వేములవాడ, ఫిబ్రవరి 18: వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యక్తిగత మాజీ కార్యదర్శి వెంగళ దినేష్ సతీమణి రోహిణి (32) బుధవారం అనుమానస్పద మృతి చెందారు. గత 8 సంవత్సరాల క్రితం సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన రోహిణితో దినేష్ కు వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కొంతకాలంగా దినేష్ వేరే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంట్లో భార్యను వేధిస్తూ గొడవలకు దిగుతున్నట్లుగా స్థానికుల ద్వారా తెలిసింది.
గొడవలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇటీవలే రెండు మాసాల క్రితం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అతనిని పీఏ నుండి తొలగించినట్లు సమాచారం. అయితే వేకువ జామున ఆత్మహత్య పాల్పడిందని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిసింది. మెడపై బలమైన వైరుతో లాగినట్లు గాయాలు ఉండగా వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. రోహిణి అనుమానాస్పద మృతి పట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకు దిగినట్లు తెలిసింది.