Sunday Story | స్మిత.. పేరుకు తగ్గట్టే మందస్మిత. రాణి.. చదువుల్లో మహారాణి. హారిక.. తెలివైన అమ్మాయి. ముగ్గురూ మంచి స్నేహితులు. చదువుల్లో టాప్ త్రీ కూడా! స్మిత ఆల్వేస్ ఫస్ట్‌ర్యాంక్ హోల్డర్. రాణికి సెకండ్ ర్యాంకు వచ్చేది. మూడో ర్యాంకు హారికది. ర్యాంకుల మధ్య ఉన్నట్టే.. ఒకట్రెండు మార్కుల వ్యత్యాసంతో స్మిత టాప్‌లో నిలిచేది. ఒకే బెంచ్‌లో కూర్చునేవారు. లంచ్ బాక్సులు షేర్ చేసుకునేవారు. సందేహాలు వస్తే.. వాళ్లలో వాళ్లే నివృత్తి చేసుకునేవారు. ఈ మిత్రత్రయానికి అందరూ ఫ్యాన్సే!
రోజులు జాయ్‌ఫుల్‌గా సాగిపోతున్నాయి. పోటాపోటీగా వాళ్ల చదువులూ ముందుకెళ్తున్నాయి. ఒకసారి హారిక పుట్టినరోజున ముగ్గురు మిత్రులూ కలుసుకున్నారు. మిగతా స్నేహితులూ కొంతమంది వచ్చారు. ఆటపాటలతో మజా చేశారు. అక్కడి వాతావరణం సందడిగా మారింది. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా కూల్ డ్రింక్స్ తెప్పించింది హారిక. స్మితకు కూల్‌డ్రింక్స్ అంటే పెద్దగా నచ్చదు. లావైపోతానేమో అని తన భయం. రాణికి మాత్రం నో మొహమాటమ్స్! కూల్‌డ్రింక్స్ అంటే మహా ఇష్టం. పెట్‌బాటిల్ ఎత్తిందంటే దింపకుండా మొత్తం ఖాళీ చేస్తుంది.
‘ఇప్పుడు కూల్డ్రింక్సా! నేను తాగలేను బాబోయ్’ అన్నది స్మిత. ‘అవును మరి! ఒక్క గ్లాసు తాగితే మేడం గారు లావైపోతారు మరి!’ అని ఆటపట్టించింది రాణి. ‘కూల్‌డ్రింక్స్ టేస్ట్ చేయడం ఒక ఆర్ట్’ అని తన ఇష్టాన్ని రెట్టింపు చేసేలా కామెంట్ చేసింది. ‘లావు కాదు, బరువు కాదు.. అదేమైనా హాట్డ్రింకా, కూల్డ్రింకేగా నేనూ తాగగలను’ అన్నది స్మిత. ఇలా డిస్కషన్స్ జరుగుతుండగా హారిక కల్పించుకొని.. ‘ఉండవే స్మిత! ఇప్పుడు నీకు, రాణికి కూల్ డ్రింక్ పోటీ పెడతాను. నేనిచ్చే గ్లాస్‌లోని కూల్‌డ్రింక్‌ని ఎవరు ముందు కంప్లీట్ చేస్తారో వాళ్లే విన్నర్! ఏమంటావ్?’ అంది. ‘ఆ! అదెలా కుదురుతుంది. నాకసలే ఈ డ్రింక్స్ నచ్చవు. రాణికేమో ఇవంటే ప్రాణం. కచ్చితంగా తనే గెలుస్తుంది. అంతగా కావాలంటే, నేను ఒక గ్లాస్ తాగే లోపు, తను ఐదు గ్లాస్లు కంప్లీట్ చేస్తానంటే అప్పుడు నేను ఈ పోటీకి ఒప్పుకొంటాను’ అని సవాలు విసిరింది స్మిత. రాణి కూడా పోటీకి సై అంది. ఓ పెద్ద జార్లోని డ్రింక్‌ను స్నేహితురాళ్ల ముందే ఆరు గ్లాసుల్లో హారిక నింపింది. అయితే, డ్రింక్స్ చల్లగా లేవని ఐస్ క్యూబ్స్‌ని ఒక్కో గ్లాస్లో ఒక్కోటి వేసి ‘గేమ్ స్టార్ట్’ అంది రాణి.
