‘స్వాతంత్య్రాన్ని గురించిన నా అభిప్రాయం సంకుచితం కాదు. మానవుని హోదాకు తగిన అన్ని అంశాల్లోనూ స్వాతంత్య్రం ఉండాలి’
– గాంధీజీ (హరిజన్, 1942 జూన్ 7)
‘వ్యక్తిగత స్వాతంత్య్రం లేని ఏ సమాజమూ అభివృద్ధి పొందలేదు… వ్యక్తిగత స్వాతంత్య్రం ఉన్నవాడే దేశసేవను సంపూర్ణంగా చేయగలడు, చేయడానికి పాత్రుడు కాగలడు; ఈ స్వాతంత్య్రం లేనినాడు అతడొక యంత్రంగా సంచరిస్తాడు. దానితో సమాజం నాశనమౌతుంది.’
– గాంధీజీ (హరిజన్, 1942 ఫిబ్రవరి 1)
బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారని రాజా రామ్మోహన్ రాయ్ మీద విమర్శలెక్కుపెట్టి ఖండించడం, అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదని వివేకానందుని తూలనాడటం… ఇలాంటివి తెలుసు. ఇక గాంధీజీని ఖండించాలన్నా, విమర్శించాలన్నా, దూషించాలన్నా నేడు మితిమీరిన స్వేచ్ఛతో, విశృంఖలంగా సాగుతున్నారు. మతం, కులం, ప్రాంతం, పార్టీ, భావజాలం వగైరా కారణాలతో అహేతుకమైన ధోరణిలో గత పదేళ్లుగా ఈ తంతు ఆధునిక టెక్నాలజీ చేయూతతో నడుస్తున్నది.
తొలుత పండిట్ జవహర్లాల్ నెహ్రూ కేంద్రంగా మొదలైన ఈ దుష్ప్రచారం, తర్వాతికాలంలో మహాత్మాగాంధీ వైపు మళ్లి తారాస్థాయికి చేరింది. ఎందుకు? ఏమిటి?.. అనే ప్రశ్నలు చాలామందికి కలుగుతున్నాయి.. ఎందుకిలా జరుగుతున్నది… ఏమిటి వాస్తవమని! ఆరేడేళ్లుగా గాంధీజీకి సంబంధించి లోతైన పరిశీలన పరిశోధన చేసిన వ్యక్తిగా ఈ 2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయం గురించి కొంత దృష్టి పెట్టి చర్చించాల్సిన అవసరముంది అనిపిస్తున్నది.
గాంధీజీ భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం మొదలుపెట్టి పదేళ్ల క్రితమే వందేళ్లు దాటింది. తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే సలహా మీద గాంధీజీ 1915,16 ప్రాంతంలో ఈ సమాజాన్ని ఓ సంవత్సరంపాటు రైలు ప్రయాణం చేస్తూ నేరుగా పరిశీలించి, అధ్యయనం చేసి; తర్వాత కార్యాచరణకు దిగిన వ్యక్తి. తగిన ఉపాధి దొరకని కారణంగా దక్షిణాఫ్రికా వెళ్లిన యువ లాయర్ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడం, అందులోభాగంగా అక్కడ స్థిరపడిన భారతీయులను సమీకరించి ఏకతాటిన నడిపిన అనుభవం గల సాధకుడు కూడా ఆయనే.
గాంధీజీ రాజకీయ రంగప్రవేశం చేసేనాటికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, బిపిన్‌చంద్రపాల్, అరవింద్ ఘోష్, లాలా లజపతిరాయ్ వంటి మహనీయులు తమదైన ధోరణిలో కృషిని దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రారంభించారు.
అప్పటికి తొలి స్వాతంత్య్ర సంగ్రామాన్ని మొదలు పెట్టి, విఫలమైన మనదేశం పూర్తిగా బ్రిటిష్ రాణి ఏలుబడిలోకి వచ్చేసింది. అదే సమయంలో ఈ తెల్లదొరల ప్రతినిధులు తమ చట్టాలకు మరింత క్రౌర్యాన్ని కలగలిపి ఇక్కడ పాలన సాగిస్తున్నారు. అటువంటి సంధి సమయంలో ఘర్షణలకు తలపడకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని కొందరు వినతులతో, మహజరులతో ఉపక్రమించాలన్నారు.
