Unicorn Club | ఐఐటీ అబ్బాయి దొరకడం ఐఐటీ అమ్మాయి అదృష్టం. ఇద్దరికీ ఒకే లక్ష్యం కావడం, ఇద్దరూ ఆంత్రప్రెన్యూర్‌షిప్ స్వాప్నికులు కావడం ఇంకా ఇంకా అదృష్టం. ఓ కంపెనీలో కొలీగ్స్‌గా పరిచయమైన ఇద్దరూ డ్యూటీనే కాదు జీవితాన్నీ పంచుకుందామని అనుకున్నారు. ఒక్కటైన తర్వాత కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. తాజాగా ‘యూనికార్న్ క్లబ్’లో చేరారు.
రుచి కల్రా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్ చదివింది. తర్వాత, హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేసింది. వెను వెంటనే ఎవాల్యూసెర్వ్ అనే కంపెనీలో సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగం వరించింది. ఏడాదిన్నరపాటు కొలువు చేసిన తర్వాత మెకెన్సీ అండ్ కంపెనీకి మారింది. అక్కడే రుచి జీవితం మలుపు తిరిగింది. ఐఐటీలో తనకంటే రెండేండ్ల సీనియర్ అయిన ఆశిశ్ మహోపాత్ర పరిచయమయ్యాడు. ఇద్దరి ఆలోచనలూ, ఆశలు ఒక్కటే.. కెరీర్ పరుగులో, టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఒకరికొకరు పోటీపడ్డారు. ఈ పోటీలో స్పర్ధలు రాలేదు. ప్రేమ చిగురించింది. పెండ్లయింది. ఆ తర్వాత ఎక్కువ సంపాదన ఉన్న మగవాడు భార్యను ఇంటికే పరిమితం చేయడం చాలా కుటుంబాల్లో కనిపించే ప్రేమ. కానీ, ఆశిశ్ అలా కాదు. రుచిని ప్రోత్సహించాడు. ఉద్యోగం చేస్తూనే ఇద్దరూ సొంత బిజినెస్ కోసం కలలుకన్నారు. స్టార్టప్ స్థాపించాలనే ఆలోచనతో ఉద్యోగాలు వదులు కున్నారు.
ఆశిశ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి‘ఆఫ్‌బిజినెస్’ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇది తయారీ రంగానికి కావాల్సిన ముడి సరుకుల్ని అందించే స్టార్టప్. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన సిమెంట్, ఇనుము, రసాయనాలు, ధాన్యం, లోహాలు, పాలిమర్స్, టెక్స్టైల్స్ మొదలైనవాటిని ఆర్డర్ చేస్తే.. సకాలంలో డెలివరీ చేస్తుంది. ఆర్డర్లే కాదు చెల్లింపులు కూడా ఆన్లైన్లో చేసే అవకాశం ఉండటంతో మార్కెట్ బాగానే ఆదరించింది. గుర్గావ్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీలో 1000 మంది వరకూ పని చేస్తున్నారు. కొంతమంది కీలక ఉద్యోగులకు వాటాలిచ్చారు.
రుచి కల్రా కూడా సొంతంగా ‘ఆక్సీజో ఫైనాన్షియల్ సర్వీస్’ అనే స్టార్టప్‌ను స్థాపించింది. ఆక్సీజన్, ఓజోన్ అనే పదాలను జోడిస్తూ ‘ఆక్సీజో’ అనే పేరు పెట్టింది. చిన్న చిన్న వ్యాపారాలకు ‘ఆక్సీజో’ ప్రాణవాయువుతో సమానమైన డబ్బును సాయం చేస్తుంది కాబట్టి ఆ పేరును ఎంచుకుంది. ఇందులో వెంచర్ క్యాపిటలిస్టులు భారీగా పెట్టుబడులుపెట్టారు. ఏడాది క్రితం.. ఆఫ్బిజినెస్లో సాఫ్ట్ బ్యాంక్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేయడంతో.. ఆపరేషన్స్ పెరిగాయి. దీంతో డిసెంబరు నాటికి ఆఫ్ బిజినెస్ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ మధ్యనే ఆక్సీజో కూడా భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆ పెట్టుబడులతో కంపెనీ మార్కెట్ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో రెండు స్టార్టప్‌లు యూనికార్న్ క్లబ్లో చేరాయి. భారతదేశంలో భార్యా, భర్తలు స్థాపించిన స్టార్టప్స్ చాలానే ఉన్నాయి. చాలానే విజయవంతం అయ్యాయి. కానీ, వాటిల్లో ఇలా రెండూ యూనికార్న్ క్లబ్లో చేరిన స్టార్టప్స్ మాత్రం లేవు. అలాంటి డబుల్ సక్సెస్ సాధించిన జోడీ… రుచి కల్రా, ఆశిశ్ మహోపాత్ర ఒక్కటే!
సక్సెస్ అంటే యూనికార్న్.. అనే అర్థం స్థిరపడిపోతున్నది. కానీ, భార్యా భర్తలు నడిపే స్టార్టప్స్ రెండూ యూనికార్న్ క్లబ్లో చేరడం ఇదే మొదలు. ఈ విజయంతో రుచి కల్రా, ఆశిశ్ మహోపాత్రసరిజోడని నిరూపించుకున్నారు. ‘మనదైన ప్రపంచాన్ని నిర్మించుకుందామని తొలి రోజుల్లో కలలుగనేవాళ్లం. ఇప్పుడు అది నిజమైంది’ అంటారు ఆ దంపతులు.
Read More :
“Sangeetha Kala Sisters | ఆ సిస్టర్స్‌కి రామకథలే అన్నపానీయాలు”
“Indina bald woman | గుండు అయితేనేం.. గుండెనిండా విశ్వాసం!”
“సపోట నుంచి తేనె దాకా అన్నింటితో వైన్.. మరాఠా అమ్మాయి ఆలోచన అదుర్స్”
అవకాశం వస్తే ఆర్టీసీ డ్రైవర్ కొలువు చేస్తానంటున్న కరీంనగర్ ఆడబిడ్డ.. ఎందుకంటే”