అందరి ఎంకరేజ్మెంట్ మధ్య రాణి వడివడిగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు ఇలా అన్ని గ్లాసుల్లోని డ్రింక్స్‌ను పది సెకన్లలో ఖాళీ చేసింది!, స్మిత మాత్రం తన ఒక్క గ్లాస్‌లోని డ్రింక్‌ని పూర్తి చేయడానికి నాలుగు నిమిషాల సమయం తీసుకుంది. రాణి విజేతగా నిలిచింది. ఇంతలో కేక్ కటింగ్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరూ వచ్చి హారికకు కేక్ తినిపిస్తూ.. సెల్ఫీలు దిగసాగారు. స్మిత భారంగా కదిలింది. ఆమెకు కండ్లు తిరుగుతున్నట్టు అనిపించింది. అయినా స్నేహితురాలిని సమీపించింది. తను వెంట తెచ్చిన బహుమతిని హారికకు ఇవ్వబోతూ అక్కడికక్కడే కూలబడింది. ‘అయ్యో!’ అనుకుంటూ హారిక ఆమెను పట్టుకోబోయేంతలో కింద పడిపోయింది. ఆమె నోట్లోంచి రక్తం. వెంటనే దవాఖానకు తరలించారు. కానీ, అప్పటికే స్మిత చనిపోయిందన్నారు వైద్యులు. అంతేకాదు ఆమెపై విష ప్రయోగం అయిందని తేల్చి చెప్పారు.
స్మిత తాగిన కూల్డ్రింక్నే తాగిన రాణి బాగానే ఉన్నప్పుడు, స్మితకు మాత్రమే ఎందుకిలా జరిగింది? అని అప్పుడే సీన్లోకి వచ్చిన ఇన్స్పెక్టర్ రుద్ర ఆశ్చర్యపోయాడు. జరిగిన పోటీని, డ్రింక్స్ ఇచ్చిన హారికను, పోటీలో పాల్గొన్న రాణిని ఇంకొంతమందిని ప్రశ్నించిన రుద్రకు అసలేం జరిగిందో అర్థం కాలేదు. కేసు కొలిక్కి రావడానికి సమయం పడుతుందని, పార్టీకి వచ్చినవాళ్లెవరూ తన అనుమతిలేకుండా సిటీ దాటి వెళ్లొద్దని చెప్పి స్టేషన్‌కు తిరిగివచ్చాడు.
టేబుల్ మీద ఉన్న ఓ కేస్ ఫైల్‌ను తెరిచాడు రుద్ర. భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపిన ఓ భార్య కేసు అది. భర్తను ఒకేసారి చంపేస్తే అందరికీ డౌట్ వస్తుందని, ఆ భార్య రోజూ కొంచెం కొంచెంగా కాఫీలో అతనికి పాయిజన్ ఇచ్చేది. రోజూ కాఫీలో పాయిజన్ కలపడాన్ని ఎవరైనా చూస్తే సమస్య అని, షుగర్ క్యూబ్స్‌కు విషాన్ని రాసి డబ్బాలో నింపింది. డయాబెటిస్ పేషెంట్ కావడంతో ఆ షుగర్ క్యూబ్స్‌ను తను వాడేది కాదు. ఈ కేసు చదివిన రుద్ర మెదడు పాదరసంలా పనిచేసింది. స్మితను హత్య చేసిందెవరో ఈజీగా కనిపెట్టేశాడు. వెంటనే, ఆ హంతకురాలికి రుద్ర ఫోన్ కలిపాడు. ఆ హంతకురాలెవరో మీరు కనిపెట్టారా?