Jaya Senapathi | జరిగిన కథ : ఒకనాడు ఉదయాన్నే.. ఓ గాత్రం.. తంబుర నాదంతో మేళవించి ప్రతిధ్వనిస్తూ జాయపుని చెవిన పడ్డది. ఆ పాడుకుంటూ పోతున్నది ఓ భిక్షుక గాయకుడు.. మాల దాసరి. కాస్త పులకింత కలిగింది జాయపునికి. పొద్దుగుంకే వేళకు దాసరివాళ్లుండే గుడిసెల దగ్గరికి వెళ్లాడు.
అక్కడి రావిచెట్టు మొదట్లో ఉన్న దిమ్మెపై కూర్చున్నాడు. కాస్త అవతలగా మరో రావిచెట్టు. దాని మొదట్లో ఓ చిన్నగుడి. రానురానూ చీకటి ముసురుకుంటుండగా.. ఎవరో మహిళ దైవప్రార్థన చేయడం వినిపించింది. ఆశ్చర్యంగా అటు చూస్తే.. ఆ గ్రామదేవత ఎదుట ఓ వృద్ధ మహిళ పాడుతున్నది. పాడుతూనే చీరె కొంగు నడుంవద్ద దోపి నాట్యానికి సిద్ధమై భంగిమ తీసుకుంది.
“ఓం నమశ్శివాయ..”ఆమె ఆ గ్రామదేవతను శివునిగా గుర్తిస్తూ పాడుతున్నది. విగ్రహం ఏ దేవుడో కానీ.. శివునిగా స్పందన కనబరుస్తున్నది. విస్మయంతో దగ్గరగా వెళ్లిన జాయపుడు.. తనకు తెలియకుండానే లీలగా కదులుతున్నాడు. గ్రీవ (మెడ), కటి (నడుం), త్రిభంగ కదలికలు.. ఆమె జాయపుణ్ని చూసి.. మళ్లీ చూసి.. కళ్లు కదిపి ఆహ్వానించింది. నాట్యమాడమన్నట్లు! అతని శరీరం జలదరించింది. పైనున్న ఉత్తరీయం నడుముకు బిగించి.. స్థానకం తీసుకుని ఆమెతో కాలు కలిపాడు.
ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ స్వామికి రంగభోగ నివేదన సమర్పిస్తున్నారు. ఆ దేవదేవుడు ఇంతింత కళ్లు చేసుకుని ముగ్ధుడై చూస్తున్నాడు. మహానాట్యకారుడు జాయపుడు ఓ అపరిచిత వృద్ధ గుడిసానితో పాదం కలిపి ఆ మహాశివునికి సంధ్యభోగం నిర్వహించడం.. అతనికే సంబరంగా, అబ్బురంగా ఉంది. అప్పుడే.. ఏదో తప్పు జరిగినట్లు.. ఆయన గుర్తించిన లిప్తకాలంలోనే, ఆమె చెయ్యి జాయపుని చెంపను బలంగా తాకింది. “మహారుద్రునికి భోగం అనుకున్నావా!? లంజతో చుళిక అనుకున్నావా!?”. క్రోధంతో ఆమె గొంతు నిప్పులు కక్కింది. రెండు చెంపలూ మళ్లీ మళ్లీ వాయించింది. అన్నీ భరించి చేతులు జోడించి తప్పును క్షమించమన్నట్లు తలవంచాడు.. జీవితంలో తొలిసారి. మరుక్షణం ఆమె జాయపుణ్ని పట్టుకుని మెల్లగా జారి పడిపోయింది. స్పృహ తప్పింది.
“అయ్యో అయ్యో..” అంటూ, చుట్టూ ఉన్న స్త్రీలు దగ్గరికొచ్చారు. “అన్నం తిని ఎన్ని రోజులయ్యిందో..” ఒకామె అన్నది. దాదాపు మూడు మాసాల అనంతరం. ఆమె.. సొక్కమాంబ నట్టువాంగం వాయిస్తున్నది. ముందున్న పిల్లలు ముద్రలు (చేతులతో చేసేవి) పడుతున్నారు.. నాట్యాభ్యాసంలో భాగంగా. అక్కడే.. ఆ చిన్నగుడి ఇప్పుడు ఓ చక్కని రుద్రాలయం కాగా, దానిముందు ఓ నాట్యగురుకులం నిర్మించి ఉంది. జాయపుడు కూడా పిల్లలకు పాఠం చెప్పి బయటికి వచ్చి.. ఆ రావిచెట్టు దిమ్మెవద్ద కూర్చున్నాడు. చుట్టూ పదిమంది దాసరులు తంబురలు మీటుతూ తత్వాలు పాడుతున్నారు.
వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంటా.. చేసిన ఖర్మము చెడని పదార్థము.. వచ్చునే నీ వెంట!! ఇల్లు నాది.. వాకిలి నాది.. ఇల్లాలు నాదనుచు.. ఏల భ్రమసితివయ్యా మనసా.. కాలుని వలలోను కానక జిక్కితివి.. కడతేరుటే త్రోవ మనసా.. కామ క్రోధ లోభ మోహము.. కాల్చి వేయుదురిక్కడ.. ఎవరు చేసిన వారి ఖర్మము.. లనుభవించే దక్కడ.. ఈ వేదాంత వైరాగ్యగీతాలు ఘనత వహించిన కవిపండితులు రాయరేం.. పాడరేం!? పంక్తిబాహ్యులై ఉంఛవృత్తితో బతికే ఈ దాసరులు.. ఆయా పండితులు పాడే ఆ శృంగార, భక్తిసాహిత్యం వదిలేసి జీవన వైరాగ్య, సామాజిక అంశాలను గొప్ప పరిశీలనతో గుర్తించి.. పాటలో ఇమిడ్చి ఎంత హృద్యంగా పాడుతున్నారు!?
లోపలినుంచి ఖంగుమంటున్న సోమాంబిక గొంతు వింటుంటే.. ఆ రోజు.. గతంలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. పదిరోజులుగా ఆహారం లేకపోయినా తన ధర్మంగా సంధ్యభోగం నిర్వహించింది! చటుక్కున చేయి చెంపలపైకి వెళ్లింది. తప్పు చేసిన తనను దండించిన గురువు ఆమె! ఆమె అలా దండించడం.. జాయపునికి ఎందుకో బావుంది. ఇప్పటివరకూ ఈ ముప్పైఐదేళ్ల వయసు వరకు.. ఎవ్వరూ నాట్యంలోగానీ, యుద్ధంలో గానీ తన తప్పులెంచలేదు.
తానెప్పుడూ చెయ్యలేదా తప్పు?! తప్పొప్పులకన్నా నటనస్థాయి భరతముని చెప్పిన ప్రమాణంగా లేదని గుర్తించి.. తనను గుండయామాత్యునికి అప్పజెప్పిన ప్రభువు గణపతిదేవుడు. ఆయన కూడా తను తప్పు చేస్తున్నాడు అనలేదు. ఇక గుండయామాత్యుడు, అక్కడి ఉపాధ్యాయులు, అక్క నారాంబ, స్థపతి రామప.. వీళ్లంతా తన నాట్యాన్ని ముద్దుగా చూశారేగానీ తప్పులెంచలేదు. ఈమె తప్పులెంచింది. చాచి బుగ్గలు వాయించింది. అందుకే ఆమె జాయపునికి బహు నచ్చింది.
ఆరోజు ఆమె నాట్యం చేస్తూ స్పృహతప్పి పడిపోయింది. గబగబా ఆమెను తన పర్ణశాలకు చేర్చాడు దాసరుల సహాయంతో. ఆమె ఎవరో అక్కడెవరికీ తెలియదు. వైద్యుని సహాయంతో ప్రాణాలు పోకుండా కాపాడి.. స్పృహ వచ్చాక భోజనం ఏర్పాటు చేశాడు. ఆమె కళ్లలో జీవంలేదు. పండిపోయి ఎండిపోయి ముడుచుకుపోయిన పండుటాకు. జాయపుని అనురాగంతో కోలుకుంది. తిరిగి మామూలు మనిషయ్యింది. జాయపునితో కలిసి కృష్ణమ్మ తీరాన దినమూ నడుస్తున్నది. నాట్య ప్రయోగాలపై తన సంప్రదాయాలను చెబుతున్నది. చేసి చూపుతున్నది. అప్పుడడిగాడు ఆమె వివరాలు.
ఆమె సోమాంబిక!! ధనదుపురం పండితేశ్వరస్వామి దేవాలయ గుడిసాని. పండితేశ్వరుణ్నే కాదు.. అప్పటి పాలకుడు పృథ్వీశ్వరుణ్ని, అతని అధికార గణాన్ని, సమస్త రాజ్యాన్ని కూడా ఆమె శాసించింది. అంతటి అధికారం, ఐశ్వర్యం ఆమె సొంతం. ముఖ్యంగా తీవ్రమైన భక్తి తత్పరత! వెలనాడు కాకతీయరాజ్యంగా అయ్యవంశజుల పాలనలోకి వచ్చినప్పటినుంచి ఆమె తలరాత మారిపోయింది. కారణం రాజ్యపాలకులు కారు. ఆమె వారసురాలు కొమరాంబ. దేవుడే నాథుడైన గుడిసానులకు పిల్లలుండరు. అనేక కారణాలతో కొందరు తమ ఆడపిల్లలను గుడికి చిన్ననాడే దానం చేస్తారు.
