అభివృద్ధి అంటే పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, ఇబ్బడిముబ్బడిగా వస్తు వినియోగమే. అయితే, వీటి విపరిణామాల గురించి చాలా రోజుల వరకు పట్టించుకోలేదు. ఫలితంగా వాయు, జల, భూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. నేలలో లవణాలు, హానికరమైన రసాయనాలు, భారలోహాలు పరిమితికి మించి పేరుకుపోతున్నాయి. దాంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. విష రసాయనాలు కలిసిన నీళ్లు, గడ్డి తినే పశువుల పాలూ, మాంసమూ కలుషితమై పోతాయి. చెరువుల్లో చేపలు మరణిస్తాయి. ఇక మనుషుల సంగతి చెప్పనక్కర్లేదు.
చర్మ క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయ క్యాన్సర్, మెదడులో కణుతులు.. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వీటన్నిటి విపరిణామాలకు ఉదాహరణగా చెప్పుకోవాల్సిన ప్రాంతం పటాన్చెరు పారిశ్రామిక వాడ. ఇక్కడి వాగులు, చెరువులు సమీపంలోని పరిశ్రమల కాలుష్య భారాన్ని మోస్తుండటంతో ప్రజలు ఉద్యమించక తప్పలేదు. 1980, 1990లలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో దాఖలైన ‘1056/ 90’ రిట్ పిటిషన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దీని పూర్వాపరాలను విశ్లేషిస్తూ సమయమంత్రి చంద్రశేఖర శర్మ వెలువరించిన పుస్తకం ‘ఒక విధ్వంసం 1056/90’. పటాన్చెరు కాలుష్యం ప్రధానంగా సాగిన ఈ పుస్తకం మనకు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ఎంత అత్యవసరమో గుర్తుచేస్తుంది.
నివేదిక: సమయమంత్రి చంద్రశేఖర శర్మ
పేజీలు: 398; ధర: 401
ప్రచురణ: శ్రీ జనచైతన్య పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 76748 69432
మన(సు) అనుభవాలకు అందమైన అక్షర రూపం ఇస్తే అది కవిత్వం అవుతుంది. ఈ ప్రయత్నంలో వాక్యాలను రాస్తాం. కొట్టేస్తాం. కొట్టివేసిన దాంట్లో రాసింది వెతుక్కుంటాం. కొత్తగా మళ్లీ ఏదో రాస్తుంటాం. మనసులో ఎంతో అలజడి జరిగితే గాని ఓ మంచి కవిత రూపుదాల్చదు. ఇలాంటి కవితల సమాహారమే కుడికాల వంశీధర్ ‘లోపలి వాన’ సంకలనం. ‘గగనతలమంతా/ పొగ చూరినట్టుగా వుంది/ సందేహం లేదు!/ ఏ క్షణంలోనైనా/ వానపడొచ్చు..’ అంటూ సాగే ‘లోపలి వాన’ కవిత వాన వైవిధ్యాన్ని కండ్లకు కడుతుంది.
‘కాగితం పడవ’లో చిన్ననాటి జ్ఞాపకాలు వానలో తడవనివని గుర్తుచేస్తాడు. లాస్ ఏంజెల్స్‌లోని గోల్డెన్ గేట్ వంతెన వైభవాన్ని ‘గోల్డెన్ గేట్ బ్రిడ్జ్’ కవిత ఘనంగా చాటుతుంది. నగరీకరణ వేగం పుంజుకున్న సమయంలో ఉన్నాం. ఊళ్లను, పొలాలను రోడ్లు ముంచేస్తున్నాయి. ఈ పరిణామం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన ‘ఔటర్ రింగ్ రోడ్’ ఎంతో ఆలోచనాత్మకంగా సాగుతుంది. ‘ఒకే దుఃఖం’ కవిత కరోనా సమయంలో వలస కూలీల వెతలను దృశ్యమానం చేస్తుంది. ‘లోపలి వాన’ చదువుతుంటే పాఠకులకు తాము కూడా అర్థవంతమైన గమ్యాలకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది.
రచన: కుడికాల వంశీధర్
పేజీలు: 100; ధర: రూ. 150
ప్రచురణ: సాకేత్ & రాహుల్ ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 98852 01600