తాను అడిగిన అన్ని ప్రశ్నలకు రుద్ర కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో తన ప్రేయసి ‘శివుడు’ అంటూ శరత్ బాంబు పేల్చాడు. విరాట్+అనుష్క=విరుష్క ఎలా అయ్యారో.. శివుడు+శరత్=శివరత్ పేరిట తాము మారనున్నట్టు చెప్పాడు. అది విన్న రుద్ర అండ్ టీమ్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థంకావట్లేదు. అప్పటివరకూ ఏమీ తెలియని అమూల్ బేబీలాగా నటించిన శివుడు.. నవ్వుతూ శరత్ దగ్గరికి చేరి.. అతని చేతిలో చేయి కలిపాడు.
షాక్‌లో ఉన్న రుద్ర అండ్ టీమ్‌ను చూస్తూ శరత్ ఇలా వెకిలిగా అన్నాడు. ‘ఒరేయ్.. మళ్లీ మీ సీరియల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ మొదలెట్టారా? కాస్త ఆపండిరా బాబూ!! నా దరిద్రం ఏంటంటే? హంతకుడిని నేనే అంటూ నాకు నేనుగా రివీల్ చేసుకోవాలి. 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని కూడా నేనే మీకు చిన్నపిల్లల కథలా వివరించి చెప్పాలి. చివరకు నా ప్రేయసి శివుడన్న విషయాన్ని కూడా నేనే చెప్పాలి. ఈ మాత్రం దానికి ఏదో షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్లాగా ఈ రుద్రగాడి బిల్డప్. వాడికో తొట్టిగ్యాంగ్. ఛీ..’ అంటూ శరత్ గట్టిగా నవ్వుతుండగానే.. మధ్యలో రుద్ర కలుగజేసుకొన్నాడు.
‘రేయ్ శరత్. అన్నీ బాగానే మేనేజ్ చేశావ్. అయితే, ఒక్క విషయంలో నీ బుర్రను ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టి వచ్చావేంట్రా?’ అంటూ అంతే విసురుగా నవ్వాడు. తనను హేళన చేస్తూ రుద్ర నవ్వడాన్ని జీర్ణించుకోలేని శరత్.. ‘ఏంట్రా.. అది’ అంటూ నిలదీశాడు. ‘ఏరా? నేను షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్నో కాదో తర్వాత. నువ్వు భస్మాసురుడి వారసుడివి కదా! ఆ భస్మాసురుడి తల భస్మం అయినట్టే, నీ తలలోని మెదడు చితికిపోయిందా? లేకపోతే, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావురా’ అంటూ రుద్ర అంతే రెట్టించి కొనసాగించాడు. అసలు రుద్ర ఏం చెప్తున్నాడో ఎవ్వరికీ అర్థంకావట్లేదు. రుద్ర మళ్లీ కొనసాగించాడు.
‘ఒరేయ్ తెలివితక్కువ గాడిద. ఇప్పుడేదో డైలాగ్ కొట్టావ్!! హంతకుడివి నువ్వే అంటూ నీకు నువ్వుగా రివీల్ చేసుకొన్నావా? శివగాడి గురించి, 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని గురించి నువ్వే మాకు చెప్పావా? సరే. నువ్వు ఫుల్లు జీనియస్. ఒప్పుకొంటా. మరి, అంత జీనియస్ అయినప్పుడు.. నీ 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని నువ్వే నాశనం ఎలా చేసుకొన్నావ్రా??’ అంటూ రుద్ర అనడంతో అసలేం జరుగుతుందో శరత్, శివుడికి అర్థంకాలేదు. జయ, స్నేహిల్, రామస్వామి అండ్ కో క్వశ్చన్ మార్క్ ముఖాలు పెట్టి ఆసక్తిగా వింటున్నారు.
