మనదేశంలో నదులు చాలావరకు నీళ్లతోపాటు గృహ, పారిశ్రామిక వ్యర్థాలనూ మోసుకెళ్తున్నాయి. ఇవన్నీ చివరికి సముద్రంలో కలిసిపోతాయి. అలా రోజురోజుకూ జలావరణమంతా కాలుష్యమయమై పోతున్నది. ఇది మర్చంట్ నేవీ విశ్రాంత అధికారి కెప్టెన్ డీసీ శేఖర్‌ను కలచివేసింది. ఆయన తన ఉద్యోగంలో భాగంగా 26 ఏండ్లపాటు సముద్రాల మీద ప్రయాణించి భూగోళమంతా చుట్టొచ్చారు. పదవీ విరమణ సమయంలో ఇంతకుముందు చేపట్టని కార్యక్రమం ఏదైనా చేయాలని సంకల్పించుకున్నారు. భారతదేశపు నౌకాశ్రయాలు, నదులు ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలతో నిండిపోవడాన్ని శేఖర్ ప్రత్యక్షంగా గమనించారు. తాను మర్చంట్ నేవీ అధికారిగా సముద్రం మీద గడిపిన అనుభవాన్ని తన కొత్త ప్రయత్నానికి స్ఫూర్తిగా తీసుకున్నారు.
భారతదేశపు నదుల్లో ప్లాస్టిక్ లేకుండా శుద్ధిచేయడానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. తన ప్రయత్నం సఫలమైతే నదులే కాదు, సముద్రాల్లో కూడా వ్యర్థాలు పేరుకుపోవు. ఈ క్రమంలో ఆయన నదుల శుద్ధి కోసం ఓ ప్రత్యేకమైన తేలియాడే అడ్డుకట్టను రూపొందించారు. సంప్రదాయ పారిశుద్ధ్య విధానాల్లా కాకుండా శేఖర్ రూపొందించిన విధానం నదుల సహజ సిద్ధమైన ప్రవాహాలను ఉపయోగించుకుంటుంది. ఇందులో నదీ ప్రవాహానికి అడ్డుగా ఓ తేలియాడే కట్టను ఉంచుతారు. ఇది ప్లాస్టిక్, చెట్ల కొమ్మలు, ఇతర వ్యర్థాలను నది ఒడ్డున ఏర్పాటు చేసిన శుద్ధి కేంద్రం వద్దకు చేరుస్తుంది. అంటే నదీ ప్రవాహం మామూలుగా కొనసాగుతూనే వ్యర్థాలు వేరుపడి పోతాయన్నమాట. ఇది చాలా సరళంగా ఉంటుంది. పైగా పనిచేయడానికి ఎలాంటి ఇంధనం అవసరమూ ఉండదు.
విదేశీ విధానాలతో పోలిస్తే 30 రెట్లు ఖర్చు తక్కువ కూడా. ఇప్పటికే ఈ అడ్డుకట్టలను చెన్నై నగరం నుంచి ప్రవహించే కూవం, అడ్యార్ నదుల్లో ఉంచారు. శేఖర్ ఆవిష్కరణకు పలు రాష్ర్టాల ప్రభుత్వాల ప్రశంసలు లభించాయి. ఆయన ఇప్పుడు గోవాలో ఓ ప్రాజెక్టును చేపట్టారు. ఇక్కడ అరేబియా సముద్రంలో కలిసే నదులకు అడ్డంగా తేలియాడే కట్టలను ఏర్పాటుచేశారు. అలా సముద్రాన్ని కాలుష్యం బారినుంచి రక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శేఖర్ తన కొత్త విధానం ద్వారా ఇప్పటివరకు లక్ష టన్నుల వ్యర్థాలను నీటి నుంచి వేరుచేశారు. రోజురోజుకూ మానవ జనిత కాలుష్యం బారినపడి విలవిల్లాడుతున్న నదులు, సముద్రాలను కాపాడటానికి శేఖర్ చొరవ అభినందనీయం. ఆయన ప్రయత్నం ప్రభుత్వాలకు, పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలకు స్ఫూర్తిదాయకం.