ఇన్స్పెక్టర్ రుద్ర అడిగిన ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పిన ఏఐ అవతార్ డీయాక్టివేట్ కావడంతో పాటు ఘోరకలికి కూడా ఫుల్స్టాప్ పడింది. కానీ, ఆకాశంలో అంతలోనే ఏదో అలజడి మొదలైంది. దీంతో ఏమవుతుందోనని రుద్ర అండ్ టీమ్ ఆందోళనగా చూస్తుండగా.. అంతకుముందే ప్రీ-రికార్డెడ్ చేసిన వాయిస్ ఓవర్ ఒకటి ఆన్ అయ్యింది. ‘రుద్ర.. మరేం భయపడకు. నేనే ఏఐ అవతార్‌ను. ఏంటీ? డీయాక్టివేట్ అయిన అవతార్ మళ్లీ ఎలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? మరేంలేదు. ఒకవేళ, నువ్వు నన్ను ఓడించి డీయాక్టివేట్ చేస్తే, చివరగా నిన్ను ఓడించాలని.. చచ్చాక కూడా ఆశ చావని నేను ఇలా చివరికి ఒక్కసారి ప్రీ-గేమ్‌ను సెట్ చేశా’ అని వినిపించింది.
‘రుద్ర అవతార్ ఇంకా చెబుతూ.. ‘ఈ గేమ్ నువ్వు గెలిచావో.. ఇక అంతా శుభమే. ఒకవేళ, ఓడిపోయావో.. ఈ ప్రపంచమే నాశనమయ్యే విషం ఉబికివస్తుంది. ఈ కారులో ఒక శివ లింగం ఉంది చూశావా? ఆనాడు సృష్టిని కాపాడటానికి ఆ మహాశివుడు హాలాహలాన్ని తాగి నీలకంఠుడు అయ్యాడు. ఇప్పుడు నువ్వు ఓడిపోయావో.. అదే శివుడు ఈ ప్రపంచాన్ని తన విషజ్వాలతో నాశనం చేసే ప్రళయకాల రుద్రుడు అవుతాడు. ఎలాగో అర్థం కావట్లేదా? బయోకెమీ క్రియేచర్ దశ కోసం వైరస్‌ను సిద్ధంచేయడానికి ముందు ట్రయల్స్ చేశారు. ఆ ట్రయల్ శాంపిల్ ఈ లింగంలో నేను భద్రపరిచా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఉన్న చోటు నుంచి కొంత దూరంలో నూటొక్క లింగాలను ప్రతిష్ఠించారు. ఆ లింగాల నడుమ ఈ కారులోని లింగాన్ని 8 నిమిషాల్లోపు వెళ్లి ప్రతిష్ఠించు. ఒకవేళ, ఆలస్యమయ్యిందో.. కారులోని వైరస్ నింపిన లింగం బద్దలై.. ఈ సృష్టినే కబలించే మహమ్మారిగా మారుతుంది. మరి, ఎక్కడ ప్రతిష్ఠించాలో నీకు క్లూ ఇవ్వాలిగా.. జాగ్రత్తగా విను!’ అంటూ ఆ వాయిస్ ఓవర్ చెప్తూ పోతుంది. రుద్ర అండ్ టీమ్ ముఖానికి పట్టిన చెమటలను తుడుచుకొంటూ ఆందోళనగా వింటున్నారు.
‘రుద్ర.. ఎక్కడైతే, బయోకెమీ క్రియేచర్ను నువ్వు కట్టడి చేశావో.. ఆ పుణ్యక్షేత్రానికి, ఇప్పుడు నువ్వు వెళ్లాల్సిన ప్రాంతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. పురాణాల ప్రకారం.. బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయల్దేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగుట్టుకునేందుకు రుషుల సూచనల మేరకు రాముడు దేశంలోని పలు ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించాలని తలంచాడు. అలా ఇప్పుడు నువ్వు వెళ్లాల్సిన ప్రాంతానికి వచ్చిన ఆ శ్రీరాముడు.. అక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడయ్యాడు. ఈ క్రమంలో అక్కడే ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిశ్చయించుకొన్నాడు. మంచి ముహూర్తం నిర్ణయించాలని మహర్షులను కోరాడు. ముహూర్తం ఖరారైంది. ఇక, శివలింగాన్ని సిద్ధం చేయడమే మిగిలింది. దీంతో మహర్షుల సూచనల మేరకు కాశీ క్షేత్రం నుంచి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు రాముడు. ఆ ఆజ్ఞను అందుకొన్న హనుమంతుడు అక్కడికి చేరుకొన్నాడు. అయితే, ఆ కాశీ విశ్వేశ్వరుడు హనుమంతుడికి నూటొక్క లింగాల రూపంలో దర్శనమిచ్చాడు. దీంతో దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేక.. ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి.. మొత్తం నూటొక్క లింగాలతో ఆకాశ మార్గాన నువ్వు ఇప్పుడు వెళ్లాల్సిన ప్రాంతానికి బయల్దేరాడు హనుమంతుడు.