ఆ దరిమిలా 1885 చివరలో ’ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ ముంబయిలో తొలి సమావేశం జరిగింది. కొంత కాలానికి స్వాతంత్య్ర సాధనకు సంబంధించి నాయకులు అతివాదులు, మితవాదులు అని రెండు వర్గాలుగా విడిపోయి, తమదైన పద్ధతుల్లోకి దిగిపోయారు. బ్రిటిష్ వారు మాత్రం వీటిని గమనిస్తూ మౌనంగా ఎందుకుంటారు? వారి డొంకతిరుగుడు చర్యలు వారివే!
విక్టోరియా రాణి ప్రతినిధి అయిన భారతదేశపు వైస్రాయ్ లార్డ్ కర్జన్ 1905 జూలై 16న బెంగాల్ విభజనను ప్రకటించారు. బెంగాల్ ప్రెసిడెన్సీగా పిలవబడే ప్రాంతంలో పశ్చిమ వైపున హిందువులూ, తూర్పు వైపున ముస్లింలు అధికంగా ఉండేవారు. దీన్ని గమనించి ఆ తెల్లవారు ఈ విభజనను ప్రతిపాదించి దేశంలో రగులుతున్న జ్వాలలకు మరింత ఆజ్యం పోసేశారు. మన దేశం వదిలి వెళ్లేటప్పుడు కూడా దేశ విభజనకు ప్రయత్నించి, విజయం సాధించారు. అలాగే మనదేశంలో ఉన్న 584 సంస్థానాలకు స్వాతంత్య్రం ఇస్తున్నట్టు కూడా ప్రకటించి మరింత అల్లకల్లోలాన్ని పెంచారు. అప్పుడు మొదలైన విద్వేషాలు నేటికీ చల్లారలేదనడం అతిశయోక్తి కాదేమో! బెంగాల్ విభజనతో దేశం అట్టుడికిపోయి వందేమాతరం ఉద్యమానికి దోహదం చేసింది.
భారతీయుల మధ్య కులం, మతం, ప్రాంతం, భాష, సంస్కృతి అనే అడ్డుగోడలు చాలా సనాతనమైనవి, పురాతనమైనవి ఇంకా బలమైనవని గాంధీజీకి దక్షిణాఫ్రికాలోనే బోధపడింది. పరిశీలించి, అధ్యయనం చేసి బాగోగులు గమనించి నిర్ణయం తీసుకునే స్వభావం గాంధీజీది, కనుకనే ఆయన స్వీయచరిత్ర నామకరణంలో ‘ప్రయోగాలు’ అనే మాట మనకు కనబడుతుంది. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న భారతీయులను ఒక తాటి మీద నిలపడానికి చేసిన ప్రయత్నాలు తర్వాత దశలో భారతదేశంలో ఉద్యమం నడపడానికి గాంధీజీకి ఎంతో దోహదం చేశాయి. కనుక ఆయన ఈ మతాన్ని, కులాన్ని, విశ్వాసాల్ని, సంస్కృతుల్ని బహిరంగంగా విభేదించకుండానే చాకచక్యంగా ప్రణాళికను సిద్ధం చేశారు.
మాటలో, వాదనలో పారుష్యం అసలు లేకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. అన్ని మత విశ్వాసాల్లో ఉన్న ఉపయోగపడే మంచిని మాత్రమే స్వీకరించాలనే ధోరణిలోఆలోచించారు. అలాగే ఈ మతాలన్నీ చెప్పే దయ, అహింస, కారుణ్యం, క్షమ, సత్యం వంటి గుణాలు రాజకీయరంగంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించగలవని నమ్మడమే కాకుండా ప్రవేశపెట్టి, రుజువు కూడా చేశారు. ఇంకో విషయం ఏమిటంటే అక్కడ దక్షిణాఫ్రికాలోనూ, ఇక్కడ భారతదేశంలోనూ పాలిస్తున్నది బ్రిటిష్ ప్రభుత్వమే కనుక వారి స్వభావాన్ని వ్యూహాల తీవ్రతను గాంధీజీ సులువుగానే బేరీజు వేయగలిగారు.
