నేను పదో తరగతిలో ఉండగా ఓసారి అందరమూ మా ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చిది. మా నానమ్మ వరంగల్లో చనిపోవడం, ఆమెకు మా ఇంట్లోనే కర్మకాండలు చేయడంతో.. మూడు నెలలు వేరే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అద్దె ఇళ్లలో ఉండే బాధలు.. అప్పుడు గానీ మాకు అర్థం కాలేదు.
నానమ్మ అదే.. నాన్నవాళ్ల అమ్మ, తాతయ్య, ఇద్దరు చిన్నాయనల కుటుంబాలు కూనూరులో ఉండేవి. మా నాన్న.. వాళ్ల అమ్మమ్మకు దత్తుడు కాబట్టి, మేము శివునిపల్లిలో ఉండేవాళ్లం. భర్త చనిపోయిన మా నాన్నవాళ్ల చిన్నమ్మ కూడా మాతోనే ఉండేది. మా అసలు నాయనమ్మ ఓసారి వరంగల్ వెళ్లి.. చిన్న అనారోగ్యంతో అక్కడే చనిపోయింది. అక్కడినుంచి మా దగ్గరికే తీసుకొచ్చాక అంత్యక్రియలు, కర్మకాండలు జరిపారు. ఓ పదిహేను రోజులపాటు మా అత్తయ్యల ఏడుపులు, వచ్చేపోయేవారు, బ్రాహ్మణుల మంత్రాలు, భారీ వంటలు.. వీటితో ఇల్లంతా హడావుడిగా ఉండేది. మా పిల్లలందరికీ మహా సంతోషంగా ఉండేది. నేనైతే బడీ, పుస్తకాలూ గాలికొదిలేసి ఆటల్లో మునిగిపోయాను. అన్ని రోజులు, అంతమంది కజిన్స్ ఎప్పుడు దొరుకుతారు చెప్పండి?! చివరికి.. మా తాతయ్యతోసహా ఎక్కడివాళ్లక్కడ వెళ్లిపోయాక ఇల్లంతా బోసిపోయింది. మా అక్క ఇంకా వరంగల్లో ఇంటర్లో చేరాల్సి ఉంది. అయితే ఓరోజు నేను బడినుంచి వచ్చేసరికి.. ఇంట్లోని కొన్ని సామాన్లు మా పశువుల దొడ్డి పక్కనున్న శేషయ్య గారి ఇంట్లోకి పట్టుకెళ్తుండటం కనిపించింది. అదే విషయం అమ్మను అడిగాను. “మనం కొన్ని రోజులు శేషయ్యగారి ఇంట్ల ఉండాల్నట. గందుకే రోజూ అక్కరబడే కొన్ని సామాన్లు తీస్కపోతున్నం” అని చెప్పింది. “ఎందుకు.. అక్కడ ఉండుడు మనం?!” నాలోని ప్రశ్నా రాక్షసి లేచింది.
“ఇగ నీకు చెప్పలేక చావాలె! మీ నాయనమ్మ చచ్చిపాయె గద! ఆమె పోయిన తిథి, నక్షత్రం మంచివి గావట. మనం మూణ్నెల్లు ఈ ఇల్లు ఒదిలి పెట్టాల్నట”.
“ఎవరు చెప్పిన్రు? నక్షత్రాలు, తిథులల్ల కూడ మంచివి, చెడ్డయి ఉంటయా?!”
“ఎవరు చెప్తరు?! పురోహితులు, శాస్త్రం తెలిసిన పండితులు చెప్తరు”
“మనమే ఒదిలిపెట్టాల్నా? తాతయ్య,
చిన్నాయనలు గూడనా?!”
“వాండ్లెందుకు ఒదులుతరు?! మనింట్లకు తీసుకొచ్చిన్రు గద శవాన్ని?! ఇక్కడ్నే కార్యక్రమాలు ఆయె!”
“మరి దవాఖాన్ల చచ్చిపోయింది గద! దవాఖానల వాండ్లు కూడా వేరే దిక్కుకు పోతరా?!”
“దీన్నే అతి తెలివి అంటరు. నాయనమ్మ మన కుటుంబ సభ్యురాలు. మీ నానకు తల్లి. దావఖాన వాండ్లకు కాదు”.. అంటూ అమ్మ అక్కడినుంచి వెళ్లిపోయింది. అమ్మ జవాబు నాకేమీ సంతృప్తినివ్వలేదు. నాన్నేమో బిజీగా ఉన్నాడు. చేసేదేమీ లేక నా పుస్తకాలూ, బట్టలూ, కొన్ని అవసరమైన వస్తువులూ సర్దుకుని పక్కింట్లోకి పోయాను. ముందొక ఇనుప రేకులతో కప్పిన పెద్ద గది, వెనుక అలుకు నేలతో ఒక సందు, దాంట్లోంచి వెళ్తే ఒక స్టోర్ రూమ్లాంటి చిన్న గది. అంతే!! వంటకు ఇబ్బంది అవుతుందని నాన్న తాటి ఆకులతో ఇంటి వెనుక పెరట్లో చిన్న గుడిసె వేయించాడు. అమ్మ అందులోనే వంటచేసేది. ఈ ఇంటికి మంచినీళ్ల బావి లేదు. ఆ పక్కిల్లు పురోహితుడు నర్సయ్యగారిది. ఆయన్ను అడిగి రెండిళ్ల మధ్యనున్న గోడను ఒక చోట పగులగొట్టించాడు నాన్న. ఆ దారిలోంచి వెళ్లి వాళ్ల మంచినీళ్ల బావిలోంచి నీళ్లు చేదుకుని తెచ్చేవాళ్లం. నానమ్మకు ఎప్పుడూ అన్నిటినిండా నీళ్లు ఉండాలి. “ఎక్కువ చేదకండి అత్తయ్యా! అక్కెరుంటె మళ్ల తెచ్చుకోవచ్చు” అని అమ్మ అన్నా వినకుండా నీళ్లు చేది తెస్తూ.. “మా అక్క ఎందుకో గా పాడు నక్షత్రంల పోయింది. తెల్లారితె మంచిగుండునట. గీ నీళ్లు మోసుడు తప్పేది. మనింట్ల బాయిల మంచిగ నీళ్లు మీదికి ఉండేది. గిక్కడ పాతాళానికి ఉన్నయి” అనేది. మూడు నెలల తరువాత మేము వెనక్కి వచ్చేటప్పుడు నాన్న మళ్లీ గోడ కట్టించాడు. ఏదో వేరే ఇంట్లో సరదాగా ఉందామనుకుంటే మా సరదా రెండు రోజులకే తీరిపోయింది. అది ఆషాఢ మాసమే గానీ, ఆ సంవత్సరం పెద్దగా వానలు పడలేదు. విపరీతమైన వేడి, ఉడకపోత. మా ఇంట్లో అన్ని దర్వాజాలూ, కిటికీలూ ఎప్పుడూ తీసిపెట్టే ఉండేవి కనుక గాలి బాగా వచ్చేది. పైగా మాది పాతకాలం గూనపెంకుల ఇల్లు. చల్లగా ఉండేది. ఇక్కడ ఆ సౌకర్యం లేదు.
దాంతో, నానమ్మ ఎప్పుడూ విసనకర్ర మీద నీళ్లు చల్లుకుని తను విసురుకుంటూ మాకు విసిరేది. ఇక్కడ కూడా కరెంటు లేదు. కానీ, అక్కడ మంచి వెలుతురు వచ్చేది. ఇక్కడ ఒకటే చిన్న ద్వారం, ఎక్కడో ఆకాశాన ఒక కిటికీ ఉండేది. “ఎహె! కుమ్మున పెట్టినట్టు అయితున్నది ఒళ్లు” అంటుండేది నానమ్మ. సాయంత్రం కాగానే నానమ్మ ఎప్పటిలాగే సుద్దపొడితో ఎక్కా సీసాలను, కందిలి సీసాలను మసి లేకుండా తుడిచిపెట్టేది. ఈ ఇంట్లో నాకు ఎక్కువ వెలుతురు కావాల్సి వచ్చి రెండు కందిళ్లు పెట్టుకునేదాన్ని. వీలైతే చీకటి పడక ముందే హోం వర్కు చేసేదాన్ని. అంత చిన్న ఇంట్లో కూడా మాకు చుట్టాలు రావడం మానలేదు. ఎవరన్నా వస్తే అమ్మ, అక్క, నేను వెనుక అలికిన నేల ఉన్న సందులో పడుకునేవాళ్లం. ఈ ఇంట్లో నల్లులు ఉండేవనుకుంటా. రాత్రిపూట అవి చిటుకూ చిటుకుమని కుడుతుంటే.. మేము చేతుల్తో మమ్మల్ని మేము చరుచుకునేవాళ్లం. ఏ రాత్రో మెలకువ వచ్చి చూస్తే.. పాపం అమ్మ నిద్రపోకుండా ఓ చీపురు పుల్లకు దూది చుట్టి దాన్ని గ్యాసునూనె (కిరసనాయిల్)లో ముంచి మంచాల సందుల్లో, చాపల మూలల్లో గుచ్చి నల్లుల్ని చంపుతూ ఉండేది. ఆ ఇంటి గోడల నిండా, తలుపుల మీదా.. ‘నల్లులు నశించవలెను. నల్లులే నశించవలెను’ అని బొగ్గుతో పెద్దగా, వంకరటింకర అక్షరాలతో రాసి ఉండేది. బహుశా వాళ్లు నల్లుల బాధ పడలేకనో ఏమో ఇల్లు వదిలి వెళ్లిపోయుంటారు. “అమ్మా! ఇట్ల గోడల మీద రాస్తె నల్లులకు ఎట్ల తెలుస్తది?! వాటికి చదువొస్తదా?! మరి నల్లులు పోకుండ మనుషులే ఎళ్లిపోయిన్రు గద! ఎందుకు?” అని అమ్మను అడిగాను. “మీ నానను అడుగు. మంచిగ చెప్తరు” అన్నది అమ్మ నవ్వి. కొంచెం వెటకారంగా అన్నదా.. ఏమో! నాకప్పుడు తెలియలేదు.