దీంతో శరత్ అందుకొని.. ‘ఏరా.. ఏండ్లుగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని నాకు నేనుగా నాశనం చేసుకొన్నానా? పిచ్చెక్కిందా?’ అంటూ శరత్ విరుచుకుపడ్డాడు. ‘ఒరేయ్ పిచ్చి వెధవా.. ఆగు. నీ తెలివిలేనితనంతోనే ఆ యాగాన్ని ఎప్పుడో అట్టర్ ఫ్లాప్ చేసుకొన్నావ్రా. అంతెందుకు, నువ్వు కిడ్నాప్ చేసిన 16 మందిని కరెక్ట్ టైమ్‌లో బలిచ్చినా సరే.. నీ తాతమ్మల తాతమ్మకు ముత్తాతల తాత అయిన భస్మాసురుడు ఈ భూమి మీదకు వచ్చేవాడు కాదురా’ అంటూ రుద్ర పూర్తిచేయకముందే.. ‘ఎందుకు??’ అంటూ గట్టిగా అరిచాడు శరత్. ‘పిచ్చి కుక్కలా ఎందుకు అలా అరుస్తావ్? కామ్‌గా అడిగినా చెప్తాగా.. అయితే, ఇప్పుడు నీతో నాకు ఒక గేమ్ ఆడాలని ఉందిరా. ఎలాగూ 5 క్వశ్చన్స్ గేమ్ స్టార్ట్ చేశావ్‌గా. ఇప్పుడు నీ ఆట నాది. నీ వేట కూడా నాదే.. రేయ్ శరత్. నేను అడిగే.. 5 సింపుల్ క్వశ్చన్స్‌లో కనీసం మూడింటికి సమాధానాలు చెప్పినా.. నువ్వు చేసిన తప్పేంటో చెప్పేస్తా? నువ్వు నాకు ఇచ్చినట్టు 5 సెకండ్ల టైమ్ నేను ఇవ్వన్రోయ్.. దానికి రెట్టింపు 10 సెకండ్ల టైమ్ ఇస్తా. పండుగ చేస్కో. గేమ్ స్టార్ట్ చేద్దామా?’ అంటూ రుద్ర అనగానే.. తన తప్పేంటో తెలుసుకోవాలన్న కసితో కోపంగానే సరేనని తలూపాడు శరత్. రుద్ర మొదలుపెట్టాడు.
‘నేను అడిగే మొదటి ప్రశ్న కూడా నీలాగే తింగరిదిరా.. ప్రశ్న ఏంటంటే?? మొదటి ప్రశ్న: చెట్టు ముందా? విత్తనం ముందా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..త్రీ.. ఫోర్.. ఫైవ్.. సిక్స్.. సెవన్.. యైట్.. నైన్.. టెన్.. టైమ్ అప్’ ఏమిరా.. శరత్? పురాణాలు అంటివి. 18వ పునర్జన్మ బలిపీఠ యాగం అంటివి. భస్మాసురుడు అంటివి? ఏమైందిరా?? సరే, రెండో క్వశ్చన్ అడుగుతా.. కనీసం ఇదైనా చెప్పు.. రెండో ప్రశ్న: ఆడపడుచు చేత పెండ్లి కొడుకును ముస్తాబు చేయిస్తారు. ఎందుకు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..త్రీ.. ఫోర్.. ఫైవ్.. సిక్స్.. సెవన్.. యైట్.. నైన్.. టెన్.. టైమ్ అప్’.. ఒరేయ్.. నువ్వు నిజంగా ఇంత ట్యూబ్‌లైట్‌లా ఉన్నావేంట్రా??’ అంటూ శరత్‌ను ఉద్దేశిస్తూ రుద్ర ఏదో అంటుండగానే.. ‘నోర్ముయ్.. ఐదింటిలో కనీసం మూడు క్వశ్చన్లు కరెక్ట్‌గా ఆన్సర్లు చేయాలన్నావ్. ఇంకా మూడు క్వశ్చన్లు ఉన్నాయ్. అడుగు ముందు’ అని శరత్ కనుబొమ్మలు ఎగిరేస్తూ అనగానే.. రుద్ర అదేరీతిన కనుబొమ్మలను ఎగిరేస్తూ అడిగాడు.
