జానపదుల ప్రకారం..: పూర్వం అక్కమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుండేవారు. పెద్ద వదిన ఒకరోజు ఆడబిడ్డకు పాలలో విషం ఇచ్చి చంపేస్తుంది. ఆ తర్వాత ఆనవాళ్లు తెలియకుండా ఊరిబయట పాతిపెడుతుంది. పాతిపెట్టిన చోట అడవి తంగేడు చెట్టు పుట్టి విరగబూస్తుంది. ఊరి నుంచి అప్పుడే వస్తున్న అన్నలు చెల్లికి పూలు ఇద్దామని తంగేడును తెంపబోతే అక్కమ్మ ఆత్మ తన మరణం గురించి చెప్తుంది. అప్పుడు అన్నలు ‘నీకేం కావాలో కోరుకో తల్లి’ అని ప్రాధేయపడితే ‘తంగేడు పూలల్లో నన్ను చూసుకొమ్మని, ఏటా నా పేర పండుగ చేయమని’ అక్కమ్మ కోరినట్లు ఓ కథ ప్రాచుర్యంలో ఉన్నది.
ఇలా… 108 మొగ్గల్లో 36 పుటల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ‘బతుకమ్మ’ పండుగను కవి ఉప్పరి తిరుమలేశ్ ‘బతుకమ్మ మొగ్గలు’ పుస్తకం ద్వారా మనకు అందించారు. అలంకార శాస్త్ర ప్రకారం ‘కవికర్మమ్ కావ్యమ్’ కవి కలం నుంచి జాలువారిన అపూర్వ సృష్టికావ్యం, కవి ఆత్మీయతలు ఈ పుస్తకంలో ప్రతిఫలిస్తాయి. మొదటి మొగ్గలో…
‘వీధి వీధిలో పూలవనాలనవుతూనే జగమంత బతుకమ్మ సంబరాలు ప్రకృతి పండుగ మన బతుకమ్మ’ అని పేర్కొన్నాడు. దాదాపు వానకాలం పూర్తయినప్పుడు ఈ పండుగ వస్తుంది. చెరువులు, బావులు, నీటితో నిండి రకరకాల పూలతో వీధివీధిలో జరుపుకొనే పండుగ బతుకమ్మ.
‘ప్రకృతి దేవతతానై ఇలలో వెలుస్తూనేప్రతి ఇంటిలో బిడ్డవుతుంది బతుకమ్మ కోవెల లేని ఇలవేల్పు తెలంగాణ బతుకమ్మ’ మాతృస్వామ్య వ్యవస్థలో దేవతయే తప్ప దేవుడి ప్రసక్తి లేదు. సింధు ప్రజలు అమ్మతల్లిని స్త్రీ దేవతగా పూజించారు. తెలంగాణలో గుడిలేకుండా ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న దేవతయే బతుకమ్మ తల్లి.
విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నారు. రస ప్రాధాన్య దృష్టిలో రసవత్తరమైన ఒక మహా వాక్యమే కావ్యమన్నారు.
‘గునుగుపూల సంద్రమే గుంపుగా వచ్చితంగేడు పూలతో దోస్త్ జేస్తుంది బతుకమ్మ ప్రతిరూపాలు గునుగు తంగేడు’. ఈ మొగ్గను చదివినప్పుడు జగన్నాథ పండితరాయలు చెప్పిన ‘రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం’ అన్న మాట గుర్తుకొస్తుంది. రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దాల సమూహమే కావ్యం.
‘ఎంగిలిపూల బతుకమ్మగా మొదలవుతూసద్దుల బతుకమ్మతో సాగిపోతుందితొమ్మిది దినాల పూలజాతర బతుకమ్మ’అని కవి పేర్కొన్నారు.
ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారుచేస్తారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ. ఈ రోజే దుర్గాష్టమిని జరుపుకొంటారు. ఇక్కడ కవి బతుకమ్మ పండుగ మొదలు, చివరను ఒకే మొగ్గలో చెప్పారు.
పాశ్చాత్య విమర్శకుడు వర్డ్స్వర్త్ అన్నట్లు ‘ప్రశాంత మానసిక స్థితిలో ఉద్రిక్తత నుంచి ఆవిర్భవించే తీవ్ర అనుభూతుల స్వచ్ఛంద విజృంభణమే కవిత్వం’. ఈ కవి కలం నుంచి జాలువారిన కవిత్వం నిండా గాఢమైన అభివ్యక్తీకరణలు కొట్టొచ్చినట్లు కన్పిస్తాయి.
ఒకచోట ‘గాయపడిన గుండె దరువు బతుకమ్మ ఆదెరువు’ అంటాడు. మరోచోట ‘సబ్బండ వర్గాల స్వాతిముత్యం’ బతుకమ్మ అంటూనే మరోచోట ‘తంగేడు వర్ణము తనువెల్ల బంగారం’ అంటూ పదాలకు చిత్రికలు పడుతారు. మన మనో యవనికపై బతుకమ్మను అద్భుతంగా ఆవిష్కరిస్తాడు’.
‘ప్రశాంత మానసిక స్థితిలో ఉద్రిక్తత నుంచి ఆవిర్భవించే తీవ్ర అనుభూతుల స్వచ్ఛంద విజృంభణమే కవిత్వం’
తూర్పింటి నరేష్ కుమార్: 81848 67240