నదులు వేల ఏండ్లుగా మనిషికి తాగునీరు, సాగునీరు అందిస్తున్నాయి. అయితే, నాగరికత ఆధునికతను సంతరించుకుంటున్న కొద్దీ నదీమతల్లులు కలుషితమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఐదు స్వచ్ఛమైన, ఐదు కలుషితమైన నదుల గురించి తెలుసుకుందాం. నదులను పూజించే భారతదేశంలోనే నదులు ఎక్కువగా కాలుష్యం బారినపడుతున్నాయి. వాటి పరిరక్షణ బాధ్యత మనదే.
థేమ్స్, లండన్
థేమ్స్ నది లండన్ నగర గుండెకాయ. 346 కిలోమీటర్ల పొడవైన ఈ నది లండన్‌కు మూడింట రెండువంతుల తాగునీటిని సమకూరుస్తుంది. ప్రపంచంలో స్వచ్ఛమైన, అందమైన నదిగా థేమ్స్‌ను పరిగణిస్తారు.
టారా, మాంటెనీగ్రో
దీన్ని ‘జువెల్ ఆఫ్ యూరప్’ అని పిలుచుకుంటారు. యునెస్కో వారసత్వ ప్రదేశమైన ఈ నదిలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి.
టార్న్, స్వీడన్-ఫిన్లాండ్
టార్న్ నది ఐరోపా దేశాలు స్వీడన్ ఫిన్లాండ్ సరిహద్దుగా ప్రవహిస్తుంది. ఈ నది పరీవాహక ప్రాంతంలో స్థానికులు పరిరక్షణ చర్యలు చేపట్టారు. కాబట్టి, నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి.
సెయింట్ క్రోయిక్స్, అమెరికా
ఇది ఒకప్పుడు బాగా కలుషితమైన నది. తర్వాత కాలంలో తగిన జాగ్రత్త చర్యలతో పరిశుభ్రం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు నదిలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటున్నాయి. ఎన్నో జీవ జాతులు మనుగడ సాగిస్తున్నాయి.
గంగ, భారత్
మనం అతి పవిత్రంగా పూజించే గంగా నది ప్రపంచంలోనే అతి కలుషితమైన నదుల్లో ఒకటి అంటే కడుపు తరుక్కుపోతుంది. రోజుకు కొన్ని లక్షల గ్యాలన్ల మురికినీళ్లు, పారిశ్రామిక వ్యర్థాలు గంగమ్మ ఒడిని చేరుకుంటున్నాయి. నదీ జలాలను పనికిరాకుండా చేస్తున్నాయి.
సిటారం, ఇండోనేసియా
సమీపంలో ఉండే వస్త్ర పరిశ్రమల నుంచి విడుదలైన చెత్తాచెదారంతో సిటారం పరిసరాలు వికృతంగా కనిపిస్తాయి. దాదాపు మూడు కోట్ల మందికి నీటిని ఇచ్చే ఈ నది విష రసాయనాలు, మురికినీళ్లతో కలుషితమైపోయింది.
డ్వాకి, భారత్
మనదేశంలో పరిశుభ్రంగా ఉండే నదులు ఉంటాయంటే నమ్మలేం. కానీ డ్వాకి దీనికి మినహాయింపు. మేఘాలయలో ఉండే ఈ నదిలో నీళ్లు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. నదీ గర్భం
కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
పాసిగ్, ఫిలిప్పీన్స్
ఈ నది ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలా గుండా సాగిపోతుంది. ఇటీవలి కాలంలో ఈ నది కూడా విపరీతంగా కలుషితమైపోయింది. శుద్ధి చర్యలు చేపట్టారు.
బుఢీగంగ, బంగ్లాదేశ్
ఢాకా నగర నీటి వ్యవస్థకు బుఢీగంగ కీలకం. ఇది కూడా ప్రపంచంలోనే అతి కలుషితమైన నదుల్లో ఒకటి. పారిశ్రామిక వ్యర్థాలు… ముఖ్యంగా తోలు పరిశ్రమల కారణంగా బుఢీగంగ జలాలు విషపూరితమయ్యాయి.
యమున, భారత్
గంగా నది ఉపనదుల్లో యమున ముఖ్యమైనది. దేశ రాజధాని ఢిల్లీ, చారిత్రక నగరం ఆగ్రా గుండా ప్రవహిస్తుంది. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు యమునా నదిని వాడకానికి పనికిరాకుండా చేస్తున్నాయి.