స్టేషన్‌లోని తన క్యాబిన్లో లంచ్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. ‘సార్.. ఇక్కడ మోహినీ మహల్ మీద నుంచి సునీతా మేడమ్ దూకారు. మీరు, త్వరగా రండి’ అంటూ అటు నుంచి ఒక వ్యక్తి కంగారుగా చెప్తూ పోయాడు. ఆ మాట వినగానే రుద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ‘మంత్ర తంత్రాలు, మూఢనమ్మకాలు నమ్మొద్దంటూ సమాజంలో చైతన్యం కోసం పాటుపడుతున్న సునీతా మేడమ్ అయితే కాదు కదా!’ అని మనసులో అనుకొంటూ ఒకింత ఆందోళనతో ఫోన్ పెట్టేశాడు రుద్ర. వెంటనే తన సిబ్బందితో క్రైమ్ స్పాట్‌కు బయల్దేరాడు.
సునీతా ఓ డాక్టర్. అలాగే యాంటీ పారానార్మల్ యాక్టివిస్ట్ కూడా. దెయ్యాలు, భూతాలు, మూఢనమ్మకాల వంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. సమాజం అభ్యున్నతికి ఎంతో కృషి చేసే ఆమెను అందరూ సునీతా మేడమ్ అని పిలుస్తారు. సిటీ సెంటర్లో ఐదంతస్తుల భవనమే మోహినీ మహల్. కమర్షియల్ యాక్టివిటీస్‌కు మంచి ప్లేస్. అయితే, భవనంలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ ఏడాదిగా పుకార్లు రావడంతో అక్కడ ఉండటానికి ఎవరూ ముందుకురాలేదు. అప్పటికే ఉన్న దుకాణదారులు కూడా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో మోహినీ మహల్ దిక్కు వెళ్లడానికి కూడా అందరూ జంకేవారు. జన సంచారం లేకపోవడంతో అది ఓ పాడుబడ్డ భూత్ బంగ్లాగా మారింది. కోట్ల ప్రాపర్టీ అలా నిరుపయోగంగా మారిందని బిల్డింగ్ యజమాని కళాధర్ సునీతా మేడమ్‌ను ఇటీవలే కలిశారు. జరిగిందంతా చెప్పారు. దీంతో ఆ భవనంలో ఏ దెయ్యమూ లేదని నిరూపించడానికి మూడు రోజుల కిందటే ఆమె అక్కడ దిగారు. ఇంతలోనే ఈ వార్త.
క్రైమ్ స్పాట్‌కు చేరుకొన్నారు రుద్ర సిబ్బంది. గేటుకు దూరంగా జనం గుమిగూడారు. వాచ్మాన్ గేటు దగ్గరికి వస్తూ.. ‘సార్! నేనే మీకు ఫోన్ చేసింది. మేడమ్ నా కండ్ల ముందే కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకొన్నారు’ అంటూ ఏడ్వసాగాడు. ‘ఎవరైనా లోపలికి వెళ్లారా?’ రుద్ర ప్రశ్న. ‘లేదు సార్. ఎవ్వరూ లోపలికి వెళ్లలేదు’ వాచ్మాన్ సమాధానం. ‘సరే! ఎవ్వరినీ లోపలికి రానివ్వొద్దు’ అంటూ రుద్ర ఒక్కడే లోపలికి వెళ్లడానికి సమాయత్తమవుతుండగా.. ‘సార్.. ఒక్కరే లోపలికి వెళ్లొద్దు! ఈ బిల్డింగ్ గురించి కథలు కథలుగా చెప్తున్నారు’ అని వారించాడు రామస్వామి. ‘బాబాయ్.. మీరు కూడా ఇవన్నీ నమ్ముతున్నారా?’ అంటూ ఒకింత అసహనంతో సమాధానమిచ్చాడు రుద్ర. ‘బాబూ.. నేను కూడా మీతో వస్తా!’ నిశ్చయంగా చెప్పాడు రామస్వామి. ఇద్దరూ లోపలికి కదిలారు.
ఐదంతస్తుల భవంతిలో నాలుగో ఫ్లోర్‌లోని చివరి గదిలో సునీతా మేడమ్ ఉండేవారు. మిగతా ఫ్లోర్లు, గదులన్నీ లాక్ చేసి ఉన్నాయి. మేడమ్ ఉండే ఆ గదిలోకే రుద్ర, రామస్వామి సరాసరి వెళ్లారు. గది అంతా నిశ్శబ్దం. ఓ మూలకు కుర్చీ, దాని ముందు ఓ టేబుల్ వేసి ఉన్నాయి. మేడమ్ దూకిన కిటికీ దగ్గరికి రుద్ర వెళ్లాడు. అద్దం తెరిచి కిందికి చూశాడు. కింద మేడమ్ డెడ్‌బాడీ కనిపిస్తున్నది. మేడమ్ ఇక్కడి నుంచే పడ్డారన్న విషయం స్పష్టమైంది. టెర్రస్ మీద ఏముందో చూద్దామనుకొని రుద్ర వెనక్కి తిరిగాడో లేదో.. కుర్చీ పక్కన ఉన్న గోడపై ‘వెళ్లిపోతున్నా.. ఇక్కడ ఎవరూ ఉండొద్దు. ప్రమాదం’ అని రాసి ఉన్నది. అది చదివి రామస్వామికి నిల్చున్న చోట భూకంపం వచ్చినట్లయ్యింది. ‘సార్.. ఇక్కడ ఎక్కువ సమయం ఉండొద్దు. వెళ్దాం’ అంటూ తొందరపెట్టాడు. సరేనన్న రుద్ర.. టెర్రస్ మీదకు వెళ్లాలనుకున్నప్పటికీ, ఆ డోర్ లాక్ చేసి ఉండటంతో మళ్లీ కిందకు వచ్చి వాచ్మాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు.
‘సార్, ఓ గంట ముందు అంటే మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో మేడమ్ ఉన్నట్టుండి ఆ కిటీకీలోంచి దూకి ఆత్మహత్య చేసుకొన్నారు. నేను వెంటనే భయపడిపోయా. మీకు ఫోన్ చేశా’ కంగారుగా చెప్పాడు వాచ్మాన్. ‘ఆత్మహత్య అని ఎలా చెప్తావ్? ఎవరైనా తోసేసి ఉండొచ్చుగా?’ సూటిగా అడిగాడు రుద్ర. ‘అలా.. జరిగే అవకాశమే లేదు సార్. ఎందుకంటే, ఈ బిల్డింగ్ లోపలికి వెళ్లే ఏకైక మార్గం ఇదే. మేడమ్ తప్ప ఎవరూ లోపలికి వెళ్లలేదు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చూడండి. వేరే దారిలో లోపలికి ఎవరైనా రావొచ్చన్న అనుమానాలు కూడా వద్దు సార్. ఎందుకంటే బిల్డింగ్‌కు అన్ని వైపులా సీసీటీవీ కెమెరాలు కవర్ చేసి ఉన్నాయి. ఆ దెయ్యమే… మేడమ్‌ను.. ’ అంటూ ఆగిపోయాడు వాచ్మాన్. అతను చెప్పినట్టే సీసీటీవీ ఫుటేజీలో ఎవరూ లోపలికి వచ్చినట్టు లేదు.
‘అవును. ఈ మోహినీ మహల్‌పై ఏదో కోర్టు కేసు నడుస్తున్నట్టుంది కదూ!’ వాచ్‌మాన్‌ను సందేహాస్పదంగా అడిగాడు రుద్ర. ‘అవును సార్. ఈ బిల్డింగ్ ఓనర్ కళాధర్‌కు తమ్ముడున్నాడు. పంపకాలకు సంబంధించి అతనే ఏదో కేసు వేసినట్టు చెప్తారు’ చెప్పాడు వాచ్మాన్. దీంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ ‘మొత్తానికి మేడమ్‌ను సూసైడ్ చేసుకొనేలా ఆ దెయ్యమే చేసిందంటావ్’ వాచ్‌మాన్‌తో అన్నాడు రుద్ర తాపీగా. ‘అవును సార్!’ అంతే కచ్చితంగా చెప్పాడు వాచ్మాన్. ‘కానిస్టేబుల్స్.. మేడమ్‌ది ఆత్మహత్య కాదు. హత్య. నేరస్తుడు ఎవరో తెలియాలంటే ఇతన్ని స్టేషన్‌కు తీసుకురండి’ అంటూ వాచ్మాన్ వైపు ఆగ్రహంగా చూశాడు రుద్ర. ఇంతకీ, మేడమ్‌ది ఆత్మహత్య కాదని రుద్ర ఎలా కనిపెట్టాడు?? వాచ్‌మాన్‌ను ఎందుకు అరెస్ట్ చేశాడు???
సునీతా మేడమ్‌ది హత్య. ఎందుకంటే, మేడమ్ ఒకవేళ సూసైడ్ చేసుకొంటే కిటికీ అద్దం కూడా తెరిచే ఉండాలి. అయితే, అది మూసి ఉంది. అంటే హంతకుడు మేడమ్‌ను తోసేసి ఏమరుపాటుతో అద్దాన్ని మూసేశాడు. అలా ఇది హత్య అని రుద్ర కనిపెట్టాడు. ఇక, మొదటి నుంచి మేడమ్‌ది ఆత్మహత్య అంటూ ప్రచారం చేస్తున్న వాచ్మాన్ అబద్ధం చెప్తున్నాడని గ్రహించి అసలు విషయం తెలుసుకొందామనే అతన్ని అరెస్టు చేశాడు రుద్ర. విచారణలో.. బిల్డింగ్ ఓనర్ కళాధర్ తమ్ముడితో కుమ్మక్కై, మోహినీ మహల్‌ను ఓ భూత్ బంగ్లాగా చిత్రీకరించాడు వాచ్మాన్. ఆ భయంతో ఆ కోట్ల ప్రాపర్టీని వదిలేసి కళాధర్ వెళ్తాడనుకొని ఆయన తమ్ముడు అనుకొన్నాడు. అయితే, సునీతా మేడమ్ జోక్యం చేసుకోవడంతో ఆమెను చంపి.. దెయ్యం చంపినట్టు గోడమీద రాతలతో నమ్మించాలనుకొన్నాడు. మేడమ్‌ను హత్య చేసింది వాచ్మానేనని తర్వాత ఒప్పుకొన్నాడు. సీసీటీవీలో పడకుండా ఆ వాచ్మానే తగిన జాగ్రత్తలు కూడా తీసుకొన్నాడు.