జరిగిన కథ : ధారానగరాన్ని పాలించే భోజ మహారాజుకు కవి కాళిదాసుతో అనుకోని తగాదా వచ్చిపడింది. యన కాళిదాసుతోపాటుగా.. భార్యను కూడా దూరం చేసుకున్నాడు. వాళ్లిద్దరినీ వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో ఘోటకముఖుడు అనేవాడు భోజరాజుకు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తాము ఏడుగురం స్నేహితులం కాశీలో చదువుకుని, ధారానగరంలో కొలువు సంపాదించుకోవడానికి వెళ్తున్నామని చెప్పాడు. కాళిదాసు ఏకశిలానగరంలో అల్లాణభూపతి కొలువులో ఉన్నాడని తెలిసి, భోజుడు – ఘోటకముఖుడు అక్కడికే బయల్దేరారు.
పశుపతి మంచం మీదినుంచి కిందికి ఉరికాడు. సువ్రత పాదాలమీద పడ్డాడు. “దేవీ! నీ నిప్పు కన్ను తెరవకు. నేను మాడిపోతాను. ఆ త్రిశూలం విసరకు. తుచ్ఛపు కోరిక కోరినందుకు నన్ను శిక్షింప వచ్చావా? లోకమాతా! నీకు నమస్కారం. నా తప్పు మన్నించు. నన్ను రక్షించు” అని వేడుకుంటున్నాడు. సువ్రత అతడినుంచి దూరంగా జరిగింది. “నువ్వు ఈ రాత్రికి ఒక వేశ్యకాంత కావాలని రాజుగారిని కోరావట. నన్ను పంపారు. వేగంగా నీ కోరిక తీర్చుకో!” అని పలికింది.పశుపతి నిలువునా నీరైపోయాడు.
“అమ్మ బాబోయ్! నీ మాటలు మెత్తగా ఉన్నాయి. కానీ, రూపం చూస్తే మహాశక్తిలా కనిపిస్తున్నది. అహో! నీ వదన బిలం పాతాళంలా ఉన్నది. నాలుక జ్వాలికలా వేలాడుతున్నది. నీ చూపులు శూలాల్లా నన్ను పొడుస్తున్నాయి. అంబా! నీ భయంకరమూర్తిని ఉపసంహరించు” అని పదేపదే కోరుతున్నాడు.
సువ్రత నిదానంగా..
“అయ్యో! నేటి ఉదయం మహారాజు చేత మహేశ్వర స్థానంలో అర్చన అందుకున్నావు. నువ్వు మహేశ్వరునివి కావడం వల్ల నీ కంటికి నేను పార్వతిలా కనిపిస్తున్నానేమో.. కానీ, నేను మామూలు స్త్రీనే. సరిగా చూడు” అంటూ దగ్గరికి రాబోయింది.
అతను పైకి లేచి..
“అయ్యో ఈ వేడికి నా ఒళ్లు మండిపోతున్నది” అంటూ ఒక్క అంగలో బయటికి పరిగెత్తాడు.
అల్లాణ భూపతి ఉన్న తావుకు పోయాడు.
“మహారాజా! నా కామితం తీర్చిపెడతానని చెప్పి, ఇంత దారుణం చేశావేమిటి? మహాశక్తిని నా మీద ప్రయోగించావెందుకు?! ఇదేనా నీ వ్రత పరాయణత్వం?! నా ఆపద దాటించు. నువ్వు నా కోరిక తీర్చినట్లే భావిస్తాను. అబ్బబ్బా! నా ఒళ్లంతా కాలిపోతున్నది” అంటూ వేదన పడసాగాడు.
ఇంతలో ఆ గదిలోకి సువ్రత వచ్చింది.
వెనువెంటనే పశుపతి రెండు చేతులతోనూ ముఖం మూసుకుని..
“అయ్యయ్యో! ఈ వేడికి నా కళ్లు పోయేలాగా ఉన్నాయి. కొంతసేపాగితే గుడ్డివాడినై పోగలను. రాజా! చెడ్డకోరిక కోరినందుకు నువ్వే నాకిలాంటి శిక్ష విధించావు. వేగంగా ఆమె పాదధూళిని తీసి, నా మేనికి పూయి. లేకుంటే నాకు స్వస్థత చిక్కదు. ఇదే నేను నిన్ను కోరిన కోరిక అనుకో!” అన్నాడు.
అల్లాణ భూపతి వెనక ముందులాడుతున్నాడు. పశుపతిని దగ్గరికి తీసుకుని వీపు నిమిరాడు. దాంతో పశుపతికి శాంతించింది. అతను సువ్రతకు నమస్కరించి, కొంత పాదధూళిని తన శిరస్సున ధరించాడు.
‘దైవం నన్ను సరిదిద్దడానికే ఇటువంటి కోరిక పుట్టించాడు’ అనుకుంటూ అల్లాణ భూపతి పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కణ్నుంచి వెళ్లిపోయాడు.
ఏకశిలానగరంలో అల్లాణ భూపతిని గురించి ఈ కథ బహుళ ప్రచారంలో ఉంది. రాజదంపతుల వ్రతదీక్షను గురించి, సువ్రత పాతివ్రత్యాన్ని గురించి ప్రజలు వేనోళ్ల పొగుడుతుంటారు. అటువంటి ఏకశిలానగరానికి కాళిదాస మహాకవి వచ్చాడు.
* * *
కాళిదాసుకు – భోజరాజుకూ గల మిత్రత్వం లోకోత్తరమైనది. భోజరాజు కవితా ప్రియుడు. ఎవరికైనా కవిపండితులంటే పక్షపాతం ఉండవచ్చు.. కానీ, వారిని ఏకంగా నెత్తికే ఎక్కించుకునేంత ప్రీతి భోజరాజుకు మాత్రమే ఉంది.
ఇక కాళిదాస మహాకవి అంటే.. ఆనాటికీ ఈనాటికీ భరతఖండంలో అతనికి సాటిరాగల మరో కవి లేడని ప్రతీతి. అలాంటివాణ్ని భోజరాజు అమితంగా ప్రేమించాడంటే.. అది అతని తప్పు కాదు. ధారానగరంలో కాళిదాసుకు సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండేవి. కాళిదాసంటే మరో భోజరాజుతో సమానమని మాళవ ప్రజలు భావించేవారు.
భోజరాజుకు నలుగురు భార్యలున్నారు.
వారిలో లీలావతికి కవిత్వమంటే ప్రాణం. కాళిదాసుకు ఆమె అంతఃపురంలోకి సైతం అనుమతి ఉండేది.
తరచుగా అక్కడికి వస్తూపోతుండటం, భోజరాజు లేని సమయంలో కూడా లీలావతి అంతఃపురంలో కాళిదాసు అప్పుడప్పుడూ ఉండటం.. మిగిలిన వారికి
కంటగింపైంది.
భోజరాజు ముందే ఈ విషయంలో చెవులు కొరుక్కునేవారు. పరోక్షంగా లేనిపోని చాడీలు చెబుతుండేవారు. ఒకానొక బలహీన క్షణంలో భోజరాజు కూడా అదంతా నిజమేనని నమ్మాడు. కాళిదాసును అనుమానించాడు. దాంతో ఆయన మాళవ దేశాన్ని వదిలేశాడు.
లీలావతిని అడవిలో దించి రమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు భోజరాజు. తరువాత కొద్దిరోజులకే చేసిన తప్పు తెలుసుకున్నాడు. తీరా అప్పుడు భార్యను వెతుక్కుంటూ వెళ్లేసరికి, ఆమె భైరవుడనే తాంత్రికుని పాలబడిందని ఘోటకముఖుని వల్ల తెలుసుకున్నాడు.
భైరవుణ్ని వెతుక్కుంటూ భోజరాజు, ఘోటకముఖుడు ఏకశిలానగరానికే వస్తున్నారు.
* * *
అంతకంటే చాలాముందుగానే కాళిదాసు ఏకశిలానగరంలో అల్లాణ భూపతి కొలువులో స్థిరపడ్డాడు. కాళిదాస మహాకవి అల్లాణుడిపై చెప్పిన శ్లోకం ఒకటి సాహితీలోకంలో ప్రసిద్ధంగా ఉంది.
ఆ శ్లోకం తాత్పర్యం ఇలా ఉంటుంది..
‘ఓ మహారాజా! నీ చేత ఓడించబడిన శత్రురాజుల పట్టణాలు నేలమట్టమైపోయాయి. వాటియందు ఆటవికులైన కిరాతకాంతలు సంచరించసాగారు. శత్రువుల కోటల కింద దొరికిన రత్నాలను వారు చండ్రనిప్పులని భావించారు. కట్టెపుల్లల్ని తెచ్చి ఆ రత్నాలపై వేసి, బాగా మండటం కోసం కన్నులు మూసుకుని ఊదుతున్నారు. అటువంటి కిరాతకాంతల శ్వాసలోని మాధుర్యానికి తుమ్మెదల గుంపులు వారి చుట్టూ మూగుతున్నాయి. ఆ తుమ్మెదలను చూడగా.. నీ శత్రువుల తేజం నీ బలం ముందు కాలి బూడిదైపోతుండగా వస్తున్న పొగయేమో అన్న భ్రాంతి కలుగుతున్నది.
ఈ శ్లోకాన్ని వినగానే అల్లాణ భూపతి తన రాజ్యాన్ని కాళిదాసు పాదాలముందు ఉంచుతున్నానని ప్రమాణం చేశాడు. కానీ, కాళిదాసు అందుకు అంగీకరించలేడు కదా!
ఆనాటి నుంచి ఏకశిలానగరంలో కూడా కవి పండిత గోష్ఠులు విరివిగా సాగుతుండేవి.
ఇలా ఉండగా ఒకనాడు ఆ నగరంలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటైంది.
భైరవుడు అనే తాంత్రికుడు సింహం, పులి వంటి క్రూరమృగాల చేత అనేక వినోదాలు చేస్తాడని నగరమంతటా ప్రచారం జరిగింది. అల్లాణుడు కూడా కాళిదాసు మొదలైన కవులతో కలిసి ఆ ప్రదర్శనకు వెళ్లాడు.
క్రూరమృగాల చేత భైరవుడు చేయిస్తున్న వినోద ప్రదర్శనలకు జనమంతా విస్తుపోతున్నారు.
ఒక గొర్రె వీపున పెద్ద కర్రదుంగ పెట్టాడు. ఆ దుంగపైన రెండువైపులా రెండు ఏనుగులను నిలబెట్టాడు. రెండు ఏనుగుల వీపున మరో దుంగను పెట్టి.. మూడు సింహాల్ని ఎక్కించాడు. సింహాల వీపులపైన ఉంచిన దుంగపై ఒంటెలను, వాటి వీపున కోతులను ఎక్కించాడు. గొర్రె వర్తులాకారంలో మైదానం అంతటా తిరుగుతున్నది. ఆ వింతను చూసిన అల్లాణుడు..
“కవీంద్రా! ఈ గొర్రెపిల్ల స్వల్పబలం కలిగినదైనా.. మేరుపర్వతం భూమి భారాన్ని వహించినట్లుగా ఈ మృగాల భారాన్ని మోయడం విచిత్రంగా లేదా?” అన్నాడు.
అందుకు కాళిదాసు..
“ముల్లోకాల భారాన్ని తన కీర్తిచేత, భుజబలం చేత మోసే భోజమహారాజుకు ఈ జంతువుల భారాన్ని వహించడం ఒక లెక్కలోనిది కాదు” అని శ్లోకంలో
పలికాడు.
ఆ మాటతో అల్లాణుడు అదిరిపడ్డాడు.
“అదేమిటి మహాకవీ! రాజాధిరాజైన భోజభూపాలుడు గొర్రెపిల్లగా మారిపోవడం ఏమిటి.. ఎందుకిలా సెలవిచ్చారు?” అని ఆందోళనగా ప్రశ్నించాడు.
“ఏమో.. మీ ప్రశ్నకు నా నోట అప్రయత్నంగా ఆ మాటలు వచ్చాయి” అన్నాడు కాళిదాసు.
“వెంటనే ప్రదర్శన నిలిపివేసి, నిర్వాహకుడు నా ఎదుటకు రావాలి” అని అల్లాణ భూపతి ఆజ్ఞలు
జారీ చేశాడు.
ప్రదర్శన నిలిచిపోయింది. భైరవుడు వచ్చాడు.
“ఏమయ్యా! నువ్వీ మృగాలన్నీ ఎక్కడ సంపాదించావు? వీటిని ఆడించే సాధనాలన్నీ ఎక్కడ సంపాదించావు.. అసలీ ఆట ఎలా నేర్చుకున్నావు?” అని ప్రశ్నించాడు అల్లాణ భూపతి.
“మహారాజా! ఇది మా కులవృత్తి. ఈ జంతువుల్ని నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి పెంచుతున్నాను. ఇవి నావే” అని పలికాడు భైరవుడు.
“సరే.. నువ్వు కోరినంత ద్రవ్యం ఇస్తాను. ఆ గొర్రెపిల్లను ఇక్కడే వదిలేసి, నీ దారిన నువ్వు పో!” అన్నాడు.
భైరవుడు చేసేది లేక గొర్రెను వదిలేసి.. అక్కణ్నుంచి వెళ్లపోయాడు.
కాళిదాసు ఆ గొర్రెవద్దకు వెళ్లి వీపు దువ్వుతూ..
“భోజరాజా! సత్కవి కల్పభూజా! నువ్విలా మేషమై పోయావేమిటి?! నిన్నెవరిలా చేశారు?!” అని బాధపడసాగాడు.
గొర్రె మెడ నిమురుతూ, దానికి కట్టివున్న తాయెత్తును లాగి పారేశాడు.
మరునిమిషంలో అక్కడ గొర్రె స్థానంలో భోజమహారాజు అందరికీ కనిపించాడు.
“ఆహా! నేడెంత సుదినం. కాళిదాస మహాకవీ! నిన్ను కలుసుకోగలిగాను. అవునూ.. నేనిక్కడికి ఎలా వచ్చాను?! ఇది ఏకశిలానగరమే కదా!? అతను అల్లాణ భూపతే కదా!? అయ్యో.. ఘోటకముఖుడు ఏమైపోయాడు?” అంటూ చుట్టూ పరికించి.. కాళిదాసుని పట్టుకుని..
“మహాత్మా! రక్షించు” అని పలికాడు.
అప్పుడు కాళిదాసు ఒక ప్రసిద్ధ శ్లోకం చెప్పాడు. దాని భావం ఏమిటంటే..
‘స్నేహం కలిసిన తరువాత విడిచిపెట్టడం కంటే కలవకపోవడమే శ్రేష్ఠం. నడిమి జీవితంలో కళ్లు పోయినవాడి విచారం అంతా ఇంతా కాదు. పుట్టుగుడ్డివాడికి ఆ చింత ఉండదు!’
ఆ శ్లోకం చెప్పిన తరువాత..
“భోజరాజా! నువ్వీ తాంత్రికుని చేతిలో ఎలా చిక్కావు?” అని ప్రశ్నించాడు.
అందుకు భోజరాజు..
“మహాత్మా! నిన్ను, లీలావతిని వెతుక్కుంటూ నేను అడవిదారి పట్టాను. భైరవుడు అనేవాడు ఆమెను ఎత్తుకుపోయాడని ఘోటకముఖుని వల్ల తెలిసింది. అనేక దేశాలు తిరుగుతూ వాణ్ని వెతికాం. చివరికి వాడు ఈ రాజ్యానికి వచ్చాడని తెలిసి ఇక్కడికి వస్తుంటే వాడే ఎదురుపడ్డాడు. వాడు కంటబడగానే నా కోపం ఆగింది కాదు. ‘పాపాత్మా! నిలువునిలువు.. నీ పీచమణిచేస్తాను. నా లీలావతిని ఎక్కడ దాచావో చెప్పు’ అంటూ వాడికి అడ్డంగా నిలబడ్డాను. ఘోటకముఖుడు నా వెనుకే నిలిచాడు. దండధరుడినై ఉన్న నన్ను చూసి వాడి దగ్గరున్న మృగాలు బెదిరాయి. కానీ వాడి పరిజనులు మాచుట్టూ మూగారు. వాళ్ల చేతుల్లో ఆయుధాలు లేవు. మేమిద్దరం కర్రలతో వాళ్లను ఆపుతున్నాం. ఇంతలో ఆ భైరవుడు ఎర్రని గుడ్లతో నన్ను చూస్తూ ఏదో పసరు నామీద చల్లి, నాకు స్మృతి లేకుండా చేశాడు. అంతవరకే జ్ఞాపకం ఉంది. మళ్లీ ఇప్పుడే తెలివి వచ్చింది. బహుశా ఘోటకముఖుడు పారిపోయి ఉంటాడు” అని వివరించాడు.
అప్పుడు కాళిదాసు కళ్ల నీరు చిమ్ముతుండగా..
భోజరాజును వాడు గొర్రెగా మార్చడం, వగైరా
కథనంతా చెప్పాడు.
అల్లాణ భూపతి ముందుకు వచ్చి భోజుణ్ని
కౌగిలించుకుని..
“మహానుభావా! కవిజనులు సతతమూ పొగిడే నీ సత్కీర్తిని విని నిత్యమూ మైమరిచి పోతుంటాను. కానీ ఎన్నడూ నువ్వు నా రాజ్యాన్ని దర్శించినది లేదు. ఆ తాంత్రికుడీ రూపంలో నాకు మహోపకారం చేశాడు. నేను నీ కింకరుడిని. ఈ కవిసార్వభౌమునితోపాటు నువ్వు నా రాజ్యాన్ని పాలించు” అని అత్యంత వినయంతో ప్రార్థించాడు.
భోజరాజు సంతృప్తి నిండిన కళ్లతో..
“వదాన్యుడా! నువ్వు ఇలాంటివాడివి కనుకే మా కాళిదాసు నీ కడకు చేరుకున్నాడు. నిన్ను రాజ్యం కంటే అధికమైన వస్తువు ఒకటి అడుగుతాను. ఈ కాళిదాసు నా ఆరోప్రాణం. ఆయన్ను నాకు తిరిగి ఇచ్చివేయి” అని పలికాడు.
కాళిదాసు వైపు తిరిగి..
“ఆర్యా! నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, మేల్కొంటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా గానీ నా మనసు నీ వియోగాన్ని సహించదు. నా తప్పులన్నీ మన్నించి నువ్వు ధారానగరానికి రావాలి. నువ్వు లేని నగరానికి నేను తిరిగి వెళ్లలేను” అన్నాడు.
అల్లాణుడు వారిద్దరికీ విందుభోజనాలు పెట్టి సాగనంపాడు. కాళిదాసును పల్లకిలో ఉంచి, భోజరాజు పాదచారియై ధారానగరానికి బయల్దేరాడు. ఆయన భార్య లీలావతి ఇంకా లభించలేదు. ఘోటకముఖుడు ఏమయ్యాడో తెలియదు.
(వచ్చేవారం.. యక్షుని గుహలో విచిత్రాలు)