చికెన్ పీసులేస్తే హత్తెరీ. మటన్ ముక్కలేస్తే మహత్తరి.కాయ గూరలతో కానిస్తే.. శాకంబరి. ఏ తీరున వండినా.. బిర్యానీ అందరికీ ప్యారీ! పోటు మీదుండే మసాలాల ఘాటు.. సుగంధాలు వెదజల్లే బాస్మతీ బియ్యం పరిమళాలు.. బిర్యానీకి మాత్రమే సొంతం. వండిన వారికి కీర్తిని కట్టబెట్టే ఈ పాకరాజ్ఞి.. తినేవారికి వైభవాన్ని సంప్రాప్తింపజేస్తుంది.
‘బిర్యానీ చెయ్యలేదా అన్నయ్యా’ ఓ చెల్లి కోరిక. ఆ ప్రకటనలో అయితే.. సదరు అన్నగారు చకచకా చెల్లి ఇచ్ఛను తీర్చాడేమో కానీ, చిటికెలో చేసే వంటకం కాదిది. చేయి తిరిగిన నలభీములు సైతం అన్నిసార్లూ రుచికరంగా వండి వడ్డించలేని బ్రహ్మపదార్థం. ఏ ముహూర్తాన, ఎవరు ఈ వంటకాన్ని సృష్టించారో ఇదమిత్థంగా తెలియదు కానీ, పెండ్లి ముహూర్తానికి ముందే బిర్యానీ పూర్తవ్వాల్సిందే! ఇవాళ్టి పెండ్లి విందులో అన్ని వంటలూ ఒకెత్తు.. బిర్యానీ ఒక్కటీ ఒకెత్తు. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చిన బంధుమిత్రులు సదరు బిర్యానీ కొసరి కొసరి వడ్డించుకున్నారా.. వివాహ ఆహ్వానితులకు కడుపు నిండినట్టే! ముక్క ముక్కకూ లొట్టలేశారా… ఆ చప్పుళ్లు మేళతాళాల కన్నా ప్రశస్తమైన మంగళవాద్యాలై నవజంటకు ఆశీస్సులు పలుకుతాయి.
మధ్య తరగతి భారతం ఐతారం దావత్ స్పెషల్ బిర్యానీ ఓన్లీ. ఆదివారం పొద్దుపొద్దునే మార్కెట్‌కు వెళ్లి… ఉల్లిపాయలు కొనడంతో బిర్యానీ పాక పర్వానికి తెరలేస్తుంది. బంగాళదుంపలు, క్యారెట్లు, బీన్స్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక కట్ట కొత్తిమీర, రెండు కట్టల పుదీనా.. ఇలా చకచకా కొనేయాల్సిందే. ఏ రోజైనా బేరాలు ఆడుతారేమో కానీ, సండే అంత సమయం ఉండదు. వేగిరంగా కూరలు కొని.. మనోవేగంతో ఇంటికి చేరుకోవాలనే ఆరాటంతో అనుక్షణం పోరాటం చేస్తుంటారు. వెళ్తూ వెళ్తూ… మాంసాహారులు మనసారా మటన్ కొట్టిస్తారు. చికెన్‌తో ఇంటికి చెక్కేస్తారు. ఇక్కడితో బిర్యానీ ముడిసరుకులు ముప్పాతిక శాతం సమకూరినట్టే! బిర్యానీకి అద్భుత వంటకమన్న పేరు తెచ్చిపెట్టిన మసాలా దినుసులు మర్చిపోతే ఇంటికి వెళ్లాక అట్లకాడ పొయ్యెక్కే ప్రమాదం లేకపోలేదు. నాణ్యమైన మసాలా దినుసులు సరసమైన ధరకు కొనుగోలు చేసే ప్రక్రియ మొదలవడంతోనే.. ఆత్మారాముడి ఆక్రందనలు ప్రారంభమవుతాయి.
