ఆయిల్ పామ్ చెట్టు దాదాపు ఈత చెట్లను పోలి ఉంటుంది. పామాయిల్ చెట్టు పుట్టిల్లు దక్షిణాఫ్రికా. అక్కడి నుంచి ఇతర ఖండాలకు విస్తరించింది. పామాయిల్‌ను అయిదు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉపయోగిస్తున్నట్టుగా చరిత్ర చెబుతున్నది. ప్రాచీన కాలంలో పామాయిల్ పండ్లను దంచి, వేడినీళ్లలో మరిగించి గుజ్జును పిండి నూనె తీసి వంటల్లో వాడేవారట. నేడు పామాయిల్ని వంటనూనెగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. మలేషియా, ఇండోనేషియాలలో వాణిజ్య పంటగా పెంచడం వల్ల ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి మెరుగైందని అంచనా. దానికి కారణం వంట నూనెల్లో మిగతా నూనెలకన్నా తక్కువ ధరలో పామాయిల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది పామే కుటుంబానికి చెందినది. నూనె ఉత్పత్తికి మూలమైన కొవ్వుని కలిగిన కాయలు కాస్తుంది కాబట్టి పామాయిల్ చెట్టనే పేరు వచ్చింది.
గుత్తుల గుత్తులుగా ఉండే పామాయిల్ గెలల నుంచి నూనె (క్రూడ్ పామాయిల్) తీస్తారు. పామాయిల్‌ను రిఫైండ్ (శుద్ధి) చేసి, పామోలివ్ ఆయిల్గా మారుస్తారు. దీనిని వంటకు ఉపయోగిస్తారు. ఎక్కువగా బేకరీ ఉత్పత్తులలోనూ పామోలివ్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. రిఫైండ్ చేసేప్పుడు వచ్చే కొవ్వుని సబ్బుల తయారీలో, రబ్బరు, టైర్ల పరిశ్రమల్లో ఉపయోగిస్తుంటారు. కుటీర పరిశ్రమలలో తయారైన పామాయిల్ ఎర్రగా ఉంటుంది. ఇందులో కెరోటిన్లు ఉంటాయి. వీటి నుంచే ‘విటమిన్-ఏ’ తయారవుతుంది.
పామాయిల్‌కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. అందువల్ల ఆయిల్ పామ్ చెట్లను పంటగా, తోటలుగా రైతులు సాగు చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా భారీ వ్యవసాయ క్షేత్రాలలో పామాయిల్ సాగు నానాటికీ పెరుగుతున్నది. విత్తనాల ద్వారా ఈ మొక్కలను వ్యాప్తి చెందించవచ్చు. 3 సంవత్సరాలకు పూత కొస్తుంది. కాయలు కాసి, పండుగా మారడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. పచ్చగా ఉన్న కాయలు, నారింజ రంగుకు మారిన తర్వాత రెండు, మూడు కాయలు కింద రాలితే గెలలు పక్వానికి వచ్చినట్లు అనుకోవచ్చు. పామాయిల్ సాగుకు పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. మన రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ఆయిల్ పామ్‌కు ప్రసిద్ధి. పీవీ వనంలో పాతిక పామాయిల్ చెట్లు పెరుగుతున్నాయి.
g ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు