ఇల్లు అనేది వ్యవహార స్వరూపం. అది ఒక ప్రకృతి యంత్రం. దిశలు – కొలతలు దాని ఇంధనం. ఇంటి విషయంలో కేవలం ఏదో పైనపైన భావాలతో అల్పంగా ఆలోచించకూడదు. అది నిర్మాణ శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. మొక్కుబడిగా, తూతూ మంత్రంతో ముడిపెట్టేది కాదు. తెలిసీ – తెలియక చెప్పే మేధావులు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ఇంటి విషయంలో అది సరైన చర్యకాదు. గృహంలో నైరుతిలో ద్వారం ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఎన్నో వైపరీత్యాలు జరుగుతుంటాయి. అది ప్రకృతి శాసనం. గుండెకు రంధ్రం ఉన్నవాడు.. పరుగుపందెంలో పాల్గొనలేడు. ఎత్తయిన ప్రదేశాలను చేరుకోలేడు. ఆ లోపం సవరించినప్పుడు.. అతను మామూలు వ్యక్తిగా అన్ని చర్యలూ చేయగలడు. ఇల్లు కూడా అంతే! కేవలం తోరణ వైద్యంతో పూర్తి ఫలితాన్ని అందుకోలేం. ఇంటికి ఓ పక్క వీధిశూల ఉంటే.. ఆ లోపాన్ని సవరించకుండా, ధాన్యాలు కడితే, ధ్యానాలు చేస్తే సరిపోదు. సర్జరీ చేయకుండా రోగం ఎట్లయితే నయం కాదో.. ఇల్లు మార్పులు చేయకుండా శుభగృహం కాదు. యజమానికి ఇల్లు విజయాన్ని ఇవ్వాలి.
ఎవరు ప్లాను ఇచ్చినా.. యజమానికి ఇష్టమైన ప్లాను మాత్రమే ఇల్లుగా నిలుస్తుంది. ఆర్కిటెక్టులు ప్లానులు ఇస్తే.. దానిని ఆ గృహ సభ్యులు ఇష్టపడితే, తప్పకుండా కట్టుకోవచ్చు. ఇందులో వాస్తు పండితుల అభ్యంతరం ఏముంటుంది? శాస్త్ర ఆమోదం కూడా ఇంటికి అవసరమని యజమాని అనుకున్నప్పుడు.. ఆ ప్లానును వాస్తు పండితులకు చూపిస్తాడు. అప్పుడు అందులో శాస్త్ర ప్రకారం ద్వారాలు, గదుల విభజన, గాలి – వెలుతురు అన్నీ అనుకూలంగా ఉండేలా పండితులు మారుస్తారు. ఇది ఆర్కిటెక్టులు ఇచ్చిన ప్లాను వద్దని కాదు. అది చెల్లదని కూడా కాదు. శాస్త్ర సవరణలు చేస్తారు. ఏది, ఎవరు, ఎలా సవరించినా.. యజమాని ఇష్టానుసారమే కదా జరిగేది. కొందరు ఆర్కిటెక్టులు చాలా గొప్పగా శాస్త్ర హృదయాన్ని ఎరిగి ఇంటి ప్లాను ఇస్తారు. దాంట్లో మార్పులు అవసరమే ఉండవు. అలాంటప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. వాస్తు పండితులు కూడా ఇంటి ప్లానులు ఇస్తారు. ఎవరు ఏది చెప్పినా.. యజమాని బాగుకోసమే కదా!?
తప్పకుండా కట్టుకోవచ్చు. తాటికమ్మలతో, తాటిపట్టెలతో.. మట్టిగోడలతో మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఒకనాడు స్థానికంగా లభించే వస్తు సముదాయంతో ఇండ్లు కట్టేవారు. తడకలతో ఇంటికి ప్రహరీలు ఏర్పాటు చేసుకునేవారు. బండ రాళ్లతో కూడా ఇంటికి హద్దులు నిర్మిస్తారు. ఇవి తప్పుకాదు. కొన్ని ప్రాంతాలలో షాబాద్ బండలతో ఇంటి కప్పులు వేస్తారు. కమ్మలతో, పెంకులతో వేస్తారు. చొప్పతో కూడా ఇల్లు కప్పుతారు. ఏ మెటీరియల్ వాడినా, అది ఆ ఇంటికి ఆహ్లాదాన్ని – ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేది ముఖ్యం. రేకుల డబ్బాలు ఇండ్లు కావు. సహజసిద్ధంగా మట్టి, కలప, పెంకులు, చొప్పగడ్డి, తాటికమ్మలు ఇతరత్రా స్థానిక సామగ్రి వాడి, మంచి వాస్తు ఇల్లు కట్టుకోవచ్చు. దోషం లేదు. రుషులంతా అక్కడినుంచే కదా వచ్చారు.
ఏ రాష్ట్రం.. ఆ రాష్ర్టానికి సంబంధించిన ప్రాంత పరిస్థితులు, అక్కడి శీతోష్ణ పరిస్థితుల మీద.. అక్కడి ప్రజల జీవనరీతులు ఆధారపడి ఉంటాయి. వారి మనోభావాలు ఉంటాయి. అలా ఒక్కో దేశం, ఒక్కో రాష్ట్రం దాని వాతావరణ పరిస్థితులకు తలవంచి ఉంటుంది. చెన్నైలో చాలామంది తూర్పు ద్వారాన్ని ఇష్టపడరు. అక్కడ తూర్పున బంగాళాఖాతం ఉంది. అలాగే ముంబై నగరంలో పడమర ద్వారం పనికిరాదని అక్కడి వారి ఉద్దేశం. వీటన్నిటినీ భౌగోళికంగా అక్కడి పరిస్థితులు శాసిస్తాయి. అది సత్యం కూడా! కొన్ని ప్రదేశాలలో పంచభూతాలలోని ఒక్కో భూతం.. అనగా నీరు, గాలి మొదలైనవి ఎక్కువ లీడ్ చేస్తాయి. అలా సముద్రతీర పట్టణాలు కొన్నిచోట్ల ప్రకృతిసిద్ధమైన స్వభావాలను ప్రేరేపిస్తాయి. కాబట్టి, ఎంతో తేడా ఆయా రాష్ర్టాల మధ్య ఉంటుంది. ఇలా అనేక విభిన్న మార్పులు భూమిపై ఉంటాయి. కాబట్టి, శాస్త్రం అవసరం పడుతుంది. వ్యక్తి – కుటుంబ జీవనం వృద్ధికి అన్నిచోట్లా శాస్త్ర సూచనలు అవసరం.