ముక్కలు ఎలా కోస్తారో తినేవాళ్లూ తెలుసుకోవడం పాకయాజులకు మనమిచ్చే మర్యాద. కక్కుర్తితో చిన్నముక్కలకు వంతపాడితే.. బిర్యానీకి ద్రోహం చేసినవాళ్లు అవుతారు. ఒంట్లో వేడి పుట్టించే పదార్థాలన్నీ.. మాంచి వేడిమీద ఉడకలాంటే ముక్కలు ఘనమైన పరిమాణం కలిగి ఉండాలి. గంట ప్రహసనం తర్వాత గానీ అసలు పని మొదలుకాదు. పోపులో అన్నీ మగ్గిచ్చి.. నానబెట్టిన బాస్మతీ రైస్ వేస్తారో, అన్నం వేరుగా మసాలా వేరుగా వండి కలిపేస్తారో మీ ఇష్టం. ఎలా చేసినా బాగుంటుంది. ఎందుకంటే.. బిర్యానీ అంటేనే బాగుంటుందని భావం. నవాబుల వంటింటి నుంచి తప్పించుకొచ్చిన ఈ పదార్థం తిన్నవాళ్లందరూ ఆ పూటకు షరాబులే! ముద్దముద్దకూ నాలుక చురుక్కుమనాలి. ముక్కుమీద కూడా చెమట్లు పట్టాలి. మసాలాల గాఢతకు అధరాలు బెదిరిపోవాలి. నుదుటన పట్టిన చిరు చెమటలను తుడిచేసుకోవడం కూడా మర్చిపోయి బిర్యానీ రుచిని ఆస్వాదించాలి. అప్పుడే వండిన వారికి ఖుషీ అవుతుంది. తినేవారి కసి తీరుతుంది.
ఇంత చక్కని బిర్యానీ ఈ పూటకు మన వంటింట్లో పుట్టిందే కావొచ్చు.. అసలు ఇది ఎక్కడ పుట్టిందో ఆరా తీస్తే గూగులమ్మ పేరాలకు పేరాల సమాచారం అందిస్తుంది. బిర్యానీ శాస్త్రీయ నామం సిండ్రెల్లా ఆఫ్ సెంట్రల్ ఏషియన్ పిలావ్ అని కొందరు శాస్త్రకారుల అభిప్రాయం. మధ్య ఆసియాలో పుట్టిందని కొందరి నమ్మకం. ఇరాన్ ఇలాఖాలో తఢాకా చూపించి ఆపై ప్రపంచవ్యాప్తమైందని చెబుతారు. ఏ పూర్వకాలమో అఫ్గానిస్తాన్ బిడ్డలు తొలిగా దీనిని వండారని మరికొందరి వాదన! మొఘల్ రాజులు వస్తూ వస్తూ బిర్యానీని భారత్‌కు తీసుకొచ్చారని విశ్వసిస్తారు. ఆపై నిజాం రాజుల పోటులో మరింత ఘాటెక్కిందని నమ్ముతారు. ఆ పురాణమంతా ఎవడికి కావాలి! మన వరకు బిర్యానీ పుట్టిల్లు హైదరాబాదే! ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నిసార్లు పందేరాలు పెట్టినా ద బెస్ట్‌గా నిలిచింది మన హైదరాబాదీ బిర్యానీనే! మటన్ ముక్కలతో మరిగి, చికెన్ పీసుల్లో ఓలలాడిన హైదరాబాదీ బిర్యానీ రుచి చూసిన ప్రతి ఒక్కరూ.. బిర్యానీ పుట్టినిల్లు మన భాగ్యనగరమే అని చరిత్ర పుటల్లో చెదిరిపోకుండా రాయడం ఖాయం!
ప్రయోగాల పేరిట బిర్యానీని నానా రకాలుగా వండి వారుస్తున్నారు. అయితే తాతల తరాల నుంచి కొన్ని ప్రాంతాల్లో చెదరని రుచితో అలరిస్తున్నదీ వంటకం. కేరళలో మలబారు బిర్యానీ ఫేమస్. చేపలు, రొయ్యలతో దీనిని వండుతారు. పశ్చిమ బెంగాల్లో ఢాకాయ్ బిర్యానీ రుచి అదురుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొరాదాబాద్ బిర్యానీ స్పెషల్. రాజస్థాన్‌లో అజ్మీర్ బిర్యానీ అదుర్స్. ఇలా ప్రాంతానికో బిర్యానీ ఫేమస్ అయింది. ఎన్ని ఏరియాల్లో ఇంకెన్ని ఉన్నా.. హైదరాబాద్ బిర్యానీ తర్వాతే మరేదైనా!!