How to Earn Money | మీ చేతిలో చేపలు పట్టే వల ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎక్కడ విసురుతున్నారన్నదీ ముఖ్యమే. కాలువలో వల వేస్తే.. పిల్లచేపలే పడతాయి. చెరువులో వేస్తే ఓ మోస్తరు చేపలు పడతాయి. అదే సముద్రమైతే.. టన్నుల కొద్దీ మత్స్య సంపదంతా మీదే. సంపాదనకూ ఈ పోలిక వర్తిస్తుంది. ఎక్కడా రాజీపడకుండా.. మీ వలను సముద్రం మీదికే విసరండి. ఏదో ఒకరోజు ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరిపోతారు.
ఒక వ్యక్తి తన సమయాన్నీ శ్రమనూ అందించడం ద్వారా, ఒక వ్యాపార సంస్థ వస్తుసేవలను సమకూర్చడం ద్వారా, ఒక వ్యాపారవేత్త పెట్టుబడి పెట్టడం ద్వారా.. ప్రతిఫలంగా పొందే డబ్బే ఆదాయం. ఉద్యోగులు జీతాల పేరుతో, వృత్తి నిపుణులు ఫీజులు లేదా పారితోషికాల రూపంలో ఆదాయాన్ని సంపాదిస్తే, వ్యాపారులు తాము అందించే వస్తుసేవల వ్యయానికి కొంత లాభాన్ని జోడించి విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. ‘కూటి కోసం కోటి తిప్పలు’ అన్నట్టు ఉద్యోగం, వృత్తి , వ్యాపారం.. ఏ పనిచేసినా మనిషి లక్ష్యం సంపాదనే. డబ్బు సంపాదించే మార్గాలు స్థూలంగా మూడు రకాలు.. క్రియాశీల ఆదాయం, నిష్క్రియా ఆదాయం, పోర్టుఫోలియో ఆదాయం.
వ్యసనం మనిషిని అన్నివిధాలా బలహీనుడిని చేస్తుంది. ఆర్థికంగా దెబ్బతీస్తుంది. వ్యసనపరుడైన ఏ వ్యక్తీ సంపాదనాపరుడు కాలేడు. సంపాదించినా, ఆ డబ్బు ఎంతోకాలం నిలబడదు.
సంపాదన కోసం ఒక వ్యక్తి ప్రత్యక్షంగా తన సమయాన్ని, శక్తిని వినియోగిస్తే.. ఒక వ్యాపార సంస్థ ప్రత్యక్షంగా వస్తుసేవలను అందిస్తే.. తద్వారా వచ్చేదే క్రియాశీల ఆదాయం. ఈ పద్ధతిలో పనిచేసిన సమయానికి మాత్రమే ఆదాయం పొందుతారు. ఏ కారణం చేతనైనా పని చేయలేకపోతే ఆ మేరకు ఆదాయాన్ని కోల్పోతారు. క్రియాశీల ఆదాయాన్ని సంపాదన ద్వారా వచ్చిన ఆదాయం, లాభాల ద్వారా వచ్చిన ఆదాయం.. అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
మీరు ఉద్యోగి లేదా వృత్తి నిపుణుడు అయితే.. మీ శ్రమకు, మీరు వెచ్చించిన సమయానికి బదులుగా పొందే డబ్బును ‘సంపాదన ద్వారా ఆదాయం’ అంటారు. క్రియాశీల ఆదాయంలో ఉద్యోగులకు వేతనాలు, జీతాలు, బోనస్‌తో పాటు కమీషన్ల రూపంలో సొమ్ము వస్తుంది. వృత్తి నిపుణులకు.. ఫీజులు, రెమ్యునరేషన్ పేరుతో చెల్లింపులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, టీచర్లు, లెక్చరర్లు, సాఫ్ట్వేర్ నిపుణులు.. ఇలా ఒక సంస్థలో అటెండర్ మొదలు సీఈఓ స్థాయి వరకు అందరూ ఉద్యోగులే. ఇక వృత్తి నిపుణుల విషయానికి వస్తే లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వైద్యులు, సినిమా కళాకారులు.. అందరూ ఈ విభాగంలోకే వస్తారు.
