జరిగిన కథ : ప్రకృతి పిచ్చెక్కినట్లు ఊగిపోతున్న బీభత్స వాతావరణంలోనే.. నంగెగడ్డరేవుకు చేరాడు జాయపుడు. ముందే వచ్చి ఇసుకగుట్టపై కూర్చుని ఉన్నది మువ్వ. ఇద్దరూ మాటల్లో ఉండగానే.. నల్లని మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. రాబోయే ముప్పును గుర్తించింది మువ్వ. ఉప్పెన వచ్చేటట్టున్నదనీ, జాయపుణ్ని రేవులోకి దూకమని చెప్పి.. తానుకూడా నీళ్లలోకి దూకేసింది. క్షణక్షణానికీ ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. ఆ ఇద్దరినీ వేగంగా లాక్కుపోతున్నది. వారితోపాటు కొమ్మలు, చెట్లు.. గడ్డీ గాదం, గేదెలు, దూడలు, ఆవులు.. సుళ్లు తిరుగుతూ మునిగి – తేలుతూ సాగిపోతున్నాయి. ఊహాతీతంగా ఇద్దరూ ఒక చెట్టుపైకి చేరారు. ప్రత్యూష వేళకు కిందికి చూసి కొయ్యబారిపోయాడు జాయపుడు.
జాయపుడు, మువ్వ ఇద్దరూ కూర్చున్నది.. ఆకాశమంత ఎత్తున్న తాడిచెట్టు పైన. ఇద్దరి చేతులమధ్య గోపయ్య బొమ్మ. కింద.. వేగంగా పోతున్న కృష్ణమ్మ. ఆమె ఉరవడిలో పోతున్న శవాలైన మనుషులు, జంతువులు, చెట్లు చేమలు, గొడ్డు గోదా! ఆ ఇద్దరూ.. తెల్లవార్లు నీటిలోనే.. ఆ తాడిచెట్టుపైనే.. నాలుగైదు గంటలు అలాగే ఉండిపోయారు. పిచ్చికేకలు వేసినా పలికే దిక్కులేదు. మధ్యాహ్నం మూడోజాము వేళకు నీరు వచ్చినంత వేగంగా తగ్గిపోయింది. మనుషులు కనిపిస్తున్నారు. బతికి ఉన్నవాళ్లు ఏడుస్తూ.. అంతా వెతుకుతున్నారు.
అప్పుడు చెట్టు పైనుంచి పెద్దగా అరవసాగాడు జాయపుడు. పైకి చూసిన కొందరు పోగయ్యి.. కల్లుగీసే గౌడును పిలిపించి, చర్చించి ఇద్దరినీ మోకుతాళ్లతో కట్టి కిందికి దించారు. నీటివెంట దొర్లుకుంటూపోతూ చెట్లకు తగిలి.. ఒళ్లంతా ముళ్లు గుచ్చుకుని.. ఇద్దరూ రెండు మాంసపు ముద్దలుగా మిగిలారు. ఎవరో అడిగారు..
“సచ్చి బతికారు.. ఏ ఊరు బాబూ మీది?”. “మాది.. మాది నంగెగడ్డ. ఇదే ఊరు?” నీరసంగా దిక్కులు చూస్తూ అడిగింది మువ్వ. “కూసెనపూండి అగ్రహారం మాదిగవాడ”. “ఓయమ్మో.. అంటే మనం నంగెగడ్డ నుంచి పోయిపోయి పదియోజనాలు దిగువకు పోయి పడ్డాం..” అన్నది మువ్వ. ఈ ఊరెక్కడో జాయపునికి ఇదమిత్థంగా తెలియదు కానీ, చాలాదూరం వచ్చినట్లు గుర్తించాడు.
