Exercise | ఇప్పుడు నగరాల్లో మెట్లెక్కడం కంటే లిఫ్ట్ వాడకమే ఎక్కువ.అయితే, ఓ తాజా అధ్యయనం ప్రతిరోజు మెట్లెక్కడంతో ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతుందని పేర్కొన్నది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన ప్రివెంటివ్ కార్డియాలజీ సమావేశంలో ఈ అధ్యయనాన్ని వెల్లడించారు. మెట్లెక్కడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది నిజమే అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అండ్ నార్ఫోక్ పరిశోధకురాలు డాక్టర్ సోఫీ పాడాక్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు గుండె రక్తనాళాల వ్యాధి ప్రధాన కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. శారీరక శ్రమ, వ్యాయామం ద్వారా ఈ ముప్పు తప్పించుకోవచ్చు. వ్యాయామం అంటే జిమ్, వాకింగ్, రన్నింగ్ లాంటివే కాకుండా మెట్లెక్కడం కూడా. దీనివల్ల గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చు.

డాక్టర్ పాడాక్ బృందం 48,000 మందిపై తొమ్మిది అంశాల ఆధారంగా మెటా అనాలసిస్ జరిపింది. ఇందులో పాల్గొన్నవారిలో ఆరోగ్యవంతులు, గుండె రోగాల చరిత్ర ఉన్నవాళ్లు ఉన్నారు. ఈ అధ్యయనం ఫలితాలు పరిశోధకులను ఆశ్చర్యపరిచాయి. మెట్లెక్కడం ద్వారా ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం 24 శాతం వరకు తగ్గుతుందట. అదే గుండె రక్తనాళాల వ్యాధులతో మరణించే ముప్పు 39 శాతం తగ్గుతుందని తేలింది. రోజూ మెట్లెక్కడం గుండెపోటు, గుండె వైఫల్యం, స్ట్రోక్ లాంటి సమస్యల ముప్పు కూడా తగ్గిస్తుందట.
రోజువారీగా డాబాపైకి వెళ్లేటప్పుడు, షాపింగ్ మాల్స్‌లో, ఉద్యోగం చేసేచోట… లిఫ్ట్‌కు బదులుగా మెట్లెక్కడానికి ప్రయత్నించాలి. పనిగట్టుకొని మరీ మెట్లు ఎక్కడం పనిగా పెట్టుకోవాలి.
నిపుణుల ప్రకారం రోజుకు పది నుంచి పదిహేను మెట్ల చొప్పున మూడు నుంచి ఆరు సార్లు ఎక్కితే ఆరోగ్యానికి మంచిది. ఓ అధ్యయనం ప్రకారం ఐదు విడతలుగా మొత్తం యాభై మెట్లెక్కితే గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.
మెట్లు ఎక్కుతున్నప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది గుండె కండరాలు బలోపేతం అయ్యేలా దోహదపడుతుంది. దీంతో గుండె రక్త సరఫరా సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. పైగా పోషకాలు, ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని శరీరం అంతటికీ చేరవేయడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సిన పరిస్థితి తప్పుతుంది.