1906 సెప్టెంబర్ 11న దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్ పట్టణంలోని యూదుల థియేటర్ ఎంపైర్‌లో 3,000 మంది ఉన్న సమావేశంలో గాంధీజీ ‘సత్యాగ్రహం’ అనే తన నూతన పోరాట విధానాన్ని ప్రకటించారు. దక్షిణాఫ్రికా విజయంతో ఆయనకు ప్రపంచ ఖ్యాతి లభించింది. దీన్నే దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలా… భారతీయులు గాంధీని ఆఫ్రికాకు ఇస్తే, తాము మహాత్మునిగా పరిణమింప చేసి అందజేశామంటూ మరో రకంగా వ్యాఖ్యానించారు.
‘కాంతి కాంతిని తెస్తుంది, చీకటిని తీసుకురాదు! మంచి భావంతో చేసిన పని రెట్టింపు మంచిని తెస్తుంది!!’
అని గాంధీజీ ‘యంగ్ ఇండియా’ పత్రికలో 1920 అక్టోబర్ 13 సంచికలో రాశారు. లక్ష్యమే కాదు, లక్ష్య సాధనామార్గం కూడా శుభ్రంగా, అలాగే విపరిణామాలకు దారి తీయకుండా ఉండాలని భావించే ధోరణి ఆయనది. హింస, వినాశనం అనేవి అంతులేని వినాశక ప్రక్రియలని చరిత్ర లోతుగా గమనించిన గాంధీజీ ఎటువంటి హింసకు తావులేని పోరాట మార్గాన్ని సృజించారు. 40 కోట్ల మంది జనాభా గల అప్పటి భారతదేశంలో దాదాపు 10 శాతం మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం విశేషం.
ఇటువంటి సంఘటన మరే దేశంలోనూ, ఏ కాలంలోనూ జరుగలేదు. అందులో మహిళలు, పిల్లలు కూడా ఉండటం మరింత గమనార్హం. మత విభేదాలు విస్మరించి ఎంతోమంది ముస్లింలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకంగా పేర్కోవాలి. గాంధీజీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సన్నిహిత క్రైస్తవ మిత్రులు ఉన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా దేశం మొత్తం ఒకే లక్ష్యం మీద పోరాడటం మనదేశంలో ఒక్క ఈ స్వాతంత్య్రోద్యమ సమయంలోనే సాధ్యమైంది. అంతకుముందు చరిత్రలో ఏనాడు భారత దేశ ఉపఖండం సమైక్యంగా నిలిచిన దాఖలాలు లేనే లేవు.
ఒక్క రాజకీయ స్వాతంత్య్రం రావడమే సరిపోదు, దానికి తగిన రీతిలో సాంఘిక, సామాజిక చైతన్యం రావాలి; దానికోసం కూడా కృషి జరగాలనే ఉద్దేశంతో స్వాతంత్య్ర ఉద్యమంతోపాటు చాలా రకాల ఉద్యమాలు జరిగాయి. గ్రంథాలయాలు, గ్రామీణ వృత్తులు, రైతులు, వ్యవసాయం, ఆరోగ్యం, పారిశుధ్యం… ఇలా చాలా వాటి గురించి పెద్ద ఎత్తున కృషి జరిగేలా చర్యలు తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే దేశంలో పలు ప్రాంతాల్లో గాంధీజీతో స్ఫూర్తి పొందిన ఎంతోమంది ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు చిత్తశుద్ధితో పెద్ద ఎత్తున ప్రారంభించారు.
