– వి. కృష్ణకుమారి, బుద్వేల్.
ఇంటిలో ద్వారాలు అంటే.. మనం వాడుకునే గదులకు సంబంధించి, ఇంటికి వచ్చే ద్వారాలు లెక్కించాలి. డ్రెస్సింగ్ డోర్లు, గదిలో వచ్చే వార్డ్రోబ్ ద్వారాలు లెక్కపెట్టాల్సిన అవసరంలేదు. మనం నడిచేది, మనల్ని దాటించేది, రెండు రెక్కలు కలిగి ఉండేది ద్వారంగా గుర్తిస్తాం. అలా సింహద్వారాలు, పడక గదుల ద్వారాలు అలాగే, టాయిలెట్ల ద్వారాలు లెక్కకు వస్తాయి. సింహద్వారం నిర్ణయం చేసి, అప్పుడే దాని ఎత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఇంటి ఎత్తును బట్టి, దాని ఎత్తుకు అనుకూలంగా అమరినట్టుగా ఉండేలా కొలతలు ఉండాలి. మరీ పొడవుగా.. మరీ చిన్నగా ద్వారాలు ఉండకూడదు. కనీసం ఆరు అడుగుల తొమ్మిది అంగుళాలు ఉండాలి. ఇంట్లో మిగతా అన్ని ద్వారాలు ఒకే ఎత్తులో ఉండాలి అది ముఖ్యం!
– పి. రాధ, నిజాంపేట్.
స్టాఫ్ రూములు ఇంటిలో కాకుండా ఇంటికి చుట్టూ ఉండే ఆవరణంలో కట్టడం మంచిది. ఇంటికి ఎలాగూ ప్రదక్షిణ స్థలం వదలాలి కాబట్టి, ఉత్తరంలో లేదా తూర్పులో కాస్త ఎక్కువ స్థలం వదిలి ప్లాన్ చేసుకోవాలి. ఆ ఆవరణంలో తూర్పు – ఆగ్నేయం లేదా ఉత్తర – వాయవ్యం, దక్షిణంలో కానీ, పడమర మధ్యలోకానీ కాంపౌండును అంటకుండా గదులు వేసుకోవాలి.
వాళ్లకు కావాల్సిన టాయిలెట్ కూడా వాటిని ఆనుకొని పెట్టుకోవచ్చు. అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇంటి నిర్మాణం భాగంలో కారు పార్కింగ్ పశ్చిమ – వాయవ్యంలో పెట్టొచ్చు. ఇక కారుకోసం స్థలం వదిలాక.. ఇంటి భాగంలో అంటే, ఇంటిని ఏదో ఒక మూల మళ్లీ కట్‌చేసి, సర్వెంట్ గదులు పెట్టవద్దు. తద్వారా ఇంటి నిర్మాణం రూపురేఖలు మారిపోయి.. విషాద ఫలితాలు అందుతాయి.
– బోసు బాబు, ఆలేరు.
మన జీవన విధానంలో వ్యాపారం – సంసారం సదా కలిసే ఉంటాయి. అయితే, వ్యాపార భావాన్ని సంపారంలోనికి, సంసార చిత్తాన్ని వ్యాపారంలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి అన్నది పెద్దల మాట. మీకున్న రోడ్డును అనుసరించి షాపులు వేసుకోవచ్చు. ఏ దిశకు వేసినా ఆ దిశకు ఉండే ఉచ్ఛమైన భాగంలో గేటు కోసం తప్పకుండా స్థలం వదలాలి.
అంటే దక్షిణంలో షాపులు వేసుకుంటే.. దక్షిణ – ఆగ్నేయంలో రాకపోకల కోసం గేటు తప్పనిసరి కదా! ఆ విధంగా అన్ని రోడ్లకూ పాటించాలి. ఎక్కడ షాపులు వేసినా ఇంటి ఫ్లోరింగ్ లెవెల్‌కు సమానంగా.. ఉండటం చాలా మంచిది. తద్వారా స్లాబులు వేసినప్పుడు కింది ఆవరణంలో వ్యత్యాసాలు ఉండవు. దక్షిణం – పడమర షాపులు ఇంటికన్నా తప్పకుండా ఎత్తుగా ఉండాలని అనుకోవద్దు. అయితే, ఇంటిలో నుంచి షాపులోకి ద్వారాలను కేవలం తూర్పు – ఉత్తరం దిశల్లో షాపులు వచ్చినవారు మాత్రమే సరిగ్గా చూసుకొని ఎదురు ద్వారాలు పెట్టాలి. వక్ర నడకలు రాకుండా చూసుకోవాలి.
– ఎస్. వెన్నెల, షేక్‌పేట.
ఇంటికి ద్వారాలు – కిటికీలు సరిసంఖ్యలో పెట్టడం ఎందుకంటే.. వాతావరణ సమతుల్యత కోసం. గృహంలో పెట్టే కిటికీలు ప్రధానంగా అన్ని గదులకు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అందులో రాజీపడకూడదు. ప్రతి ఆవరణ (గది లోపలి భాగం) తప్పకుండా ప్రకృతితో కనెక్షన్ కలిగి ఉండాలి. శరీరంలో ప్రతి చిట్టచివరి భాగం కూడా నాడులతో లింక్ అయ్యి ఉంటుంది.
గుండె అన్నిచోట్లకూ రక్తం పంపినట్టుగా.. ప్రతి గది, అది స్టోర్‌రూమ్ కావచ్చు లేదా టాయిలెట్ కావచ్చు లేదా బెడ్రూమ్ కావచ్చు.. అన్ని గదుల్లోకీ బయటినుంచి గాలి – వెలుతురు ప్రసారం జరగాలి. కిటికీలోంచి ఆక్సిజన్ వస్తుంది. అది ఇంటిని ప్రాణంతో ఉంచుతుంది. నెంబరింగ్ కన్నా.. వెంటిలేషన్ ప్రధానం అన్నది మరువకూడదు. కాబట్టి ఎక్కువ ఉన్నాయని గ్లాస్‌తో మూయడం కాదు. మరొకటి పెంచండి. ఇంటిని ఆహ్లాదంగా తయారుచేయండి. కిటికీలు ఎక్కువ అయ్యాయని ఒక గదికి వెలుగు లేకుండా చేయకండి. ప్రతి మూల, ప్రతి ప్రదేశం దినమంతా వీలైనంత వెలుగుతో ప్రకాశించేలా చేయండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143