మొదట్లో మా ఇంట్లో వంటకు అయ్యగారు ఉండేవారు. అయితే, మేము మిడిల్ స్కూల్‌కు వచ్చేసరికి అమ్మే వంట చేసేది. ఏరోజూ ఏడెనిమిది మందికి తక్కువ కాకుండా తను వండాల్సి ఉండేది. అయినా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వంటల కోసం అయ్యగార్లు, అమ్మగార్లూ వచ్చేవారు.
‘ఆడ ఇక మా నాన్న తన అమ్మమ్మకూ, తాతయ్యకూ దత్తపుత్రుడు కనుక వాళ్లిద్దరికీ తద్దినాలు పెట్టేవాడు. అది చాలా ఖర్చు, శ్రమతో కూడిందైనా, నాన్న తన ఎనభై మూడో ఏట చనిపోయేదాకా.. సుమారు తన పద్నాలుగో ఏట నుంచీ.. అంటే డబ్భు ఏళ్లపాటు ఎంతో శ్రద్ధగా ఆబ్దికాలు పెట్టేవాడు. “ఎందుకు నానా ఈ తద్దినం పెట్టడం?!” అని ఓసారి అడిగాను. దానికి నాన్న ఎంతో ఓపిగ్గా.. “మనం రోజూ అన్నం తింటం గద! మరి పై లోకానికి పోయినోళ్లకు ఎవరు పెడతరు?! మనకు ఒక సంవత్సరం అయితె వాండ్లకు ఒకరోజు అన్నట్టు. అందుకోసం వాండ్లకు ఏడాదికొక్కసారి పిండాలు పెట్టాలె. దాన్ని కాకులకో, పక్షులకో పెడుతం. వాండ్లు పక్షుల రూపంల ఒచ్చి తినిపోతరని, అట్ల వాండ్ల దీవెనలు ఉంటయని పెద్దవాండ్ల నమ్మకం!” అని చెప్పాడు. అట్లాగే ఇంకోమాట కూడా చెప్పాడు.. “పెద్దవాండ్ల విశ్వాసం కోసం అది చెయ్యాలె. ఆ పేరుతోటి ఆరోజు ఒక పదిమంది ఆకలితోటి ఉన్నవాండ్లకు భోజనం పెడితే బాగుంటదని నాకనిపిస్తది”.. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది.
వారం ముందే ఓ జీతగాడిని వెంటపెట్టుకుని వెళ్లి కిరాణా సామాను తెచ్చేవాడు నాన్న. అప్పుడే కాదు.. నాన్న ఎప్పుడు ఇంట్లోకి సామాను తెచ్చినా నాకూ, అక్కకూ చెరో బిస్కట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేవాడు. మేము వాటికోసమే ఎంతో ఆత్రంగా ఎదురు చూసేవాళ్లం. అదే మాకు చాలా గొప్ప ఔట్ సైడ్ ఫుడ్. అదికూడా తరచుగా ఉండేది కాదు. ఏదైనా ఇంట్లో చేసింది తినడమే!
తద్దినం రోజు ఏడింటికల్లా మా పక్కఊరు చాగల్లు నుంచి సింహయ్యగారు, ఆయన కొడుకు కేశవయ్యగారు వచ్చేవారు. ఆరోజు వీలైనంత వరకూ నేను బడి ఎగ్గొట్టడం తప్పనిసరి అని వేరే చెప్పక్కర్లేదుగా! వాళ్లు వస్తూనే మడిపంచెలు కట్టుకుని వంటింట్లో దూరేవారు. అమ్మకు ఒక్క వంట తప్పేది కానీ, మిగతా అన్ని పనులూ పెరిగేవి. ఓ పది రకాల వంటకాల కోసం బోలెడు కూరగాయలు కోసి, మిగతా వంట సామానంతా సిద్ధం చేసి ఉంచేది. వాళ్లు పిలిస్తే చాలు.. “ఏం గావాలె అయ్యగారూ!” అంటూ సిద్ధంగా ఉండేది. దగ్గరి మూడు కుటుంబాల బంధువులు భోజనాలకు వచ్చేవారు. ఇంకా పదిమంది దాకా పనివాళ్లకు, ఆరోజున ఎందరొస్తే అందరు బిచ్చగాళ్లకు భోజనాలు పెట్టడం అమ్మవంతే అయ్యేది. మేము కాస్త పెద్దయిం తరువాత వడ్డనలు చేసేవాళ్లం.
