జరిగిన కథ : రాత్రి రెండవజాములోకి ప్రవేశిస్తున్నది. తన మందిరంలో వెలనాడు నుంచి పృథ్వీశ్వరుడు పంపిన తన వ్యక్తిగత వస్తువులు.. తాళపత్ర గ్రంథాలను సరిచూసుకుంటున్నాడు జాయచోడుడు.
అంతలోనే.. ఎవరో మెట్లు ఎక్కి వస్తున్నట్లు శబ్దం! తలతిప్పి చూశాడు. చివ్వున లేచి నిలబడ్డాడు. ఎదురుగా.. గుమ్మం నిండుగా మహామండలీశ్వరుడు శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి! జాయచోడుని ముఖకవళికలను
మౌనంగా చూస్తూ వెళ్లి.. అక్కడున్న ఉచితాసనంపై విశ్రాంతిగా కూలబడ్డాడు గణపతిదేవుడు.
“గతంలో మాకొక పని అప్పగించావ్. అది ఏమైందో తెలుసుకున్నావా!? మీ అక్కనైనా అడిగావా!? నిన్ను చూడగానే.. అయ్యవంశం వారినందరినీ పేరుపేరునా తలుచుకుంటూ.. పరస్పరం కొత్తకొత్త కబుర్లు, ముచ్చట్లు. ఇక మీ ఇద్దరికీ రాజ్యం.. కుటుంబం.. పిల్లలు.. వాళ్ల పెళ్లిళ్లు.. ఏమి గుర్తుంటాయి?!”.. ప్రశ్నల బాణాలు వదులుతూనే ఉన్నాడు చక్రవర్తి. చేతులు వెనక్కు కట్టుకుని అటూ ఇటూ కదలుతున్నాడు జాయపుడు. ఆయన కదలికల్లో ఆ ముద్రలు, స్థానకాలు, రేచకాలు, కరణులు అదిరిపోతున్నాయి. ఏకపాద లక్షణం.. పాదాల కదలిక.. వళితం.. ఓహో త్రిభంగి.. భలే.. మర్దితం.. ఘట్టితం.. తాడితం!! నృత్తంలో పాద కదలికలు అన్నీ ప్రభువులకు తెలిసినట్లుంది. “పాపాల భైరవుణ్ని నేనొకణ్ని ఉన్నాను కదా.. అతగాడే చూసుకుంటాడని.. మీ ధీమా!”. ఏమిటన్నాడు? పిల్లల పెళ్లిళ్లు అన్నాడు కదూ.. గతంలో తనే గణపాంబ వివాహం ప్రస్తావించాడు. గణపాంబ పెళ్లి నిశ్చయమైంది.
నువ్వొచ్చి పెళ్లి చెయ్యాలని రాశాడేమో.. వచ్చిననాడు అక్క ప్రస్తావించింది కూడా.. ఆరోజు ఆ లేఖను చూడలేదు. మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్. నిశ్శబ్దం మరీ లావవుతున్నది. ఎవరో ఒకరు మాట్లాడకపోతే నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ముక్కుపొడుం పీల్చి కూర్చున్నట్లు ఆయన కిక్కురుమనడంలేదు. తాపీ ముని! పెంచిన గెడ్డం నిమురుకుంటూ కూర్చున్నాడు. ఇక తను మాట్లాడక తప్పదు. “అదే.. అది.. అదే.. ఆ.. ద.. గణ.. అక్క.. సోమ.. లక్క!”.. ఒక్క వాక్యం కుదిరితే ఒట్టు. కొన్ని పదాలు.. పదాలు కూడా కాదు.. కొన్ని శబ్దాలు!! భారంగా లేచాడాయన. హమ్మయ్య నృత్తం ముగింపునకు వచ్చింది.
ఇక యవనిక మౌనంగా వాలును. కదిలాడు. గుమ్మంవైపు తిరిగాడు. అప్పుడు మళ్లీ విశాలంగా సగం వెనుదిరిగాడు. “అవునూ.. మమ్మల్ని ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు మండలీశ్వరా.. మేము చేసిన తప్పు..??”. తప్పుచేసినట్లు ఆయనే అడగడంతో హిమాలయమంత మంచుపర్వతం బుడుంగున పేలి ప్రవహించి అనుమకొండ వరకూ వచ్చేసింది. కానీ, తట్టుకుని నిలబడ్డాడు జాయచోడుడు. “నేనొక డప్పువాద్యగాణ్ని ద్వీపం నుంచి మీకోసం పంపాను. అతణ్ని మీరు గౌరవించకపోగా.. అవమా..” అర్థమై చివ్వున చూశాడు. కళ్లు చికిలించి చూశాడు. “మేమా.. డప్పు కళాకారుణ్ని.. అవమానించడమా..?! ఎప్పుడు ఎక్కడ??”.“మన కళామందిరంలో.