మూడో ప్రశ్న: రాత్రి కుడివైపు తిరిగి పడుకొంటే పిశాచాలు ఆవహిస్తాయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ శరత్ సమాధానం చెప్పాడు. నాలుగో ప్రశ్న: కొత్త దుస్తులకు నాలుగు అంచుల్లో పసుపు రాస్తారు. ఎందుకు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..’ శరత్ సమాధానం చెప్పాడు. ఐదో ప్రశ్న: ప్రియతమ్కు ఇప్పుడు పదేండ్లు. అతను ఈ వయసుకు రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. అయితే, ప్రియతమ్కు 30 ఏండ్లు రావడానికి ఎన్నేండ్లు పడుతుంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ శరత్ సమాధానం చెప్పాడు. సెకండ్ల వ్యవధిలోనే శరత్ అంత కచ్చితంగా ఆన్సర్లు చెప్పడాన్ని చూసి రుద్ర అండ్ టీమ్ షాక్ అవుతుండగానే.. ‘మీరు షాకులు తినడం తర్వాత.. ముందు నేను చేసిన తప్పేంటో చెప్పరా?’ అంటూ రుద్రను నిలదీశాడు శరత్. దీంతో రుద్ర చెప్పడం ప్రారంభించాడు. అదిపక్కనబెడితే, రుద్ర అడిగిన ప్రశ్నలకు సమాధానాలను మీరు కనిపెట్టారా?
సమాధానం 1: దీనికి రెండు సమాధానాలు.. తాత్వికంగా చూసుకొంటే, చెట్టే ముందు.. కారణం ఏమిటంటే, కల్పవృక్షాన్ని వృక్షజాతికి ఆది వృక్షంగా పిలుస్తారు. క్షీరసాగర మథనంలో కల్పవృక్షం పుట్టింది గానీ, కల్ప విత్తనం రాలేదు. దీన్నిబట్టి చెట్టే ముందు. ఇక, శాస్త్రీయంగా చూసుకొంటే, చెట్టు కంటే విత్తనమే ముందు. చెట్లు పుట్టడానికంటే ముందే మొక్కలు పుట్టాయి. గాలికి ఎగిరే బీజాల ద్వారా సంపర్కం జరిగి కొత్త మొక్కలు పుట్టుకొచ్చాయి. ఆపై మొక్కలే విత్తనాలను పుట్టించి అవే క్రమంగా చెట్లుగా మారాయి. అంటే, ఇక్కడ చెట్టు కంటే విత్తనమే ముందు.
సమాధానం 2: ఆడబిడ్డ అత్తారింటికి వెళ్లగానే పుట్టింట్లో తనకు స్థానం లేకుండాపోయిందని స్త్రీ బాధపడుతుంది. అలాగే, తాము చనిపోయిన తర్వాత కూడా తమ ఆడబిడ్డను.. తమ కొడుకులు పట్టించుకోవాలన్న ఉద్దేశంతో పెండ్లి కొడుకు ముస్తాబే కాదు.. పుట్టింట్లో జరిగే ప్రతీ శుభకార్యాన్ని ఆడబిడ్డ చేతుల మీదుగానే చేయాలని పెద్దలు ఓ ఆచారంగా తీసుకొచ్చారు.
సమాధానం 3: మనిషికి ఎడమ పార్శంలో జఠరాగ్ని ఉంటుంది. ఆహారం జీర్ణంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. రాత్రి శారీరక శ్రమ తక్కువ కాబట్టి, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. అయితే, ఇది చెప్తే వినరని, పిశాచాల పేరుతో పెద్దలు భయపెట్టారు.
సమాధానం 4: పూర్వం వస్ర్తాలను మగ్గాలపై నేసి గంజి పెట్టేవారు. గంజి వల్ల దుస్తులపై సూక్ష్మక్రిములు చేరేవి. వాటిని అలాగే ధరిస్తే వ్యాధులొస్తాయి. అందుకే, క్రిమిసంహారిణిగా పేరున్న పసుపును పెట్టేవారు.
సమాధానం 5: 20 ఏండ్లు.