భారతీయులు చాయ్ ప్రేమికులు. పొద్దున లేచీ లేవగానే వేడివేడి చాయ్ గొంతు దిగితే గాని రోజు మొదలుకాదు. అయితే మరీ వేడిగా ఉన్న చాయ్ తాగితే అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురితమైన అధ్యయనం ఒకటి ఈ విషయం వెల్లడించింది. దీనికోసం పరిశోధకులు ఇరాన్ దేశంలోని గోలెస్తాన్ ప్రాంతానికి చెందిన 40 75 ఏండ్ల మధ్య వయసున్న 50,045 మంది నుంచి పదేండ్ల ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. వీరిలో చాయ్ తాగేవారిని బాగా వేడిగా (60 డిగ్రీల కంటే ఎక్కువ), గోరువెచ్చగా (60 డిగ్రీల కంటే తక్కువ) అనే భాగాలుగా విభజించారు. రోజుకు బాగా వేడి చాయ్‌ను 700 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో తాగిన వారిలో అన్నవాహిక క్యాన్సర్ అభివృద్ధి చెందే ముప్పు, గోరువెచ్చటి వర్గం కంటే 90 శాతం ఎక్కువని తేల్చారు. కాబట్టి ఏ పానీయమైనా సరే 60 డిగ్రీల లోపు ఉండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఎంత నడిస్తే అంత మంచిది
రోజులో ఎంత ఎక్కువగా నడిస్తే అంత ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. కానీ రోజుకు ఎంతసేపు, ఎన్ని ఎక్కువ అడుగులు నడవాలనే విషయంలో ఓ సాధారణ సూత్రీకరణ అంటూ ఏదీలేదు. కాకపోతే, రోజుకు కనీసం 2,500 అడుగులు వేసేవారికి… ఇంతకంటే తక్కువగా నడిచేవాళ్లతో పోలిస్తే గుండె రక్తనాళాల జబ్బుతో మరణించే ముప్పు 16 శాతం తక్కువగా ఉంటుందట. కాబట్టి, జీవనశైలిలో మనం చేసుకునే చిన్నచిన్న ఆరోగ్యకరమైన మార్పులు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.