కృష్ణమ్మ ఉగ్రరూపం ఎలా ఉంటుందో మొదటిసారి చూసిన జాయపుడు దిమ్మెరపోయాడు. కానీ, ద్వీపవాసులకు ఇలాంటివి మామూలే! తుఫానులు, వరదలు, వాయుగుండాలు వస్తుంటాయి. వందలమందిని తీసుకుపోతుంటాయి. తక్కువ నష్టంతో కృష్ణమ్మ, సముద్రుడు శాంతిస్తే అదే పెద్ద ఊరట.
మువ్వ, జాయపుడు చేరిన ప్రాంతం.. గడ్డిపాడు, కూసెనపూండి గ్రామాల మధ్య ప్రదేశం. గడ్డిపాడులో ప్రాణనష్టం ఎక్కువ జరగగా.. కూసెనపూండి అగ్రహారంలో తక్కువ. ఆ అగ్రహారపు మాదిగవాడ నివాసులు ఇద్దరినీ చేరదీసి, తాత్కాలికంగా ఓ గుడిసెలో ఉంచారు.
జాయపునికి మతి మతిలో లేదు. ఈ ఉప్పెనలో ఏమయ్యాడోనని తన కుటుంబం, కోటలో పరివారమంతా తప్పక ఆందోళన చెందుతుంది. అన్న పృథ్వీశ్వరుడు.. ఇప్పటికే వేగులతో వెతికించడం మొదలెట్టి ఉంటాడు. నిజానికి తానీ వెలనాడుకు అధికారిక పాలకుడు, మండలేశ్వరుడు. తను ప్రచ్ఛన్నంగా స్వేచ్ఛగా వెలనాడు అంతటా తిరుగాడుతున్నాడు. అన్నీ బాగుంటే అది సమస్యకాదు కానీ, ఇలాంటి ప్రకృతి విపత్కరవేళ సమస్యే. ఇప్పుడెలా.. ఏమి చెయ్యాలి? తను క్షేమమేనని తనవారికి తెలియజేయడం ఎలా? అని మధనపడుతున్నాడు. “జగన్నాథుడు పేరున్న వ్యక్తి ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. ఉన్నారా బాబూ?”..
గుడిసె బయట ఎవరో అడగడం వినిపించి చటుక్కున బయటికి వచ్చాడు.
పరాశరుడు!! వెనక విక్రమ.. ఆ పక్కన పల్లికేతు!!
తమ్ముడి రాకపోకలు చూసుకోడానికి పృథ్వీశ్వరుడు నియమించిన పల్లికేతు.. ఎప్పుడూ తలగడదీవి కోట సింహద్వారం, శ్రీవాకిలి నియోగంవద్ద ఉంటాడు. జాయపుడు కోటనుంచి అక్కడికి రాగానే వెంట వెళ్లి రాజబాటపై నది దాటాక విక్రమతో వెనక్కు వెళ్తాడు. ఒక్కొక్కసారి జాయపుడు విక్రమతోవెళ్లి దానిని పెద్దన కళాగృహం వద్ద ఉంచుతాడు. జాయపుని రాక ఆలస్యమైతే కళాగృహానికి వెళ్లి జాయపుని వివరాలు తెలుసుకుంటాడు.
ఈరోజు కళాగృహానికి పల్లికేతు రాగా.. బహుశా విక్రమే ఆ ఇద్దరినీ ఇక్కడికి తీసుకుని వచ్చింది. విక్రమ కొంతదూరం వరకూ జాయపుని ఉనికిని గుర్తించగలదు. మచ్చిక జంతువులు, మంచి మిత్రులు ఎప్పుడూ ఆపదలో ఆదుకునే సంపదలే!“జగన్నాథులకు వందనాలు. విక్రమ వల్ల మీరెక్కడున్నారో మాకు తెలిసింది. క్షమించాలి నన్ను!”.. అభ్యర్థనగా అన్నాడు పరాశరుడు. తన రహస్యం అతనికి తెలిసిపోయిందని జాయపునికి తెలిసిపోయింది. చిన్నగా నవ్వి పల్లికేతుతో అన్నాడు..
