Nostalgiyana | ఇదీ అని చెప్పలేని వెలితి గుండెల్ని పిండేస్తున్నప్పుడు.. మనసుకు నచ్చిన పాట చెవినపడితే చాలు. అదే మంత్రంలా పనిచేస్తుంది. అయినా, గ్రామ్‌ఫోన్, క్యాసెట్ రికార్డర్ల కాలం నాటి ఆ పాటల్నిమళ్లీ వినిపించేదెవరు? ఆ వైపుగా ఓ యజ్ఞమే జరుగుతున్నది. ‘నోస్టాల్జియానా’ వంటి ఆన్లైన్ సంఘాలు పాత పాటకు పట్టాభిషేకం చేస్తున్నాయి.
సమయం రాత్రి పదిన్నర. యాభై పైబడిన వాళ్లంతా తమ పనులు ముగించుకొని జూమ్ మీటింగ్‌కు హాజరవుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే దాదాపు వందమంది సభ్యులు డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లకు హెడ్‌సెట్స్ పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఆ సమూహం పేరు ‘నోస్టాల్జియానా’. అంతా సిద్ధం అంటూ సంకేతం ఇవ్వగానే, ‘సమ్ఝే నా బాత్ మేరీ’ పాట మొదలైంది. అంతే, అందరి మొహాల్లో చిలిపి చిరునవ్వు. ఈ పాట 1972లో విడుదలైన ‘సా రే గ మ ప’ సినిమాలోది. తర్వాత, 1959లో విడుదలైన ‘నాచ్ ఘర్’ లోంచి మరోపాట. ఆ కొంతసేపూ కళ్లు మూసుకుని ఊహల ప్రపంచంలోకి వెళ్లిపోయారు. పాట పూర్తయిన మరుక్షణం చప్పట్లు, విజిళ్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పాట తర్వాత పాట. పాట తర్వాత పాట. వింటూ వింటూ ఆనందబాష్పాలు రాలుస్తున్నవారు, వింటూ వింటూ అడుగులు కదుపుతున్నవారు, వింటూ వింటూ ఆ పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తున్నవారు.. అదో సుస్వరాల జాతర! తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, తట్టుకోలేని ఉద్వేగాలు.. అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తానికి ఆ రాత్రికి నోస్టాల్జియానా సమూహమంతా హాయిగా.. గుండెమీద చెయ్యివేసుకొని పడుకుంది. చాలామందికి కలలోనూ పాత పాటలే.
పాత పాటల ప్రేమికులు..
పేరుకు తగినట్టుగానే ‘నోస్టాల్జియానా’ ఆన్లైన్ సమూహానికి పాత పాటలంటే వ్యామోహం.. పిచ్చి.. ప్రాణం. కాబట్టే, అందరూ కలిసి ఓ ఆన్లైన్ సమూహంగా ఏర్పడ్డారు. వారానికి రెండుమూడుసార్లు జూమ్‌లో మీట్ అవుతున్నారు. అంతేకాదు ఒక్కోసారి ఆన్లైన్ సెషన్లు కూడా నిర్వహిస్తారు. ఈ బృందంలో దేశంలోని అన్ని ప్రాంతాలవారూ ఉన్నారు. ముంబైకి చెందిన శంకర్ అయ్యర్, ముజుందార్, చెన్నైకి చెందిన బాలాజీ రామచంద్రన్ ‘నోస్టాల్జియానా’ సారథులు. ఈ బంధం యాహూ, ఆర్కూట్ జమానా నాడే మొదలైంది. ప్రస్తుతం జూమ్, గూగుల్ మీట్ వంటి మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లోని ఆ పాత మధురాల్ని తరచూ ఆస్వాదిస్తున్నారు. తరచూ కొత్త సభ్యులు కూడా చేరుతుంటారు. ప్రస్తుతం 250 మంది వరకూ నోస్టాల్జియన్లు ఉన్నారు. వారానికి మూడు ఆన్లైన్ మీట్స్ తప్పనిసరి. ఎప్పుడైనా మీట్ వాయిదా పడితే.. విషాద గీతాలు పాడు కుంటారేమో పాపం!
డిజిటల్ రూపం
ముంబైకి చెందిన 54 ఏండ్ల వ్యాపారవేత్త గోపాల్కర్ కూడా ఇలాంటి ఓ సంఘాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ వివిధ భాషల్లో జనాదరణ పొందిన లక్షన్నరకు పైగా పాత పాటలను సేకరించారు. ముంబైలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం, బిర్లా సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ వంటి వేదికల మీద పాత పాటల సెషన్లు ఏర్పాటు చేస్తుంటారు. ‘మెహఫిల్’ అనే ఆన్లైన్ గ్రూప్‌నూ నిర్వహిస్తున్నారు. ఆయన పాటలకు దేశ, విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం తన పాటలకు డిజిటల్ రూపం ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కోల్‌కతాకు చెందిన 66 ఏండ్ల పవన్ అగర్వాల్ ‘మ్యూజిక్ అడ్డా’ పేరుతో ఓ ఫోరమ్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన నెలలో రెండుమూడు సార్లు ఆన్లైన్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. తెలుగు గడ్డ మీదా ఇలాంటి వేదికలు ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే మనం చాలా ఆణిముత్యాలను కోల్పోయాం.
ఒకవైపు యాక్టింగ్.. మరోవైపు స్టార్టప్స్.. సైడ్ బిజినెస్‌లతో దూసుకెళ్తున్న టాలీవుడ్ స్టార్స్..
పవన్ కళ్యాణ్‌తో నటించడంపై బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ రియాక్షన్ ఇదీ..
నత్తగుల్లలు లొట్టలేసుకుంటూ తింటానంటున్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందా? అయితే మీ ఆహారంలో ఇది ఉండేలా చూసుకోండి..