గ్రామసీమలకు విజ్ఞానం అందించాలని ప్రయత్నాలు తొలి పదేళ్లలో గాంధీజీ ప్రారంభించారు. దీనికి నాయకత్వం వహించిన వారు సబర్మతి ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన మగన్‌లాల్ గాంధీ. వీరు అర్థంతరంగా కనుమూయడంతో ఈ కార్యక్రమాలు ఆగిపోయాయి. అలాగే ప్రకృతిని సంరక్షించుకొని కొంత సాయం పొందాలి, కానీ పూర్తి వినాశనం చేసే ధోరణిని విడనాడాలి అని గాంధీజీ చెప్పారు. ఈ ఆలోచనలు ఆధారంగా చేసుకుని జె సి కుమారప్ప ‘గాంధియన్ ఎకనామిక్స్’ అనే కొత్త సిద్ధాంత విభాగాన్ని సిద్ధం చేయడంతో కుమారప్ప తోపాటు, మీరాబెన్, సరళాబెన్ మొదలైన వారు పెద్ద ఎత్తున నీటిని, భూసారాన్ని, పంటలను కాపాడుకునేందుకు కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవలి కాలపు పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ కూడా సరళా బెన్ అనుచర వర్గం నుంచి తయారైన వ్యక్తి కావడం గమనార్హం.
తాగుడు సమస్యతో సమాజం ఎంత దిగజారిపోతుందో అధ్యయనం చేయడమే కాకుండా దాని నిర్మూలనకు పెద్ద ఎత్తున పోరాటం చేయించిన గాంధీజీ; మరొక దశలో ఈ దేశానికి తగిన విద్యా విధానం గురించి తన సహచరులతో చర్చించి, పరిశీలించి, శోధించి ‘నయీతాలిమ్’ విధానాన్ని ప్రతిపాదించారు. గాంధీజీ భావనలో మనిషి, అతడి మనసు ద్వారా సాధ్యమయ్యే మార్పు చాలా కీలకమైనవి.
ఇంత జనాభా ఉన్న దేశం మొత్తం హింసకు దిగితే అంతులేకుండా పోతుందని గుర్తించి గాంధీజీ ఆలస్యం చేయకుండా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పూర్తిగా విరమించుకున్నారు. గాంధీజీ పోరాటం చేసిన సమయం రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలపు విరామం. కనుకనే ప్రపంచం యావత్తు గాంధీజీ శాంతియుత పోరాట విధానాలను చాలా జాగ్రత్తగా పరిశీలించి, శోధించి గౌరవించింది. 1930 లోనే ’టైమ్’ మ్యాగజైన్ గాంధీజీని ‘మాన్ అఫ్ ది ఇయర్’గా ప్రకటించి ఆయన విధానాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తూ చెల్లుబాటును పెంచింది.
గాంధీజీ గతించిన ఏడెనిమిది దశాబ్దాల తర్వాత ఆయనను విమర్శించడమే విచిత్రంగా అనిపిస్తుంది. గాంధీజీ పోరాట కాలానికి రైళ్లు పెద్దగా లేవు, పత్రికలు విరివిగా లేవు, రేడియో వ్యాప్తి లేదు. కనీసం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా అందుబాటులో లేదు. వీటికితోడు ఒక భాష కాదు, ఒక సంస్కృతి కాదు. సువిశాలమైన దేశం. అంతకుమించి అడుగడుగునా ఆంక్షలు, అవరోధాలు. ఆయనకు గొప్ప వాగ్ధాటి కూడా లేదు. కానీ కేవలం నిస్వార్థమైన, సహజమైన గాంధీజీ జీవన విధానం, చిత్తశుద్ధి, స్వార్థ రాహిత్యం, క్రమశిక్షణ, పట్టుదల, త్యాగబుద్ధి మొదలైనవి విద్యాగంధం లేని ఈ దేశంలోని ఎంతోమంది పల్లె ప్రజానీకానికి విపరీతంగా నచ్చాయి.
గాంధీజీ వస్తున్నారంటే మైళ్ల దూరం నడిచి, రైలు మార్గాల దగ్గర రోజుల తరబడి వేచి ఉండేవారు. ఆయన్ను చూసి తరించామని పులకించిపోయేవారు. గాంధీజీ హత్యకు గురయ్యారని తెలిసిన రోజున ఈ దేశంలో కులంతో సంబంధం లేకుండా అత్యధిక జనాభా నదీస్నానం, సముద్ర స్నానం, బావి దగ్గర స్నానం వంటివి చేశారు. ఎందుకంటే గాంధీజీని తమ కుటుంబ వ్యక్తిగా భావించి, విలపిస్తూ ఆ పనికి ఉపక్రమించారు. అంతకుముందు గాని, తర్వాత గాని ఆ స్థాయిలో అంతటి గౌరవం మరే వ్యక్తికి మనదేశంలోగానీ బయటగానీ దక్కలేదు.
గాంధీజీ మన దేశ రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బాబు రాజేంద్రప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మృదుల సారాభాయ్, మీరాబెన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, జేబీ కృపలాని, టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కమలాదేవి ఛటోపాధ్యాయ, దుర్గాబాయి దేశముఖ్, సరోజినీ నాయుడు, వినోబా భావే, ఎమ్ఎన్ రాయ్, అంబేద్కర్, జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా మొదలైన ఎంతోమంది రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇలా వీరందరూ చాలా ప్రత్యేక వ్యక్తిత్వం, స్వభావం, పోరాటశీలంతోపాటు విభిన్నమైన సామాజిక సైద్ధాంతిక నేపథ్యంతో ప్రజాదరణ గల వేర్వేరు భాషల నాయకులు. వీరందరినీ సంభాళించుకుని కలుపుకుపోవడం అన్నది ఏమాత్రం చిన్న విషయం కాదు.
గాంధీజీని అర్థం చేసుకోవడంలో ఉన్న పరిమితిని సుధీంద్ర కులకర్ణి అనే రచయిత తన ‘మ్యూజిక్ ఆఫ్ ద స్పిన్నింగ్ వీల్ ’ (2012) అనే గ్రంథంలో విస్పష్టంగా చెప్పారు. ‘సూపర్ఫీషియాలిటీ లీడ్స్ టు స్టుపిడిటీ’.. దీని అర్థం ఏమిటంటే పైపైన మాత్రమే పరిశీలిస్తే మీకు మిగిలేది అర్థరహితమైన మూర్ఖత్వమే అని. నాలుగైదు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ ఆలోచనలను విధానాలను అన్ని దేశాల్లో అధ్యయనం చేస్తూనే ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం విపరిణామాల కారణంగా పొడచూపిన ఆరోగ్య సమస్యలతో రూపుదిద్దుకున్న పర్యావరణ ఉద్యమం 1972లో మిగతా ప్రాంతాలకు, దేశాలకు విస్తరించింది. దీనికి ఐదు దశాబ్దాల క్రితమే గాంధీజీ కీలకమైన మౌలిక భావనలు ప్రతిపాదించారు.
2019లో చివర్లో మన దేశంలో ’సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్’ వస్తున్నదన్న సమాచారం రాగానే ఐడియాలజీ చట్రాలను దాటి గాంధీజీ ఆలోచనల ఛాయల్లో తలదాచుకునే ప్రయత్నాలు జరిగాయి. పొరుగు దేశపు వ్యక్తికి కూడా సమస్య కలిగించని రీతిలో తన దేశభక్తి ఉంటుందని గాంధీజీ ప్రకటించడమే ఇందుకు కారణం. అలాగే పెద్దపెద్ద పరిశ్రమలు కలిగించే విపత్తులు, విపరిణామాల గురించి ఆలోచించినప్పుడు కానీ; మితిమీరిన రీతిలో టెక్నాలజీ వాడకం కలిగించే ఆర్థిక అంతరాలను అవలోకించినప్పుడు కానీ గాంధీజీ తప్పకుండా చర్చనీయాంశమే అవుతారు. ప్రతిసారి మనదేశపు విద్యా విధానాల్లో మార్పులు, చేర్పులు చేసినప్పుడు పక్కన దీపస్తంభంలా దారి చూపే ఆలోచనలు గాంధీజీ ప్రతిపాదించిన ‘నయీతాలిం’ విధానం దగ్గరే దొరుకుతాయి.
భారత రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిపాదించిన ‘పుర’ (ప్రొవైడింగ్ అర్బన్ అమినిటీస్ టు రూరల్ ఏరియాస్) మోడల్ అంతర్గత ఆలోచనా చట్రం గాంధీజీ భావనా ప్రపంచమే. 2020లో కరోనా యావత్ మానవాళిని కబళించినప్పుడు గాంధీజీ ప్రబోధించిన సరళమైన, శారీరక శ్రమతో కూడిన జీవన విధానమే శిరోధార్యం అయింది.
కనుకనే నేడు అత్యధిక పుస్తకాలు క్రైస్తవ మతానికి సంబంధించి కాకుండా, గాంధీజీ మీదనే ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. అదే స్థాయిలో పరిశోధనలు కూడా సాగుతున్నాయి. మనదేశంలో కేవలం రెండు దశాబ్దాలుగా గాంధీజీ మీద కొత్త దృష్టితో పరిశీలనలు ప్రారంభం కాగా మరోవైపు గాంధీజీ కి బాసటగా నిలిచిన పార్టీ చతికిల పడగానే ఆయన మూర్తిమత్వాన్ని కూడా దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారం కృషి జరుగుతున్నది. గాంధీజీ గుండె ఆలోచనలను కేవలం ఆచారాలుగా పరిమితం చేసి, ఆయా సంస్థల ఆస్తులను అనుభవించే ‘అగాంధేయులు’ ఈ ధోరణులను ప్రతిఘటిస్తూ ఆయన చెప్పిన అసలు విషయాలు ఏమిటి అని వివరించడంలో వైఫల్యం చెందుతుండగా; ఇటువైపు ఈ మారీచులు సరికొత్త ఆధునిక విజ్ఞానపు దారులతో రెచ్చిపోతున్నారు.
గాంధీజీ జీవితం బహిరంగ రహస్యం. అతని మరణం కూడా ఎంతోమంది చూస్తుండగా ఢిల్లీలో సంభవించింది. న్యాయవాద వృత్తి చేపట్టాలని బ్రిటన్‌లో చదువుకున్నా తర్వాత ఆ వృత్తి పట్ల ఏవగింపు కలిగింది. మంచి రాబడి ఉన్న ఆ ఆసరాని వదిలేసి జనావాసాలకు దూరంగా ఉండే ఫీనిక్స్ సెటిల్మెంట్, టాల్‌స్టాయ్ హోమ్, సబర్మతి ఆశ్రమం, వార్ధా ఆశ్రమం… ఇలా జీవనం సాగించారు. మరోవైపు ఆయన కుటుంబ జీవితం ముఖ్యంగా పిల్లల కారణంగా ఏమాత్రం సౌఖ్యంగా లేదు. హరిలాల్ గాంధి, మణిలాల్ గాంధి చేసిన పనులు ఆయనను చాలా ఇబ్బంది పెట్టాయి. హరిలాల్ ఆయన చనిపోయిన ఆరు నెలలకు మరణించాడు. చివరి వరకు హరిలాల్ సమస్య యాతనగానే సాగింది.
విలువలకు కట్టుబడి ఎక్కువ నష్టాలు రాకుండా ఆయన జీవిత కాలంలో ఇండియన్ ఒపీనియన్, నవజీవన్, హరిజన్, యంగ్ ఇండియా మొదలైన పత్రికలను గాంధీజీ విజయవంతంగా నడిపారు. జీవితకాలం పాత్రికేయుడిగా, రచయితగా కొనసాగారు. ఆయన తన తొలి పుస్తకాన్ని మాతృభాష అయిన గుజరాతీలోనే రాశారు. నెహ్రు అంచనా ప్రకారం గాంధీజీ ఏ విషయాన్ని స్పృశించినా దాని అంతుచూసే రీతిలో అధ్యయనం చేస్తారు. దాని తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. అలా పుట్టుకొచ్చినవే ‘ఉప్పు సత్యాగ్రహం’ వంటి సృజనాత్మకమైన ప్రయోగాలు. ఎలాంటి ఆయుధాలు, ఇతర సామగ్రి లేకుండా అందుబాటులో ఉన్న విశాలమైన సముద్ర తీరంలో ఏ ప్రాంతం వారైనా పాల్గొని తమ పోరాటాన్ని నమోదు చేసే అవకాశం ఇందులో లభించింది.