“కేతూ.. నా వివరాలు అన్నగారికి తెలియజెప్పు. పెద్దలు, పిల్లలు.. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని నా మాటగా చెప్పు. రక్షించినవారిని వదలివెళ్లడం నాకు ఇష్టంగా లేదు. కాస్త ఆరోగ్యం కుదుటపడ్డాక వస్తానని చెప్పు!”.
విక్రమ బెంగ తీరేవరకు జాయపునితో ముచ్చట్లాడాక.. పల్లికేతు దానిని తీసుకుని వెళ్లిపోయాడు.
పరాశరుడు ఒక్కడే మిగిలాడు.
“మిత్రమా.. నన్ను క్షమిం..”అడ్డుపడ్డాడు పరాశరుడు.
“మీరే నన్ను మన్నించాలి జాయసేనాని. మీరు.. ఇలా ఇంత సామాన్యంగా, నాబోటి వాడితో కలిసి ఈ గ్రామాలవెంట.. వీధులలోనూ.. పూటకూళ్లమ్మ నివాసాలలో..”
“నేను చిన్ననాటి నుంచి ఇలాగే పెరిగాను పరాశరా. ఈ జీవితమే నాకు సహజంగా అమరుతుంది. అమ్మఒడిలా ఓ నిశ్చింత. కళాకారుల సాంగత్యమే నాకు సౌకర్యం. పౌరసమాజం నన్ను మన్నించడం కోసమే ఈ సాధారణ వేషం. అనుమకొండలో అక్క – బావగారు, ఇక్కడ నా అన్నదమ్ములు నన్ను అపురూపంగా చూసుకుంటారు. ఇంతకంటే నాకేమీ కావాలి..?!”.
పరాశరుడు ఏదో చెప్పబోయాడు కానీ, జాయపుడు అతణ్ని మాట్లాడనివ్వలేదు.
“మనం ఎప్పటిలా ఉందాం. అందరికీ, నీకూ.. నేను జగన్నాథుడు మాత్రమే! అందరికీ తెలిసేరోజు వస్తే తెలుస్తుంది. అంతవరకూ నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు సుమా!”. నమస్కరించి వెళ్లిపోయాడు.. ఉద్వేగభరతుడైన పరాశరుడు. కానీ, తరచూ అక్కడికి వస్తూనే ఉన్నాడు. జాయపుని ఆరోగ్యం, మంచిచెడ్డలు సమన్వయం చేస్తూనే ఉన్నాడు.
మరునాడు పల్లికేతు జాయపునికోసం బట్టలతో, ఆస్థానవైద్యునితో కలిసి వచ్చాడు. ఆ మరునాటి నుంచి వెలనాడు ఉద్యోగులు గడ్డిపాడు, మాదిగవాడ, కూసెనపూండి.. చుట్టుపక్కల గ్రామాలను పూర్తిగా శుభ్రం చేయడం, మంచి వసతులు కల్పించడం మొదలెట్టారు. అది చూసి జాయపుడు సంతోషించాడు. కారణం.. పృథ్వీశ్వరునికి, కుటుంబానికి తను ఆరోగ్యంగా, తన ఇష్టానికి తగినట్లుగా ఇక్కడ ఉన్నట్లు స్పష్టమైంది. రాజవంశీయులను దేవతలస్థాయిలో గౌరవించే కాలం. జాయపుణ్ని చూసిన ఎవ్వరైనా ఆయన పంచమకులస్తుడు లేదా సాధారణ కులీనుడు అంటే నమ్మరు. ఆయన్ను చూస్తే ఎవ్వరైనా రాజవంశీయుడని ఇట్టే చెప్పేస్తారు.
సాధారణంగా జాయపుని లాంటివారు మాదిగవాడలో నివసించడం జరుగదు. ఎవరైనా దారితప్పి వస్తే గ్రామరట్టకు అప్పగిస్తారు. మాదిగవాడరట్ట పరమేశు, గడ్డిపాడురట్ట మంఖదాసు, కూసెనపూండి అగ్రహార వారసుడు కూసెనభొట్లు.. ముగ్గురికీ తన పేరు జగన్నాథుడని, అనుమకొండవాసినని చెప్పాడు. వాళ్లు అతణ్ని రాజకులీనుడుగా, రాజబంధువుగా గుర్తించారు. ఈ రాజబంధువు కోసం తలగడదీవి నుంచి పల్లికేతు అనే బంటు, పరాశరుడు అనే పండిత మిత్రుడు, మువ్వ అనే చండాలవాడ కవయిత్రి వచ్చారని చెప్పుకొంటున్నారు.
మాదిగవాడకు, కూసెనపూండి గ్రామానికి మధ్యగా విశాలమైనచోట జాయపుని కోసం ఓ పర్ణశాల నిర్మించారు. తలగడదీవి రాజవైద్యుడు వైద్యం చేస్తుండగా.. భోజనం మంఖదాసు ఇంటినుంచి వస్తున్నది. ‘మన జగన్నాథుడు రాజబంధువు కాబట్టే మన గ్రామాలకు మంచి జరుగుతున్నది’ అని వారంతా మురిసిపోతున్నారు. అయితే, జాయపునికి సమస్య మువ్వతో! ఉప్పెన నుంచి బయటపడిన మువ్వకు ఇప్పుడు దేవుడు – గురువు.. గురువు – దేవుడు ఒక్కరే! అది జగన్నాథుడు మాత్రమే. ఆమె అతణ్ని రెప్పవేయని కన్నులతో చూస్తుంటుంది అలా.. రాత్రి పగలు. నిద్రలో తప్ప అనుక్షణికమూ జాయపుణ్నే చూస్తుంటుంది.
ఇతను సాక్షాత్తూ తన గోపయ్య!!
కాకపోతే ఎవరో గొప్ప నాట్యకారుడు అనుమకొండ నుంచి తనను వెతుక్కుంటూ వచ్చి తనకు.. ఈ చండాల కులస్తురాలికి.. నాట్యగురువులు బహిష్కరించిన ఈ నిమ్నజాతి దానికి.. నిత్యమూ తనవద్దకే వచ్చి కృష్ణమ్మ సైకతవేదికపై నాట్యం నేర్పడం.. ఓహ్.. ‘ఓ గోపాలా.. నువ్వే నువ్వే ఈ జగన్నాథునివి. నువ్వే నా దేవునివి. నా జగత్తునంతా ఆక్రమించుకున్న ఆ పరమాత్మవు. నా నిరీక్షణ ఇప్పటికి తీరింది సావి. ఇక నిన్ను వొదలా.. సావో
రేవో నీతోనే!!’.. ఇదే లోలోన ఆమె స్మరణ!
ఇప్పుడు మువ్వ, పరాశరుడు, జాయపుడు.. ఓ బృందం!!
నాట్య, గేయ, సాహిత్యాంశాలు కలబోసుకుంటారు. నిజానికి మువ్వ అక్కడ కేవలం మౌనశ్రోత. జాయపుణ్ని చూస్తూ వాళ్ల మాటలు వినడమే ఆమె నిత్యకృత్యం. “పరాశరా.. ఈమె నుంచి నువ్వే నన్ను రక్షించాలి. కాస్త అటూ ఇటూ చూడమని చెప్పవయ్యా..” అంటాడు జాయపుడు. ఉప్పెన వల్ల కాలు, చెయ్యి అధీనంలోకి రాని మువ్వకు రకరకాల గేయాలు, జానపదాలు, స్త్రీల పాటలు, జాజిరి, జాలరుల పాటలు.. పాడుతూ పాడిస్తూ జాయపుని పైనుంచి ఆమె దృష్టిని కాస్త మళ్లిస్తున్నాడు పరాశరుడు. మువ్వ కూడా వారిద్దరి ప్రభావంతో ఏవేవో కూనిరాగాలు తీస్తూ తనలో నిబిడీకృతమైన కొన్ని భావాలను చిలవలు పలవలుగా పెంచి రచనచేసి పాడుతుంటే.. పరాశరుడు వాటికి మెరుగులు దిద్దుతుంటాడు. గోపయ్యపై ఓ శతకం చెప్పాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నది మువ్వ.
పెద్ద గ్రామాలలోని కులీన కుటుంబాలకు, పంచమ కులాల కుటుంబాలకు నివాసంలోనే దూరం.
ఎవరి నివాసాలు వారివే. అందరూ కలసిమెలసి వ్యవసాయం, వృత్తులు నిర్వహిస్తుంటారు. కులీనుల తర్వాత వృత్తికులాల స్థాయి చాలా ఎక్కువ. మంగలి, చాకలి లాంటి సేవావృత్తులవారు నిమ్నకులాల వారికి తమ సేవలను అందించరు. అందుకు వారేమీ పోరాటాలు, గొడవలు పెట్టుకోరు. వారి కులాలలోనే మంగలి, చాకళ్లను ఏర్పాటు చేసుకున్నారు. పురోహితులను, వైద్యుల్ని కూడా!
మాలవాడ, మాదిగవాడ, ఎరుకలవాడ, సగరవాడ.. వాడవాసులైన పంచములు ఎప్పుడూ పనిపాటా లేకుండా ఖాళీగా ఉండరు. ఎవ్వరినీ చేయి చాచి యాచించరు. తమతమ వృత్తులలో నిమగ్నమై సమాజంలో తమవంతు సామాజిక జీవితాన్ని గౌరవంగా గడుపుతారు. కులీనులకే కాదు.. అన్ని వృత్తివర్గాలకు, నిమ్నవర్గాలకు ఎవరికి ఉండే సామాజికస్థాయి వారికి ఉంది. వీరిలో ఎంతోమంది ఆర్థికంగా మహాధనవంతులు ఉన్నారు కూడా.
వ్యవసాయానికి అతిముఖ్యమైన పశువుల మంచిచెడ్డలు పూర్తిగా మాదిగలవే. వాటికి ప్రాథమికచికిత్స అందించే పశువైద్యులు కూడా మాదిగలే. చనిపోయిన పశువుల తోలువలిచి చెప్పులు, దుస్తులు తదితర వస్తువులను వీళ్లే ఉత్పత్తి చేస్తారు. తోలుతో, కొమ్ములతో, ఎముకలతో రకరకాల వస్తువులు తయారుచేసే కర్మాగారాలు అక్కడున్నాయి.
ఎలుకల్ని, పాముల్ని పట్టడం ఎరుకలవారి వృత్తి. వారు తప్ప మరెవ్వరికీ ఆ నైపుణ్యం లేదని రైతులు విశ్వసిస్తారు. అందుకే, పొలంలో ఎలుకలు పంటను కొరికేస్తున్నా.. పైరుపై పాము పాకిన ఆనవాళ్లు కనిపించినా ఎరుకల వారినే పిలుస్తారు. రైతులతో బతిమలాడించుకుని వెళ్లడం.. ఒకరిపై ఒకరు హాస్యమాడటం సర్వసాధారణం. అలాగే సగరులు, ఇతర వృత్తులవారు కూడా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఎవరి ఆత్మగౌరవాన్ని వాళ్లు కాపాడుకుంటారు. వచ్చిన ఆదాయంతోనే నిత్యనైమిత్తిక జీవితాన్ని గౌరవంగా గడుపుతారు. రానురానూ ఆ తీర గ్రామాలు, వాడలు ఉప్పెన ప్రభావం నుంచి బయటపడి సాధారణ జీవనంలోకి వచ్చాయి. వాడ మహిళలతో కలిసి మువ్వ ఓ దువ్వెనల తయారీ కర్మాగారంలో పనికి కుదిరింది.