అప్పుడు గ్రైండర్లు, మిక్సర్లు లేవు గనుక.. అయ్యగార్లు పెద్దరోటి ముందు కూచుని పప్పు రుబ్బేవారు. వాళ్లు చేసే గారెలు భలే రుచిగా ఉండేవి. మమ్మల్ని వంట చేసేటప్పుడు ఆ దరిదాపులక్కూడా రానిచ్చేవారు కాదు. మాకేమో మగవాళ్లు ఎలా వండుతారో చూద్దామని కుతూహలం. “ఇటు దిక్కు రావొద్దు.. మడి!” అనేవారు. ఇంకొక బ్యాచ్ బ్రాహ్మలు వచ్చి ఏవో మంత్రాలు చదివి నాన్నచేత తద్దినం పెట్టించేవారు. తరువాత అందరం వరుసగా కింద చిన్న చాపల మీద కూచొని.. ముందు విస్తర్లు పరుచుకుని ఉంటే, వాళ్లే వడ్డన చేసేవారు. సింహయ్య గారు అప్పటికే చాలా పెద్దాయన. ఆయనకు వంగడం వచ్చేది కాదు. అన్నిటినీ నిలబడే అంతెత్తునుంచి తపుక్కున విస్తట్లో వేసేవాడు. అయినా మేము భయంతో ఏమీ అనేవాళ్లం కాదు. ఆ తరువాత చాలా ఏళ్లపాటు కేశవయ్యగారు కూడా వచ్చేవాడు. నాన్న చనిపోయాక ఇక మా పుట్టింట్లో తద్దినాలు పెట్టడం ఆగిపోయింది. కొన్నాళ్లకు కేశవయ్యగారు మంచాన పడ్డాడని తెలిసి వెళ్లి చూసొచ్చాను. ఆయన పోయినా ఇప్పటికీ ఆ కుటుంబంతో టచ్‌లోనే ఉన్నాం.
మా చిన్నప్పుడు కూనూరు నుంచి లక్ష్మయ్యగారు, వాళ్లన్నయ్య మత్స్యయ్యగారు మా ఇంటికి వచ్చి పోతుండేవారు. “గీ మత్స్యయ్య ఏం పేరు? గీయిన మనిషే గద.. చేప పేరు పెట్టుకున్నడేంది?!” అని అమ్మను అడిగాను. “నీకు కోతి మాటలు బాగ ఎక్కువయినయ్! శ్రీ మహావిష్ణువు దశావతారాలల్ల మొదటిది ఏంది?!” అన్నది అమ్మ. నాకు ఠక్కున గుర్తొచ్చింది. “తిరుపతి, యాదగిరి, సింహాచలం.. అని దేవుని గుళ్లుండే ఊరి పేర్లు పెట్టుకున్నట్టే.. మత్స్యగిరి, వరాహగిరి, కూర్మనాథం అని కూడా పెట్టుకుంటరు” అన్నది అమ్మ. అప్పుడర్థమైంది. ఇంతకూ ఈ మత్స్యయ్యగారి గురించి చెప్పొచ్చేదేంటంటే.. ఈయన ఎప్పుడూ మా అక్కాచెల్లెళ్లిద్దరి మధ్యలో ఏదోఒక గొడవో, పోటీనో పెట్టి తమాషా చూద్దామనుకునేవాడు. మేమేం తక్కువా?! ఆదర్శ అక్కాచెల్లెళ్లం మరి! మాకు పెద్దగా కొట్లాటలే వచ్చేవి కావు. ఆయన మా పుట్టినరోజులు గుర్తు పెట్టుకుని ఒకరోజు ముందుగానే వచ్చేవాడు.
పుట్టినరోజంటే పెద్దగా కేక్ కట్‌చేయడం, స్నేహితుల్ని పిలవడం, సెలెబ్రేట్ చేయడం లాంటివి మాకు తెలియదు. ఆరోజు తలంటు పోసుకోవడం, ఉన్నంతలో కొత్త బట్టలు వేసుకోవడం చేసేవాళ్లం. అమ్మ ఏదైనా స్వీట్ చేసేది. ఈ మత్స్యయ్యగారు రాగానే.. “పోయినేడు మీ చెల్లె పుట్టినరోజుకు లడ్డూలు చేయించింది అమ్మ. మరి నీ పుట్టిన్రోజుకు ఏం చెయ్యాలె చెప్పు?! మీ అమ్మను అడుగు” అంటూ అక్కను రెచ్చగొట్టేవాడు. ఇక అక్క లడ్డూలు చేయించమని అమ్మ వెంటపడేది. ఆ తరువాత వచ్చే నా పుట్టినరోజు కూడా అంతే! “మీ అక్క పుట్టినరోజుకు లడ్డూలు చేసిన్రు. నీకు గూడ గవ్వే అయితె ఏం బావుంటది?! మంచిగ మైసూర్ పాక్ చేయించుకో.. అమ్మ తోటి చెప్పుపో!” అనేవాడు. “ఏం జెయ్యాల్నో అమ్మకు తెల్సు” అనేదాన్ని నేను. ఈయన కథ ఇలా ఉంటే.. అప్పుడప్పుడూ మా ఇంటికి కూనూరు నుంచి అండమ్మగారూ, లక్ష్మయ్యగారూ వచ్చేవారు. వాళ్ల ముచ్చట్ల గురించి వచ్చేవారం చెప్పుకొందాం!