మనిషిలో మంచితనం గల్లంతవుతున్నది. స్వార్థం పొడచూపుతున్నది. ఈర్ష్యాద్వేషాలు అదనపు అర్హతలై మనిషిని చెడుకు వారసుడిగా మార్చేస్తున్నాయి. ఈ ప్రాంతాలకు వెళ్లొస్తే మాత్రం.. మనలో కొడిగడుతున్న మంచితనం నందాదీపమై అఖండంగా వెలుగులు పంచుతుంది. మహారాష్ట్రలోని ఆనంద్వన్, హేమల్కసా విహారం మంచితనం ఇంతగొప్పగా ఉంటుందా అని ప్రబోధిస్తుంది.
మహారాష్ట్రలో వరోరా చిన్న పట్టణం. లక్ష దాటని జనాభా. ఆ పట్టణానికి పొలిమేరలో ఉంటుంది ఆనందవన్. ఏడు దశాబ్దాల కిందట కుష్టు రోగుల సేవ కోసం పురుడు పోసుకుందీ ఆశ్రమం. దివ్యాంగుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేయడానికి ఆవిర్భవించింది. 1951లో మహారోగి సేవా సమితి పేరిట ప్రముఖ గాంధేయవాది, సమాజ సేవకుడు బాబా ఆమ్టే దీనిని ప్రారంభించారు. యాభై ఎకరాల పరిధిలో మొదలైన ఆనంద్వన్.. ఇప్పుడు 500 ఎకరాలకు విస్తరించింది. పదిహేను మంది రోగులకు సేవలందించిన సంస్థ ఇప్పుడు వేలమంది అభాగ్యులకు జీవితాన్ని ఇస్తున్నది.
ఆనంద్వన్లో అడుగడుగునా అద్భుతాలు కనిపిస్తాయి. రోగాన్ని జయించిన వాళ్లు ఇప్పుడు జీవితంలో విజయం దిశగా సాగుతున్నారు. వ్యవసాయం చేసేవాళ్లు కొందరైతే పాడిపనిలో నిమగ్నమై ఇంకొందరు కనిపిస్తారు. చేనేత కార్మికులుగా కొందరు అవతారమెత్తితే, వృత్తివిద్యలో యువకులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఆనంద్వన్లో జేబు రుమాలు నుంచి దుప్పట్ల వరకూ తయారవుతాయి. స్టీలు చెంచా నుంచి చక్రాల కుర్చీల వాహనం వరకూ రూపొందుతున్నాయి. ఎవరి కర్తవ్యం వాళ్లు సమర్థంగా నిర్వర్తిస్తుంటారు. ఆ కార్యశీలురను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఆనంద్వన్ చరిత్రను తెలుసుకొని ఆశ్చర్యపోతారు. అక్కడివారి జీవనశైలిని చూసి స్ఫూర్తి పొందుతారు. ప్రస్తుతం ఈ ఆశ్రమం బాధ్యతలు బాబా ఆమ్టే కుమారుడు వికాస్ ఆమ్టే నిర్వహిస్తున్నారు. ఒకపూట ఉండి ఆనంద్వన్ విశేషాలన్నీ తెలుసుకోవచ్చు. రాత్రంతా ఉండి వారి ఆతిథ్యాన్ని అందుకోవచ్చు.
ఆనంద్వన్ అభాగ్యులకు కొత్త జీవితాన్నిస్తే హేమల్కసాలోని ‘లోక్ బిరాదరీ ప్రకల్ప్’ ఎలా జీవించాలో నేర్పుతుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇది ఉంది. దండకారణ్యంలో విసిరేసినట్టుండే హేమల్కసా విభిన్న పర్యాటక కేంద్రంగా అలరారుతున్నది. వరోరాలోని ఆనంద్వన్ సేవా వృక్షానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో చిగురించిన కొమ్మ ఇది. దట్టమైన అరణ్యం గుండా సాగే హేమల్కసా ప్రయాణం అద్భుతంగా సాగిపోతుంది. పొడవాటి చెట్లు… మహావృక్షాలు.. మధ్యమధ్యలో చిన్నా పెద్దా కాల్వలు.. చిన్నచిన్న పల్లెలు.. తోవంతా సంభ్రమాశ్చర్యాలకు నెలవుగా ఉంటుంది.
హేమల్కసా చేరుకోగానే.. ‘లోక్ బిరాదరీ ప్రకల్ప్’ అనే పెద్ద బోర్డు ఉన్న స్వాగతద్వారం లోనికి దారి చూపుతుంది. ఆనంద్వన్ని స్థాపించిన బాబా ఆమ్టేనే 1973లో ‘లోక్ బిరాదరీ ప్రకల్ప్’ను ప్రారంభించారు. ఆయన చిన్నకుమారుడు ప్రకాశ్ ఆమ్టేకు దాని బాధ్యతలు అప్పగించారు. అంధ విశ్వాసాలు, అరాచక విన్యాసాలు, ఆకలిచావులు ఇవీ ఆశ్రమం ప్రారంభించే సమయానికి హేమల్కసా చుట్టుపక్కల ఉన్న ఆదివాసీల పరిస్థితులు. డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే పట్టుదల, ఆయనకు భార్య డాక్టర్ మందాకిని సహకారం.. ఆ ప్రాంతం రూపురేఖలను మార్చేశాయి. ఆదివాసీల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందీ ఆశ్రమం. ఇక్కడికి సమీపంలో ఇంద్రావతీ నది త్రివేణి సంగమం ఉంటుంది. ఆదివాసీలకు విద్య, వైద్యం, జీవనోపాధి కల్పించే సంగమ క్షేత్రంగా లోక్ బిరాదరీ దర్శనమిస్తుంది.
ఇక్కడి పాఠశాలలో 750 మంది ఆదివాసీ పిల్లలు ఉచిత విద్య అభ్యసిస్తున్నారు. వైద్యశాలలో వందల మంది ఉచిత చికిత్స పొందుతున్నారు. హస్తకళలు విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న వారు కొందరు. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో ఎందరో డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. ప్రకాశ్ ఆమ్టే మనవలు కూడా ఆశ్రమ పాఠశాలలోనే చదువుతుండటం విశేషం. చుట్టూ అడవి, కొండల మధ్య ఉండే హేమల్కసా పచ్చని ప్రకృతికి అలవాలంగా ఉంటుంది. వన విహారంతోపాటు ఇక్కడి విశేషాలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడి వారో ఇక్కడికి వస్తారు. ఆశ్రమంలో హాయిగా ఉంటారు. వారి ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారు. అడవి తప్ప అన్యం ఎరుగని ఆదివాసీలకు ప్రకాశ్ ఆమ్టే, ఆయన భార్య అందిస్తున్న సేవలను చూసి మానవత్వపు చిరునామా ఇదేననుకొని తిరుగు ప్రయాణం అవుతారు.
సికింద్రాబాద్, కాజీపేట నుంచి వరోరాకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి హేమల్కసాకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఈ ఆశ్రమాల్లో పర్యటించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆనంద్వన్ పర్యటన కోసం https://www. maharogisewasamiti.org, హేమల్కసా చూడాలంటే ttp://www.lokbiradariprakalp.org/ వెబ్సైట్లు సందర్శించండి.