అలాంటివారిని గుడిసానులు సొంతపిల్లలుగా సాకుతారు. అలా కూతురైన కొమరాంబ.. తల్లిలా గుడిసాని కాలేదు. తల్లి ఐశ్వర్యం, రాజాస్థానంలో ఉన్న పలుకుబడి ఉపయోగించుకుని పూర్తిస్థాయి వేశ్యవాడ నిర్మించుకుంది. సహజంగా తల్లికి నచ్చలేదు. ఫలితం తల్లి అనాథగా మిగిలింది. తల్లి బతికి ఉంటే ఏనాటికైనా తనకు శత్రువేనని భావించిన కొమరాంబ.. తల్లిని చంపడానికి యత్నించగా, పారిపోయి ప్రాణాలు దక్కించుకుని అనేక గుడులలో తలదాచుకుంటూ.. చివరికి ఇక్కడ ఇలా జాయపుని రక్షణలోకి చేరింది. ఆమె కోరికపై అక్కడే ఓ నాట్యారామం నిర్మించి ఇచ్చాడు వెలనాడు మండలేశ్వరుడు జాయచోడుడు.
అందుకు సహాయపడినవాడు జగన్నాథుడు.. రాజ బంధువు! ఓ రాత్రివేళ దగ్గరలో ఏదో గ్రామ్య గానం. ఏదో వాద్యపు శ్రావ్యత.. పగలబడి నవ్వులు.. ముచ్చట్లు.. పంచములవాడల్లో పగలల్లా పొలాలలో, ఉత్పత్తి కర్మాగారాలలో కూలిపని చేసుకునే కుర్రకారు.. రాత్రివేళ ఓచోట చేరి కథాగానాలలో గడపడం సాధారణమే!
ఈ వాడ కుర్రాళ్లే అలా కలిసి కబుర్లు చెప్పుకొంటున్నారని గుర్తించాడు జాయపుడు.
నవ్వులు, మాటలు, చిందు వేస్తున్నట్లు, గొంతెత్తి గేయాలు, జానపదాలు ఆలపిస్తూ.. గోలగోలగా సరదా సరదాగా. మధ్యమధ్య డప్పు శబ్దం. అది కొంత అబ్బురంగా ఉంది. నాలుగైదు జతులను డప్పుపై దబిడ దిబిడ వాయించడమే డప్పు ఉపయోగం. అందుకే శవాల వద్ద, గ్రామచాటింపులకు డప్పు పరిమితం. తోలువాద్యాలైన డోలు, మృదంగంలా డప్పు సంగీతయుక్తం కాలేదు. సుబుద్ధి పిల్లలు తాటిఆకులను గొట్టంలా చుట్టి పీక సన్నం చేసి.. పీ! పీ! అంటూ వీధివీధీ మోగిపోయేలా వాయించేవారు. భలే.. బావుందని వాళ్లను అడిగితే.. తనకో బూరచేసి ఇచ్చారు. అది వాయించిన సంభ్రమం ఇప్పటికీ హృదిలో ఉంది. తర్వాత గురుకులంలో ఎన్నెన్నో వాద్యాలను చూశాడు.
మైమరచి విన్నాడు. వాద్యాల పుట్టుపూర్వోత్తరాలు చదువుకున్నాడు. ‘డప్పు.. సంగీతానికి పనికిరాదు!’ అనేవారు గురువులు. నిజమేననుకున్నాడు. అందుకే ఇక్కడ డప్పుపై సరిగమలు విని ఆశ్చర్యపోయాడు జాయపుడు. ఏదో సృజనాత్మకత. చిందుకు ఆనుగుణ్యమైనట్లు. వహ్వా.. చెవి నుంచి గుండెను తాకింది. ఆగలేకపోయాడు. లేచి డప్పువాదన, పాటలు, చిందులు వినవచ్చిన వైపుగా వెళ్లాడు. నాలుగు ఆమడల దూరంలో కాలువ ఒడ్డున గొడ్ల చావిడి. గ్రామసీమల్లో గొడ్ల చావడులే గొప్ప మిత్రసమాగమ కేంద్రాలు. అక్కడ చలిమంట వేసుకుని కొందరు కుర్రాళ్లు డప్పులు వాయిస్తూ తదనుగుణంగా చిందువేస్తూ.. చర్చించుకుంటూ మళ్లీ వాయిస్తూ.. మధ్య మధ్య ఆ నిప్పుల్లో డప్పులను కాగబెట్టుకుంటూ.. ఎంతవేడి ఉందో చిటికె వేసి వాయించి చూసుకుంటూ.. ఓహ్! ఆ దృశ్యం పరవశింపజేసింది.
తమకు దగ్గరగా వచ్చిన జాయపుణ్ని చూసి కుర్రబృందం నివ్వెరపోయింది. పలకరింపుగా నవ్వాడు జాయపుడు. ఉప్పెనకు కొట్టుకువచ్చిన కులీనుడైన అపరిచితునిగా జాయపుడు వాళ్లకు తెలుసు. ఏదో నవ్వాం అంటే నవ్వాం.. అన్నట్లు నవ్వింది బృందం. జాయపుడు వారి ప్రతిస్పందనను పట్టించుకోకుండా ఒకని చేతిలోని డప్పును చొరవగా తీసుకుని డప్పు వాద్యకారుడిలా చంకకు పొదవుకుని సున్నితంగా ఓ దరువు వేసి.. “వహ్వా! వహ్వా!” అన్నాడు. ఓ కులీనుడు డప్పు తీసుకోవడం.. చంకకు పొదవుకోవడం.. వాయించడం.. ఆ బృందం కొయ్యబారిపోయింది. చకితులై ఆయన చుట్టూ చేరారు. జాయపుడు మరికొన్ని దరువులు వాయించి.. “కొంచెం.. ఇంత.. పిసరంత.. వేడి చెయ్యి మహానుభావా!” అన్నాడు. అతని తృప్తిలో తాటికల్లో.. ఈత కల్లో.. మత్తు మందో.. రుచి చూసినప్పటి మధురత.. మగత ఏదో కనిపిస్తున్నది.
అల్పసంతోషులు పంచములు. జాయపుడు భలే నచ్చేశాడు. సాధారణంగా కులీనులైన సంగీతవేత్తలు.. వరే వాయించరా.. అసలు నీకు వాయించడం వచ్చా!. సరిగమలు తెలుసా!? చెప్పినట్లు ఏడువ్..’ అంటారు. కానీ, ఇతగాడు.. సంగీతకారుడు కావచ్చు. డప్పును తీసుకోవడం ఏమిటి!? వాయించి చూడటం ఏమిటి!? ‘మహానుభావా’ అని సంభోదించడం ఏమిటి!?.. మరుక్షణం ఆ పదిపన్నెండుమంది కుర్రాళ్లు.. ఓ తాటిదిమ్మెను చూపి, దులిపి.. “గురుదేవా.. కూర్చోండి!” అంటూ గౌరవించారు. ఓ కల్లుకుండ వినమ్రంగా నోటికి అందించి సన్మానించారు. తాజా కల్లు.. కొత్త రుచి! నాలుగు గుక్కలు వేశాడు జాయపుడు. మూతి తుడుచుకున్నాడు. “నీ పేరెంటబ్బాయా?”. “సూరప్పడు.. అయ్యా!”. మరో నాలుగు గుటికలు.. “సూరప్పడు! రాముడు.. డుమువులు ప్రథమా విభక్తి. తెలుగు ఛందస్సో.. చాదస్తమో ఏదో.. రాముడ్ని ‘రాములవారు’ అంటాం.
అదే మీబోటి వాళ్లనైతే.. ‘సూరప్పడుగాడు’ అంటాం. హర హరా.. ఎంత అన్యాయం శివా!”. ఆనందంతో దిమ్మెరబోయింది కుర్రబృందం. “రేయ్.. గురువుగారికి మరో కల్లుముంత!”. “ఎండు సేప.. భలే రుసి! కారం కారంగా ఉంటది.. కొరకండి గురుదేవా!”. “ఇటివ్వు.. ఇట్లా అర్ధరాత్రి అడిగి పెట్టేవాడు ఎవ్వడూ లేడ్రా నాకు!” అంటూనే బావురుమన్నాడు. కళ్లు తుడుచుకున్నాడు. “ఒరే.. చిత్రం ఏంటంటే వాద్యాలన్నీ మీబోటి కూలోళ్లు, కుమ్మరోళ్లు చేసినవే. కుమ్మరోళ్లు అన్నం వండుకోడానికి కుండ చేసినప్పుడే.. రెండుచేతులతో దానిపై సరిగమలు వాయించారు. తర్వాత ఎవడో వచ్చి దాన్ని ‘ఘటం’ అంటాడు. ‘అది వాద్యం.. నేను ఘటవాద్యవీరుణ్ని’ అంటాడు. రాజుగోరు సన్మానించి.. ‘అగ్రహారం తీస్కో!’ అంటాడు. చూశావా చూశావా.. ఎంత మోసమో!?”.
“వాద్యాలలో కూడా మతాలు! విబూది రాసుకునేవాళ్లు శంఖం, డమరుకం, రుంజ, గరగ వాడితే.. నామం పెట్టుకునేవాళ్లు డోలు, మృదంగం, తంబుర, మురళి, వీణ ట్వయ్.. ట్వయ్.. ట్వయ్.. ప్చ్! వీళ్లిద్దరూ డప్పు ఎందుకు వాడరురా సూరప్పడూ!?”. తెల్లార్లూ అక్కడ డప్పుతో.. మోతో మోత!! చిందో.. చిందు!! (సశేషం)