ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, కౌమార వయస్కులు చక్కెరలు ఎక్కువగా ఉన్న సోడా, ఇతర తియ్యటి పానీయాలు తాగడం బాగా పెరిగిందట. దీంతో పిల్లలు ఊబకాయం, ఇతర వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.
దీనికోసం పరిశోధకులు 185 దేశాల నుంచి సమాచారాన్ని సేకరించారు. దీన్నుంచి 1990 2018 సంవత్సరాల మధ్య మూడు నుంచి పంతొమ్మిదేండ్ల పిల్లల్లో చక్కెరలు ఉన్న పానీయాల వాడకం 23 శాతం పెరిగిందట. పిల్లలు వారంలో కనీసం నాలుగు సార్లయినా ఇలాంటి పానీయాలు తీసుకుంటున్నారట. కాబట్టి, నవ యువతరంలో ఊబకాయం సమస్యగా మారే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ఫోన్ల వాడకం పెరగడంతో ఇయర్ఫోన్లు దాదాపుగా ఇప్పుడు తప్పనిసరైపోయాయి. అయితే, వీటిని చాలావరకు 105 నుంచి 110 డెసిబెల్స్ శబ్ద స్థాయులతో వాడుతున్నారట. కానీ, మనం రోజుకు 80 డెసిబెల్స్ మోతాదులో ఓ 6 గంటల పాటు ఇయర్ ఫోన్లు వాడొచ్చు అంటున్నారు ఈఎన్టీ వైద్యులు. ఇకపోతే, డెసిబెల్స్ మోతాదు పెరుగుతూ పోయేకొద్దీ మనం ఇయర్ఫోన్లను వాడే సమయం తగ్గించాలని చెబుతున్నారు.
ఉదాహరణకు, శబ్దం మోతాదు వంద డెసిబెల్స్ అయితే రెండు గంటలు, అదే 110 అయితే ఒక్క గంట వరకే వినొచ్చట. ఇక చెవుల్లో ఏదో మోగుతున్నట్టు, నొప్పిగా అనిపించడం లాంటివి వినికిడి సమస్యలకు సంకేతాలు. కాబట్టి, ఈ లక్షణాలు ఉంటే ఆడియాలజిస్టును కలిసి, సమస్యను నిర్ధారించుకోవాలి. సాధ్యమైనంత వరకు చెవులకు విశ్రాంతిని ఇవ్వాలి. నిరంతరం ఏదో ఒకటి వినే ప్రయత్నం చేయకూడదని సూచిస్తున్నారు.