ఉసిరికను ‘శ్రీ ఫలం’ అని కూడా అంటారు. సంస్కృతంలో దీనిని ఆమ్ల అని పిలుస్తారు. ఉసిరికాయల్లో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ , మధుమేహం, గుండె జబ్బులను అదుపు చేస్తుంది. ప్రతిరోజూ ఒక ఉసిరికాయను తింటే అన్ని రకాల పైత్యాలను తగ్గించవచ్చు. ఉసిరికాయను పొడి, ఎండబెట్టి వరుగుగా, మురబ్బాగా, నిలువ పచ్చడిగా రూపంలో వాడుకుంటాం. అలాగే ఆమ్లా ఆయిల్ రూపంలో జుట్టు ఆరోగ్యం కోసం ఉపయోగిస్తాము. అనేక సౌందర్య సాధనాల్లో ఉసిరిని ఉపయోగిస్తున్నారు. షడ్రుచుల్లో చేదు తప్ప మిగతా అన్ని రుచులు ఉసిరిలో ఉంటాయి. ఉసిరిని తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఉపవాస దీక్ష పూర్తయిన తర్వాత ఉసిరి ఫలం తిని దీక్షను విరమించే ఆచారం ఉంది. అందుకే ‘ఉసిరి ఔషధ సిరి’ అన్నారు.
ఉసిరి దేవతా వృక్షం. ఇది ఉన్నచోట శ్రీమహాలక్ష్మి ఉంటుందని నమ్మకం. లక్ష్మీదేవి కొలువైన చోట శ్రీమహావిష్ణువు కూడా ఉంటాడు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, కొమ్మల్లో బ్రహ్మదేవుడు, ఉప కొమ్మల్లో సకల దేవతలు ఉంటారని నమ్మకం. అందుకే ఉసిరికాయతో కార్తిక మాసం సమయంలో దీపం వెలిగిస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు కింద తులసి మొక్కను ఉంచి పూజ చేస్తారు. ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఆనవాయితీ.
చరిత్రలో ఉసిరి గురించి అద్భుతమైన ప్రస్తావన ఉంది. ఒకనాడు ఆదిశంకరాచార్యుల వారు ఒక గ్రామంలో, ఓ పేద ఇంటి ముందు భిక్ష అడుగుతారు. ఆ ఇంట్లో ఆహారం ఏమీ లేకపోవడంతో ఆ గృహిణి ఇబ్బంది పడుతుంది. ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఉసిరికాయను తీసుకొని వచ్చి, భక్తితో శంకరాచార్యుల వారికి భిక్ష వేస్తుంది. ఆ పేద గృహిణి పరిస్థితిని గమనించిన ఆదిశంకరులు మహాలక్ష్మిని స్తుతిస్తూ కనకధారా స్తోత్రాన్ని అప్పటికప్పుడు ఆశువుగా పఠించారు. ఆ వెంటనే లక్ష్మీదేవి ప్రసన్నమై అక్కడ బంగారు ఉసిరికల వర్షం కురిపించిందని చెబుతారు. ఒక్క ఉసిరికాయకు ఇంతటి ప్రాశస్త్యం ఉందన్నమాట!
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు