– డి. గోపాల్, మూసాపేట్.
మనుషులంతా ఒకే విధమైన ఆకారం కలిగి ఉంటారు. శరీర సౌష్టవం కూడా ఉంటుంది. కానీ, అందరూ ఒకే హృదయంతో ఉంటారా? కాదుకదా! వ్యక్తులు – గృహాలు ఏకమై సాగుతాయి. ఆయా యజమానుల అభీష్టాలు, అంతరంగాలను బట్టి వారివారి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అదే ఇంట్లో తండ్రి మహానేత అయితే.. ఆ తండ్రి తనయుడు పెద్ద వ్యాపారవేత్త కావచ్చు. ఇక్కడ సూక్ష్మం ఏమిటంటే.. మన అంతరంగ లక్ష్యాన్ని అందించేది గృహం. అలాగని అర్హత లేకుండా ఏదీ అందదు. అపార్ట్మెంట్లు ఒక రూపంగా కట్టినా.. స్థానం మారుతూ ఉంటుంది. ఒకరు నేలమీద, ఒకరు ఆ ప్రాంగణంలో ఆగ్నేయ భాగంలో, ఇంకొకరు నైరుతి భాగంలో.. అలాగే పైన ఎక్కడో ఇరవై ఒకటో ఫ్లోర్లో ఈశాన్యంలో.. ఇలా కేవలం రూపాలు ఒక్కటైనా వ్యత్యాసాలు వేరుగా ఉంటాయి.
భౌతికంగా చూసినప్పుడు కూడా! అదే కంపెనీ కారు. నడిపే వ్యక్తినిబట్టి దాని వేగం, భద్రత నిర్ణయం అవుతుంది. ఒకే సెల్‌ఫోన్.. అతను వాడుకొనే పద్ధతిలో దాని ఉపయోగం ఉంటుంది. అంతా వ్యక్తి చేతిలోనే ఉంటే.. ఇంటికి వాస్తు బలం ఏం ఉంటుంది? అనుకోవచ్చు. రేడియోలో, టీవీలో శబ్ద – దృశ్య తరంగాలను అందుకొనే వ్యవస్థ (యంత్రాంగం) లేకపోతే.. చానెల్స్ వచ్చినా నిరుపయోగమే కదా! మన చేతిలో రిమోట్ ఉన్నాకూడా! అలా అన్నీ ఇండ్లు – ఫ్లాట్లు వాటికవి ఒకేలా ఉన్నా.. భౌతిక వ్యత్యాసంతోపాటు యాజమాన్యపు సంకల్ప బలాన్ని బట్టి ఫలాలు – ఆశయాలు నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి, ఒకేచోట – ఒకే రూపు అన్నది వేరు. ఒకే ఫలితం అన్నది వేరు. శాస్త్రం లోతులు వేరుగా ఉంటాయి. మనం పెద్దలు చెప్పింది పాటిస్తే చాలు.
– వి.ఎల్. రాజమణి, వరంగల్.
ఇంటి మీద మరో ఇల్లు వేసుకోవడమే.. డూప్లెక్స్ హౌస్ అంటే. అప్పుడు యజమానికి రెండు గదులు వస్తాయి. సాధారణంగా నేలమీద ఒక ఫ్లోర్ వేసుకోవడానికీ, ఇలా డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవడానికి చాలా తేడా ఉంటుంది. డూప్లెక్స్‌లో అదనపు ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. నేలమీద ఫ్లోర్‌లోని నైరుతి గదికి ఏ బలం ఉంటుందో.. దాని పైనగదికీ అంతే బలం వర్తిస్తుంది.
ఇంటి యజమాని అనుకూలతను బట్టి కిందకానీ, పైనకానీ నైరుతి గదిని వాడుకోవచ్చు. ఇంట్లోని పెద్ద కొడుకు కిందగానీ, పైనగానీ సౌత్-వెస్ట్ గదిని వాడుకోవాలి. తద్వారా తండ్రీకొడుకులు మంచి పవర్ ప్లేస్‌లో ఉంటారు. మంచి వ్యవహారంతో ఉంటారు. అయితే, డూప్లెక్స్ ఇంటిని మంచిస్థలంలో వాస్తుకు కట్టినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.
– డి. రమేశ్ రెడ్డి, జీడికల్.
ఇంటికి పడమర ద్వారం ఉండటం దోషం కాదు కానీ, దానికి అభిముఖంగా తూర్పు ద్వారం తప్పక ఉండాలి. తూర్పు – పడమర అభివృద్ధి, ఆరోగ్య ప్రాధాన్యం గలవి. ఈ దిశలకు రాకపోకలు ఉండటం ఎంతో అవసరం. తూర్పు ద్వారం వచ్చినపుడు పడమర ద్వారం ఉండవచ్చు. మీది ఉత్తర సింహద్వారం ఉన్న ఇల్లు కాబట్టి.. పడమర బాల్కనీ ఇచ్చి ఉంటారు. ఆ బాల్కనీ ‘బాక్స్ బాల్కనీ’ అయితే.. దానికి గ్రిల్ వేసుకొని ఆ బాల్కనీ వాడుకోవచ్చు.
లేదు.. పడమర మొత్తంగా బాల్కనీ ఉంటేమాత్రం.. తప్పకుండా తూర్పు దిక్కు బాల్కనీ వేసుకోవాల్సి వస్తుంది. ఐరన్తోనైనా! తూర్పులో బాల్కనీ లేకుండా పశ్చిమం బాల్కనీ మంచిదికాదు. నడకలు ఎప్పుడూ పడమర దిక్కుగా సాగుతాయి. తూర్పుగా ఉండవు. అలాగే, అభివృద్ధిలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే, పడమర బాల్కనీ ద్వారం తూర్పు – ఉత్తరం ద్వారాల కంటే పెద్దదిగా ఉండకూడదు. అటు – ఇటు గ్లాసు పెట్టుకొని, ద్వారం చిన్నదిగా పెట్టుకోవాలి.
– పి. శ్రీలత, దిల్సుఖ్నగర్.
మీరు దక్షిణం మొత్తం మాస్టర్ బెడ్రూముగా చేయాలి అనుకున్నప్పుడు పడక ఏర్పాటు మాత్రం.. దక్షిణ – నైరుతిలోనే రావాల్సి ఉంటుంది. మొత్తానికి నైరుతి కదా.. అటువైపు బరువు ఉండాలి అనుకొని నైరుతిలో ఒక గది ఏర్పాటుచేసి, దానిని డ్రస్సింగ్ రూముగా మార్చవద్దు. ఇంటిలో – ఒంటిలో గుండెస్థానం గుండెదే! దానిని మార్చనట్టుగానే.. నిదుర స్థానం యజమానికి ఆ దిశ అవసరం.
దక్షిణంలో నైరుతి వదిలితే దక్షిణ – ఆగ్నేయంలో టాయిలెట్‌ని, దక్షిణం మధ్యలో డ్రెస్సింగ్ రూమును అమర్చుకోవచ్చు. తద్వారా మీ అవసరం తీరుతుంది. ప్రధానంగా పడక గదులు ఒక దిశ మొత్తం తీసుకున్నప్పుడు ఆ గదికి మంచినడక వచ్చే ద్వారం కావాలి. అందుకుగాను ఉత్తరం – ఈశాన్యం లేదా ఉత్తరం మధ్యలో ద్వారం వచ్చేలా చూసుకోవాలి. అలాగే గాలి, వెలుతురు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143