మల్బరీ చెట్లు లేకపోతే మనకు పట్టు దారమే దొరకదు. పట్టు పురుగులకు మల్బరీ ఆకులే ప్రధాన ఆహారం. పట్టు పురుగుల పెంపకం (సెరి కల్చర్) చేపట్టే రైతులు వాణిజ్య పంటగా మల్బరీని సాగు చేస్తున్నారు. ఇది మధ్యస్థంగా పెరిగే చెట్టు. కుండీల్లో, డాబాలపైనా పెంచుకోవచ్చు. ఈ చెట్లు సులభంగానే పెరుగుతాయి. పది నుంచి పదిహేను మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయి. మోరస్ జాతికి చెందిన ఈ మొక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. మల్బరీ చెట్లు ఎంతటి మంచునైనా తట్టుకొని బతుకుతాయి. చలికాలం పోగానే మళ్లీ చిగురిస్తాయి. మొగ్గలు తొడిగి పూలు పూస్తాయి. అందుకే మల్బరీ చెట్టుని సహనానికి ప్రతీకగా చెబుతారు. సరైన రీతిలో రక్షిస్తే ఈ చెట్టు యాభై సంవత్సరాలు కూడా బతుకుతుంది.
మల్బరీ చెట్లలో ఉదా, ఎరుపు, నలుపు, తెలుపు రకాలు ఉన్నాయి. ఉత్తర అమెరికాలో ‘రెడ్ మల్బరీ’ చెట్లు డబ్బు ఫీట్ల దాకా అంటే 21 మీటర్ల దాకా పెరుగుతాయి. గ్రామీణ జీవనోపాధికి ముఖ్యమైన అనుబంధ పరిశ్రమ పట్టు పరిశ్రమ. సెరి కల్చర్ (పట్టు పురుగుల పెంపకం)లో రైతులు మల్బరీ తోటలను వాణిజ్యపంటగా పెంచుతున్నారు. మల్బరీ సాగు పదిహేనో శతాబ్ది నుంచి ఉన్నదని చారిత్రక ఆధారాలున్నాయి.
మల్బరీ ఆకు రాల్చే చెట్టు. కొమ్మలకు ప్రత్యామ్నాయంగా ఆకులు అమరి ఉంటాయి. మంచి ప్రూనింగ్ (కత్తిరింపులు) చేస్తూ ఉంటే శాఖలు విస్తరించి చెట్టు నిండా కాయలుకాస్తాయి. లేత పచ్చగా, ఎరుపు రంగు సంతరించుకొని చిక్కని ఊదా, నలుపు రంగులో పండుతాయి. మల్బరీ పండ్లను చూడగానే తినాలనిపిస్తుంది. తీపి, పులుపు కలగలిసి ద్రాక్షపండు రుచికి దగ్గరగా అనిపిస్తుంది. పండ్లు బ్లాక్ బెర్రీలను పోలి ఉంటాయి. ఈ పండ్లు యథాతథంగా తినవచ్చు. జామ్, జెల్ తయారీలో మల్బరీ పండ్లను ఉపయోగిస్తారు. మల్బరీ పండ్లను తింటే శరీరంలో చక్కెర స్థాయులు, కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడతాయి. క్యాన్సర్ ప్రమాదాన్నీ తగ్గిస్తాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు