ఈ నెల 16న రథయాత్ర
ప్రపంచంలో ఎన్నో ఉత్సవాలు ఉంటాయి. కానీ, దేవుడే ఆలయం నుంచి బయటికి వచ్చి లక్షలాది మంది భక్తుల మధ్య సంచరించే పండుగలు చాలా అరుదు. అలాంటి విశిష్ఠమైన వేడుకే ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర. వేల ఏళ్ల చరిత్రను, అపారమైన భక్తిని, అద్భుతమైన శిల్పకళను, రాజైనా పేదైనా దేవుడి ముందు సమానమనే సందేశాన్ని ఒకేసారి చాటే ఈ మహోత్సవం ప్రతి ఏడాది కోట్లాది మంది దృష్టిని ఆకర్షిస్తుంది. ఏటా ఆషాఢ శుద్ధ విదియనాడు రథ యాత్ర ప్రారంభమవుతుంది. మూడు మహారథాలు, లక్షలాది భక్తుల హర్షధ్వానాలు, రహస్యాలకు నెలవైన మూర్తులు… ఇలా ఎన్నో విశేషాలు ఈ యాత్రను ప్రపంచంలోనే అత్యంత వైభవమైన ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి.

కదిలే దేవుడు
సాధారణంగా భక్తులే ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు. కానీ పూరి జగన్నాథ రథయాత్రలో మాత్రం దేవుడే భక్తుల దగ్గరికి వస్తాడు. ప్రతి ఆలయంలోనూ మూల విరాట్టు వేరుగా, ఉత్సవ మూర్తిగా వేరుగా ఉంటారు. కానీ, పూరి యాత్రకు సాక్షాత్తూ మూల విరాట్టులే కదిలి వస్తాయి. ఆలయం దాకా వెళ్లి స్వామిని దర్శించుకోలేని భక్తులకు తానే బయటికి వచ్చి ఆశీర్వాదం అందిస్తాడు. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రమ్మ తమ రథాలపై గుండిచా ఆలయానికి ప్రయాణిస్తారు.
దేనికదే ప్రత్యేకం
ఈ యాత్రలో మూడు భారీ రథాలు ప్రధాన ఆకర్షణ. జగన్నాథుడి రథం నందిఘోష, బలభద్రుడి రథం తాళధ్వజ, సుభద్రమ్మ రథం పద్మ ధ్వజం. ప్రతి రథానికి ప్రత్యేక రంగులు, ప్రత్యేక జెండా, ప్రత్యేక గుర్రాలు, ప్రత్యేక సారథి ఉంటారు. రథాల ఎత్తు, చక్రాల సంఖ్య, అలంకరణలన్నీ శాస్ర్తోక్తంగా నిర్ణయించినట్టే ఉంటాయి. జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రంతో అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని ఎర్రటి చారలుండే నీలి వస్త్రంతో కప్పుతారు. పద్మధ్వజాన్ని ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు.

ప్రతి రథం కొత్తదే…
యాత్రలో ఉపయోగించే రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మించడం అత్యంత విశేషం. ఎంపిక చేసిన పవిత్ర వృక్షాల కలపతో సంప్రదాయ వడ్రంగులు శాస్త్రబద్ధంగా వాటిని తయారు చేస్తారు. పాత రథాలను మళ్లీ ఉపయోగించరు. రథ నిర్మాణం కోసం పూజారులు, మహారణగా పిలిచే సంప్రదాయ వడ్రంగులు, అటవీ అధికారులు కలిసి వెళతారు. ఒడిశాలోని ప్రధాన అటవీ ప్రాంతాల్లోంచి ఫాసి, ధౌరా, సిమిలిలాంటి ప్రత్యేక వృక్షాలను ఎంచుకొని, వాటికి పూజలు జరిపి కలపను సేకరిస్తారు. ఇక్కడ రథానికి వాడే కలప ముక్కలకూ ఒక లెక్క ఉంటుంది. సేకరించిన వృక్షభాగాలను 2,188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు.
విశ్వకర్మే చేశాడట
జగన్నాథ యాత్ర గురించిన విశేషాలు పద్మ, స్కంద, బ్రహ్మ పురాణాల్లో కనిపిస్తాయి. దీనిని బట్టి ఈ యాత్ర అతి పురాతనమైనదిగా చెప్పవచ్చు. పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకు స్వామి కలలో కనిపించి, అక్కడి చాంకీ నదిలో దారు వృక్షంగా తానే వస్తానని చెప్పాడట. దాన్ని జగన్నాథ మూర్తులుగా మలచాలని విశ్వకర్మను బ్రహ్మదేవుడు ఆదేశించాడట. ఆయన దాన్ని మూడు మూర్తులుగా మలచాడని ప్రతీతి. అయితే పని పూర్తి కాకముందే అతన్ని ఆ రాజు కదిలించడంతో అక్కడితో తయారీ ఆపేశాడని అంటారు. వాటినే తర్వాత ఆలయంలో ప్రతిష్ఠించారట. మిగతా ఆలయాల్లోలాగా రాతి మూర్తులు ఇక్కడ ఉండకపోవడానికి ఇదే కారణంగా చెబుతారు.

చెట్టు చెబుతుంది…
జగన్నాథ ఆలయంలో స్వామి మూర్తులు కూడా కొత్తవి ఏర్పాటవుతూ ఉంటాయి. సుమారు ప్రతి 12 నుంచి 19 సంవత్సరాల మధ్య కాలంలో ఇది జరుగుతుంది. అంటే, ప్రతి అధిక ఆషాఢ మాసంలో కొత్త విగ్రహాల రూప కల్పనకు నాంది పలుకుతారు. అయితే ఇది పెద్ద రహస్యంగా సాగుతుంది. పూజారికి వచ్చిన కల ఆధారంగా దీనికి సంబంధించిన చెట్టు ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు. నది, శివాలయం, శ్మశానం… లాంటి ప్రదేశాలు ఆ చెట్టు పెరిగే ప్రాంతంలో తప్పక ఉండాలి. పక్షులు గూళ్లు కట్టి ఉండకూడదు. ఎరుపు వన్నెలో ఉండి శంఖు, చక్రం, గద ఆకృతులు కలిగి ఉన్న వేప చెట్టునే జగన్నాథ స్వామి విగ్రహ తయారీకి వాడతారు. అదే పసుపు చెక్క ఉండి కమలాకృతిలో కొమ్మలున్న చెట్టును సుభద్రమ్మ మూర్తి కోసం, నాగలి గుర్తులు నలుపు వర్ణం కలిగిన చెట్టు బలభద్రుడి విగ్రహమవుతుంది. వీటి తయారీకి ఎటువంటి ఇనుప పరికరాలను వాడకుండా రాగి, చెక్కతో చేసిన ఉలులను మాత్రమే వినియోగిస్తారు. దీన్ని నవకళేబర వేడుకగా జరుపుతారు.
ఆ గుండె బ్రహ్మ పదార్థం…
జగన్నాథ మూర్తుల తయారీ అత్యంత గోప్యంగా జరుగుతుంది. దీన్ని అక్కడి ప్రత్యేకమైన శిల్పులు కఠిన నియమాలతో ఇతరుల అలికిడి లేకుండా తయారు చేస్తారు. తర్వాత అందులోకి బ్రహ్మపదార్థాన్ని జొప్పించే ప్రక్రియ మరింత రహస్యం. బ్రహ్మ పదార్థంగా పిలిచే ప్రత్యేక భాగాన్ని ఆలయ అర్చకులు పాత మూర్తుల నుంచి కొత్త మూర్తులలోకి మారుస్తారు. అయితే ఆ సమయంలో వాళ్లు కళ్లకు గంతలు కట్టుకుంటారు. దాన్ని తగలకుండా చేతికి వస్ర్తాన్ని చుట్టుకుంటారు. అంతేకాదు, ఇది జరుగుతున్న సయయంలో పూరి నగరమంతా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు. గాఢాంధకారంలో ఎవరికంటా పడకుండా ఈ బ్రహ్మ పదార్థ మార్పిడి జరుగుతుంది. అవతార పరిసమాప్తి తర్వాత మిగిలిన శ్రీ కృష్ణుడి దివ్య హృదయమే ఈ బ్రహ్మ పదార్థం అని భక్తుల నమ్మకం.

దేవుడికీ జ్వరమొస్తుంది
జ్యేష్ఠ పౌర్ణమి నాడు అన్నా చెల్లెళ్లతో కూడిన జగన్నాథ స్వామికి 108 కలశాల చల్లని నీటితో స్నానం చేయిస్తారు. దీనివల్ల స్వామివార్లకు జ్వరం వస్తుందని భక్తుల నమ్మిక. అందుకే తరువాతి 15 రోజులు మూర్తులను ప్రత్యేక గదిలో ఉంచుతారు. ఆయుర్వేద మూలికలు, కషాయాలు ఉంచి, లేపనాలు రాసి, పథ్యంగా పండ్లలాంటివి నివేదనలు పెడతారు. ఆ సమయంలో పటాలకు పూజలు జరుగుతాయి. దీని తర్వాత ‘నవయవ్వన దర్శనం’ ఇస్తారు స్వామి. అప్పుడు జగన్నాథుడు మరింత కాంతితో, కళగా కనిపిస్తాడు. ఆ రోజే ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది.
జగన్నాథ స్వామి ఆలయం నుంచి గుండిచా దేవి గుడి వరకూ మూడు మైళ్ల దూరం ఈ రథయాత్ర సాగుతుంది. ఇందులో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగుతారు. జగన్నాథుడి జయ జయ ధ్వానాలు మిన్నంటుతాయి. ఆ ఒక్కరోజే ఏకంగా పది నుంచి పదిహేను లక్షల మంది యాత్రలో పాల్గొంటారు. ఇక, స్వామి పిన్నిగా చెప్పే గుండిచా దేవి ఆలయంలో బలభద్ర, సుభద్ర సమేతంగా వారం రోజులు ఉంటారు. తిరిగి దశమి నాటి మధ్యాహ్నానికి ఆలయం చేరుకోవడంతో రథ యాత్ర పూర్తవుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథం ప్రయాణించాలంటే పన్నెండు గంటల సమయం పడుతుందంటే భక్తుల తాకిడి ఎంతగా ఉంటుందో, స్వామి ఎంత మహిమాన్వితులో అర్థం చేసుకోవచ్చు.


గుండిచా ఆలయం… అమ్మమ్మ ఇంటి అనుబంధం
పూరి ఆలయంలో సిద్ధమయ్యే మహాప్రసాదానికి ప్రత్యేక స్థానం ఉంది. మట్టి పాత్రల్లో వండే ఈ ప్రసాదం వేలాది మందికి ప్రతిరోజూ అందుతుంది. వర్ణ, కుల, మత భేదాలకు అతీతంగా అందరూ కలిసి భుజించడం సమానత్వానికి చిహ్నంగా నిలుస్తోంది.
రథయాత్రను ప్రత్యక్షంగా చూసేందుకు భారతదేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు, పర్యాటకులు వస్తారు. అనేక దేశాల్లో కూడా జగన్నాథ రథయాత్రలు నిర్వహించబడుతున్నాయి. దీంతో ఈ ఉత్సవం భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది.
రథయాత్ర కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. రథాలపై కనిపించే చెక్క శిల్పాలు, రంగురంగుల వస్ర్తాలు, సంప్రదాయ వాయిద్యాలు, భజనలు, ఒడిశీ కళా సంప్రదాయాలు ఈ ఉత్సవాన్ని సాంస్కృతిక ఉత్సవంగా కూడా నిలబెడతాయి. తరతరాలుగా కళాకారులు తమ నైపుణ్యాన్ని ఇందులో ప్రతిబింబిస్తున్నారు.
పూరి రథయాత్ర మనకు కేవలం భక్తినే కాదు, అనేక జీవన విలువలను కూడా నేర్పుతుంది. సమానత్వం, సేవాభావం, ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణ, ప్రకృతిపట్ల గౌరవం, కుటుంబ బంధాల విలువ, సమష్టి కృషి.. ఇవన్నీ ఈ యాత్రలో అంతర్లీనంగా కనిపిస్తాయి. వేగంగా మారుతున్న ఆధునిక ప్రపంచంలో కూడా మన సంస్కృతిని, మనుషుల మధ్య అనుబంధాలను కాపాడుకోవాలనే సందేశాన్ని జగన్నాథ రథయాత్ర అందిస్తోంది.
పూరి జగన్నాథ రథయాత్ర కేవలం ఒక మతపరమైన ఉత్సవం కాదు. అది భారతీయ సంస్కృతి, శిల్పకళ, సామాజిక సమానత్వం, భక్తి, మానవీయ విలువల సమ్మేళనం. ప్రతి ఏడాది కొత్త రథాలు నిర్మించినా, ఈ యాత్ర అందించే సందేశం మాత్రం శాశ్వతందేవుడు అందరివాడు, భక్తికి సరిహద్దులు లేవు, సేవే గొప్ప పూజ. అందుకే పూరి రథయాత్ర శతాబ్దాలుగా కోట్లాది హృదయాలను కదిలిస్తూ ప్రపంచ ఆధ్యాత్మిక వారసత్వంలో తనకంటూ ఒక అపూర్వ స్థానాన్ని సంపాదించుకుంది.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి

