ఓ తరం.. కండ్ల ముందు జరిగిన అన్యాయాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. పెదవి విప్పలేదు అప్పటి ‘పెద్ద మనుషులు’. ముంచుకొచ్చిన ముప్పును గ్రహించలేదు. ఫలితం.. 58 ఏండ్ల అరిగోస. రెండో తరం.. పిడికిళ్లు బిగించింది. బరిలోకి దిగింది. నడిపించాల్సిన నాయకుడే నయవంచన చేస్తే చేతులెత్తేసింది. వందల దేహాలు తూటాలకు బలైన చేదు జ్ఞాపకాన్ని చరిత్రలో నెత్తుటి మరకగా భావించి ఊరుకుంది.
‘అష్ట దిగ్బంధనం’లో చిక్కుకున్న తెలంగాణలో అష్టకష్టాలూ అనుభవించింది. దశాబ్దాలు గడిచిపోయాయి. జరిగిన మోసాన్ని ప్రశ్నించేవాళ్లు లేరు. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే నాథుడు లేడు. పెట్టుబడిదారుల కబ్జాలో ఇక్కడి అవకాశాలు తుడిచిపెట్టుకు పోయాయి. రాజకీయాల ఎత్తుగడలు మన ప్రాంత అస్తిత్వాన్ని గద్దలా తన్నుకుపోయాయి. దశాబ్దాల పీడనకు చరమ గీతం పాడుతూ.. ఓ రాజకీయ శక్తి పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత రాష్ట్ర సమితి) గులాబీ ధ్వజమెత్తి బరిలోకి దూకారు కేసీఆర్.
అప్పటికే చుట్టూ గాఢాంధకారం అలుముకుంది!
ఏదీ కనిపించని ఆ చోట వినిపించే వెతలెన్నో..
కన్నీళ్లు ఇంకిన కండ్లు దీనంగా చూస్తున్నాయి..
తడారిన గొంతుకలు ఏదో పెగలడానికి
తండ్లాడుతున్నాయి..
అంత చీకట్లో లక్ష్యాన్ని చూసిన ఒకేఒక్కడు
మన కేసీఆర్!
ఎంతటి విపత్తు ఎదురైనా గమ్యాన్ని
చేరుకుంటాననే ధీమా తనది.
సంకల్పమే ఆయన బలం..
సాహసమే ఆయన బలగం..
అందరి ఆశల్నీ తన ఆశయంగా భావించాడు..
ఉద్యమ దివిటీతో బైలెల్లాడు…
ఈ సాహసాన్ని మూడో తరం ముచ్చటగా చూసింది. ఉద్యమ కేసరి పోరుబాటలో కదం తొక్కింది. ఆయన పంథాలో పదం కదిపింది.
బీఆర్ఎస్ పదమూడేండ్ల పోరాట ఫలం..
తెలంగాణ కల సాకారం.
తొలి తరం కోల్పోయింది..
రెండో తరం అందుకోలేకపోయింది.
మూడో తరంలో ముచ్చట తీరింది.
తెలంగాణ ఏర్పడింది.
కేసీఆర్ సాధించిన విజయం ఈ నాలుగో తరానికి మాత్రమే కాదు.. తరతరాల తలరాతలు మార్చే దస్ఖత్గా మారింది.

2001 ఏప్రిల్ 27 జలదృశ్యం వేదికగా ఓ రణ నినాదం వినిపించింది. ఆ బక్కపల్చటి మనిషి మాటలు పర్జన్య గర్జనలై సమైక్యవాదుల గుండెల్లో ప్రతిధ్వనించాయి. తెలంగాణ ప్రజల మనసుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. రాజకీయ పండితులు విస్తుపోయారు. సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉన్న కేసీఆర్ ‘తెలంగాణ’ ఎందుకు ఎత్తుకున్నారని? తొలి తరం పెద్దమనుషులు.. ‘అయ్యేదుందా.. పొయ్యేదుందా!’ అని పెదవి విరిచారు. 1969 తొలిదశ పోరుబాటలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నవాళ్లు అనుమానించారు.
