తాజ్‌బంజారాలో ఇన్స్పెక్టర్ రుద్ర ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఓ కేసుఫైల్ను నిశితంగా స్టడీ చేస్తున్నాడు. కాసేపటి తర్వాత రుద్ర కజిన్ స్నేహిల్ వచ్చాడు. అతణ్ని చూడగానే కుర్చీలోంచి లేచిన రుద్ర ఆప్యాయంగా హగ్ చేసుకొన్నాడు. వరుసకు అన్నదమ్ములు అవుతారు ఇద్దరూ! ఒకరంటే ఒకరికి అభిమానం. వాళ్లిద్దరూ కలుసుకొని చాలా రోజులైంది.
ఆఫీస్ పనిమీద రుద్ర అక్కడికి వస్తే.. ఆఫీసుకు హాఫ్ డే లీవ్ పెట్టి స్నేహిల్ తాజ్‌కు వచ్చాడు. అలా వచ్చాడో లేదో.. ‘ఏంట్రా? మొహం మొత్తం వాడిపోయింది. ఏమైంది?’ అంటూ అడిగాడు స్నేహిల్. ‘ఏం చెప్పమంటావ్రా?? కేసుల తలనొప్పి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?? వీటిని సాల్వ్ చేయాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది’ నిట్టూరుస్తూ చెప్పాడు రుద్ర. ‘కేసులు ఎప్పుడూ ఉండేవే.. ఇంతకీ పిన్ని, బాబాయ్ ఎలా ఉన్నారు?’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు స్నేహిల్. ఇద్దరూ కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకొన్నారు. అలా మాట్లాడుకొంటుండగానే స్నేహిల్ ఇన్స్పెక్టర్ రుద్ర ఆరోగ్యం గురించి మరోసారి ఆరా తీశాడు. సరైన సమయంలో తిండి, నిద్ర లేకపోతే.. ఎలా ఉంటుందో సాఫ్ట్వేర్ జాబ్ చేసే తనకు తెలుసంటూ స్నేహిల్ అలా చెప్తూ పోయాడు. ఇంతలో రుద్ర అందుకొని.. ‘అన్నయ్యా.. ఇదిగో ఇలాంటి కేసులు వారానికొకటి తగిలినా చాలు.. ఇక తిండి, తిప్పల సంగతి అంతే..!’ అంటూ కుర్చీలో కూలబడ్డాడు. దీంతో తమ్ముడి చేతిలోని కేసు ఫైల్‌ను అందుకొన్న స్నేహిల్ చదవాలని తెరిచాడు. ఇంతలో రుద్ర.. ‘అదో రైటర్ హత్యకు సంబంధించిన కేసు. హత్య అని చెప్పడం కంటే.. ‘మిస్టరీ మరణం’ అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే, తన హత్యకు కారణం ఎవరో ఆ రైటర్ క్లియర్‌గా చెప్పాడు. అయితే, రైటర్ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ హంతకుణ్ని పట్టుకోవడానికి మాకు చుక్కలు కనిపిస్తున్నాయి’ అంటూ రుద్ర వాపోయాడు. స్నేహిల్ కలుగజేసుకొని.. ‘ఏదీ.. నేను ఓసారి కేసును పూర్తిగా చదువుతా..!’ అంటూ ప్రారంభించాడు.
