హీరోయిన్ కటౌట్ హైట్ పెంచిన నటి నిత్యా మేనన్. కథానాయిక అంటే ఎక్స్పోజింగ్ చేయాలన్న నియమానికి తలొగ్గకుండా.. తన అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైంది! దక్షిణాదిలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నిత్య తన గాత్రంతోనూ ఆకట్టుకుంటున్నది. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న ఆమె.. సినిమాల్లో కొనసాగడంపై ఆసక్తి లేదంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. అందం అనేది మేకప్‌తో వచ్చేది కాదని, కొందరి కళ్లలోనే తాను అందాన్ని చూశానని చెబుతున్న నిత్యా మేనన్ పంచుకున్న కబుర్లు..
ఇండస్ట్రీలో అందరూ నెంబర్‌వన్ కాలేరు. స్టార్‌గా ఎదగాలని నేనీ పరిశ్రమలోకి అడుగు పెట్టలేదు. నా వరకు నేను పోషించిన పాత్రకు నూరు శాతం న్యాయం చేయాలనుకుంటాను. నేను పాత్ర ఎంచుకునే ముందే.. అది నా వ్యక్తిత్వానికి సరిపోతుందా అని చూస్తాను. సినిమా వర్కవుట్ అవుతుందా లేదా అన్నది అంతగా పట్టించుకోను. సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా ప్రజలపై మంచి ప్రభావం చూపే పాత్రలనే ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాను. కథ నాకు అర్థం కాకపోతే.. నేను చేయలేనని చెప్పేస్తాను.
జాతీయ అవార్డు వచ్చిన సమయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆ సమయంలో నేను జ్యూరీలోని కొంతమంది సభ్యులను కలిశాను. కేవలం ఇది సినిమాకు మాత్రమే ఇచ్చిన అవార్డు కాదు. నాలో ఉన్న కళాకారిణికి ఇచ్చిందని అప్పుడు అర్థమైంది. అయినా నేను కెరీర్లో ఎప్పుడూ కష్టమైన మార్గాన్నే ఎంచుకుంటాను. అందుకే అవార్డులను గొప్పగా భావిస్తాను.
సినిమాకు అందాన్నిచ్చేది కథానాయికలు. కానీ, నేను ఎప్పుడూ సినిమాల్లో నా మేకప్, లుక్స్‌కి ప్రాధాన్యం ఇవ్వను. ఏదో పరధ్యానంలో ఉండి మేకప్ వేసుకోవడం మర్చిపోయి షూటింగ్‌కు వెళ్లిన రోజులూ ఉన్నాయి. నా దృష్టిలో అందమనేది మనం వేసుకునే మేకప్‌తో వచ్చేది కాదు. నేను కొంతమందిలో వారి కళ్లలోనే అందాన్ని చూశాను. చాలా సందర్భాల్లో సినిమాలో మీరు ఇలానే కనిపించాలని ఒత్తిడి చేసినా వాటికి ఎప్పుడూ లొంగలేదు.
చిన్నప్పటి నుంచీ పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, అందరినీ అనుకరిస్తూ నటించడం నాకు అలవాటు. అది గమనించిన అమ్మ నన్ను ప్రోత్సహించింది. నిజానికి నేను నటి అవ్వాలని అనుకోలేదు. అనుకోకుండానే ఇన్నేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా! ఎప్పటికప్పుడు సినిమాలు మానేద్దాం అనిపిస్తుంటుంది.
నటిగా బయటికి స్వేచ్ఛగా వెళ్లలేం. పార్కులో నడవాలని అనిపించినా, అది సాధ్యం కాదు. ట్రావెలింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ, అందరిలా పర్యాటక కేంద్రాలు తిరగలేను. చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని ఉండేది. మరెన్నో కోరికలు ఉన్నాయి. వేరే రంగంలో ఏదైనా అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా అందులోకి వెళ్లిపోతా! నాకు సాదాసీదా లైఫ్ అంటేనే ఇష్టం.
యాక్టింగ్ ఆపేసి ఇండస్ట్రీకి దూరంగా సాధారణ జీవితం గడపాలని అనుకున్నా. అప్పుడే ‘తిరుచిత్రంపళం’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. ‘నేను వదిలేద్దాం అనుకున్నా… సినిమా మాత్రం నన్ను వదిలిపెట్టద’ని అప్పుడు అనిపించింది.