ఇవేవీ లెక్క చేయలేదు కేసీఆర్. ఆయన అంతరంగంలో తెలంగాణ రాష్ట్ర రేఖా చిత్రం అప్పటికే ముద్రితమై ఉంది. ఏర్పడిన తెలంగాణ ఎట్లా ఉండాలో తన మస్తిష్కంలో అప్పటికే ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. కాంగ్రెస్ చేసిన మోసాన్ని.. తెలంగాణ ప్రజలు శాపంగా అనుభవించారు. ఆ శాపానికి పరిహారం తెలంగాణ సాధన ఒక్కటే మార్గం అని బలంగా నమ్మారు కేసీఆర్. పోరుబాటలో సాగిపోవడానికి రాజకీయ రణరంగాన్ని కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. బీఆర్ఎస్ రథాన్ని అధిరోహించి ప్రజాక్షేత్రంలో పలుమార్లు పరీక్షకు నిలబడ్డారు.

* * *
అప్పటి వరకు కేసీఆర్ ఓ వ్యక్తి మాత్రమే! ఉన్నపళంగా శక్తిగా ఎదగలేదు. తన వ్యక్తిత్వం ఏమిటో అయనకు బాగా తెలుసు. తన అస్తిత్వం ఏమిటో కూడా స్పష్టత కలిగిన నాయకుడు. పార్టీని స్థాపించడం తేలికే! దానిని నిలబెట్టడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా కేసీఆర్‌కు పెద్ద విషయం కాదు! కానీ, బీఆర్ఎస్ లక్ష్యాన్ని తనలా ప్రజలు కూడా అంగీకరించాలి. ‘తెలంగాణ కోసం’ అని రెండు ముక్కలు చెబితే.. నమ్మే స్థితిలో లేరు జనాలు. అప్పటికి తెలంగాణ ఆకాంక్ష పూర్తిగా ఆవిరైంది. ఏమీ లేనిచోట కేసీఆర్ మాట యాదగిరీశుడి గర్జనలా వినిపించింది. బీఆర్ఎస్ జెండా కొమురెల్లి మల్లన్న పెద్ద పట్నమంత ఉన్నతంగా రంగులు చిమ్మింది. 2001 స్థానిక సమరంలో సత్తా చాటి తొలి అడుగుతోనే ప్రభంజనం సృష్టించింది బీఆర్ఎస్. ఇంకేముంది.. పల్లె పల్లెలో తెలంగాణం పల్లవించింది. ఊరూరా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. తెలంగాణ ఆకాంక్ష ప్రతి ఇంటా అఖండ జ్యోతిగా వెలుగులు ప్రసరించడం మొదలైంది. ఆ దీపాన్ని కొండెక్కనివ్వలేదు కేసీఆర్. తన వ్యూహ చతురతతో, అనూహ్య నిర్ణయాలతో తెలంగాణ ఏర్పడే దాకా.. చమురు పోస్తూ వచ్చారు. ఆశలు చాలించుకొని, నిరాశలో కూరుకుపోయిన జనాలకు కొత్త ఉత్సాహం ఏర్పడింది. కేసీఆర్‌పై గురి కుదిరింది. బీఆర్ఎస్పై నమ్మకం పెరిగింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సై అనుకున్నారు కేసీఆర్. కానీ, గెలవాల్సింది తాను కాదు, తెలంగాణ అనుకొని.. పొత్తు కోసం కాళ్ల బేరానికి వచ్చిన కాంగ్రెస్ మాటను మన్నించేలా చేసింది. మళ్లీ బీఆర్ఎస్ హిట్టయ్యింది. కేసీఆర్ సూపర్ హిట్ సాధించారు. గల్లీలో ఉన్న నినాదం.. ఢిల్లీకి చేరింది. యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణ ఏర్పాటు చోటు దక్కించుకుంది.

* * *
ఢిల్లీలో, రాష్ట్రంలో ప్రభుత్వంలో చేరింది బీఆర్ఎస్. తెలంగాణ ఊసు మర్చిపోయింది కాంగ్రెస్. తరాలుగా తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ తన బుద్ధి పోనిచ్చుకోలేదు. వాయిదాల రాగం ఎత్తుకుంది. ఒక్కోదారి మూసుకుపోయింది. తెలంగాణవాదుల్లో అనుమానం. కేసీఆర్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అన్నిటికీ ఒకే సమాధానంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. అయినా, విమర్శల జడివాన ఆగలేదు. ‘బీఆర్ఎస్ మఖలో పుట్టింది.. పుబ్బలో పోతుంది’ అని హేళన చేశారు. సమైక్యవాదులు సంబురాలు చేసుకున్నంత పనిచేశారు. ఇదే అదనుగా ఆయన భాష మీద దాడి చేశారు. నిజాయతీని ప్రశ్నించారు. పార్టీనీ కబళించే ప్రయత్నమూ చేశారు. కానీ, తాటాకు చప్పుళ్లకు బెదిరే వ్యక్తి కాదు కేసీఆర్. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే.. పది అడుగులు ముందుకు దూకడానికే! వ్యూహాత్మక మౌనం, అనూహ్యాత్మక నిర్ణయాలు.. ఆయన పంథా! ఈ రెండు విధానాలు కేసీఆర్‌ని అనువుగాని చోట కూడా అధికుడిని చేసి నిలబెట్టాయి. ఏ దారీ లేని చోట కూడా తనదైన మార్గాన్ని ఏర్పర్చుకోగల నేర్పరి. ఆ నైజమే పదమూడేండ్ల పాటు ఉద్యమాన్ని నడిపించేలా చేసింది.
* * *
ఉద్యమం అంటే హింస! అప్పటి వరకు తెలిసింది ఇదే! తొలిదశ తెలంగాణ ఉద్యమంలో జరిగింది కూడా అదే! కానీ, కేసీఆర్ అనుసరించిన పార్లమెంటరీ విధానంతోనే ప్రత్యేక రాష్ట్రం కల సజావుగా సాకారమైంది. కేవలం ఎన్నికలు, ఓట్లు మాత్రమే ఉద్యమం అంటే.. తెలంగాణ సాధనలో ప్రజలు భాగస్వాములు కారు. అందుకే, అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని నడిపారు. అన్ని ప్రజాపక్షాలనూ ఏకతాటిపైకి తెచ్చారు. అదే సమయంలో రాజకీయంగా రాజీలేని పోరాటం చేస్తూ.. తెలంగాణ వచ్చుడు ఖాయమనే నమ్మకాన్ని ఎప్పటికప్పుడూ పురిగొల్పారు. ఈ ప్రయత్నంలో కేసీఆర్ తన మాటనే అస్త్రంగా నమ్ముకున్నారు. నీళ్ల విషయంలో నిజాలు ప్రజలకు చెప్పారు. నిధులు ఎలా తరలిపోతున్నాయో వివరించారు. నియామకాల్లో గోల్మాల్ ఎలా జరుగుతున్నదో విశ్లేషించారు. ‘మీ ముందు నేనుంటా.. అందరం కలిసి ఉద్యమిద్దాం’ అని పదే పదే చెప్పుకొచ్చారు. పోరాట పంథాలో తానుగానీ పక్కకు తప్పుకొంటే… రాళ్లతో కొట్టి చంపండని పిలుపునివ్వడం ఒక్క కేసీఆర్‌కే చెల్లింది. మరోవైపు ఆయన రాజకీయ ఎత్తుగడలు అద్భుతంగా పారాయి. ఆంధ్ర రాష్ర్టాన్ని తెలంగాణలో విలీనం చేసిన కాంగ్రెస్‌తో, కరుడుగట్టిన సమైక్య పార్టీతో ‘జై తెలంగాణ’ అనిపించాయి.

