– ఎం. ఆనందిని, వరంగల్.
Vastu Shastra | ఆధునికత – వేగం.. ఇవి మనిషి కాళ్ల కింద నేలను లేకుండా చేస్తాయి. తొందరగా కావాలి, త్వరగా కొత్త ఇంట్లోకి వెళ్లాలి అనే వెర్రి వేగంతో చాలా దారుణమైన నిర్మాణశైలికి పూనుకొంటున్నారు. అద్దాలు, ఇనుము.. ఇవే ఇప్పటి ఇంటికి ప్రధాన అవయవాలు. రోబోల టెక్నాలజీని ఇంటికి వాడితే.. ఇల్లు ఒక ఇనుప సమాధిలాగా మారుతుంది. అంతేతప్ప.. ఆ ఇంటిలో సహజత్వం అనేది బతికి ఉంటుందా? కాంక్రీటు గోడలు, ఇనుప స్లాబులు, ఇనుప పిల్లర్లు, ఐరన్ కిటికీలు – ద్వారాలు.. ఇలా ఎంతో వైరుధ్యమైన పర్యావరణ విఘాతపు మెటీరియల్ మానవుని ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపిస్తుంది.
దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. తిరిగి వాడుకోవచ్చు, నష్టం ఉండదు అని ఇనుప గృహాల అడవులు నేడు మహానగరాలుగా విస్తరిస్తున్నాయి. కిటికీ అందంగా ఉంటే చాలు.. కంకర గడ్డలు తినడానికి సిద్ధం అన్నట్లు కట్టడాల తీరు మారుతున్నది. వ్యక్తి ఆయుష్షు అదే తీరులో కరిగిపోతున్నది. నిర్మాణరంగంలోకి వేగంగా మెటల్ పొల్యూషన్ కమ్ముకు వస్తున్నది. ఇది పెనువిపత్తులకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లల మీద, వృద్ధులమీద ప్రభావాన్ని చూపించబోతున్నది.
వాస్తు మార్పుల మాట అటుంచి.. అలాంటి ఇళ్లలో ఒక గర్భిణి, ఒక వృద్ధుడు, ఒక పసిబిడ్డ ఆరోగ్యంగా జీవిస్తారా? అన్నది ముందు చూసుకోవాలి. గొప్ప ఇల్లు ఉన్నంతమాత్రాన సరిపోదు. అన్ని పనులు చేసిపెట్టినంత మాత్రాన.. రోబోను తల్లిగా భావించలేం కదా! గృహం దేనితో కడితే.. అది ఉండటానికి వీలుగా, సజీవంగా ఉంటుందో.. అలాంటి ఇళ్లను ఎంచుకోండి. పాలిచ్చే ఆవు కావాలి కానీ, కదలని బలమైన ఇనుప దున్నలు పనికి వస్తాయా? ఉండేది మీరు.. అన్నీ చూసి నిర్ణయం తీసుకోండి. బొమ్మలు.. అమ్మలుకావు కదా!
– వి. రమ, ఉప్పల్.
కొన్నిచోట్ల కాలనీల పక్కన కొత్త వెంచర్లు చేస్తూ ఉంటారు. ‘పక్కవాళ్లను చూసి నేర్చుకో’ లేదా ‘సర్దుబాటు చేసుకో’ అనేది ఇక్కడ పనికివస్తుంది. మన స్థలానికి అనుకూలంగా ఉన్నంతమేరకు పక్క వీధులను అనుసరిస్తూ.. మన వెంచర్లలోనూ అవే వరుసల్లో రోడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ‘అలాచేస్తే పక్క కాలనీవాళ్లూ నడకలు పెట్టుకుంటారు’ అనుకోవద్దు. ఎలాగూ.. వెంచర్‌కు కాంపౌండ్ నిర్మిస్తారు.
కాబట్టి, ఇబ్బంది ఉండదు. బయటివాళ్లు రాలేరు. రోడ్డు రోడ్డు కలిసేలా మనం ప్లాన్ చేయడం చాలా గొప్ప నిర్ణయం అవుతుంది. లేదా ఆ వీధులు కలవకపోతే.. అక్కడ కొన్ని గదులు, ఆ వీధులకు ఎదురుగా కట్టి, స్టోర్ రూమ్, స్టాఫ్ గదులుగా వాడుకోవచ్చు. అంతేకానీ, మన వెంచర్లో ఇండ్లకు పక్క కాలనీ వీధులు పడేలా లే అవుట్ చేయవద్దు. అడ్డుగా కాంపౌండ్ ఉందికదా.. అనుకోవద్దు. అయినా వీధిపోట్లు ఆగవు.
– కె. మాలతి, వర్గల్.
సెల్లార్ అవసరం ఉంటే తీసుకోండి. అది తప్పనిసరి కాదు. సెల్లార్ అంటే.. భూమిలో గొయ్యి తీయాల్సి వస్తుంది. కానీ, అందులోకి చేరే వాడుక నీరు, వర్షం నీరు బయటికి పంపింగ్ చేయడం కష్టంతో కూడుకొని ఉంటుంది. ఈశాన్యం – ఉత్తరం – తూర్పు.. మూడు దిక్కులకు సెల్లార్ తీసుకోవచ్చు. అంతేకాదు.. ఇంటికి మొత్తం స్థలం కూడా సెల్లార్ తీయవచ్చు.
కానీ, అది దిశను బట్టి ఆ దిశ స్థితిగతులను బట్టి తీయాలి. దక్షిణం – పడమర వీధులు ఉండి, అవి సరిగ్గా దిశలకు ఉన్నట్లయితే.. ఆ స్థలంలో సెల్లార్‌కు వెళ్లండి. విదిక్కులు ఉన్నాకూడా.. తూర్పు వీధి, ఉత్తరం వీధి ఉన్నా కూడా.. ఇంటికి ఈశాన్యమైన తూర్పు – ఉత్తరం దిశలు అయినా.. సెల్లార్ తీయడం మంచిదికాదు. ఇంటిని భూమినుంచి ఎత్తుగా నిర్మించినప్పుడే దాని ఆరోగ్య – ఐశ్వర్య స్థితులు బాగుంటాయి. అన్నీ శాస్త్రపరంగా చూసుకొని కట్టండి.
– ఎన్.మురళీధర్, కొడంగల్.
ఇంటిని కట్ చేయాలి అనేది శాస్త్రమేకాదు. స్థిరత్వం – జీవత్వం అనేది ఇంటికి నిర్వచనం. ఇల్లు – యంత్రం ఏదైనా.. ఒక నిర్మాణ శాస్త్రీయత కలిగి ఉంటాయి. చేనేత మగ్గం, కుమ్మరి సారె, విల్లు (బాణం), వీణ, మురళి (పిల్లనగోవి).. ఇవి అతి సహజసిద్ధమైనవి. నిర్మాణ వైభవంతోనే తమ అద్భుత జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. వీటిలో ఎటు దిక్కు కట్ చేస్తారు? ఎందుకు? రంధ్రాలు ఉండే డప్పు మోగలేదు. తెగిన వీణ పలుకలేదు.
విరిగిన బాణం.. దూసుకుపోలేదు. అలా.. ‘ఇంటిని ఆ మూలను తెంపి, ఈ మూలను కడుతాం. ఈ తూర్పు కత్తిరించి కడుతాం’ అంటూ ఇష్టం వచ్చిన రీతిలో దిశలు కట్ చేయడం వల్ల కొత్తగా కనిపిస్తుందేమో కానీ, దాని వక్రతల వల్ల ఎన్నో వాస్తుపరమైన దోషాలు వస్తాయి. ఇంటి వాస్తు తెలిసిన వారిచేత ప్లాన్ చేయించుకొని కట్టుకోండి. ప్రశాంతంగా జీవించండి. మీరు బాగుపడటానికి ఇల్లు. ఎవరో బాగుంది అనడానికి కాదు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143