అయితే, అప్పటికే మహర్షులు నిర్ణయించిన ముహూర్తం ముగిసిపోతుండటంతో సీతారాములు పరమశివుడిని ప్రార్థించారు. వారికి పరమేశ్వరుడు శివలింగరూపంలో దర్శనమివ్వగా ఆ శివలింగాన్నే సీతారాములు ప్రతిష్ఠించి అభిషేకం చేశారు. ఇంతలో హనుమంతుడు నూటొక్క శివలింగాలతో వచ్చాడు. ‘స్వామీ.. వీటిలో మీకు కావాల్సిన శివలింగాన్ని ప్రతిష్ఠించండి. మిగతా వాటిని కాశీలో పెట్టేసి వస్తా’ అని రాముడితో అనగా.. ‘హనుమా.. నువ్వు రావడం ఆలస్యమవడంతో పరమేశ్వరున్ని ప్రార్థించాను. స్వామి లింగరూపుడుగా ప్రత్యక్షం కాగా ఆ లింగాన్నే ప్రతిష్ఠించాను’ అని శ్రీరాముడు బదులిచ్చాడు. తాను తెచ్చిన శివలింగాల్లో ఏ ఒక్కటీ రాముడికి ఉపయోగపడలేదనే కోపంతో కూడిన ఆవేదనతో హనుమంతుడు నూటొక్క శివలింగాలను తన తోకతో చుట్టి విసిరేశాడు. అవి నువ్వు వెళ్లాల్సిన ప్రాంతం పరిసరాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పుడు రాముడు హనుమంతుడిని శాంతిపజేసి ‘ఈ క్షేత్రం ఇప్పటి నుంచి ఆ చంద్రతారార్కం నీ పేరుతో ప్రసిద్ధి చెందుతుంది’ అని వరమిచ్చాడు.
రుద్ర.. ఇప్పుడు 8 నిమిషాల్లో నువ్వు ఆ ప్రాంతానికి వెళ్లి ఈ లింగాన్ని ప్రతిష్ఠించాలి. లేకపోతే, ఏమౌతుందో తెలుసుగా! గుడ్‌లక్.. హియర్ ఏఐ అవతార్ సైనింగ్ ఆఫ్..’ అంటూ వాయిస్ ఓవర్ ఆగిపోయింది. వాయిస్ ఓవర్ ముగియకముందే, ఎక్కడికి వెళ్లాలో అప్పటికే రుద్రతో పాటు టీమ్ మెంబర్స్ అందరికీ అర్థమయ్యింది. అప్పటికే, డీసీపీ సత్యనారాయణ హెలికాప్టర్ సిద్ధం చేయడంతో.. 8 నిమిషాలకు ముందే రుద్ర టీమ్ ఆ ప్రాంతానికి చేరుకొని లింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పటికే సాయంత్రం కాసాగింది. పడమటి సూర్యుడి కిరణాలు.. రుద్ర అంట్ టీమ్‌పై విజయ ఆశీస్సులను వెదజల్లాయి. అది పక్కనబెడితే, రుద్ర ఆ లింగాన్ని ఏ ప్రాంతంలో ప్రతిష్ఠించినట్టు?
సమాధానం: రుద్ర అండ్ టీమ్ హైదరాబాద్ శివారులోని కీసర గుట్టకు హెలికాప్టర్లో చేరుకొని లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ కొండపై 101 లింగాలు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. సీతారాములు ప్రతిష్ఠించారు కాబట్టే, క్షేత్రంలోని స్వామిని శ్రీరామలింగేశ్వస్వామిగా పిలుస్తారు. హనుమంతుడి పేరు మీదుగా దీన్ని కేసరిగిరిగా పిలిచేవారు. కాలంగడిచిన కొద్దీ కీసరగా మారింది.