ఒక వ్యక్తి లేదా వ్యాపార సంస్థ తమ వస్తుసేవలను ఉత్పత్తి వ్యయం కంటే అధిక ధరకు విక్రయించడం ద్వారా సంపాదించే ఆదాయాన్ని ‘లాభాల ద్వారా ఆదాయం’ అంటారు. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడిపే వ్యక్తి, కిరాణా దుకాణం యజమాని, సంతలో దుస్తుల వ్యాపారి మొదలు పెద్దపెద్ద కార్పొరేట్ లీడర్ల వరకూ ఈ పరిధిలోకే వస్తారు. ఈ పద్ధతిలో అమ్మకాలు లేకపోతే ఆదాయం ఉండదు. ఏదైనా కారణంతో కొన్నిరోజులు వ్యాపారాన్ని తాత్కాలికంగా మూసేస్తే.. ఆ మేరకు ఆదాయాన్ని కోల్పోవాల్సిందే.
పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. కన్నవారి ఆర్థిక ప్రవర్తన బిడ్డలను కూడా ప్రభావితం చేస్తుంది. పెద్దలు ఖర్చుపెట్టే తీరునుబట్టే పిల్లలూ ఖర్చు చేస్తారు.
ఇది క్రియాశీలం కాని ఆదాయం. పనిచేయకుండానే పొందే ఆదాయాన్ని నిష్క్రియా ఆదాయమని అభివర్ణిస్తారు నిపుణులు. ‘మీరు నిద్రపోతూ కూడా సంపాదించండి!’ అనీ సలహా ఇస్తుంటారు. నేరుగా మీ సమయంతో సంబంధం లేకుండా, అన్నివేళలా మీ ప్రత్యక్ష ప్రమేయం అవసరం లేకుండానే.. సంపాదించగలిగే ఆదాయాన్ని నిష్క్రియా ఆదాయం అనవచ్చు. నిష్క్రియా ఆదాయమంటే, అసలేమీ పనిచేయకుండా డబ్బులు సంపాదించడం కాదు. ఆదాయం పొందడానికి మళ్లీమళ్లీ పని చేయాల్సిన అవసరం లేకుండా, ప్రతిసారీ మనం ఆ పనిలో ప్రత్యక్షంగా పాల్గొనే అవసరం లేకుండా సంపాదించడం అన్నమాట. ఈ ఆదాయానికి అనేక మార్గాలు..
ఫలానా వ్యాపారం మీద అవగాహన లేకపోయినా.. రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా.. కేవలం పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ వ్యాపారంలో భాగస్వామిగా మారిపోవచ్చు, ఆదాయాన్ని పొందవచ్చు. అలాంటివారిని స్లీపింగ్ బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఈ తరహా భాగస్వామ్యాన్ని ఎంచుకునే ముందు.. ఆ వ్యాపార చట్టబద్ధత, లాభనష్టాలు, భాగస్వాముల వ్యాపార సామర్థ్యం, వ్యక్తిత్వం, నీతీనిజాయతీల గురించి తెలుసుకోవాలి. లోపాలు లేని అగ్రిమెంట్ చేసుకోవడమూ ముఖ్యమే. అప్పటికప్పుడు కుదరకపోవచ్చు కానీ, సమీప భవిష్యత్తులో అయినా ఆ వ్యాపార స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయానికి వస్తే మీ ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీని అద్దెకు ఇవ్వడం ద్వారా, ఖాళీ స్థలాల్లో తాత్కాలిక భవనాలను నిర్మించి వేర్‌హౌస్ లేదా రిటైల్ వ్యాపారాల కోసం లీజ్‌కు ఇవ్వడం ద్వారా, పార్కింగ్ స్థలంగా వాడుకోవడానికి అనుమతి ఇవ్వడం ద్వారా.. అద్దె లేదా లీజ్ రూపంలో ఆదాయాన్ని పొందవచ్చు. రియల్ ఎస్టేట్ స్థలాన్ని కొనుగోలు చేయడానికి, దానిని అభివృద్ధి చేయడానికి మీరు పెట్టిన పెట్టుబడే మీరందించే విలువ. అయితే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఉంటాయి. వీటిని ఆస్తి ఆదాయం నుంచి తీసివేసినపుడు వచ్చేదే నికర నిర్వహణ ఆదాయం. కాకపోతే భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా పక్కా అగ్రిమెంట్ చేసుకోవడం మాత్రం మరిచిపోకూడదు. లేకపోతే ఇబ్బందులు తప్పవు.