దాదాపు నాలుగు మాసాలనాడు. ఆనాటి సభలో అందరూ అతణ్ని వేళాకోళం ఆడారట. మీరు సైతం..” “ఆ.. గుర్తొచ్చింది. వాడా!? ఆ డప్పువాడు. సరే సరే.. డప్పు కేవలం శ్మశానంలో, గ్రామాల్లో చాటింపునకు వాడే వాద్యం. సంగీత లోకంలో దానికి స్థానంలేదు. వాడు డప్పుతో లయవిన్యాసాలు చేస్తున్నాడు. సరిగమలు వాయిస్తున్నాడు.. బావుంది. కానీ, అది రాజాస్థానపు నాట్యధర్మానికి సరిపోదు జాయా! ఆ దరువులు, జతులు కొంతవరకు ప్రేరణ నృత్తానికి ఉపయోగపడతాయి. సంగీత, నాట్యాలకు.. అబ్బే. సరిపోవు..” ఆయన ఎప్పటిలాగే నిక్కచ్చిగా.. ఓ సామ్రాజ్యాధినేతగా చెప్పేశాడు. కానీ, జాయచోడుని అహం తగ్గడంలేదు. “కానీ.. నేను.. నేను పంపినవాడిని..” ఆయన మాట మారిపోయింది. “ఆగాగు. అతణ్ని నువ్వు పంపావా!? నిజమా!? మాకు ఆ సంగతి తెలియదు. ఎవ్వరూ చెప్పలేదు. అతను కూడా చెప్పలేదే?!”.“అతనికి లేఖ కూడా రాసి ఇచ్చాను”.“అయ్యో.. ఎవ్వరూ ఆరోజు అక్కడ నీ పేరు సైతం ప్రస్తావించలేదు. అతను కూడా..”జాయచోడుడు మౌనంగా నిలబడ్డాడు. రెండు మూడులిప్తల నిశ్శబ్దం.గణపతిదేవుడు అన్నాడు.
“ఆనాడు ఎప్పుడో నీలాంబతో వచ్చి నువ్వు మా ముందు నాట్యం చేయడం మాకు గుర్తొస్తున్నదిప్పుడు. అప్పుడు మేము నీ నాట్యం పట్ల ఎలా స్పందించామో.. ఇప్పుడు అతని కళపట్ల కూడా అలాగే స్పందించాం. నీవు పంపిన కళాకారుడు కాబట్టి అతని ప్రతిభపై నీకు నమ్మకం ఉంది. అయితే ముందు డప్పును శాస్త్రీయ సంగీతానికి అనుసంధానం చెయ్యి. అప్పుడతడు రాజాస్థానపు స్థాయి మార్గి కళాకారుడు అవుతాడు..”
కొత్తగా ఉంది జాయచోడునికి. “మరో మాట. నువ్వు కూసెనపూండి కళాకారులతో చేసిన యుద్ధం అసామాన్యం. చరిత్రలో ఎప్పుడూ ఎవ్వరూ చేయనిది. నీబోటి కళాకారుడైన యుద్ధకోవిదుడు, మండలీశ్వరుడు, స్థాయిపాలకుడు చరిత్రలో మరొకడు లేడు.
భవిష్యత్తులో మరొకడు వస్తాడని అనుకోలేం. కాబట్టి ఆ దేశీ నాట్య, నృత్త, లిఖిత సాహిత్య, సంగీత, గేయ, పాటల ప్రదర్శనను, రచనలను మరింత సానబెట్టి పూర్తిస్థాయి మార్గి కళారూపాలుగా రూపకల్పన చెయ్యి. వాటిని గ్రంథస్థం చేసే బాధ్యత కూడా నీదే సుమా..” కాకతీయ మహాసామ్రాట్టు వెళ్లిపోయాడు. నోరు తెరచి ఉండిపోయాడు జాయచోడుడు. కానీ, ఆయన చేసిన విశ్లేషణాత్మక ఉపదేశం అక్కడ వలయాలు తిరుగుతూ అలా ఉండిపోయింది. చిన్ననాటి నుంచి చూసిన, చేసిన పిచ్చిపిచ్చి చిందులు, అయినవోలులో, నీలాంబ అక్క నాట్యగృహంలో.. దేవాలయాలలో, రాజాస్థానంలో.. వీధులలో.. కులీన నాట్యారామాలలో.. చేసిన చూసిన దేశీ నృత్యాలు, నృత్తాలు, నాట్యాలు.. అన్నిటినీ తీసుకుని కొంత ప్రామాణికం చేసి యుద్ధభూమిలో ప్రదర్శించి మతరక్కసిపై తాత్కాలికంగానైనా ఓ అనూహ్య విజయం సాధించాడు. ఇప్పుడు ఇక్కడే అవన్నీ వలయాలు తిరుగుతూ ఏవేవో కొత్త భావనలకు నిర్దిష్ట రూపాన్ని ఇస్తున్నాయి. అప్పుడే సప్రమాణ గ్రంథరూపం అనే భావన మనసులో మెదిలింది.
మరుక్షణం ఆ భరతముని ఆశీర్వదిస్తున్నట్లు.. భావన దృఢమై ఆలోచన సుస్థిరమయ్యింది. ఆనాటి నుంచి జాయచోడుని ఆలోచనా స్రవంతి పూర్తిస్థాయి మార్గి రూపం తీసుకుంది. నటుడు, నాట్యాచార్యుడు, రూపక, యక్షగాన రచయిత.. ఇప్పుడు గ్రంథకర్త కావాలని నిర్ణయించుకున్నాడు. “గీత వాదిత్య సంగీత త్రయం నాట్య ముచ్యతే” అన్నాడు భరతుడు. కాబట్టి నృత్తంపై ఓ లాక్షణిక గ్రంథం, గేయంపై ఓ లాక్షణిక గ్రంథం, వాద్యాలపై ఓ లాక్షణిక గ్రంథం.. మూడు ప్రామాణిక గ్రంథాలకు శ్రీకారం చుట్టాడు. గ్రంథరచనపై స్పష్టమైన ఆలోచన ఏర్పడ్డాక అక్క సమక్షంలో గణపతిదేవునికి చెప్పాడు. ఇద్దరూ విస్మయానందంతో ఆశీర్వదించి భుజం తట్టారు. కాకతి మురిసిపోయింది. జాయచోడుడు.. ప్రౌఢం స్థిరపడింది. అయినా యవ్వనం శరీరంపై సీతాకోకచిలుకలా తూగాడుతూనే ఉంది.
అనుభవాల కొలిమిలో మనిషిని బాగా కాల్చి అటుతిప్పి ఇటుతిప్పి బలమైన సుత్తి దెబ్బలతో వజ్రాయుధంలా గట్టిపరచింది. తుళ్లింతలా ఉండే నవ్వు నడిసంద్రంలోని కెరటపు సవ్వడిలా గంభీరంగా స్థిరపడింది. నిమ్మపండు ఛాయ కొంచెం వడలి మీగడలో పసుపు కలిపినట్లు ఇంచుకించుక ముదురు తేలింది. జుట్టు అక్కడక్కడా తెల్లబోయి చూస్తుండగా, గుబురు గడ్డపు నలుపు మరికొంత తగ్గింది. ఏవి ఎంతమారినా.. ముఖంలో మాత్రం నృత్త విన్యాస చారణీ చారణుల రామణీయకత చిటికెడు కూడా తగ్గలేదు. ఇప్పటికీ ఎవ్వరెదురైనా జాయచోడుణ్ని తలతిప్పి చూడాల్సిందే! మహిళలైతే వారి మనసు పడే బిడియం శిరస్సు వినదు.
లోతై వెడదలైన లోచనాలు, దృఢమైన దీర్ఘ సమనాసిక, చెవులకు వేలాడే హంస కుండలాలు, పోతపోసిన కాంచన కంఠం, వంగపండు ఛాయ కంచుకం, ఎర్రపట్టు కాసెకోక, వెండివర్ణపు నడబంధం, అందు దోపిన చురక వెండి వొర, వేళ్లకు జ్యోతిషులు నిర్దేశించిన వివిధ అంగుళీయకాలు, ముంజేతికి మణి కంకణాలు, మెడలో మణిమయ పగడాల హారాలు, కాళ్లకు బంగారు అందెలు, తలకు నురగవర్ణపు పట్టు ఉష్నీషం..
