Health Insurance | ఆర్థిక మూలాలు పదిలంగా ఉండాలంటే ముందుజాగ్రత్త చాలా అవసరం. మనకేం అవుతుందిలే అన్న నిర్లిప్త ధోరణి లక్షాధికారిని కూడా బికారిని చేస్తుంది. సగటు మానవుడు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించే విషయాల్లో ఆరోగ్య బీమా ఒకటి. దూరదృష్టి లేకపోతే అప్పటి దాకా పొదుపు చేసుకున్నవన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. ఎగువ మధ్యతరగతి కుటుంబాన్ని దిగువ మధ్యతరగతికి పడదోయడానికి చిన్న ప్రమాదమో, పెద్ద వ్యాధో కారణం కావొచ్చు. అలా కావొద్దంటే ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలన్నది కూడా చాలా ముఖ్యం. ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోండి.
చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేయగానే ముఖం చిట్లిస్తారు. మాకేమైంది దుక్కలా ఉన్నాం అనుకుంటారు. పైగా ఆఫీసులో గ్రూప్ పాలసీ ఉందంటూ ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను పురుగు కన్నా హీనంగా చూస్తారు! కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పటి కోసం కాదు.. భవిష్యత్తు కోసమనే ఎరుక ఉండాలి. ఈరోజు మోకాలి చిప్పల మార్పిడి చికిత్సకు సుమరు ఐదు లక్షల దాకా చెల్లించాల్సి వస్తున్నది. పదేండ్ల కిందట ఇదే సర్జరీ లక్షన్నరలో అయిపోయింది. అంటే పదేండ్లలో మూడున్నర రెట్లు పెరిగినట్టే కదా! అంటే ఇప్పుడు మోకాళ్ల శస్త్రచికత్సకు ఐదు లక్షలు అవుతుంటే.. ముప్పయ్ ఏండ్ల తర్వాత కోటి రూపాయలు దాటిపోతుందంటే నమ్ముతారా!
ఈ విషయం ఇప్పుడు చెబితే అంత ఎందుకు అవుతుంది అని ఎగాదిగా చూస్తారు. కానీ, వాస్తవం చాలా కఠినంగా ఉంటుంది. వైద్యరంగంలో ద్రవ్యోల్బణం మార్కెట్ రేటును మించి ఉంటుందన్నది సత్యం. భవిష్యత్తు ఊహించడం కష్టం అనుకుందాం! ఒకసారి గతంలోకి తొంగి చూద్దాం. 1994 ప్రాంతంలో మీ తల్లిదండ్రులు ముప్పయ్ ఏండ్ల వయసులో ఉండి ఉంటారు. వాళ్లు అప్పుడు ఓ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని కాసేపు ఊహించుకుందాం. ఇన్సూరెన్స్ ఏజెంట్ వారితో ముప్పయ్ ఏండ్ల తర్వాత మోకాలి కీళ్ల మార్పిడికి రూ.5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెబితే.. వాళ్లూ నమ్మి ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడు అదే నిజమైందిగా! భవిష్యత్తులోనూ మెడికల్ ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. సాంకేతికత పెరిగేకొద్దీ, వైద్యశాస్త్రంలో నూతన విధానాలు పుట్టుకొచ్చే కొద్దీ ధరలు పెరుగుతాయే కానీ, తగ్గవు. ఈ క్రమంలో మనకు, మన కుటుంబానికి ఎంత మొత్తంలో ఇన్సూరెన్స్ ఉండాలో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అత్యావశ్యకం.
మరో ముఖ్య విషయం హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ రోగాలు పలకరిస్తాయి. రుగ్మతలు కలిగే కొద్దీ ప్రీమియం భారం అవుతుంది, కవరేజీ తగ్గుతుంది. అలా కావొద్దంటే.. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఆరోగ్య బీమా ఆనందంగా తీసుకోవాలి. ‘ఆరోగ్య బీమా మాకు అవసరం రావొద్దు’ అనుకుంటూనే దస్త్రంపై సంతకం పెట్టండి. ఒకవేళ ఏ ప్రమాదమో, అనారోగ్యమో పలకరించినా.. మీ ఆర్థిక మూలాలకు ఏ అపాయమూ వాటిల్లదు. లేకపోతే.. ఆస్పత్రి పాలయ్యాక అప్పు చేస్తున్నారని తెలిసినా, ఆస్తులు అమ్మి డబ్బులు పెడుతున్నారని విన్నా… మీరు తట్టుకోలేకపోవచ్చు.
ఎంత డబ్బు సంపాదిస్తున్నారన్నది మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారన్నదే కీలకం. అయితే, పెట్టుబడికి అర్హత ఉందో లేదో చూసుకోవాలి. మీ జీవన సౌధానికి హెల్త్ ఇన్సూరెన్స్ పిల్లర్స్ లాంటివి. ఆ తర్వాత మీరు చేసే పెట్టుబడులు స్లాబుల్లాంటివి. పిల్లర్స్ లేకుండా ఎన్ని అంతస్తులు కడితే మాత్రం ఏం ప్రయోజనం. ఒక్క కుదుపుతోనే మీ జీవితం కుప్పకూలిపోతుంది. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి, సగటు ఉద్యోగి అందరూ ఆరోగ్య బీమా కాన్సెప్ట్‌ను లోతుగా అర్థం చేసుకోవాలి. పాతికేండ్ల తర్వాత వైద్యానికయ్యే ఖర్చులను అంచనా వేసి.. ఆ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత కుటుంబ వ్యవహారానికయ్యే ఖర్చులు ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. లేకపోతే ఊహించని ప్రమాదం జరిగి ఆస్పత్రిపాలైనా, దీర్ఘకాలిక వ్యాధిబారిన పడినా.. మీ కుటుంబం ఆర్థికంగా ఇరవై ఏండ్లు వెనకపడిపోతుందని గుర్తుంచుకోండి. కుటుంబసభ్యులు నలుగురు ఉన్నట్లయితే.. కోటి నుంచి కోటిన్నర రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం. ఐదు లక్షల ఇన్సూరెన్స్‌కు యాభై లక్షల ఇన్సూరెన్స్‌కు ప్రీమియంలో వ్యత్యాసం ఏడాదికి పదివేల లోపే ఉంటుంది. పదివేలు అదనంగా కట్టలేని మీరు.. హాస్పిటల్ బిల్లు కట్టడానికి లక్షలు ఎక్కన్నుంచి తేగలరు! అందుకే, ఆరోగ్య బీమా విషయంలో పెద్దగా ఆలోచించి.. ఎక్కువ మొత్తానికి తీసుకుంటే మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చినవారు అవుతారు!