స్వేచ్ఛ, సమానత్వం సాధికారత కోసం యుగయుగాలుగా స్త్రీ పోరాడుతున్నది. సంఘంలో స్త్రీల సమస్యను వీరేశలింగం పంతులు వేలెత్తి చూపితే, సాహిత్యంలో మహాకవి గురజాడ రాచబాట పరిచాడు. మరి స్త్రీ హృదయాన్ని తెలుగువారికి ఆవిష్కరించడానికి అహరహం శ్రమించాడు చలం. అదే రీతిన నాటక రంగంలో స్త్రీ సమస్యను, హృదయాన్ని ‘గోగ్రహణం’ అనే నాటికలో ఏకకాలంలో గొప్పగా ఆవిష్కరించాడు తనికెళ్ళ భరణి.
ఆడపిల్ల పుడితే ఏడ్చేలోకం ‘ఒళ్లు కాలిపోయినా బావుండేది. ఇల్లు కూలిపోయినా బావుండేది. ఆడపిల్ల పుట్టిందోయ్ దేవుడా! దేవుడా!’ అంటూ వినిపించే శోకాలు 21వ శతాబ్గంలోనూ కొనసాగడం విడ్డూరమే కాదు. మానవ వైపరీత్యం కూడా! ‘బొట్టు, కాటుక, అద్దాలు, రిబ్బన్లు, పూలు, గాజులు, పరికిణీలు, ఓణీలు, ఒడ్డాణాలు, కట్నాలు, కానుకలు, కడుపులు, కాన్పులు… ఇన్ని చేసి, వంటింట్లో చావే అంటే కాలేజీకి వెళ్తానంటుంది’ అంటూ ఇంట్లో అవమానించినా, ఆటంకపరిచినా… చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి సిద్ధమైతే బయట మరో రకమైన వేధింపులు. వాటన్నిటినీ ఎదుర్కొంటూనే నిలదొక్కుకోవాలనే ప్రయత్నంలో ఉంటే.. భర్త నుంచి శారీరక హింస, మానసిక క్షోభకు గురవుతూ ఉండాలి. ఈ కష్టాలకు, బాధలకు అంతే ఉండదు.
‘అసలు మీకు పెళ్లెందుకు బాబులు?’ అంటూ (ప్రదర్శన మధ్యలో) సూత్రధారి మగవాళ్లను ప్రశ్నిస్తాడు?
‘మా అవసరాలు తీర్చుకోవడానికి, వంటావార్పు చేయడానికి, ఒంటరితనం పోగొట్టుకోవడానికి, సంతానాన్ని పొందడానికి’ అని జవాబులొస్తాయి.
‘అన్నీ వాళ్లే చేస్తే… ఇక మీరు చేసేదేముంది నాయినా?’- సూత్రధారి మరో ప్రశ్న.
‘మూడుముళ్లు వేస్తాం. ఇంత ముద్ద పడేస్తాం. సంతానాన్ని ప్రసాదిస్తాం’ అన్నీ ఇలాంటి జవాబులే.
హక్కులు, పక్కలు మావి. బాధ్యతలు, బరువులు వాళ్లవి (స్త్రీలవి). వీళ్లకు శరీరం ఒక్కటే ఇస్తే చాలదమ్మా. మనసివ్వాలి. మస్తిష్కం ఇవ్వాలి. వీళ్లు ఎలా ఆలోచిస్తే మీరు (భార్యలు) అలాగే ఆలోచించాలి. వీళ్లకి నచ్చిన చీరకట్టాలి. పూలు పెట్టాలి. ఇది కాపురమో, వ్యాపారమో తెలియదు’ అని సూత్రధారి నిస్సహాయత వ్యక్తం చేస్తాడు. ఇలా పురుషాధిక్యతతో జతకట్టిన (సరుకు) వినిమయ వివాహ (వ్యాపార) బంధంలోని పురుషాధిక్య సమాజం వలువలూడదీసి ప్రేక్షకుల ముందు నగ్నంగా నిలబెడతాడు రచయిత. సంభాషణలతో మగవాళ్లను చెండాడుతాడు.
చివరిగా… ‘రక్షించండి.. రక్షించండి. రక్షించు తండ్రీ రక్షించు, దేవుడా రక్షించు’ అంటూ కథానాయక ఆర్తనాదంతో బజారునపడితే ఒక్కరు రారు. సరికదా… మానవ ముఖ వ్యాఘ్రాలు చుట్టుముట్టి గాండ్రిస్తాయి. ‘భర్త పులి అయినా, మొసలి అయినా, కోపిష్టి అయినా, రోగిష్టి అయినా, దుర్మార్గుడైనా, మంచివాడైనా, అతణ్నే భార్య పూజించాలి. అతనితోనే జీవించాలి. అదే పతివ్రతా ధర్మం. అదే మన భారత స్త్రీ ఖర్మం’ అని సూత్రధారి కుండబద్దలు కొడతాడు.
‘నాకు ప్రేమ కావాలి. నాకు స్వేచ్ఛ కావాలి. నా కన్నీరు తుడిచే చేయి కావాలి’ అంటూ స్త్రీ బోరున విలపిస్తుంటే… సూత్రధారి ఓదారుస్తూ… ‘ఎంత దురాశే పిచ్చితల్లి! ఇది పురుష ప్రపంచం. ఇక్కడ ఆవునీ, ఆడదాన్ని పూజిస్తాం. కానీ, ప్రేమించం. మా అవసరం ఉన్నంత కాలం వాడుకుని ఆవుని వధ్యశాలకు, ఆడదాన్ని శ్మశానానికి పంపిస్తాం. ఇది మా సంస్కృతి’ అంటూ ఎండగడతాడు. ‘మా కల్లబొల్లి కబుర్లని, మా కుహనా ఆదర్శాలను, నీకు స్వేచ్ఛ నిషేధించిన మా ధర్మ శాస్ర్తాలను క్షమించకు తల్లీ క్షమించకు’ అంటూ చివరికి సూత్రధారి స్త్రీకి ప్రణమిల్లుతాడు.
ఈ నాటిక ఆడిన ప్రతిచోటా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నది. ప్రజానాట్యమండలి, మరికొన్ని అభ్యుదయ కళా సంస్థలు ఈ నాటికను సొంతం చేసుకున్నాయి. యావత్ మహిళాలోకం ఈ నాటికను ఆదరించింది. స్టేజీ నాటికగా, వీధి నాటికగా సాంస్కృతిక దళాలు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన ఘన చరిత్ర ‘గోగ్రహణం’ నాటికకు ఉంది. తనికెళ్ళ భరణి నాటిక స్వర్ణోత్సవాలలో (జూలై 13, 14) భాగంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శించారు. నాలుగు దశాబ్దాలు దాటినా… ఈ నాటిక వాడి, వేడి, ఉధృతి రవ్వంత కూడా తగ్గకపోవడం గమనార్హం!
నాటిక: గోగ్రహణం
రచన: తనికెళ్ళ భరణి
దర్వకత్వం: డాక్టర్ వెంకట్ గోవాడ
ప్రదర్శన: గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్
పాత్రధారులు: సంధ్య, దాక్షాయని, చిత్కళ, రూపిక, వంశీ, నర్సింహా,
ఉదయ సంతోష్, పవన్, ప్రమోద్
– కె. శాంతారావు రంగస్థల నటుడు, విశ్లేషకుడు