“అక్కా! మరీ జాతరలో గంగిరెద్దులా అలంకరిస్తున్నావ్. ఇక చాలు..” అన్నాడు జాయచోడుడు. “కదలకు.. అలంకరణ పూర్తికావచ్చింది..” “ఇకపై నువ్వెప్పుడూ ఈ ఆహార్యంతోనే ఉండాలి. ఆ వీధుల్లో, పొలాలలో, కాలువల వెంట, ఆ పంచముల వాడల్లో తిరగడానికి వీల్లేదు.
పూర్తిగా బావగారిలా నీదైన రాజోచిత కార్యకలాపాలు నిర్వహించాలి..”దవనం, మరువం, మల్లెపూలు, కనకాంబరాలను గుదిగుచ్చి కట్టిన పూలమాలను జాయపుని సిగకు చుడుతూ చెబుతున్నది. నిజమే! వయసు రీత్యా మాత్రమే కాదు. ఇప్పుడు సాధారణ పౌరునిగా తిరగడం కష్టం. పౌరులు తనను బాగా గుర్తుపడుతున్నారు. సైనికస్వాగతం రోజున సైన్యమే కాదు.. సాధారణ పౌరులు కూడా తనను గుర్తుపట్టి జేజేలు పలకడం గుర్తొచ్చింది. తమ్ముని ఇబ్బందిని పట్టించుకోకుండా అతని ఆహార్యాన్ని అలంకరణను నఖశిఖపర్యంతం చూసుకుని తృప్తిగా, దీర్ఘంగా నిట్టూర్చింది.
“ఊ.. ఇప్పుడు మహామండలీశ్వరులు మీ బావగారికి ఆహార్యంలో కాస్త దగ్గరగా వచ్చావు..” అన్నది. “అబ్బా! అంటే ముసలివాడిలా ఉన్నానన్న మాట..” అన్నాడు చిలిపిగా. చివ్వున గావుకేక వేసింది. “ఏమిటన్నావురా..??”. సర్దుకుని.. “కాస్త కుర్రాడిలా చూపాలి కానీ, నీ మొగుడిలా నన్నూ..” మళ్లా నాలిక కరచుకుని..“ఎంతైనా మీవారి కంటే పదేళ్లు చిన్నవాణ్ని కదా. కాస్త కుర్రాడిలా ఉండాలి..” అంటూ కొన్నికొన్ని ఆభరణాలను వేగంగా తీసివేసి, ఆమె తేరుకునేలోగా అక్కణ్నుంచి పరిగెత్తాడు.విభిన్న ఆహార్యంతో, అనేకానేక ఆభరణాలతో నర్తించడం జాయచోడునికి చిన్ననాటి నుంచీ అనుభవమే కాబట్టి.. మంచి ఆహార్యం, అలంకరణ అతనికి ఇష్టమే.
కానీ, మనిషిగా అతను సాధారణ దుస్తులతో ఉండటం మరింత ఇష్టం. ఇప్పుడు రాజప్రాసాదాలలోకి, నిండు పేరోలగాల వద్దకు, నియోగ మందిరాలలోకి వెళ్తే.. ఈ సంపూర్ణ రాజోచిత ఆహార్యంతోనే వెళ్తున్నాడు. అందరూ కళ్లువిప్పార్చి చూస్తున్నారు. వారి దృక్కులలో ఇదే జాయచోడునికి సమంజసమైన ఆహార్యమనే గుర్తింపు కనిపిస్తోంది. “నమస్తే జాయచోడ సాహిణుల వారికి..” రాజప్రాసాదంలో నియోగ విభాగాలను పరికిస్తూ ముందుకుపోతున్న జాయచోడుణ్ని ఎవరో పలకరించారు. తెలియదు. పూర్తిగా కొత్త ముఖం!! “సూరంబొట్లు మమ నామధేయం. రాయప్రోలు సూరంబొట్లు. మహామండలీశ్వరులకు సూతునిగా నన్ను నియమించారు!”. సూతుడా!?
ఆనాడు ఎప్పుడో నీలాంబతో వచ్చి నువ్వు మా ముందు నాట్యం చేయడం మాకు గుర్తొస్తున్నదిప్పుడు.
అప్పుడు మేము నీ నాట్యం పట్ల ఎలా స్పందించామో.. ఇప్పుడు అతని కళపట్ల కూడా అలాగే స్పందించాం.
నీవు పంపిన కళాకారుడు కాబట్టి అతని ప్రతిభపై నీకు నమ్మకం ఉంది. అయితే ముందు డప్పును శాస్త్రీయ సంగీతానికి అనుసంధానం చెయ్యి. అప్పుడతడు రాజాస్థానపు స్థాయి మార్గి కళాకారుడు అవుతాడు.. (సశేషం)