మూలాధారం నుంచి.. సహస్రారం దాకా!
శా॥ ఆధారంబున హంసవాసనము వాగంభోజ జన్మస్థితిన్ శ్రీధామంబు అనాహతంబున రమా శ్లిష్టాది నారాయణం బై ధీసంపుటి నాజ్ఞయందు శివశక్త్యా కారమై పొల్చు సం ధ్యాధారాకృతి యైన దేవత హృదబ్జంబందు భాసించుతన్
శా॥ ఆధారంబున హంసవాసనము వాగంభోజ జన్మస్థితిన్
శ్రీధామంబు అనాహతంబున రమా శ్లిష్టాది నారాయణం
బై ధీసంపుటి నాజ్ఞయందు శివశక్త్యా కారమై పొల్చు సం
ధ్యాధారాకృతి యైన దేవత హృదబ్జంబందు భాసించుతన్
ఈ పద్యం డాక్టర్ కోవెల సుప్రసన్నాచార్య గారి మణిసేతువు కావ్యంలోనిది. ఇది ఒక విలక్షణ అనుభూతి కవితా విధానం. పెద్దలు కవిపండితులు కోవెల సంపత్కుమార గారు దీనిని వ్యక్తావ్యక్తాల మధ్య సాగిన ప్రయాణంగా వర్ణించారు. ఈ ప్రయాణం మణిసేతువు మీద సాగిందని ఆ మణి ప్రకాశవంతమైన వికాసశీలం గల పద్మానికి ప్రతీకగా, యోగవిధానంలోని షట్చక్రాల చక్రత్వ సూచనగా మూలాధారం నుంచి సహస్రారం దాకా సాగే ప్రయాణంగా వారు పేర్కొన్నారు.
ఇక మన ప్రస్తుత పద్యం చూద్దాం. ఆధారము హంసవాసనముగా గల వాగంభోజ వాక్కు అనే తామరపువ్వులా విలసిల్లే సరస్వతి అనే అర్థం. మన ఆధ్యాత్మిక చింతనలో హంస జ్ఞానానికి సంకేతం. యోగ శాస్త్రం ప్రకారం హంస ఉచ్ఛ్వాస. నిశ్వాసాలకి ప్రతీక. హంస అనే పదం తిరగేస్తే అదే సోహం అవుతుంది. జీవాత్మయే పరమాత్మ అనే అద్వైత సారాన్ని తెలిపే హంసను పరమాత్మకు గుర్తుగా పరిగణిస్తారు. అలాంటి హంస ఆమె వాహనం. అంటే ఇది యోగసాధకుని ప్రయాణ వాహనం. కాగా ఆధారం అనేది మూలాధార చక్రం. ఇది పృథ్వీ తత్త్వం గలది. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు గల ఆరు చక్రాలకు కులపథము అని పేరు. దీనినే సుషుమ్న అని కూడా అంటారు.
ఉపాసకులు శ్రీదేవిని తమ శరీరమునందే ఉన్న కుండలినీ రూపంగా గ్రహించి యోగసాధనలో ఆమెను ఉత్థితగా చేసి అంటే సహస్రారం వరకు సాగిన దానిగా చేసి ఆ ప్రక్రియలో సహస్రార చంద్రమండలామృతంతో తృప్తి పొందుతారు. ఇది ఉపాసకుడి సాధనకు సంబంధించింది. ఆ ఉపాసనకు గాను కవి వాగంభోజను ప్రార్థిస్తున్నారు. ఈ ప్రయాణం శ్రీధామంబు అనాహతంబున రమా శ్లిష్టాది నారాయణంబై కొనసాగి ఆజ్ఞా చక్రంలో శివశక్త్యాకారమైన సంధ్యాధారాకృతియైన అమ్మవారు తన హృదయంలో భాసించుగాక అని కవి కాంక్షిస్తున్నారు. అనాహత చక్రం వాయుతత్వం గలది. ఇది పండ్రెండు దళాల పద్మం. ఇది హృదయ స్థానంలో ఉంటుందని ప్రసిద్ధి. వాయుతత్వంతో కూడిన ఈ చక్రం యాభైనాలుగు సూర్య కిరణాలు కలది. ఈ హృదయాకాశంలో రమా నారాయణులు కొలువై ఉన్నారు.
పై పద్యంలో పేర్కొన్న వాగంభోజ సాక్షాత్తూ చదువుల తల్లి కాగా, రమా నారాయణులు శ్రీవిద్యా వ్యాప్తికి ఆది గురువులు, ఇక శివశక్తి సమస్త వాఙ్మయ సృష్టికి కారణమైన అక్షర సమామ్నాయం. అంటే కవి తను యోగసాధకుడుగా మారుతూ పృథ్వీ తత్త్వమైన మూలాధారం నుంచి తన ప్రస్థానం మొదలుపెట్టారు. అది వివిధ రూపాల ఆరాధనలతో సహస్రారం చేరుకోవాలి. అదే మంటికి మింటికి లంకె. పెద్దలు పేర్కొన్నట్లు మణిసేతువు కావ్యం ఒక శ్రీవిద్యా రహస్య మంత్రసంపుటి. పాఠకుడు తన శక్తి మేరకు ఆ చంద్రామృతం అందుకోగలడు.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