తెలుగులో డిటెక్టివ్ నవలలు రాసే సుబ్రహ్మణ్యం అంటే తెలియని వారు లేరు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేవు. అయితే, ఆయనకు మానసిక ప్రశాంతతే కరువైందని సన్నిహితులు చెప్తారు. ఉన్న ఒక్క కూతురికి ఏడాది కిందే పెండ్లి చేసి అమెరికా పంపాడు. గారాబంగా పెంచుకొన్న బిడ్డ దూరమవడంతో కొంత కుదేలైన సుబ్రహ్మణ్యం.. భార్య సుమతితో కలిసి వారసత్వంగా వచ్చిన ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే, ఇటీవలే ఓ రోడ్డు యాక్సిడెంట్లో సుమతి మరణించింది. దీంతో పూర్తిగా ఒంటరివాడైన సుబ్రహ్మణ్యం రచనలకు దూరమయ్యాడు. భార్యా వియోగంతో మందుకు బానిసయ్యాడు. ఇంటి నుంచి బయటికి రావడం దాదాపుగా గగనమే అని చెప్పాలి. ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చుకొంటూ కాలం గడిపేవాడు. ఐదు రోజుల కిందట.. సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నదని ఇరుగుపొరుగు వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లిన రుద్ర.. తలుపులను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లాడు. కుళ్లిన స్థితిలో సుబ్రహ్మణ్యం మృతదేహం నేలమీద పడి ఉంది. ఒంటిమీద ఎలాంటి గాయాలు గానీ, దాడి చేసినట్టు ఆనవాళ్లు గానీ ఏమీ లేవు. భార్యకు దూరమై, మానసిక వేదనతోనే సుబ్రహ్మణ్యం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాడు రుద్ర. సుబ్రహ్మణ్యం గదిని మొత్తం పరిశీలనగా చూశాడు. ఇంతలో సుబ్రహ్మణ్యం రాసిన నవల ‘లాస్ట్ పేజీ’ బుక్కు ఒక టేబుల్ మీద కనిపించింది. పుస్తకంపై ‘లాస్ట్ పేజీ’ అని పెద్దగా రాసి ఉంది. చివరి అట్టపై సుబ్రహ్మణ్యం ఫొటో, ప్రొఫైల్ తదితర వివరాలు ఉన్నాయి. కేసు కోసం పనికొస్తాయని ఆ వివరాలను రికార్డు చేశాడు రుద్ర. ఇక, నవలను తెరిచిన రుద్రకు అందులో ఓ పేపర్ దొరికింది. అందులో.. ‘నన్ను చంపిన హంతకుడి పేరు, వివరాలను.. ఈ బుక్కు చివరి పేజీలో రాశాను’ అని ఉంది. పేపర్ చివరన సుబ్రహ్మణ్యం సంతకం కూడా ఉంది. దీంతో రుద్ర.. భృకుటి ముడిపడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నవల చివరి పేజీలోకి వెళ్లాడు. ఆశ్చర్యం.. అదో తెల్లని కాగితం. నోట్స్ రాసుకోవడానికి వదిలిపెట్టినట్టుంది. దీంతో రుద్రకు మతిపోయినట్టయింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సుబ్రహ్మణ్యం విషం తాగి చనిపోయినట్టు తేలింది.
దీంతో ఈ కేసు రుద్రకు సవాలుగా మారింది. గదిలో పరిస్థితులను చూస్తే హత్య జరిగిందని ధ్రువపరిచేలా ఒక్క ఆధారమూ కనిపించలేదు. సూసైడ్ కేసుగా ముగిద్దామనుకొంటే.. మృతుడి చివరి వాంగ్మూలం హంతకుడు ఉన్నట్టు చెప్తున్నది. సుబ్రహ్మణ్యం చెప్పినట్టు బుక్కు చివరి పేజీలో హంతకుడికి సంబంధించిన ఏ వివరాలూ రాసిలేవు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఆ లాస్ట్ పేజీ ఏమీ రాయకుండా వదిలేసి ఉన్నట్టు చెప్తున్నది. దీంతో ఏం చేయాలో రుద్రకు అర్థం కావడం లేదు.
స్నేహిల్ కేసును పూర్తిగా చదివాక, రుద్ర భుజంపై తట్టి.. ‘డియర్.. బ్రదర్..! ఇలాంటి కేసులను నువ్వు ఎన్నో సాల్వ్ చేశావ్. ఇది కూడా పరిష్కరిస్తావన్న నమ్మకం నాకున్నది. ముందు ఇంటికి వెళ్దాం’ అన్నాడు. ఇద్దరూ కలిసి ముందు స్నేహిల్ ఇంటికి వెళ్లారు. కాసేపు పెద్దనాన్న, పెద్దమ్మతో మాట్లాడిన రుద్ర.. బాల్కనీలోకి వచ్చి ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంతలో కింద ఇద్దరు స్కూల్ పిల్లలు ఏదో మాట్లాడుకొంటున్నారు. వారి సంభాషణ ఇలా సాగింది. ‘హండ్రెడ్ పేజీస్ బుక్ అన్నారు.. నైంటీ సిక్స్ పేజీసే ఉన్నాయ్’ అన్నాడు ఓ అబ్బాయి. ‘కవర్స్ నాలుగు పేజీలు ఉన్నాయిగా! మొత్తం వంద పేజీలు లెక్క సరిపోయింది కదరా!’ అని మరో అబ్బాయి బదులిచ్చాడు. ఆ మాటలు విన్న రుద్ర ముఖంపై చిరునవ్వు విరబూసింది. ‘హంతకుడు దొరికేశాడోచ్!’ అని అరిచాడు. ఇంతకీ, హంతకుడు ఎవరో మీరు కనిపెట్టారా?