దేశానికి రాజ్యాంగం, పార్లమెంట్, ఎగువ-దిగువ సభలు ఉండటం సహజమే! అయితే, ఓ పల్లెటూరికీ ఇలాంటి ప్రత్యేకతలుంటే?! అదే.. హిమాచల్ ప్రదేశ్‌లోని మలానా. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య గ్రామాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తనదైన ప్రత్యేక చట్టాలతో విలక్షణ గ్రామంగా పేరు తెచ్చుకున్నది.
హిమాచల్ ప్రదేశ్‌లోని పార్వతీ లోయలో ఉంటుంది మలానా గ్రామం. తనదైన ఆచార వ్యవహారాలు, విభిన్న సంప్రదాయాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య గ్రామంగానూ పేరు తెచ్చుకున్నది.
గ్రీకువీరుడు అలెగ్జాండర్‌తో ‘మలానా’కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ భారత్‌పై దండెత్తినప్పుడు.. అతని సైన్యంలోని కొంతమంది గ్రీకు సైనికులు గాయపడ్డారు. వారంతా తిరిగి స్వదేశానికి వెళ్లకుండా.. మలానా ప్రాంతంలో స్థిరపడ్డారట. తామంతా గ్రీకు సైనికుల వారసులమేనని మలానా గ్రామస్తులు చెబుతారు.

గ్రామానికి సొంతంగా పరిపాలనా వ్యవస్థ ఉంది. ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగం అమలవుతుంది. ఇది అత్యంత పురాతనమైనది కూడా. గ్రామానికి సొంత పార్లమెంట్, అందులోనూ ఎగువ, దిగువ సభలు ఉన్నాయి. గ్రామానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇక్కడే చర్చకు వస్తాయి. ఏవైనా సమస్యలుంటే.. ఇక్కడే పరిష్కారాలు నిర్ణయిస్తారు. ఏవైనా వివాదాలు వస్తే.. గ్రామ పెద్దలే పరిష్కరిస్తారు. ఇక గ్రామంలో శాంతిభద్రతలు నిర్వహించడానికి పోలీసు స్టేషన్‌తోపాటు సొంత చట్టాలు కూడా ఉన్నాయి.

మలానా వాసులు తమ గ్రామ దేవత ‘జమ్లు రిషి’ నిర్ణయాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. గ్రామ పవిత్రతను, స్వచ్ఛతను కాపాడటానికి కొన్ని నిర్దుష్ట నియమాలను ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వాటిలో ప్రముఖమైనది.. బయటి వ్యక్తులు మలానాలోని దేనినీ తాకకూడదు. ఇక్కడి మనుషుల్నే కాదు.. గుళ్లను, ఇళ్లను, చివరికి గోడలను కూడా తాకకూడదనే చట్టం ఉంది. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే.. ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకు నిబంధనలు పాటించని వారినుంచే జరిమానా వసూలు చేస్తారు. చివరికి దుకాణాల్లో వస్తువులు కొన్నా.. డబ్బును నేరుగా చేతికి ఇవ్వకూడదు. ఇక బయటివారితోనూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. అలాచేస్తే.. తమ ఆధ్యాత్మికత కలుషితానికి దారితీస్తుందని, దైవానికి ఆగ్రహం కలుగుతుందని గ్రామస్తులు నమ్ముతారు. ఇక్కడి వాళ్లంతా ‘కనాషి’ భాషను మాట్లాడతారు. ఈ భాష ప్రపంచంలో మరెక్కడా వినిపించదు. అందుకే, తమ భాషను కూడా పవిత్రంగా భావిస్తారు. ఇక గ్రామస్తులను, ఆలయాలను ఫొటో తీసే ముందు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో ఉండే ఈ పల్లె.. ప్రకృతి సౌందర్యానికీ కేరాఫ్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా, సాహస యాత్రికులకు స్వర్గధామంగా విరాజిల్లుతుంది. జారీ అనే ప్రాంతం నుంచి నాలుగైదు కిలోమీటర్ల మేర కొండ మార్గంలో ట్రెకింగ్ చేస్తూ.. ఈ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, చందర్ఖానీ పాస్, దేవ్ టిబ్బా శిఖరాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఢిల్లీ, చండీగఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని భుంతర్ వరకు బస్సు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. భుంతర్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ‘జరీ’ గ్రామం మీదుగా మలానా డ్యామ్ వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 4 కి.మీ మేర ట్రెక్కింగ్ చేస్తే మలానా గ్రామానికి చేరుకోవచ్చు. మే నుంచి జూలై, సెప్టెంబర్ నుంచి నవంబర్ ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన నెలలు.