వర్షాధార ప్రాంతాల ప్రజల ఆహారంలో జొన్నలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కేవలం నీళ్లు మాత్రమే కలిపి చేసే జొన్నరొట్టె తెలంగాణ, ఉత్తర కర్ణాటక లాంటి వర్షపాతం తక్కువగా కురిసే ప్రదేశాల్లో రోజువారీ ఆహారం. ఒకప్పుడు పల్లెటూళ్లలో సాయంత్రాల్లో పొలం పనులు చేసివచ్చాక ప్రతి ఇంట్లో రొట్టెల తయారీ తప్పనిసరి కృత్యం. ఇప్పుడు ఊళ్లలోనూ ఆహార విధానాలు మారిపోతున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రం సాయంత్రం వేళల్లో వీధుల పక్కగా రొట్టెలు అమ్మే దుకాణాలు ఎక్కువగానే కనిపిస్తాయి. జొన్నరొట్టెలు తేలిగ్గా అరిగిపోతాయి. అధికమొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి.
ఆరోగ్యానికి మంచివని సంపన్నులూ వీటిని ఇష్టపడుతున్నారు. తెలంగాణను ఆనుకుని ఉండే ఉత్తర కర్ణాటకలోని కలబురగి (గుల్బర్గా) ప్రాంతంలో కూడా రొట్టెలకు గిరాకీ ఎక్కువ. కొన్నేళ్లుగా అక్కడ వేలాది మంది మహిళలు రొట్టెల తయారీలో నిమగ్నమై స్వయం ఉపాధి పొందుతున్నారు. స్వావలంబన సాధిస్తున్నారు. దీంతో కలబురగి జిల్లా అధికార యంత్రాంగం రొట్టెల వ్యాపారంలో ఉన్న మహిళలకు అండగా నిలవడానికి ముందుకువచ్చింది. వారితో సహకార సంఘాలను ఏర్పాటు చేసింది. జొన్నరొట్టెల కోసం ఏకంగా ‘కలబురగి రొట్టి’ పేరుతో ఓ బ్రాండ్‌నే సృష్టించింది. వారికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, బిగ్‌బాస్కెట్, రిలయన్స్ లాంటి ఆన్లైన్ వేదికలతో ఒప్పందాలు కుదిర్చింది.
ప్రస్తుతం రొట్టెల అమ్మకాలకు బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, పూణెలాంటి మొదటి శ్రేణి నగరాలపై దృష్టి సారించారు. ముందుముందు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కలబురగి జిల్లా పాలనా యంత్రాంగం రొట్టెల సహకార సంఘాలకు 50 శాతం సబ్సిడీతో రోటీ మేకర్ యంత్రాలను సరఫరా చేసింది. సుమారు లక్షన్నర రూపాయల నుంచి ఆరు లక్షల వరకు ఉండే ఈ యంత్రాల సాయంతో గంటకు ఐదు వందల రొట్టెలు చేయొచ్చు. కలబురగి పరిసర ప్రాంతాల మహిళలు కిలో జొన్నలు 50 రూపాయలకు కొంటారు. దాన్ని పిండి పట్టించి సుమారు 28 నుంచి 30 రొట్టెలు తయారుచేస్తారు. ఒక రొట్టెను ఐదు నుంచి ఆరు రూపాయలకు విక్రయిస్తారు. జొన్నలు పేదవాళ్ల ఆహారమే కాదు… పేదరికాన్ని దూరం చేసే పంట కూడా!