మీదైన ప్రతిభతో ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశారని అనుకుందాం. ఆ సాంకేతికత సాయంతో ఒక కంపెనీ తమ వస్తుసేవలను మార్కెట్లో విక్రయించడం ద్వారా లాభాలు పొందే అవకాశం ఉందనీ అనుకుందాం. ఆ టెక్నాలజీని ఉపయోగించుకునే హక్కులను మీరు ఆ కంపెనీకి దఖలు పరిచినందుకుగాను ఆవిష్కర్త హోదాలో మీకు ఆ కంపెనీ రాయల్టీ చెల్లిస్తుంది. ఇక్కడ టెక్నాలజీ అభివృద్ధి చేయడమే మీరు అందిస్తున్న విలువ. అది యంత్ర పరికరాలు కావచ్చు, యాప్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు. పుస్తకాలు రాయడం, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం తదితర మార్గాల్లో కూడా రాయల్టీ ఆదాయం పొందవచ్చు.
ఆధునిక టెక్నాలజీ మనకు అందించిన సరికొత్త ఆదాయ మార్గం సోషల్ మీడియా. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్.. అత్యుత్తమ ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. అంతెందుకు, యూట్యూబ్‌లో ఎవరైనా సులభంగా, ఉచితంగా అకౌంట్ ఓపెన్ చేసి వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. మీ చానల్‌కు సబ్‌స్ర్కైబర్లు ఎంత పెరిగితే అంత ఆదాయం. వీక్షణలు పెరిగే కొద్దీ రాబడీ పెరుగుతుంది. ఇంట్లో చేసుకునే వంటలు మొదలు ట్రావెల్ వీడియోలు, జానపద పాటలు, మ్యూజిక్ ఆల్బమ్స్, కామెడీ స్కిట్స్, షార్ట్‌ఫిల్మ్‌లు, స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు, గార్డెనింగ్ .. ఇలా ఒకటని కాదు ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్లు క్రియేట్ చేసి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. పెద్దగా చదువుకోని వాళ్లు, టెక్నాలజీ మీద అంతగా అవగాహన లేనివాళ్లు కూడా యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోలు, కామెడీ బిట్లు, జోక్స్ వీడియోలు చేసి లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అధిక సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన సెలెబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో వివిధ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ.. ఆదాయాన్ని పొందుతున్నారు.
కొందరికి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. సరికొత్త దృష్టికోణంలో కళాత్మకంగా ఫొటోలు తీస్తారు. వాటిని సోషల్ మీడియాలో పెడతారు కూడా. అక్కడితో ఆగిపోకుండా.. స్టాక్ ఫొటోలను అమ్మే వెబ్సైట్లకు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఏదైనా అంశం మీద విస్తృత సమాచారం అందించే వెబ్సైట్ లేదా యాప్ క్రియేట్ చేసి గూగుల్ యాడ్స్ ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు.
మీ ఆలోచనలు ఆకాశంలో ఉన్నా పాదాలు నేలమీదనే ఉండాలి. మీ ఆలోచనలు లోతుగా, విస్తృతంగా ఉండాలి కానీ, జీవితాన్ని మాత్రం సరళంగా ఉంచుకోవాలి.
సాధారణంగా కాగితం ఆస్తులైన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, నగదు, నగదుతో సమానమైన ఎక్సేంజ్ ట్రేడ్ ఫండ్స్ (ETF), డిజిటల్ ఆస్తులైన క్రిప్టోకరెన్సీలు, నాన్-ఫంగిబుల్ టోకెన్ (NFT) లను పోర్ట్‌ఫోలియో ఆస్తులుగా పరిగణిస్తుంటారు. కానీ, ఒక పోర్ట్‌ఫోలియోలో రియల్ ఎస్టేట్, ఆర్ట్స్, ప్రైవేట్ పెట్టుబడులతో సహా విస్తృత శ్రేణి ఆస్తులు ఉండవచ్చు. ఈ ఆస్తులలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్జించే ఆదాయాన్ని పోర్ట్‌ఫోలియో ఆదాయం అంటారు. ఈ ఆదాయాలు మూడు రకాలు.
మ్యూచువల్ ఫండ్స్, వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్స్ మొదలైన ఆస్తుల విలువ, మీరు పెట్టిన పెట్టుబడి కంటే అధికంగా పెరిగినపుడు దాన్ని మూలధన లాభం అంటారు. ఇలాంటి లాభాలను స్వల్పకాల లేదా దీర్ఘకాలిక లాభాలుగా వర్గీకరించి, ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆస్తి కొనుగోలు ధరతో పోలిస్తే ఆస్తి విలువ తగ్గినప్పుడు మూలధన నష్టం కూడా జరుగుతుంది. కానీ, ఆ ఆస్తిని విక్రయించినప్పుడు మాత్రమే మూలధన లాభం లేదా నష్టంగా పరిగణిస్తారు. వాస్తవంగా ఆస్తిని విక్రయించకుండా ఆస్తుల విలువలో ఏర్పడే పెరుగుదల లేదా తగ్గుదలను ‘పేపర్ లాభనష్టాలు’ అంటారు. పేపర్ లాభనష్టాలు ఆస్తుల విలువలో పెరుగుదల లేదా తగ్గుదలను ప్రతిబింబిస్తాయి. కానీ పన్ను విధించదగ్గ మూలధన లాభంగా లేదా పన్ను రాయితీ పొందే అవకాశం ఉన్న నష్టాలుగా పరిగణించలేం. పైన తెలిపిన ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ద్వారా మూలధన లాభాల రూపంలో ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
ఒక కంపెనీ ఒక నిర్ణీతకాలంలో ఆర్జించిన లాభాలను కంపెనీ వాటాదారులకు చెల్లించడాన్ని డివిడెండ్ అంటారు. డివిడెండ్ ప్రకటించే సమయానికి మీరు ఆ కంపెనీ షేర్స్ కలిగి ఉన్నట్లయితే డివిడెండ్ల ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు.
బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలలో కలిగి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల మీద, బాండ్ల మీద ఆర్జించే ఆదాయాన్ని వడ్డీ ఆదాయం అంటారు. భారతదేశంలో కొన్ని బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలో ఉన్న నగదు మీద కూడా వడ్డీ చెల్లిస్తున్నాయి. ఎన్ని మార్గాలున్నా.. మనదైన ప్రణాళిక కూడా ముఖ్యమే. ప్రణాళికలేని ప్రయత్నం.. వ్యూహం లేని యుద్ధం లాంటిది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లగలననే నమ్మకమే ఆర్థిక విజేత అసలైన పెట్టుబడి.
మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు. కాబట్టి, మీ ఆలోచనల మీద పట్టు సాధించండి. ఆలోచనే ఆచరణ. ఆచరణే విజయం.
ఒక ఆటలో విజయం సాధించాలంటే ముందుగా ఆట నియమాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత, ఇతరులకన్నా మిన్నగా ఆడాలి. అప్పుడే విజయం సాధిస్తాం. అలాగే, ఆర్థిక ప్రపంచ నియమ నిబంధనలను అర్థం చేసుకుని, వాటినే అస్ర్తాలుగా మార్చుకుంటే కుబేరత్వం అసాధ్యమేమీ కాదు. ఆర్థిక పరమపద సోపానానికి తొమ్మిది మెట్లు..
ఒకవ్యక్తి ఆర్థిక విజయానికి విద్య అత్యవసరం. ప్రపంచంలో ఏ దేశ విద్యా వ్యవస్థలో అయినా ప్రధానంగా ప్రభుత్వ, పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో పనిచేయడానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేలా సిలబస్ రూపొందిస్తారు. కానీ ఆర్థికంగా ఎదగాలని అనుకునేవారు ఆర్థిక విద్యనూ అభ్యసించాలి. పొదుపు-మదుపు సూత్రాలను ఆకళింపు చేసుకోవాలి. కరెన్సీ ఆత్మను పట్టుకోవాలి.
కెరీర్ ఎంపిక విద్యార్థి జీవితంలో ముఖ్యమైన మలుపు. విద్యార్థి దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. ఎంచుకునే సబ్జెక్టులు, కోర్సులు, ఇన్స్టిట్యూషన్లు, యూనివర్సిటీలలో చదివే చదువులు జీతభత్యా లను, ఆంత్రప్రెన్యూర్‌షిప్ అవకాశాలను నిర్ణయిస్తాయి.
కష్టపడి పనిచేయడం కెరీర్లో ఎదుగుదలకు కొంతవరకే సహాయపడుతుంది. కానీ, మిమ్మల్ని పైస్థాయికి తీసుకెళ్లడానికి అదొక్కటే సరిపోదు. ఎక్కడ కష్టపడి పనిచేస్తే వేగంగా ఎదుగుతామనేది కూడా తెలిసి ఉండాలి. లేదంటే, సంపాదనలో వెనుకబడిపోతారు. నైపుణ్యం ఉన్నా, ఎంతో కష్టపడుతున్నా ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదంటే.. మీరు ఎంచుకున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను సమీక్షించుకోవడం అవసరం. ఎందుకంటే మీ ఎదుగుదల బాధ్యత పరిపూర్ణంగా మీదే.
అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లడం తప్పేం కాదు. కొన్నిసార్లు అనివార్యం కూడా. భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు ఉన్నత చదువుల్లోనూ, సంపాదనలోనూ అమెరికన్ల కన్నా ముందున్నారు. అమెరికాలోని కుటుంబాల జాతీయ సగటు ఆదాయం 63,922 డాలర్లు అయితే.. భారతీయ కుటుంబాల సగటు ఆదాయం 1,23,700 డాలర్లుగా ఉండటం గమనార్హం. పలు దిగ్గజ కంపెనీలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈఓ)గా భారతీయులను, భారత మూలాలున్న వారిని నియమించడం ఇప్పటి విషయం కాదు.
దూరదృష్టి అనేది అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచంలో ఏ రంగంలో అయినా గొప్పగొప్ప విజయాలు సాధించిన వారిలో కనిపించే లక్షణం.. దూరదృష్టి కలిగి ఉండటం, భవిష్యత్తును అంచనా వేయడం. ఆర్థిక ప్రపంచంలో కూడా గొప్ప కంపెనీలను స్థాపించిన వారిలో, అపార మైన సంపద సృష్టించిన వారిలో కూడా ఈ లక్షణాలు ఉంటాయి.
నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే.. ఈ సమాజమే ఒక విద్యాలయం, మనకు తారసపడే వ్యక్తులే గురువులు. ఓపెన్ మైండ్ కలిగి ఉండటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, వాటి ద్వారా కొత్త ఆలోచనలు రేకెత్తుతాయి, అవే నూతన ఆవిష్కరణలకు దారితీస్తాయి.
అది కుబేరత్వమైనా, దారిద్య్రమైనా.. ఈరోజు మీరున్న స్థితికి మీ ఆలోచనలే కారణం. కాబట్టి మీ ఆలోచనలను మీ నియంత్రణలో ఉంచుకోండి. ‘మన ఆలోచనలే మనల్ని తయారుచేశాయి; ఆలోచనలు జీవిస్తాయి; అవి చాలా దూరం ప్రయాణిస్తాయి. కాబట్టి, మీరు మీ ఆలోచన పట్ల జాగ్రత్త వహించండి’.
ఎదిగే క్రమంలో చిన్నచిన్న తప్పులు సహజం. ఆ తప్పులు చేసిన తర్వాత మీరేం చేస్తారన్నది మాత్రం కచ్చితంగా మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇక్కడే విజేతలకు, పరాజితులకు మధ్య స్పష్టమైన తేడాను గుర్తించవచ్చు. విజేతలు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు. తాము చేసిన తప్పును ఒక అనుభవంగా తీసుకుంటారు. ఒకసారి తమ తప్పును గుర్తించాక వాటిని ఎలా సరిదిద్దుకోవాలి లేదా వాటి నుంచి ఏం నేర్చుకోవాలి అన్నదానిపై విజేతలు దృష్టి పెడతారు.
విజేతలలో ఉండే మరో ముఖ్య లక్షణం.. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా, తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నిస్తూ ఉండటం. అవరోధాలు ఎదురవగానే, ఒక్కసారి అపజయం పాలవగానే పరాజితులు తమ ప్రయత్నాలను విరమిస్తారు. కానీ, విజేతలు అపజయానికి కారణాలను తెలుసుకుంటూ, వాటిని సరిచేసుకుంటూ, అడ్డంకులను అధిగమిస్తూ, అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఓపికగా ప్రయత్నిస్తూనే ఉంటారు. వీళ్లే చరిత్రలో నిలిచిపోతారు, చరిత్ర సృష్టిస్తారు.
ఇవే కాదు.. ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. మీకు నచ్చిన మార్గాలతో ఓ జాబితా రాసుకోండి. వీలైనన్ని ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నం చేయండి. కానీ, చట్టాన్ని అతిక్రమించకండి. దొడ్డిదారిలో ఇట్టే సంపన్నులు అయిపోవచ్చు. కానీ, ఆ వైభవం కొన్నాళ్లే. మీ దారి రహదారి కావాలి. మీరు సంపాదించే ప్రతి పైస వెనుకా మీ శ్రమ, నైపుణ్యం కనిపించాలి. లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు!
ఆలోచన మారితే జీవితం మారుతుంది
రచన: నాగరాజు మున్నూరు
పేజీలు: 246; వెల: రూ. 499,
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
ఫోన్: 9948935484
ఆ దేశాల్లో కీలక స్థానాల్లో మన భారతీయులే.. జనం మెచ్చిన ఆ నేతలు వీళ్లే