* * *
ఎన్ని చేసినా.. కాలం మనిషిని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటుంది. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతుంటాయి. కాలం ఎప్పుడు సవాలు విసిరినా.. దానికి తగ్గ సమాధానం కేసీఆర్ దగ్గర సిద్ధంగా ఉంటుంది. ఆ అకుంటిత వైఖరే కేసీఆర్‌ను విజేతగా నిలిపింది. బీఆర్ఎస్ను రాజకీయ శక్తిగా నిలబెట్టింది. తుదకు తెలంగాణను రాజ్యాంగబద్ధంగా సాధించేలా చేసింది. ఈ క్రమంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు నివురు గప్పిన ఉద్యమానికి ఎన్నోసార్లు ఊపిరిలూదాయి. చిన్న అవకాశం దొరికితే చాలు.. దానిని తెలంగాణవాదం ఎంత బలంగా ఉందో చాటడానికి, బీఆర్ఎస్ ఎంతగా వేళ్లూనుకుందో చూపడానికి ఉపయోగించుకున్నారు. కరీంనగర్ ఉప ఎన్నిక అలాంటి పాచికే! ‘తెలంగాణ వాదం ఎక్కడుంది?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెస్ మాట జారిందే అదునుగా.. ఉప ఎన్నికకు సిద్ధమయ్యారు కేసీఆర్. ‘కరీంనగర్ ఉప ఎన్నిక వెయ్యి అలజడుల పెట్టు. ఇది మనకు అంతిమ యుద్ధం. చావో, రేవో తేల్చుకుందాం. మిమ్మల్ని లాఠీ దెబ్బలు తినమనడం లేదు. వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారాలు పాడుచేసుకోమని చెప్తలేను. చేయాల్సిందల్లా.. ఓటుతో బదులిద్దాం. తెలంగాణవాదాన్ని బలంగా వినిపిద్దాం’ అని పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డినా.. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడింది. అఖండ మెజారిటీతో కేసీఆర్ గెలిచారు. తెలంగాణవాదం మరోసారి నిలిచింది. ఇలా ఎన్నోసార్లు కాల పరీక్షను ఎదుర్కొన్నారు. తాను గెలిచినప్పుడు తెలంగాణవాదం విజయమని సంబురపడ్డారు. ఆశించిన ఫలితం రానప్పుడు తన వైఫల్యంగా భావించి, మరో సంచలన నిర్ణయానికి సమయం కోసం వేచి ఉన్నారు. ఆదరాబాదరాగా ఇదైపోతే.. ఉద్యమం అన్నాళ్లూ సాగేది కాదు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోరికగానే మిగిలిపోయేది!

* * *
గాలివాటానికి తగ్గట్టుగా తూర్పారబట్టడం తెలివైన పని. ఒక్కోసారి ఏటికి ఎదురీదడానికీ సిద్ధమవ్వాలి. సందర్భానుసారం ఈ రెండు విధానాలనూ పాటించారు కేసీఆర్. తెలంగాణ ఆకాంక్షను తుంచేసే కుట్రకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టేలా 14ఎఫ్ అంశాన్ని భుజానికెత్తుకున్నారు. ఆమరణ నిరాహార దీక్ష అస్ర్తాన్ని సంధించారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అని చావునోట్లో తలకాయ పెట్టి.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యేలా చేశారు. తర్వాతి కాలంలోనూ అనేక పరీక్షలు, అనేకానేక విమర్శలు. అయినా మొక్కవోని దీక్షతో ప్రజలను పోరాటంలో మమేకం చేసేలా, యావత్ తెలంగాణ జాతి ఒక్కతాటి పైకి వచ్చేలా వ్యూహాలు రచించి.. ‘పార్లమెంటరీ విధానంలోనే తెలంగాణ సాధిస్తామ’న్న తన మాటను అక్షర సత్యం చేశారు కేసీఆర్.

