రలో తప్పనిసరిగా ఓ ఫీల్ ఉండాలి బ్రో… లేకపోతే అది సాదాసీదా ప్రయాణంగానే మిగిలిపోతుంది.

విహారంలో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇది తెలియకుండానే మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కళ్లకు, మెదడుకు చాలా వరకూ అలసట తగ్గుతుంది.
మీరు ఏదైనా పర్యటనకు వెళ్లినప్పుడు రోజువారీ బాధ్యతలను పక్కనపెట్టండి. ఆఫీసు ఫోన్‌కాల్స్, టార్గెట్లు, బిజినెస్ డీల్స్, వాదోపవాదాలు, చర్చలు అన్నింటినీ పక్కన పెట్టండి. పూర్తి సమయాన్ని పర్యటనకే వెచ్చించండి. అప్పుడు మీ విహారం పూర్తి స్థాయిలో సార్థకం అవుతుంది.
మనలో గతాన్ని పట్టుకుని వేల్లాడేవాళ్లు కొందరైతే, భవిష్యత్తు గురించి ఆందోళన చెందే వాళ్లు మరికొందరు. ఈ రెండింటినీ కాదనుకుని వర్తమానంలో గడపండి. పూర్తి నిమగ్నతతో వ్యవహరించండి. మీ కంటి ఎదురుగా కనిపించే అందమైన ప్రదేశాలను చూడండి. ప్రకృతి వైవిధ్యాన్ని, పక్షుల కిలకిలారావాలను గమనించండి. చుట్టూ ఉన్న వ్యక్తులను ఆసక్తిగా గమనించండి. వారితో వీలైతే నాలుగు మాటలు
మాట్లాడండి. మనుషుల పట్ల మీకు ఉండే అవగాహన మారొచ్చు.
పర్యాటక ప్రాంతాల్లో అపరిచితులతో జాగ్రత్తగా వ్యహరించండి. మీకు పరిచయం లేని కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఏమరుపాటు తగదు. జనసమ్మర్ధం లేని ప్రదేశాలను ఎంచుకోవటం, వేళగాని వేళల్లో వెళ్లటం ముప్పు తెస్తుంది. ప్యాకేజీలతో యాత్రలకు వెళ్లే వాళ్లు ట్రావెల్ సంస్థ పూర్వాపరాలను తెలుసుకోవటం మంచిది. రివ్యూలు ముందుగా పరిశీలించుకుని, నలుగురితో చర్చించి నిర్ణయం తీసుకోండి. మీరు స్నేహితులు, పరిచయస్తులతో వెళ్లినప్పుడు చాలా వరకూ ఇబ్బందులను పరిహరించుకోవచ్చు.
భారత దేశం వైవిధ్యానికి పెట్టింది పేరు. అన్ని రకాల ట్రావెలర్ల ఆర్తిని తీర్చే ఎన్నో ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దేశీయంగా ఎక్కువ మంది సందర్శించే ప్రదేశాల్లో ఉత్తర్‌ప్రదేశ్ ముందుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలైన కాశీ, ప్రపంచపు ఏడు అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ని చూడటానికి సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. రెండు, మూడు, నాలుగు స్థానాల్లో దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. ఈ మూడు రాష్ర్టాలు సంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రసిద్ధమైన ఆలయాలకు పెట్టింది పేరు. ఐదో స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. విదేశీ టూరిస్టులు ఎక్కువ మంది సందర్శించే ప్రాంతాల్లో గుజరాత్ ముందుంటే, ఉత్తరప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. ఈ రెండిటి మధ్యలో మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి. కేవలం నగరాలను తీసుకుంటే ఢిల్లీ, ముంబయి, జైపూర్, ఆగ్రా, వారణాసి.. టాప్ ఫైవ్‌లో ఉన్నాయి.