పెండింగ్ కేసులు పెరిగిపోవడంతో ఇన్స్పెక్టర్ రుద్ర ఓ గంట ముందే స్టేషన్‌కి చేరుకొన్నాడు. కుర్చీలో కూర్చున్నాడో లేదో.. స్టేషన్ మీదకు ఎవరో ఓ బాంబు విసిరేసినట్టు ఓ బంతి కిటికి అద్దాలను పగులగొట్టుకొని ఇన్స్పెక్టర్ టేబుల్ మీద పడింది. పది నిమిషాల తర్వాత.. గల్లీలో క్రికెట్ ఆడుకొంటున్న పిల్లలు భయపడుతూ లోపలికి వచ్చి రుద్రకు సారీ చెప్పారు. తొలుత కొంచెం కోపం తెచ్చుకొన్న రుద్ర.. తర్వాత తమాయించుకొన్నాడు. బంతి పడగానే.. పారిపోకుండా స్టేషన్‌కు వచ్చిన చిన్నారుల ధైర్యానికి ముచ్చటపడ్డాడు. ఇంకోసారి అలా చేయొద్దని చెప్పి బంతి ఇచ్చి పంపించాడు. అద్దం పగలడంతో లోపల ఫ్లోర్‌పై పడ్డ గాజు పెంకులను శుభ్రంచేయమని సిబ్బందిని పురుమాయించాడు. ఇంతలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. వచ్చీ రాగానే సంఘటనా స్థలానికి బయల్దేరాడు రుద్ర.
ఇన్స్పెక్టర్ రుద్ర కారు ఓ ఇంటి ముందు ఆగింది. అప్పటికే అక్కడ చుట్టుపక్కల వాళ్లు చేరి చెవులు కొరుక్కుంటున్నారు. ఇంటి వరండాలో కూర్చుని ఉన్న వృద్ధ దంపతులను కొందరు పరామర్శిస్తున్నారు. పరిసరాలు గమనిస్తూ కారు దిగాడు రుద్ర. పోలీసు వాహనాన్ని చూసిన జనంలో ఉత్సుకత పెరిగింది. వాళ్లందరినీ దూరం జరగండి అంటూ ఆ ఇంట్లోకి దారితీశాడు ఇన్స్పెక్టర్. ఖాకీ డ్రెస్‌లో లాఠీ కన్నా కఠినంగా కనిపిస్తున్న రుద్రను చూడగానే ముసలి దంపతుల చుట్టుముట్టిన ఇరుగుపొరుగు పక్కకు జరిగారు. అసలు విషయం ఏంటంటే ఆ ఇంట్లో ముందురోజు రాత్రి దొంగలు పడ్డారు. పది లక్షల రూపాయల నగదు, ముప్పయ్ తులాల బంగారం, కిలోకి పైగా వెండి వస్తువులు దొంగిలించారు. ఆ కేసు పూర్వాపరాలు తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ రుద్ర రంగప్రవేశం చేశాడు.
కన్నీరుమున్నీరు అవుతున్న పెద్దవారిని అనునయిస్తూ ‘అసలేం జరిగిందో చెప్పండి’ అన్నాడు రుద్ర. రాత్రి నుంచి ఏడ్చి ఏడ్చి తడారిన ఆ పెద్దల గొంతుక నుంచి మాట పెగల్లేదు. నీళ్లివ్వమన్నట్టుగా కానిస్టేబుల్ వంక చూశాడు రుద్ర. అతను అందించిన నీళ్లు తాగిన పెద్దావిడ ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ‘బాబూ! మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. వాడు పంపే సొమ్మును జాగ్రత్త చేస్తూ వస్తున్నాం. దేశం కాని దేశంలో పనిచేస్తూ వాడు కష్టపడి పంపుతున్న డబ్బును ఏండ్లుగా కూడబెడుతున్నాం. ఇన్నాళ్లూ దాచిందంతా దొంగలపాలైంది. మా అబ్బాయి ఇక్కడ లేకున్నా.. మాకు సుఖంగా జరగడానికి అన్ని ఏర్పాట్లూ చేశాడు. ఏం గ్రహచారమో.. ఇలా జరిగింది. రాత్రి మా ఆయనతో కలిసి పక్కనే ఉన్న గుడికి వెళ్లాం. చాలాసేపు అక్కడే ఉన్నాం. ఇంటికి వచ్చేసరికి ఇదిగో దొంగతనం జరిగిపోయింది. ఆ మాయదారి కిటికీకి ఐరన్ గ్రిల్స్ పెట్టించమని మా ఆయనతో ఎన్నిసార్లు చెప్పినా వింటేనా! ఇప్పుడు చూడండి. కిటికీ అద్దాల్ని పగులగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్ళారు మాయదారి సచ్చినోళ్ళు’ అని ఇంటి ముసలావిడ ఏడవడం ప్రారంభించింది. కిటికీ అద్దం పగిలి గాజు పెంకులు వరండాలో పడి ఉన్నాయి. బీరువా, రూమ్, కిటికీ, ఇల్లంతా చెక్ చేశాడు రుద్ర. ముసలివాళ్లను ఓదార్చి.. ‘త్వరలోనే దొంగలను పట్టుకుంటాం. ఇకపై, జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పి అక్కడినుంచి కదిలాడు. కానిస్టేబుల్ ఆ దంపతుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నాడు.