* * *
2014లో రాష్ట్రం ఏర్పాటైంది. దశాబ్దాల కల సాకారమైంది. బీఆర్ఎస్ అవసరం మరింత పెరిగింది. తెలంగాణను సాధించిన ఘనత తనకు చాలని కేసీఆర్ అనుకుంటే మన పరిస్థితి మరోలా ఉండేది. సాధించిన తెలంగాణను అన్నిటా మిన్నగా నిలబెట్టాలంటే.. నారు పోసిన వాడే నీరు పోయాలి! అందుకే కేసీఆర్ ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ను రాజకీయ పార్టీగా పేర్కొని ప్రజాక్షేత్రంలో నిలబడ్డారు. గెలిచారు, తెలంగాణను గెలిపించారు. అభివృద్ధిలో రాష్ర్టాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు. సంక్షేమంలో అందరికీ చేయూతనిచ్చారు. అందుకే, తెలంగాణ ప్రజ బీఆర్ఎస్కి వరుసగా రెండుసార్లు పట్టం కట్టింది. ఉద్యమ నేత.. మనసున్న మనిషి.. విజనున్న నాయకుడు.. నికార్సయిన ప్రజాప్రతినిధి.. సారథ్యంలో పదేండ్లలోనే తెలంగాణ నూరేండ్ల ప్రగతిని సాధించింది.
* * *
తెలంగాణకు కలసిరాని కాలం.. బీఆర్ఎస్ను అధికారం నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టి ఉండవచ్చు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనంలో చిక్కుకుంది. పాలన గాడి తప్పింది. సంక్షేమం ఊసే లేకుండా పోయింది. అన్ని రంగాలూ సడుగులిరిగి సడక్ మీదికొస్తున్నాయి. ఒక తరం ఆశలు ఆవిరవుతున్నాయి.ఈ దుర్దశలోనూ ప్రజలకు అండగా ఉంటున్నది బీఆర్ఎస్సే! రాష్ర్టాన్ని మళ్లీ బాగు చేసేది కేసీఆరే!!
బీఆర్ఎస్ పాతికేండ్ల ప్రస్థానం అంతా ఉద్యమమే! స్వరాష్ట్ర సాధన కోసం పదమూడేండ్లు పోరాడింది. వచ్చిన రాష్ర్టాన్ని గెలిపించడానికి దాదాపు పదేండ్లు ఉద్యమ స్ఫూర్తితో పాలన సాగించింది. గడిచిన రెండున్నరేండ్లుగా.. ప్రజాపక్షం వహిస్తూ, అవినీతి కాంగ్రెస్‌ను అడుగడుగునా నిలదీస్తున్నది. గులాబీ పార్టీ.. రజతోత్సవ ఉత్సాహం.. తెలంగాణకు స్వర్ణోత్సవ సంబురానికి నాంది అవుతుంది.
2001లో తెలంగాణ సాధించి తీరుతానని సంకల్పించారు కేసీఆర్. అలుపెరుగని పోరాటంతో దానిని సాకారం చేశారు. ఈ రజతోత్సవ వేళ.. తాను తీర్చిదిద్దిన తెలంగాణ ఆగమైపోతున్న తరుణాన.. రేపటి తరం ఆశలు నిలపడానికి కేసీఆర్ విజన్, బీఆర్ఎస్ విజయం రెండూ అనివార్యం. అదే జరుగుతుందనేది అక్షర సత్యం. మరో ముప్పాతిక సంవత్సరాలైనా తెలంగాణతోనే బీఆర్ఎస్. బీఆర్ఎస్తోనే తెలంగాణ ప్రజ!

ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తుంది. తెలంగాణ కోసం ఎన్నో ఆత్మ బలిదానాలు జరిగాయి. నేను చావు అంచువరకు వెళ్లి మీ అందరి దయ వల్ల బతికి బయటపడ్డా! రాష్ర్టాన్ని సాధించుకున్నం. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి బంగారు తెలంగాణ తయారుచేసి ప్రజల చేతుల్లో పెడతా.

అహింసామార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించి గాంధీ మహాత్ముడు కొత్త పోరాట పంథాను పరిచయం చేశారు. ఆ మార్గంలోనే శాంతియుతంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమాన్ని ప్రారంభించే సమయంలో గాంధీ పోరాట వ్యూహరచనను పుణికిపుచ్చుకున్నాం. నా సహచరులు చాలా సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకు లోనైనా నేను ఆ పంథా వీడలేదు.
ప్రాణం పోయినా బిగించిన పిడికిలి విడువను. ఎత్తిన జెండా దించను. కచ్చితంగా రాష్ట్రం సాధిస్తా. ఒకవేళ నేను పెడమార్గం పడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి. నేను దృఢమైన సంకల్పంతోని, కచ్చితంగా సాధించాలనే సదుద్దేశంతోని ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఇంటికి ఒక్క యువకుడిని నాకు అప్పచెప్పండి. వందశాతం తెలంగాణ రాష్ట్రం సాధిస్తా.
– 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ పార్టీ ఆవిర్భావ సమావేశంలో కేసీఆర్
ఉద్యమ కాలంలో అనేక సమస్యలను, అంశాలను నేను కండ్లారా చూశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఫలానా విధంగా ఉంటుందనే విషయాన్ని ఉద్యమ కాలంలోనే ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. ప్రజల ఆశలు వమ్ముకావు. ప్రజాభీష్టం మేరకు అద్భుతమైన బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహానికీ తావు లేదు.
ఎన్నో బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఒక సంయమనంతో, హృదయపూర్వక విధానంతో అందరం కలిసి మన తెలంగాణను నిర్మించుకోవాలి. ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా అది ముందుతరాల వారికి దెబ్బకొడుతుంది. అటువంటి దెబ్బ తగలనీయొద్దు.
కరీంనగర్ ఉప ఎన్నిక వెయ్యి అలజడుల పెట్టు. అంత ప్రభావం చూపుతుంది. ఇది మనకు అంతిమ యుద్ధం. చావో, రేవో తేల్చుకుందాం. నేను మిమ్మల్ని జైలుకు పొమ్మంట లేను. లాఠీ దెబ్బలు తినమంట లేను. వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారాలు పాడుచేసుకోమని చెప్తలేను. చేయాల్సిందల్లా.. మనం ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. అందుకు మీరందరూ కదం తొక్కాలి.
ఒక మహా నాయకుడు మాత్రమే మరింతమంది నాయకులను సృష్టించ గలడు. పాతికేండ్ల క్రితం కేసీఆర్ ‘జై తెలంగాణ’ నినాదానికి ‘జై..జై.. తెలంగాణ’ అంటూ ఉద్యమ పిడికిలి బిగించినవాళ్లలో పెద్దపెద్ద నాయకులెవరూ లేరు. అంతా అతి సామాన్యులే. యూనివర్సిటీ విద్యార్థులు, చిన్నచిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, గృహిణులు, సన్నకారు రైతులే. ఎవరికీ ఉద్యమాలంటే తెలియదు, వ్యూహ ప్రతివ్యూహాల మీద పట్టు లేదు. లీడర్‌ను చూసి నేర్చుకున్నదే ఎక్కువ. నాయకుడి ప్రతి అడుగూ ఓ ఉద్యమ పాఠమే. బలమైన అయస్కాంత క్షేత్ర పరిధిలో ఉన్న ఇనుప ముక్కకు కూడా ఆకర్షణ శక్తి వస్తుంది. కేసీఆర్ నేతృత్వంలోని మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అదే జరిగింది. కేసీఆర్ సైన్యమై పోరాటాలు చేసినవారంతా రాష్ట్ర అవతరణ సమయానికి నాయకులుగా రాటుదేలారు. ఒక మేనేజ్మెంట్ స్కూల్ మహా అయితే ఏడాదికి ఓ వందమంది లీడర్లను తయారు చేయగలదు. కానీ, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నాయకుల కార్ఖానాగా మారింది.
– త్రిగుళ్ల నాగరాజు