నోరూరించే దానిమ్మ పండు అందరికీ తెలిసిందే. పూతకొచ్చిన కాలంలో దానిమ్మ పొద ఎంతో అందంగా ఉంటుంది. ఈ పండు ఎరుపు, పసుపు రంగులు మిళితమై ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అనేక సంప్రదాయ ఆచారాల్లో, ఔషధాల్లో దానిమ్మ పండు వినియోగిస్తున్నారు. మత విశ్వాసాల్లో ఇది సంపదకు చిహ్నం. సీమంతం వేడుకలో గర్భిణిని ఆశీర్వదించే ముత్తైదువలు అయిదు రకాల పండ్లతో ఒడినింపుతారు. వాటిలో దానిమ్మ పండు మొదటిది.
ప్రాచీన కాలంలో నేటి ఇరాన్, ఉత్తర భారత భూభాగాల్లో దానిమ్మ పండేది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించిందీ చెట్టు. సమశీతోష్ణ వాతావరణంలో, వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఎదుగుతుంది. ప్రపంచంలో అయిదు వందల పేర్లతో దానిమ్మ చెట్లున్నాయి. పొద ఎత్తు, పూలు, కాయ పరిమాణం, రంగు, రుచిని బట్టి ఒకే రకమైన దానిమ్మకు అనేక పేర్లున్నాయి. ఇందులో గింజలు గట్టిగా ఉండేవి, మెత్తగా ఉండేవి, అతి పుల్లగా ఉండేవి, కెంపు, తెలుపు, లేత ఆకుపచ్చలో ఉండే రకరకాల దానిమ్మలు ఉన్నాయి. ఇవి 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకుని పెరుగుతాయి. మన దేశంలో దోల్కా, కంధారి, స్పానిష్ రూబీ, గణేష్, ఆలంది దానిమ్మ పండ్లు పండుతున్నాయి.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని కణాలను ధ్వంసం చేసే ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని ఇవి నివారిస్తాయి. దానిమ్మ రసానికి రక్తాన్ని పలుచన చేసే గుణం ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల రక్తనాళాల్లో సరఫరా వేగవంతమవుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. అందుకే దానిమ్మ ఫలాన్ని ‘నేచురల్ ఆస్పిరిన్’ అని పిలుస్తారు. రోజూ అర కప్పు దానిమ్మ రసం తాగితే గుండె జబ్బులు రావు. నొప్పులు తగ్గించడానికీ, దగ్గు, మూత్రాశయ వ్యాధులు, జీర్ణాశయ సమస్యలు, క్యాన్సర్ నివారణకు దానిమ్మ తోడ్పడుతుంది. ఆకలిని పుట్టిస్తుంది. పూలతో కూడా ఔషధాలను తయారు చేస్తారు. దానిమ్మ తొక్కను అద్దకం కుటీర పరిశ్రమల్లో రంగుల తయారీ కోసం ఉపయోగిస్తారు. దానిమ్మ కాయ, తొక్క నుంచి తీసిన ద్రావణం కీటక నాశినిగా ఉపయోగపడుతుంది.