స్టేషన్‌కి వచ్చాడో లేదో.. వృద్ధ దంపతుల నుంచి స్టేషన్‌కు మరోసారి ఫోన్ కాల్. ‘అయ్యా! మా అబ్బాయి రేయింబవళ్లూ కష్టపడి సంపాదించిన సొమ్ము అది. దొంగలను ఎలాగైనా పట్టుకొని మా సొమ్ము మాకు తిరిగి ఇప్పించగలరు. ఎలాగైనా మీరే మాకు న్యాయం చేయాలి’ అని వేడుకున్నారు. అసలే పెండింగ్ కేసులతో సతమతమవుతున్న రుద్రకు.. ఈ కేసు మరో భారంగా తోచింది. వచ్చి తన కుర్చీలో కూలబడ్డాడు. ఆ వృద్ధ దంపతుల దీన వదనాలను తలుచుకుని ‘పాపం’ అనుకున్నాడు. కుర్చీలోంచి లేచి కిటికీ వంక నడిచాడు. కాళ్లకింద గాజు పెంకులు నలుగుతున్న శబ్దం వచ్చింది. కిందికి చూస్తే పొద్దున పగిలిన కిటికీ గాజు పెంకులు ఇంకా అక్కడే ఉండటం గమనించాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్‌పై కేకలు వేశాడు. ఇంతలో అతని మనసులో హుక్ పాయింట్ ఒకటి తట్టింది. వెంటనే, ఆ వృద్ద దంపతులకు ఫోన్ చేసి ‘మీరు స్టేషన్‌కి రండి.. దొంగలు దొరికారు’ అన్నాడు. దొంగలు దొరికారు అనగానే, వృద్ధ దంపతులు ఆగమేఘాలమీద స్టేషన్లో వాలిపోయారు.
ముసలివాళ్లు వచ్చీరాగానే, కుర్చీలో కూర్చోమన్న రుద్ర.. ‘మీకెవరిమీదనైనా అనుమానం ఉందా?’ అని అడిగాడు. ఫోన్లోనేమో.. దొంగలు దొరికారన్న ఇన్స్పెక్టర్.. ఇప్పుడు మళ్లీ ఎవరిమీదనైనా అనుమానం ఉందా? అని అడుగుతాడేంటి? అని వృద్ధ దంపతులకు అర్థంకాలేదు. అదే విషయం అడిగారు. దీనికి దీర్ఘంగా నిట్టూర్చిన రుద్ర.. ‘దొంగతనం మీరే చేసి, దొంగలు పడ్డారంటూ ఏడుస్తూ మా దగ్గరికి రావడమేంటో మాకూ అర్థంకాలేద’ంటూ బాంబు పేల్చాడు. వృద్ధ దంపతులు ఒకరిముఖాలు ఒకరు చూసుకొన్నారు. ‘ఇన్స్పెక్టర్ గారూ! ఏంటి మీరు మాట్లాడేదీ?’ అంటూ గద్దించారు. అయితే, రుద్ర.. ఇచ్చిన వివరణతో నీళ్లు నమిలారు. అసలేం జరిగిందో.. మీరు కనిపెట్టారా?